అక్టోబరు 23 (బుధవారం)న సాక్షి దిన పత్రిక ఎడిట్ పేజీలో పాలస్తీనా సమస్యపై ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ రాసిన వ్యాసం వాస్తవాలకు భిన్నంగా ఇజ్రాయెల్‌కు వత్తాసు పలికేలా ఉంది. వ్యాసం మొత్తంగా చూసినప్పుడు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణ కాండకు మద్దతిస్తున్నట్లే ఉంది. రాజ్య నైజాన్ని గురించి కానీ, దానికి ఆయుధాలు, డబ్బు ఇచ్చి ప్రోత్సహిస్తున్న అమెరికా, యూరప్ దేశాల పాత్ర గురించి కానీ ఎక్కడా ప్రస్తావించకుండా బాధితులనే దోషులుగా చిత్రించేందుకు వ్యాసకర్త యత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ వ్యవహారమంతా నాగరికతకు సంబంధించిన సమస్య అనడం అంతకన్నా శోచనీయం. ఆ వ్యాసంలో ఒక చోట ఆయన ‘ఇజ్రాయెల్ 1948లో ఆధునిక దేశంగా ఆవిర్భవించినప్పటికీ... ఎడారి భూమిలో ఆధునిక ప్రజాస్వామ్య, వ్యవసాయ, పారిశ్రామిక దేశంగా తనను తాను నిర్మించుకుంది. కానీ పాలస్తీనా పాలకులు వ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కు అమలు లోకి వచ్చే ప్రజాస్వామ్యాన్ని సాధ్యమైన వ్యవస్థగా ఎన్నడూ అంగీకరించలేదు’ అని పేర్కొన్నారు. దీని ద్వారా ఆయన ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు? ఇజ్రాయెల్ ఒక లౌకిక ఘనమైన ప్రజాస్వామ్య దేశం అని చెప్ప దలచుకున్నారా? అలా చెప్పడమంటే వాస్తవాన్ని చూడ నిరాకరించడమే అవుతుంది.
ప్రముఖ యూదు చరిత్రకారుడు, యూరోపియన్ సెంటర్ ఫర్ పాలస్తీనా స్టడీస్ డైరెక్టర్ ఇలాన్ పాపే ఇటీ వల బ్రస్సెల్స్‌లో ‘అనడోలు’ అనే వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో... పశ్చిమ దేశాల మద్దతుతో పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్నది ముమ్మాటికీ జాతి నిర్మూలన కార్యక్ర మమేనని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ రాజకీయాలు సెటి ల్మెంట్ల నిర్మాణం నుంచి యూదు దురహంకారాన్ని రెచ్చగొట్టే దశకు వెళ్లాయని ఆయన పేర్కొన్నారు.
ఈ శక్తులే ఇప్పుడు అక్కడ ప్రభుత్వంలోనూ, పోలీస్ వ్యవస్థలోనూ తిష్ట వేసుక్కూర్చున్నాయి. ఈ నాయకత్వం వల్లే ఇజ్రాయెల్ దురాక్రమణదారుగా పాలస్తీనా అంతటా విస్తరిస్తోంది. నీరు, ఆహారం, మందులపై ఆంక్షలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది. ఒక వైపు అమానుష చర్యలకు పాల్పడుతూ, మరోవైపు పాలస్తీనియన్లే ఈ ప్రాంతంలోని అన్ని సమస్యలకూ కారకులుగా, అనైతిక చర్యలకు పాల్పడే వారిగా చిత్రిస్తున్నారు.
వీరిని అక్కడ నుంచి వెళ్లగొట్టడమే పరిష్కారమన్న ఒక తప్పుడు సిద్ధాంతాన్ని అమెరికా, యూరప్‌లు చాలా కాలంగా ప్రచారంలో పెడుతూ వస్తున్నాయి. 76 ఏళ్ల తరువాత కూడా అదే పాచికను ప్రయోగిస్తే అది చెల్లుబాటు కాదు అని చరిత్ర కారుడు పాపే తేల్చి చెప్పాడు.
రెండవ అంశం: ‘అక్టోబరు 7 నాటి మారణ కాండను ఖండించకుండా ఇరాన్, లెబనాన్ కూడా హమాస్‌కు మద్దతునిస్తూ ఈ యుద్ధంలోకి ప్రవేశించాయి. ఆ విధంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి’ అని ప్రొఫెసర్ గారు సూత్రీకరించారు. అది వాస్తవమా? పాలస్తీనా, అలాగే యావత్ పశ్చిమా సియా ప్రాంతానికి పెనుముప్పుగా తయారైంది ఇజ్రా యెల్.
పశ్చిమ దేశాలు తమ ఆధిపత్యానికి కాలం చెల్లుతుండడం, ఏక ధృవ ప్రపంచం నుంచి బహుళ ధృవ ప్రపంచం వైపు పరిణామాలు చోటుచేసుకుంటుండడంతో బెంబేలెత్తి వలస వాదాన్ని మళ్ళీ విస్తరించేందుకు పూనుకుంటున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇజ్రాయిల్ గాజాపై దాడిని... లెబ నాన్‌కు, అటు నుంచి ఇరాన్‌కు, తద్వారా యావత్ పశ్చి మాసియాకు విస్తరింపజేయాలనే పన్నాగాన్ని ఈ సంద ర్భంగా గుర్తించాలి.
ఇందుకోసం ఇజ్రాయిల్‌కు అమెరికా వంటి దేశాలు పెద్ద యెత్తున ఆయుధాలు, డబ్బు అందజేస్తున్నాయి. మూడవ అంశం... 1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయిల్ అంగీకరించి సంతకం చేయగా పాలస్తీనా, ఇరాన్ ఆ ఒప్పందాన్ని తిరస్కరించాయనీ... 1948కు ముందున్న చోటికి తిరిగి వెళ్లాలని పాలస్తీనా డిమాండ్ చేస్తోందని’ ఐలయ్య తన వ్యాసంలో పేర్కొన్నారు.
ఇది వాస్తవాన్ని వక్రీకరించడమే. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మధ్య వర్తిత్వంలో 1993లో ఓస్లో ఒప్పందం (నార్వే ఒప్పందంపై ఇజ్రాయిల్ ప్రధాని ఐజాక్ రాబిన్, పాలస్తీనా విమో చనా సంస్థ నేత యాసర్ అరాఫత్ సంతకాలు చేశారు. ఆ తరువాత ఆ ఒప్పందానికి ఇజ్రాయెలే తూట్లు పొడిచింది.
నాల్గవ అంశం... హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్ హుడ్‌లు ప్రపంచం మొత్తానికి సమస్యలు సృష్టిస్తున్నాయి అని చెప్పడం కన్నా అన్యాయం ఏముంటుంది? అమెరికా, బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాల అండతో ఇజ్రాయెల్ యథేచ్ఛగా ఈ ప్రాంతంలో సాగిస్తున్న అణచివేత, దురాక్రమణకు వ్యతిరేకంగా, పాలస్తీనా స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటం లోంచి పుట్టుకొచ్చినవే హమాస్ వంటి సంస్థలు.
అయిదవదీ, చివరిదీ నాగరికతకు సంబంధించిన అంశం: ఇజ్రాయెల్– పాలస్తీనా సమస్య నాగరికతా సమస్య అని ప్రొఫెసర్ ఐలయ్య ముక్తాయింపు ఇచ్చారు. ఏది నాగరికతో ఏది అనాగరికతో ఆయన వివరించి ఉంటే బాగుండేది. ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాగతాలను కప్పి పుచ్చి ఆ దేశ నాగరికత, ప్రజాస్వామ్యం గురించి కీర్తించడాన్ని ఏమనాలి? ఇప్పుడు జరగాల్సింది యుద్ధ నేరాలకు పాల్పడిన నెతన్యాహునూ, ఆయనకు మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలను బోనులో విలబెట్టడం.
– కె. గడ్డెన్న ‘ సీనియర్ పాత్రికేయుడు
బాధితులనే దోషులుగా చిత్రీకరిస్తారా?
Published Tue, Oct 29 2024 4:51 AM | Last Updated on Tue, Oct 29 2024 4:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment