weapons supply
-
ఖబడ్దార్! ఆ సంగతి మర్చిపోవద్దు.. పుతిన్ తీవ్ర హెచ్చరికలు
ఉక్రెయిన్‌కు లాంగ్–రేంజ్ రాకెట్ సిస్టమ్స్, ఇతర ఆయుధాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. తీరు మార్చుకోవాలని, తమ మాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇప్పటిదాకా ఎన్నడూ దాడి చేయని లక్ష్యాలపై దాడులకు దిగుతామని తేల్చిచెప్పారు. అయితే, ఆ లక్ష్యాలు ఏమిటన్నది బయటపెట్టలేదు. ఆదివారం ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత ఎక్కువ కాలం పొడిగించేందుకు పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయని, అందులో భాగంగానే ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎన్ని ఆయుధాలు అందజేసిన ఉక్రెయిన్ ప్రభుత్వం ఇంకా నష్టపోవడం తప్ప సాధించేదేమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రత్యర్థిని ఎలా దెబ్బకొట్టాలో తెలుసని, తమవద్ద కూడా ఆయుధాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దని పుతిన్ హెచ్చరించారు. -
Russia Ukraine War: ఉక్రెయిన్ చేతికి అమెరికా రాకెట్లు!
వాషింగ్టన్/కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పదేపదే చేస్తున్న విజ్ఞప్తి పట్ల అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. ఉక్రెయిన్‌కు హైటెక్, మీడియం రేంజ్ రాకెట్ సిస్టమ్స్ అందజేస్తామని ప్రకటించింది. ఇవి తక్కువ సంఖ్యలోనే పంపిస్తామని పేర్కొంది. ఉక్రెయిన్‌కు ఇప్పటికే ప్రకటించిన 700 మిలియన్ డాలర్ల భద్రతాపరమైన సాయంలో భాగంగానే రాకెట్ సిస్టమ్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందులో రాకెట్ సిస్టమ్స్‌తోపాటు హెలికాప్టర్లు, జావెలిన్ యాంటీ–ట్యాంకు ఆయుధ వ్యవస్థ, టాక్టికల్ వాహనాలు, విడిభాగాలు ఉంటాయని అమెరికా ఉన్నతాధికారులు మంగళవారం స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు ఇవ్వనున్న ఆయుధ ప్యాకేజీని అతిత్వరలోనే బహిర్గతం చేస్తామన్నారు. అమెరికా ఇచ్చే ఆయుధాలు ఉక్రెయిన్‌లో తిష్టవేసిన రష్యా సైన్యంపై పోరాటానికే పరిమితం కానున్నాయి. సరిహద్దును దాటి రష్యా భూభాగంలో దాడి చేసే ఆయుధాలను ఉక్రెయిన్‌కు తాము ఇవ్వబోమని అమెరికా గతంలోనే తేల్చిచెప్పింది. అలాచేసే సంక్షోభం మరింత ముదురుతుందని అమెరికా భావిస్తోంది. ఉక్రెయిన్‌కు అడ్వాన్స్డ్ రాకెట్ సిస్టమ్స్, ఆయుధాలు అందజేయాలని తీసుకున్న నిర్ణయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ సైతం ధ్రువీకరించారు. ఉక్రెయిన్ భూభాగంలో శత్రు శిబిరాలను ధ్వంసం చేయడానికి తమ ఆయుధాలు ఉపయోగపడతాయని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దులకు ఆవల దాడులు చేయడాన్ని తాము ప్రోత్సహించబోమన్నారు. యుద్ధం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటో రష్యాకు తెలిసేలా చేయడమే తమ ఉద్దేశమన్నారు. డోన్బాస్లో వినియోగం! ఉక్రెయిన్‌కు తాము ఇవ్వనున్న మీడియం రేంజ్ రాకెట్లు 70 కిలోమీటర్ల దాకా ప్రయాణిస్తాయని, నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదిస్తాయని అమెరికా అధికారులు తెలిపారు. వీటి సాయంతో రష్యా భూభాగంపై దాడి చేయబోమంటూ ఉక్రెయిన్ పాలకులు హామీ ఇచ్చారన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్లో రష్యా బలగాల భరతం పట్టేందుకు అమెరికా ఆయుధాలను ఉక్రెయిన్ సైన్యం రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్‌కు అమెరికా హై మొబిలిటీ ఆర్టిల్లరీ రాకెట్ సిస్టమ్స్(హైమార్స్) ఇవ్వబోతోంది. ఒక్కో కంటైనర్‌లో ఆరు రాకెట్లు ఉంటాయి. ఉక్రెయిన్‌కు అత్యాధునిక యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులు, రాడార్ సిస్టమ్స్ ఇస్తామని జర్మనీ చాన్సరల్ ఒలాఫ్ షోల్జ్ ప్రకటించారు. ఇలా అగ్నికి ఆజ్యం పోయొద్దంటూ రష్యా ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఘాటుగా స్పందించారు. నిత్యం 60–100 మంది ఉక్రెయిన్ జవాన్లు బలి రష్యాపై యుద్ధంలో తమకు జరుగుతున్న ప్రాణ నష్టంపై ఇన్నాళ్లూ పెదవి విప్పని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ అంశంపై ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. యుద్ధంలో నిత్యం 60 నుంచి 100 మంది సైనికులను కో ల్పోతున్నామని, మరో 500 మంది దాకా క్షతగాత్రులవుతున్నారని చెప్పారు. డోన్బాస్ లో భాగమైన డోంటెస్క్, లుహాన్స్క్లో పరిస్థితి అత్యంత సక్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. రష్యా అణు విన్యాసాలు అణ్వస్త్రాలను నిర్వహించే తమ సిబ్బంది తాజాగా విన్యాసాలు నిర్వహించినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై యు ద్ధం నేపథ్యంలో ఇవానోవోలో ఈ విన్యాసాలు జరిగాయని తెలిపింది. వ్యూహాత్మక క్షిపణి దళాలు సైతం ఇందులో పాల్గొన్నాయని పేర్కొంది. పూర్తి వివరాలను వెల్లడించలేదు. చదవండి: రష్యా ఆర్థికంపై దెబ్బేసే నిర్ణయం! ఏంటంటే.. -
Russia- Ukraine war: కీలక దశలో దేశ రక్షణ!
రష్యా దురాక్రమణ నుంచి తన దేశాన్ని రక్షించుకోవడం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో అమెరికా మరింత సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ పార్లమెంట్‌నుంచి కొందరు సభ్యుల బృందం అమెరికాను సందర్శించి మరింత సహాయం అందించాలని కోరింది. తమకు మరిన్ని ఆయుధాలు, ఆర్థిక సాయం అవసరమని పేర్కొంది. ఇదే విషయాన్ని అమెరికా అధిపతి బైడెన్‌కు జెలెన్స్కీ నేరుగా వెల్లడించారు. తాము స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామని, తమకు సాయం కోరే హక్కు ఉందని ఆయన తాజాగా విడుదల చేసిన వీడియోలో చెప్పారు. కీవ్‌లోని అధ్యక్ష కార్యాలయం వెలుపల రాత్రి సమయంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. యుద్ధం మొదలై ఐదువారాలు ముగుస్తున్నవేళ ఉక్రెయిన్ నుంచి దాదాపు 40 లక్షలమంది విదేశాలకు శరణార్ధులుగా తరలిపోయినట్లు ఐరాస అంచనా వేసింది. రూబుల్స్‌లో వద్దు రష్యా గ్యాస్‌కు యూరోపియన్ కంపెనీలు రూబుల్స్‌లో చెల్లించాల్సిన అవసరం లేదని రష్యా నుంచి హామీ పొందినట్లు జర్మనీ తెలిపింది. తమ వద్ద గ్యాస్ కొనుగోళ్లను రూబుల్స్‌లో జరపాలని ఇటీవల రష్యా అల్టిమేటం జారీ చేయడం యూరప్ దేశాల్లో కలకలం సృష్టించింది. మరోవైపు ఈ ఏడాది చివరకు రష్యా దిగుమతులపై ఆధారపడడాన్ని ఆపివేస్తామని పోలండ్ ప్రకటించింది. టర్కీలో జరిగిన చర్చల్లో కొంత పురోగతి కనిపించినా రష్యా, జెలెన్స్కీ ప్రకటనలతో సంధిపై ఆశలు అడుగంటాయి. తమపై రష్యా దాడి కొనసాగిస్తూనే ఉందని కీవ్ తదితర నగరాల మేయర్లు ఆరోపించారు. ఉక్రెయిన్ ఇంధన డిపోలను, స్పెషల్ ఫోర్స్ కేంద్రకార్యాలయాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. రష్యా సైనికులు ఆజ్ఞలు పాటించడం లేదు! ఉక్రెయిన్‌లోకి పంపిన రష్యా సైనికులు తమకిచ్చిన ఆజ్ఞలు పాటించేందుకు తిరస్కరిస్తున్నారని బ్రిటన్ ఇంటెలిజెన్స్ చీఫ్ జెరెమీ ఫ్లెమింగ్ చెప్పారు. పై అధికారుల మాట వినకపోవడమే కాకుండా సొంత ఆయుధాలనే ధ్వంసం చేస్తున్నారని, ఈ ప్రక్రియలో అనుకోకుండా ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా కూల్చేశారని గురువారం జెరెమీ చెప్పారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణను పుతిన్ తక్కువగా అంచనా వేశారని ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రజల నుంచి ఇంత ప్రతిఘటన వస్తుందని పుతిన్ ఊహించలేదని, ఆంక్షల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులను అంచనా వేయలేదని, సొంత మిలటరీ శక్తిని ఎక్కువగా అంచనా వేసుకొని వేగంగా విజయం సాధిస్తామని భావించారని చెప్పారు. ప్రస్తుతం రష్యా సైనికులు నైతిక స్థైర్యం కోల్పోయి ఆజ్ఞలు తిరస్కరిస్తున్నారన్నారు. -
‘విశ్వాస’ ఘాతుకం
న్యూఢిల్లీ: దాయాది దేశాల ప్రజల్లో పరస్పరం విశ్వాసం నెలకొల్పాలన్న సదుద్దేశంతో వాస్తవాధీన రేఖ వెంబడి వాణిజ్యానికి భారత్ ఇచ్చిన అవకాశాన్ని ఉగ్రవాదులు దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవాధీన రేఖకు ఇరువైపుల ఉన్న భారత వ్యతిరేక శక్తులు(హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అక్రమ వ్యాపార లావాదేవీలతో విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ సొమ్ము నంతా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాద మూకలకు అందిస్తున్నాయి. ఆ సొమ్ముతో ఉగ్రవాదులు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సేకరించి భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయి. అంతేకాకుండా ఈ దారి గుండా మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ కూడా భారత దేశంలోకి పెద్ద ఎత్తున వచ్చి పడుతోంది. ఈ విషయం గుర్తించిన భారత దేశం సరిహద్దు వాణిజ్యాన్ని నిషేధించింది. పకడ్బందీగా.... సరిహద్దు ఆవల నుంచి వివిధ పదార్ధాలు, వస్తువులను ఈ మార్గం గుండా భారత దేశానికి రవాణా చేస్తారు. ఆ సమయంలో సరుకు అసలు ధర కంటే బాగా తక్కువ ధరను ఇన్వాయిస్లో చూపిస్తారు. మన దేశంలో వ్యాపారులు ఆ సరుకులను మార్కెట్ ధరకు అమ్మి అత్యధిక లాభాలు సంపాదిస్తున్నారు. ఇలా వచ్చిన అధిక లాభాలను ఉగ్రవాదులకు అందజేస్తున్నారు. ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలతో సంబంధాలు ఉన్న వారు సరిహద్దుకు ఇరువైపుల వ్యాపారాల పేరుతో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని భద్రతా దళ అధికారులు చెబుతున్నారు. వీరే కాకుండా సరిహద్దు దాటి పాక్‌లో ప్రవేశించి అక్కడి ఉగ్ర సంస్థల్లో చేరిన భారతీయులు కొందరు మన దేశంలో ఉన్న వారి బంధు, మిత్రులతో వ్యాపార సంస్థలు పెట్టించి వారి ద్వారా కూడా ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారని వారు వివరించారు. ఈ దారి గుండా జమ్ము,కశ్మీర్లోకి చేరిన మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ, ఆయుధాలు ఇక్కడి ఉగ్రవాద, వేర్పాటు వాదులకు అందుతున్నాయని, ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతున్నాయని వారు తెలిపారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్న ఆరోపణపై అరెస్టు చేసిన జహూ అహ్మద్ వతాలి అనే వ్యాపారి ఎల్వోసీ ట్రేడర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడని తేలింది. జహూకు చెందిన కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. 12 మందిని అరెస్టు చేశారు. వేల కోట్ల వాణిజ్యం భారత ప్రభుత్వం 2008లో వాస్తవాధీన రేఖ వెంబడి రెండు చోట్ల వాణిజ్యానికి అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ఈ దారిలో రూ. 6,900 కోట్ల లావాదేవీలు జరిగాయి. మన దేశం నుంచి అరటిపళ్లు, ఎంబ్రాయిడరీ వస్తువులు, చింతపండు, ఎర్రమిర్చి వంటివి ఎగుమతి అవుతోంటే, కాలిఫోర్నియా బాదంపప్పు, ఎండు ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, మామిడి వంటివి దిగుమతి అవుతున్నాయి. 21 రకాల వస్తువులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో కాలిఫోర్నియా బాదం పప్పు వల్లే వ్యాపారులు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ మార్గంలో అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, పరిస్థితిని సమీక్షించి వాణిజ్యాన్ని మళ్లీ అనుమతించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామని అధికారులు చెప్పారు. -
తుపాకీ లేని ఖాకీ
బొమ్మనహళ్లి: ప్రజా భద్రతను చూసే పోలీసులు లాఠీలతోనే దుండగులను ఎదుర్కోవాల్సి వస్తోంది. హోంశాఖకు ఏటా వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌ను కేటాయిస్తున్నా మౌలికమైన ఆయుధాల కొరత నాలుగో సింహాన్ని నిస్తేజం చేస్తోంది. నేరస్థులు, ఉగ్రవాదుల నుంచి ప్రజల ధన,మాన, ప్రాణాలను రక్షించడానికి ఎన్నో పరీక్షలు నిర్వహించి నెలల పాటు శిక్షణనిచ్చి పోలీసులను నియమించే ప్రభుత్వాలు వారికి ఆయుధాలను ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్య ధోరణిని వదులుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం చిల్లర దొంగల నుంచి ఉగ్రవాదుల వరకు అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉండగా, వారిని ఎదుర్కొనాల్సిన పోలీసులు మాత్రం దశాబ్దాల కాలం నాటి తుపాకులతోనే నెట్టుకొస్తున్నారు. కానిస్టేబుళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. రాత్రి వేళల్లో గస్తీలో పాల్గొనే కానిస్టేబుళ్లు కేవలం లాఠీలతో విధులు నిర్వర్తిస్తుండడంతో దొంగలు నిర్భీతిగా దాడులకు తెగబడుతున్నారు. బెంగళూరు నగరంలో కూడా దొంగలు, అసాంఘిక ముఠాలు పోలీసులపై దాడులకు తెగబడ్డ ఘటనలు కోకొల్లలు. ఇంత జరుగుతున్నా పోలీసులకు కొత్త ఆయుధాలు అందించి శాఖలో ఆయుధాల కొరతను నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకర పరిణామం. కాగ్ నివేదికలో చేదు నిజాలు రాష్ట్ర పోలీసుశాఖలో ఆయుధాల కొరతపై గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందో కాగ్ నివేదిక బట్టబయలు చేసింది. సంకీర్ణ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందంటూ కాగ్ స్పష్టం చేసింది. చాలా స్టేషన్లలో కావాల్సినంత మందుగుండు ఉంది, తుపాకులే లేవు, కొన్నిచోట్ల తుపాకులు ఉన్నాయి, అందుకు తగిన మందుగుండు అందుబాటులో లేదు. ♦ 2012లో రాష్ట్రంలోని చాలా పోలీస్స్టేషన్లలో ఏకే– 47 తదితర ఆయుధాల కొరత మరింత తీవ్రంగా ఉంది. ♦ ప్రతి పోలీస్‌స్టేషన్‌లో తప్పనిసరిగాఉండాల్సిన 0.303 ట్రంకెటేడ్ రైఫిల్‌ల కొరత 72 శాతం ఉండగా 2017 మార్చ్ నెలఖారు నాటికి కూడా ఆయుధాల కొరత శాతం అంతే ఉన్నట్లు కాగ్ నివేదికలో బహిర్గతమైంది. ♦ ఆయుధాలు ఉన్న 18 పోలీస్స్టేషన్లలో అందుకు సరిపడా మందుగుండు సామగ్రి లేకపోవడంతో ఆయుధాలన్నింటినీ స్టోర్‌రూమ్‌లలో పడేశారు. పలు పీఎస్‌లలో మందుగుండు కాలవ్యవధి ముగియడంతో బెంగళూరులోని సీఏఆర్,మైసూరు నగరంలోని డీఏఆర్ కేంద్రాల్లో అటకెక్కించారు. ఇంటెలిజెన్స్ విభాగ ఏడీజీపీ, కేఎస్ఆర్పీ, యాదగిరి, తుమకూరు తదితర 18 పోలీసు కేంద్రాల్లో భారీగా నిల్వ చేసిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఏళ్లతరబడి వృథాగా ఉంటోంది. ప్రస్తుతం కొత్తగా పోలీసుశాఖలో చేరిన పోలీసు అధికారులు,సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ ఇవ్వడానికి కూడా ఆయుధాలు లేనంతగా ఆయుధాల కొరత సమస్య పరిణమించిందని పోలీసు వర్గాల సమాచారం. దీంతో చేతిలో సరైన ఆయుధాలు లేక పోవడంతో రాత్రివేళల్లో విధులు నిర్వర్తించడానికి పోలీసులు వెనుకడుగేస్తున్నారు. శిక్షణ లేక చిలుము కాగ్ నివేదికల ప్రకారం ఎనిమిది జిల్లాల్లోని 21 పోలీస్స్టేషన్ల సీఐ, ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుళ్లకు 9 ఎంఎం గన్లు ఇచ్చారు. అయితే ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుళ్లకు అందించిన గన్లను అధికారులు స్టేషన్లలోని స్టోర్‌రూమ్‌లలో భద్రపరిచారు. సంవత్సరాల తరబడి స్టోర్ రూమ్‌లలో భద్రపరచిన గన్లను ఎప్పుడు కూడా వాడకపోవడం, కనీసం అప్పుడప్పుడు శుభ్రం కూడా చేయక తుప్పుపట్టి పనికిరాకుండా పోయాయి. ఆయుధాల కొరత లేదు: డీసీఎం పరమేశ్వర్ రాష్ట్రంలోని హోం శాఖలో ఎలాంటి ఆయుధాల కోరత లేదని, సీఏజీ ఇచ్చిన నివేదికను చాలా సీరియస్‌గా తిసుకోవడం జరుగుతుందని హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర్ అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ డీసీఎం ఆర్.అశోక్ మాట్లాడుతూ. పోలీసు సిబ్బందికి ఆయుధాల కొరతపై కాగ్ నివేదిక మీద చర్చించి ప్రభుత్వానికి సలహాలను ఇస్తామని తెలిపారు. -
కూర రాజన్నే సూత్రధారి
సాక్షి, మహబూబాబాద్: ఆరు నెలల క్రితం ఆవిర్భవించిన చండ్రపుల్లారెడ్డి (సీపీ)బాట అజ్ఞాత దళం ఏర్పాటులో జనశక్తి కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి కూర రాజన్న కీలకమని మహబూబాబాద్ జిల్లా పోలీసులు గుర్తించారు. ఈ దళానికి 27 ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినందుకు కూర రాజన్నతోపాటు పలువురిపై గూడూరు పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ ఎన్.కోటిరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లాలకు చెందిన 11 మంది 2016, సెప్టెంబర్ 9న హైదరాబాద్‌కు వెళ్లి కూర రాజన్నను కలిశారని, ఆ సమయంలో ఆయా జిల్లాల పరిధిలో సీపీబాట పేరుతో దళాన్ని ఏర్పాటు చేయాలని, ఆయుధాలు సరఫరా చేస్తానని రాజన్న చెప్పినట్లు విచారణలో మధు వెల్లడించాడు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 18న 27 తుపాకులు, మందుగుండు సామగ్రిని పంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినందుకు కూర రాజన్నతోపాటు మరికొంత మందిపై గూడూరు పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. -
నక్సలైట్లకు ఆయుధాలు సప్లై చేసే వ్యక్తి అరెస్ట్
ఏలూరు (వన్‌టౌన్) :నక్సలైట్లకు ఆయుధాలు తయారు చేసి సరఫరా చేసే ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఆయుధాల తయారీకి ఉపయోగించే సామగ్రిని శాంపిల్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని ఏలూరు డీఎస్పీ కె.జి.వి.సరిత తెలిపారు. ఏలూరు స్థానిక పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. విజయవాడలో నివాసం ఉండే నెల్లూరు సూళ్లూరుపేటవాసి ఎల్లశ్రీ శరత్‌కుమార్ అలియాస్ శరత్‌రెడ్డిని అరెస్ట్ చేశామని చెప్పారు. విజయవాడలో అతని ఇంట్లో ఆరుగురు సిబ్బందితో సోదాలు నిర్వహించామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన స్పేర్‌పార్ట్‌లను సేకరించి వాటన్నింటినీ కలిపి తయారు చేసిన ఆయుధాలను చంద్రన్న దళానికి చెందిన సభ్యులకు అందజేస్తున్నాడన్నారు. ఇప్పటివరకూ 35 ఆయుధాలు తయారుచేసి సభ్యులకు అందజేసినట్టు శరత్‌రెడ్డి తెలిపాడన్నారు. సోదాలలో ఆయుధాల తయారీకి కావాల్సిన వివిధ రకాల విడిభాగాలు స్ప్రింగ్‌లు, పిస్టల్ రాడ్, మ్యాగెజెన్ రాడ్లు, టేప్ డిస్పెన్సర్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్, శాంపిల్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిం టినీ 303, ఎస్ఎల్ఆర్, మోడల్ రౌండ్స్, తయారు చేయడానికి తీసుకువచ్చాడన్నారు. సోదాలలో డీఎస్పీతో పాటు ఎస్సై ఎమ్.సుధాకర్, ఇన్స్పెక్టర్ ఎమ్.రమేష్, హెచ్‌సీ ఆర్.నాగేశ్వరరావు, నాగరాజు, వీర్రాజు, పి.రాజులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే కీలక వ్యక్తి అరెస్ట్ సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గంలోని అశోక్ దళానికి చెందిన సభ్యులు ఆయుధాలతో ప్రయాణం చేస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి ఆధ్వర్యంలో బలగాలు వలపన్ని 13 మందిని 16వ తేదీన అరెస్ట్ చేసి జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం విదితమే. అయితే పోలీసులకు పట్టబడిన వారంతా గతంలో రాయల సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో సీపీఐ ఎంఎల్ (న్యూ డెమొక్రసీ)లో పనిచేశారు. తరువాత రెండు వర్గాలుగా విడిపోగా ఒక వర్గం గాదె దివాకర్ నాయకత్వంలో పనిచేస్తుండగా మరోవర్గం చంద్రన్న వర్గంగా ఏర్పడింది. అలా ఏర్పాటైన ఈ వర్గ సభ్యులు ఆయుధాలతో ప్రయాణం చేస్తున్నారన్న సమాచారంతో ఎస్పీ జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడివద్ద మాటువేసి దళసభ్యులను అరెస్ట్ చేసి ఆయుధాలు తూటాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్పీ ఈ కేసును దర్యాప్తును ఏలూరు డీఎస్పీకి అప్పగించారు. అప్పగించిన తరువాత రోజు సాయంత్రానికే డీఎస్పీ దళ సభ్యులకు ఆయుధాలు తయారు చేసి సరఫరా చేస్తోన్న శరత్‌రెడ్డిని ఆమె అరెస్ట్ చేశారు. ఒకసారి ఈ వుచ్చులో పడితే బయటకు రావడం కష్టం : శరత్‌రెడ్డి నేను చెన్నైలో ఎంబీఏ చేశాను. ఎప్పుడో తెలిసీ తెలియని వయసులో క్షణికావేశంలో ఆకర్షణకు లోనై తీసుకున్న నిర్ణయం వల్ల 12 సంవత్సరాలు దళ సభ్యులకు ఉపయోగపడుతూ ఆయుధాలు తయారు చేస్తూ ఉండాల్సి వచ్చిందని శరత్‌కుమార్, అలియాస్ శరత్‌రెడ్డి అన్నాడు. డీఎస్సీ సమక్షంలో విలేకరులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు... మధ్యలో తప్పనిపించి వదిలేద్దామనిపించినా నేను ఇరుక్కున్నది ఎలాంటి ఉచ్చులోనో ఆలోచిస్తే ఆ ఉచ్చు నా ప్రాణాన్ని హరించివేయగలదిగా నాకు అనిపించింది. తప్పో ఒప్పో ప్రాణం నిలబెట్టుకునేందుకే ఇంతకాలం దళ సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాను. ఇప్పటికీ దళ సభ్యులతో పరిచయం నాకు కల...ఈ నిమిషం మీ ముందు ఉన్నది కూడా కలలానే ఉంది. ఆకర్షణ ఎంతదూరం తీసుకు వెళుతుందో ఇప్పుడే నాకు అర్థమవుతోంది. ప్రభుత్వ పథకాలు, సమాజంలో ఎన్నో మార్పులు ఉన్నా ఇప్పటికీ నక్సలిజం ఉండాలా అని మీరడిగే ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు. కానీ యువతకు సందేశం మాత్రం ఇవ్వగలను. మీ భవిష్యత్తు మీ చేతులలోనే ఉంది. దానిని మీరే సక్రమమైన మార్గంలో అంచెలంచెలుగా తీర్చిదిద్దుకోవాలి. ఆకర్షణ, ఆవేశం రెండూ అన ర్థాలకే దారితీస్తాయి. నా భవిష్యత్తుకు ఒకప్పుడు వేసుకున్న ప్రణాళిక మధ్యలో తప్పనిపించినా అర్థం చేసుకుని బయటకు వద్దామనుకునే సమయానికి నేను భవిష్యత్తునే కోల్పోయాను. -
మావోయిస్టులకు ఆయుధాలు: యువకుడి అరెస్టు
మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శరత్ రెడ్డి అనే యువకుడు చెన్నైలో ఎంబీఏ చదివాడు. అతడి వద్ద తుపాకి తయారీకి సంబంధించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఇటీవలి కాలంలో అంతగా లేవు. తూర్పు ఏజెన్సీతో పాటు.. ఏవోబీ ప్రాంతంలో మాత్రం కొంతవరకు అలజడి ఉండేది. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి పశ్చిమ ఏజెన్సీలో కూడా మావోయిస్టులకు ఆయుధాల సరఫరా లాంటి ఘటనలు బయటపడటంతో ఉలిక్కిపడుతున్నారు.