వాషింగ్టన్: అమెరికా ఇక తమకు ఎంతమాత్రం మిత్రదేశం కాదని పాకిస్తాన్ తేల్చిచెప్పింది. మిత్రదేశంగా వ్యవహరించాల్సిన తీరు ఇది కాదంటూ అగ్రరాజ్యాన్ని ఘాటుగా విమర్శించింది. ఉగ్ర స్థావరాల నిర్మూలనలో విఫలమైందంటూ పాక్‌కు అమెరికా సైనిక సాయం నిలిపివేసిన నేపథ్యంలో పాక్ స్పందించింది. ప్రముఖ దినపత్రిక ‘వాల్ స్ట్రీట్ జర్నల్’తో పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా అసిఫ్ మాట్లాడుతూ.. అమెరికాతో మైత్రి ముగింపు దశకు చేరుకుందన్నారు. ‘మా మధ్య ఎలాంటి సత్సంబంధాలు లేవు. మిత్ర దేశాలు ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు’ అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రి వ్యాఖ్యలకు విరుద్ధంగా... అమెరికాతో స్నేహ సంబంధాలు కొనసాగుతాయని పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జంజువా పేర్కొనడం గమనార్హం. దక్షిణాసియాపై తీవ్ర ప్రభావం చూపగల అగ్రదేశం కావడంతో అమెరికాతో వీలైనంత వరకూ సత్సంబంధాలు కొనసాగించాలన్నదే పాకిస్తాన్ అభిమతమన్నారు. పాక్‌లోని ఉగ్ర స్థావరాల్ని నిర్మూలించేలా.. ఆ దేశాన్ని మిత్ర దేశమైన చైనా ఒప్పించగలదని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. ఉగ్ర సంస్థలపై ఉక్కుపాదం మోపడం చైనా జాతీయ విధానమైందున.. ఆ దేశం స్పందించాలని వైట్‌హౌస్ అధికారి సూచించారు. పాక్ లో ఉగ్ర స్థావరాల ధ్వంసంతో దక్షిణాసియాలో సుస్థిరత సాధ్యమవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment