వాషింగ్టన్: ఉక్రెయిన్ ఈశాన్య ప్రాంతంలోని ఖర్కీవ్‌పై రష్యా తీవ్రస్థాయిలో దాడులకు తెగబడుతోంది. శుక్రవారం రష్యా జరిపిన దాడుల్లో రైలు పట్టాలు, రైల్వే ఆస్తులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అమెరికా మరో విడత సైనిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.
‘‘తమ దేశం కోసం ధైర్యం వహిస్తున్న ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా ఆయుధాలు, సామాగ్రి అందించడానికి అమెరికా మరో విడత సైనిక సాయాన్ని ఉక్రెయిన్ అందించనున్నట్లు ప్రకటించింది. రష్యా దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు 275 మిలియన్ డాలర్ల సైనిక సామాగ్రి సాయం అందించనున్నాం. ఇంతకు ముందు విడుదల చేసని మలిటరీ సాయం యుద్ధ రంగంలో ఉపయోగిస్తున్నారు. తాజాగా ప్రకటించిన మిలిటరీ సాయం సాధ్యమైనంత తొందరగా అందజేస్తాం’’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తెలిపారు.
గత నెల ప్రకటించిన 61 బిలియన్ డాలర్ల మిలటరీ సాయం అందటంలో ఆలస్యం కావటంతో ఉక్రెయిన్ సైన్యం యుద్ధభూమిలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రష్యా దాడుల నేపథ్యంలో ఖర్కీవ్ ప్రాంతంలోని చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా రష్యా దాడుల్లో భవనాలు కూడా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 10 నుంచి ఖర్కీవ్ ప్రాంతంపై రష్యా విరుచుకుపతున్న విషయం తెలిసిందే. రష్యా దాడులను నుంచి తప్పించుకోవడానికి అప్పటి నుంచి 11 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.
రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంతో కుదేలైన ఉక్రెయిన్‌కు శుక్రవారం రష్యా చేసిన దాడుల్లో.. రైల్వే నెట్‌వర్క్ ధ్వంసంతో మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. గురువారం జరిగిన రష్యా దాడుల్లో సైతం ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment