‘విశ్వాస’ ఘాతుకం | Indo-Pak LoC trade route conduit for militancy, terror funding | Sakshi
Sakshi News home page

‘విశ్వాస’ ఘాతుకం

Published Sun, Apr 21 2019 4:55 AM | Last Updated on Sun, Apr 21 2019 4:55 AM

Indo-Pak LoC trade route conduit for militancy, terror funding - Sakshi

న్యూఢిల్లీ: దాయాది దేశాల ప్రజల్లో పరస్పరం విశ్వాసం నెలకొల్పాలన్న సదుద్దేశంతో వాస్తవాధీన రేఖ వెంబడి వాణిజ్యానికి భారత్‌ ఇచ్చిన అవకాశాన్ని ఉగ్రవాదులు దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవాధీన రేఖకు ఇరువైపుల ఉన్న భారత వ్యతిరేక శక్తులు(హిజ్‌బుల్‌ ముజాహిద్దీన్‌ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అక్రమ వ్యాపార లావాదేవీలతో విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ సొమ్ము నంతా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాద మూకలకు అందిస్తున్నాయి. ఆ సొమ్ముతో ఉగ్రవాదులు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సేకరించి భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయి. అంతేకాకుండా ఈ దారి గుండా మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ కూడా భారత దేశంలోకి పెద్ద  ఎత్తున వచ్చి పడుతోంది. ఈ విషయం గుర్తించిన భారత దేశం సరిహద్దు వాణిజ్యాన్ని నిషేధించింది.

పకడ్బందీగా....
సరిహద్దు  ఆవల నుంచి వివిధ పదార్ధాలు, వస్తువులను ఈ మార్గం గుండా భారత దేశానికి రవాణా చేస్తారు. ఆ సమయంలో సరుకు అసలు ధర కంటే బాగా తక్కువ ధరను ఇన్‌వాయిస్‌లో చూపిస్తారు. మన దేశంలో వ్యాపారులు ఆ సరుకులను మార్కెట్‌ ధరకు అమ్మి అత్యధిక లాభాలు సంపాదిస్తున్నారు. ఇలా వచ్చిన అధిక లాభాలను ఉగ్రవాదులకు అందజేస్తున్నారు. ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలతో సంబంధాలు ఉన్న వారు సరిహద్దుకు ఇరువైపుల వ్యాపారాల పేరుతో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని భద్రతా దళ అధికారులు చెబుతున్నారు.

వీరే కాకుండా సరిహద్దు దాటి పాక్‌లో ప్రవేశించి అక్కడి ఉగ్ర సంస్థల్లో చేరిన భారతీయులు కొందరు మన దేశంలో ఉన్న వారి బంధు, మిత్రులతో వ్యాపార సంస్థలు పెట్టించి వారి ద్వారా కూడా ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారని వారు వివరించారు. ఈ దారి గుండా జమ్ము,కశ్మీర్‌లోకి చేరిన మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ, ఆయుధాలు ఇక్కడి ఉగ్రవాద, వేర్పాటు వాదులకు అందుతున్నాయని, ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతున్నాయని వారు తెలిపారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్న ఆరోపణపై అరెస్టు చేసిన జహూ అహ్మద్‌ వతాలి అనే వ్యాపారి ఎల్‌వోసీ ట్రేడర్స్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడని తేలింది. జహూకు చెందిన కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. 12 మందిని అరెస్టు చేశారు.

వేల కోట్ల వాణిజ్యం
భారత ప్రభుత్వం 2008లో వాస్తవాధీన రేఖ వెంబడి రెండు చోట్ల వాణిజ్యానికి అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ఈ దారిలో రూ. 6,900 కోట్ల లావాదేవీలు జరిగాయి. మన దేశం నుంచి అరటిపళ్లు, ఎంబ్రాయిడరీ వస్తువులు, చింతపండు, ఎర్రమిర్చి వంటివి ఎగుమతి అవుతోంటే, కాలిఫోర్నియా బాదంపప్పు, ఎండు ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, మామిడి వంటివి దిగుమతి అవుతున్నాయి. 21 రకాల వస్తువులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో కాలిఫోర్నియా  బాదం పప్పు వల్లే వ్యాపారులు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ మార్గంలో అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, పరిస్థితిని సమీక్షించి వాణిజ్యాన్ని మళ్లీ అనుమతించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామని అధికారులు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement