గాజాలో ఇజ్రాయెల్ అమానుష హత్యాకాండ మొదలైనప్పటినుంచీ అమెరికన్ విద్యాసంస్థల్లో అలుముకున్న అశాంతి ఈ వారం తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న విశ్వవిద్యా లయాలు విద్యార్థి ఉద్యమాలతో అట్టుడుకుతున్నాయి. వియత్నాంను వల్లకాడు చేస్తున్న అమెరికా సైనిక దురాక్రమణకు వ్యతిరేకంగా 1968లో తిరుగుబాటు జెండా ఎగరేసిన విద్యార్థుల పోరాటాన్నీ, 1980ల్లో దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం నెల్సన్ మండేలాను దీర్ఘకాలం చెరసాలలో బంధించటాన్ని నిరసిస్తూ సాగిన ఉద్యమాలనూ గుర్తుచేస్తున్నాయి. అప్పటిమాదిరే ఈ ఉద్యమాలు అట్లాంటిక్ మహా సముద్రం ఆవలితీరాల్లోని యూనివర్సిటీ క్యాంపస్‌లకు సైతం విస్తరించాయి.
ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లో మాత్రమేకాదు... పశ్చిమాసియాలోని బీరూట్, కువైట్, లెబనాన్, ట్యునీ సియా యూనివర్సిటీలు కూడా రగులుతున్నాయి. లాఠీచార్జిలు, బాష్పవాయు గోళాలు ఎవరినీ భయపెట్టడం లేదు. వేలాదిమంది విద్యార్థులను అరెస్టుచేస్తూ ఉద్యమాలను చల్లార్చాలని పోలీసులు ప్రయత్నిస్తున్నా సాగటం లేదు. వీటి తీవ్రత పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే అమెరికా తన క్యాంపస్‌లను ప్రస్తుతం పోలీసు శిబిరాలుగా మార్చింది.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్‌లు 1,200మంది పౌరులను కాల్చిచంపి, దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిన ఉదంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ తీవ్రంగా ఖండించారు. స్వతంత్ర పాలస్తీనా కోసం సాగుతున్న ఉద్యమాలను ఇలాంటి దుందుడుకు చర్యలు బలహీనపరుస్తాయని హెచ్చరించారు. దాన్ని సాకుగా తీసుకుని ఇజ్రాయెల్ గత ఆర్నెల్లుగా సాగిస్తున్న మారణహోమం తక్కువేమీ కాదు. ఇంతవరకూ 35,000మంది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ సైనిక దళాల దాడుల్లో మరణించారని చెబుతున్నారు.
ఇందులో అత్యధికులు నిరాయుధులైన స్త్రీలు, పిల్లలే. చివరికి బాంబుదాడుల్లో శిథిలమైన జనావా సాల్లో బాధితులకు అండగా నిలబడుతున్న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను సైతం ఇజ్రాయెల్ సైన్యం వదిలిపెట్టడం లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా వారిని కాల్చిచంపుతూ పాలస్తీనా పౌరులకు బాసటగా నిలబడాలన్న సంకల్పంతో వచ్చేవారిని భయభ్రాంతుల్ని చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోపక్క అనేకమంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టా మని చెప్పుకుంటోంది.
ఇజ్రాయెల్‌కు ఎడాపెడా మారణాయుధాలు సరఫరా చేస్తూ, భద్రతామండలి వంటి అంతర్జా తీయ వేదికలపై అది సాగిస్తున్న నరమేథాన్ని నిలువరించే అన్ని రకాల ప్రయత్నాలకూ మోకా లడ్డుతూ మద్దతుగా నిలబడుతున్న అమెరికా అప్పుడప్పుడు కోమానుంచి నిద్రలేచిన రోగి మాదిరిగా శాంతి వచనాలు వల్లిస్తోంది. ఇది సబబేనా? నిరాయుధ సాధారణ పౌరులను కాల్చిచంపటం ప్రపంచమంతా మౌనంగా వీక్షిస్తూ ఉండాల్సిందేనా? ఈ ప్రశ్నలే విశ్వవిద్యాలయాల విద్యా ర్థులను కలవరపరిచాయి.
తాము మూగసాక్షులుగా మిగిలిపోలేమంటూ ఆ విద్యార్థులు గొంతెత్తటం వెనకున్న నేపథ్యం ఇదే. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్‌ఏంజెలస్ (యూసీఎల్‌ఏ), కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వగైరా ఉన్నతశ్రేణి విద్యాసంస్థలు నినాదాలతో మార్మోగుతున్నాయి. పేరెన్నికగన్న హార్వర్డ్, బర్క్‌లీ, యేల్ వర్సిటీలు సైతం రణక్షేత్రాలయ్యాయి. అమెరికా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాల యాలు సాధారణమైనవి కాదు. పేరెన్నికగన్న ప్రపంచశ్రేణి సంస్థలు.
ఉదాహరణకు యూసీఎల్‌ఏ 16 మంది నోబెల్ బహుమతి గ్రహీతలను తయారుచేసింది. ఆ సంస్థనుంచి ఇంతవరకూ 15 మంది మెక్‌ఆర్థర్ ఫెలోషిప్‌లను అందుకున్నారు. అసాధారణ ప్రతిభాపాటవాలున్నవారికి ఈ ఫెలోషిప్‌లు ఇస్తారు. ఇక్కడి పట్టభద్రుల్లో క్రీడల్లో రాణించి ఒలింపిక్స్‌లో పతకాలు అందుకున్నవారెందరో! ఎన్నో దేశాలు అందుకునే పతకాల సంఖ్యతో పోలిస్తే ఈ యూనివర్సిటీ పట్టభద్రులు సాధించే పతకాలే ఎక్కువంటారు. ఇలాంటిచోట చదువుకునే పిల్లలు సమాజ పరిణామాలపట్ల ఇంతగా కలవరపడటం బహుశా మన దేశంలో చాలామందిని ఆశ్చర్యపరిచి వుండొచ్చు.
విద్యార్థి ఉద్యమ కేంద్రాలుగా ముద్రపడిన ఢిల్లీలోని జేఎన్‌యూ, జమియా మిలియా, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సి టీలను ఛీత్కరించటం అలవాటు చేసుకున్న మర్యాదస్తులకు ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయాల వర్త మాన పోకడలు మింగుడుపడకపోవచ్చు. అయోమయానికి గురిచేయవచ్చు. కానీ అమెరికా తదితర దేశాల విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు ఎప్పుడూ ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తూనే వున్నాయి. ఇప్పుడు సాగుతున్న విద్యార్థి ఉద్యమాలతో ప్రొఫెసర్లు సైతం గొంతు కలపటం, అరెస్టుకావటం యాదృచ్ఛికం కాదు. ఈ నిరసనలను యూదు వ్యతిరేక ఆందోళనలుగా చిత్రించి అధికారుల, రిపబ్లి కన్ పార్టీ శ్రేణుల ప్రాపకంతో పోటీ ఉద్యమాలను నిర్వహిస్తున్న విద్యార్థులు లేక పోలేదు. పాలస్తీనా సంఘీభావ ఉద్యమకారులపై వారు దాడులకు కూడా వెనకాడటం లేదు. ఇది విచారకరం.
పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగుతూ ఎవరూ చూడటంలేదని భ్రమపడుతుంది. అమెరికా ప్రభుత్వం ఈ ధోరణిని విరమించుకోవాలి. తన ఆయుధ పరిశ్రమ లాభార్జనకు తోడ్పడుతున్నా యన్న ఏకైక కారణంతో ఇజ్రాయెల్, ఉక్రెయిన్ తదితర దేశాలకు అమెరికా భారీగా సైనిక సాయం అందించటం అనైతికం, అమానుషం. విద్యార్థి ఉద్యమాలు పంపుతున్న సందేశాన్ని సక్రమంగా అర్థం చేసుకుని ప్రపంచశాంతికి దోహదపడటం అగ్రరాజ్యంగా తన బాధ్యతని ఇప్పటికైనా ఆ దేశం గుర్తించాలి. లేకుంటే మున్ముందు ఈ ఉద్యమాలు మరింత విస్తరిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment