నక్సలైట్లకు ఆయుధాలు సప్లై చేసే వ్యక్తి అరెస్ట్ | Man arrested Weapons supply Naxals | Sakshi
Sakshi News home page

నక్సలైట్లకు ఆయుధాలు సప్లై చేసే వ్యక్తి అరెస్ట్

Published Sun, Dec 21 2014 12:32 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man arrested Weapons supply Naxals

 ఏలూరు (వన్‌టౌన్) :నక్సలైట్లకు ఆయుధాలు తయారు చేసి సరఫరా చేసే ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఆయుధాల తయారీకి ఉపయోగించే సామగ్రిని శాంపిల్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని ఏలూరు డీఎస్పీ కె.జి.వి.సరిత తెలిపారు. ఏలూరు స్థానిక పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. విజయవాడలో నివాసం ఉండే నెల్లూరు సూళ్లూరుపేటవాసి ఎల్లశ్రీ శరత్‌కుమార్ అలియాస్ శరత్‌రెడ్డిని అరెస్ట్ చేశామని చెప్పారు. విజయవాడలో అతని ఇంట్లో ఆరుగురు సిబ్బందితో సోదాలు నిర్వహించామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన స్పేర్‌పార్ట్‌లను సేకరించి వాటన్నింటినీ కలిపి తయారు చేసిన ఆయుధాలను చంద్రన్న దళానికి చెందిన సభ్యులకు అందజేస్తున్నాడన్నారు. ఇప్పటివరకూ 35 ఆయుధాలు తయారుచేసి సభ్యులకు అందజేసినట్టు శరత్‌రెడ్డి తెలిపాడన్నారు. సోదాలలో ఆయుధాల తయారీకి కావాల్సిన వివిధ రకాల విడిభాగాలు స్ప్రింగ్‌లు, పిస్టల్ రాడ్, మ్యాగెజెన్ రాడ్‌లు, టేప్ డిస్పెన్సర్‌లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్, శాంపిల్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిం టినీ 303, ఎస్‌ఎల్‌ఆర్, మోడల్ రౌండ్స్, తయారు చేయడానికి తీసుకువచ్చాడన్నారు. సోదాలలో డీఎస్పీతో పాటు ఎస్సై ఎమ్.సుధాకర్, ఇన్‌స్పెక్టర్ ఎమ్.రమేష్, హెచ్‌సీ ఆర్.నాగేశ్వరరావు, నాగరాజు, వీర్రాజు, పి.రాజులు పాల్గొన్నారు.
 
 బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే కీలక వ్యక్తి అరెస్ట్
 సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) చంద్రన్న వర్గంలోని అశోక్ దళానికి చెందిన సభ్యులు ఆయుధాలతో ప్రయాణం చేస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి ఆధ్వర్యంలో బలగాలు వలపన్ని 13 మందిని 16వ తేదీన అరెస్ట్ చేసి జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం విదితమే. అయితే పోలీసులకు పట్టబడిన వారంతా గతంలో రాయల సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో సీపీఐ ఎంఎల్ (న్యూ డెమొక్రసీ)లో పనిచేశారు. తరువాత రెండు వర్గాలుగా విడిపోగా ఒక వర్గం గాదె దివాకర్ నాయకత్వంలో పనిచేస్తుండగా మరోవర్గం చంద్రన్న వర్గంగా ఏర్పడింది. అలా ఏర్పాటైన ఈ వర్గ సభ్యులు ఆయుధాలతో ప్రయాణం చేస్తున్నారన్న సమాచారంతో ఎస్పీ జంగారెడ్డిగూడెం సమీపంలోని జీలుగులమ్మ గుడివద్ద మాటువేసి దళసభ్యులను అరెస్ట్ చేసి ఆయుధాలు తూటాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్పీ ఈ కేసును దర్యాప్తును ఏలూరు డీఎస్పీకి అప్పగించారు. అప్పగించిన తరువాత రోజు సాయంత్రానికే డీఎస్పీ దళ సభ్యులకు ఆయుధాలు తయారు చేసి సరఫరా చేస్తోన్న శరత్‌రెడ్డిని ఆమె అరెస్ట్ చేశారు.
 
 ఒకసారి ఈ వుచ్చులో పడితే బయటకు రావడం కష్టం : శరత్‌రెడ్డి
 నేను చెన్నైలో ఎంబీఏ చేశాను. ఎప్పుడో తెలిసీ తెలియని వయసులో క్షణికావేశంలో ఆకర్షణకు లోనై తీసుకున్న నిర్ణయం వల్ల 12 సంవత్సరాలు దళ సభ్యులకు ఉపయోగపడుతూ ఆయుధాలు తయారు చేస్తూ ఉండాల్సి వచ్చిందని శరత్‌కుమార్, అలియాస్ శరత్‌రెడ్డి అన్నాడు. డీఎస్సీ సమక్షంలో విలేకరులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు... మధ్యలో తప్పనిపించి వదిలేద్దామనిపించినా నేను ఇరుక్కున్నది ఎలాంటి ఉచ్చులోనో ఆలోచిస్తే ఆ ఉచ్చు నా ప్రాణాన్ని హరించివేయగలదిగా నాకు అనిపించింది. తప్పో ఒప్పో ప్రాణం నిలబెట్టుకునేందుకే ఇంతకాలం దళ సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాను. ఇప్పటికీ దళ సభ్యులతో పరిచయం నాకు కల...ఈ నిమిషం మీ ముందు ఉన్నది కూడా కలలానే ఉంది. ఆకర్షణ ఎంతదూరం తీసుకు వెళుతుందో ఇప్పుడే నాకు అర్థమవుతోంది. ప్రభుత్వ పథకాలు, సమాజంలో ఎన్నో మార్పులు ఉన్నా ఇప్పటికీ నక్సలిజం ఉండాలా అని మీరడిగే ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు. కానీ యువతకు సందేశం మాత్రం ఇవ్వగలను. మీ భవిష్యత్తు మీ చేతులలోనే ఉంది. దానిని మీరే సక్రమమైన మార్గంలో అంచెలంచెలుగా తీర్చిదిద్దుకోవాలి. ఆకర్షణ, ఆవేశం రెండూ అన ర్థాలకే దారితీస్తాయి. నా భవిష్యత్తుకు ఒకప్పుడు వేసుకున్న ప్రణాళిక మధ్యలో తప్పనిపించినా అర్థం చేసుకుని బయటకు వద్దామనుకునే సమయానికి నేను భవిష్యత్తునే కోల్పోయాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement