రష్యా దురాక్రమణ నుంచి తన దేశాన్ని రక్షించుకోవడం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో అమెరికా మరింత సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ పార్లమెంట్‌నుంచి కొందరు సభ్యుల బృందం అమెరికాను సందర్శించి మరింత సహాయం అందించాలని కోరింది. తమకు మరిన్ని ఆయుధాలు, ఆర్థిక సాయం అవసరమని పేర్కొంది.
ఇదే విషయాన్ని అమెరికా అధిపతి బైడెన్‌కు జెలెన్‌స్కీ నేరుగా వెల్లడించారు. తాము స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామని, తమకు సాయం కోరే హక్కు ఉందని ఆయన తాజాగా విడుదల చేసిన వీడియోలో చెప్పారు. కీవ్‌లోని అధ్యక్ష కార్యాలయం వెలుపల రాత్రి సమయంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. యుద్ధం మొదలై ఐదువారాలు ముగుస్తున్నవేళ ఉక్రెయిన్ నుంచి దాదాపు 40 లక్షలమంది విదేశాలకు శరణార్ధులుగా తరలిపోయినట్లు ఐరాస అంచనా వేసింది.
రూబుల్స్‌లో వద్దు
రష్యా గ్యాస్‌కు యూరోపియన్ కంపెనీలు రూబుల్స్‌లో చెల్లించాల్సిన అవసరం లేదని రష్యా నుంచి హామీ పొందినట్లు జర్మనీ తెలిపింది. తమ వద్ద గ్యాస్ కొనుగోళ్లను రూబుల్స్‌లో జరపాలని ఇటీవల రష్యా అల్టిమేటం జారీ చేయడం యూరప్ దేశాల్లో కలకలం సృష్టించింది. మరోవైపు ఈ ఏడాది చివరకు రష్యా దిగుమతులపై ఆధారపడడాన్ని ఆపివేస్తామని పోలండ్ ప్రకటించింది. టర్కీలో జరిగిన చర్చల్లో కొంత పురోగతి కనిపించినా రష్యా, జెలెన్‌స్కీ ప్రకటనలతో సంధిపై ఆశలు అడుగంటాయి. తమపై రష్యా దాడి కొనసాగిస్తూనే ఉందని కీవ్ తదితర నగరాల మేయర్లు ఆరోపించారు. ఉక్రెయిన్ ఇంధన డిపోలను, స్పెషల్ ఫోర్స్ కేంద్రకార్యాలయాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది.
రష్యా సైనికులు ఆజ్ఞలు పాటించడం లేదు!
ఉక్రెయిన్‌లోకి పంపిన రష్యా సైనికులు తమకిచ్చిన ఆజ్ఞలు పాటించేందుకు తిరస్కరిస్తున్నారని బ్రిటన్ ఇంటెలిజెన్స్ చీఫ్ జెరెమీ ఫ్లెమింగ్ చెప్పారు. పై అధికారుల మాట వినకపోవడమే కాకుండా సొంత ఆయుధాలనే ధ్వంసం చేస్తున్నారని, ఈ ప్రక్రియలో అనుకోకుండా ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా కూల్చేశారని గురువారం జెరెమీ చెప్పారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణను పుతిన్ తక్కువగా అంచనా వేశారని ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రజల నుంచి ఇంత ప్రతిఘటన వస్తుందని పుతిన్ ఊహించలేదని, ఆంక్షల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులను అంచనా వేయలేదని, సొంత మిలటరీ శక్తిని ఎక్కువగా అంచనా వేసుకొని వేగంగా విజయం సాధిస్తామని భావించారని చెప్పారు. ప్రస్తుతం రష్యా సైనికులు నైతిక స్థైర్యం కోల్పోయి ఆజ్ఞలు తిరస్కరిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment