Traders Association
-
ప్రధాని మోదీకి సొంత తమ్ముడు షాక్
ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ షాకిచ్చారు. మోదీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) చెల్లించవద్దని ప్రహ్లాద్ మోదీ వ్యాపారస్తులకు సూచించారు. ‘మోదీ కావొచ్చు.. మరొకరు కావొచ్చు. వారు మీ సమస్యలు వినాలి’ అని వ్యాపారస్తులకు చెప్పారు. ‘మనమేమీ బానిసలం కాదు’ అని తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యాపారులకు ‘జీఎస్టీ చెల్లించబోం’ అని మహారాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా లేఖ రాయాలని తెలిపారు. మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం వ్యాపారుల సదస్సు జరిగింది. ఉల్హాస్నగర్ వ్యాపారుల సంఘం పిలుపు మేరకు హాజరైన ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ.. ‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనమేమీ బానిసలం కాదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉల్హాస్నగర్ వ్యాపార కేంద్రంగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ప్రహ్లాద్ మోదీ విమర్శించారు. ‘గుజరాత్‌లోనైతే వ్యాపారానికి రసాయనాల వినియోగం అనుమతి ఉందని, రసాయన వ్యర్థాల నిర్వహణకు కూడా సరైన ప్రణాళిక ఉంది. గుజరాత్ అనుమతి ఇస్తున్నప్పుడు మహారాష్ట్ర ఎందుకు ఇవ్వదు’ అని నిలదీశారు. -
పబ్జీ లవర్స్‌కు మరో షాక్, ఊపందుకున్న బ్యాన్ డిమాండ్
సాక్షి,వెబ్‌డెస్క్:పబ్జీ గేమింగ్ ప్రియులకు షాక్ తప్పదా? ఆ గేమ్‌కు అదిలోనే హంసపాదు ఎదురు కానుందా?పబ్జీ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) పేరుతో విడుదల కానున్న..ఈ గేమ్ అసలు విడుదలవుతుందా? విడుదలైన ఎంతవరకు మనుగడ సాధిస్తుందనేది తాజా పరిణామాలతో ప్రశ్నార్ధకంగా మారింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ బీజేపీ ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాధ్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో టెన్సెంట్ సంస్థకు చెందిన పబ్జీ గేమ్, క్రాఫ్టన్ సంస్థకు చెందిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. తాజాగా సీఏఐటీ (ఆల్ ఇండియా ట్రేడర్స్ సమాఖ్య) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ కు వివిధ పార్టీల నేతలు కలిశారు. చైనా గేమ్‌పై నిషేదం విధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తరుణంలో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా "భారత సార్వభౌమత్వానికి, దేశ భద్రతకు ముప్పు మాత్రమే కాదు, యువ తరాలకు హానికరం. గతేడాది నిషేదించిన పబ్జీ ఇప్పుడు భారత చట్టాల్ని అధిగమించి దొడ్డిదారిన ఎంట్రీ ఇస్తోందని ప్రవీణ్ ఖండేల్వాల్ ట్వీట్ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన స్టైల్లో అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. పబ్జీ గేమ్‌ను బ్యాన్ చేయాలని నాడు కేంద్రానికి లేఖ రాసిన అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే నినోంగ్ ఎరింగ్ నుంచి తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్ పాటు పలు పార్టీల నేతలు బీజీఎంఐ గేమ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుత నిబంధనల రీత్యా ప్రభుత్వం క్రాఫ్టన్ గేమ్ బ్యాన్ అంశాన్ని పట్టించుకునే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే..? క్రాఫ్టన్‌కు చెందిన ఈ గేమ్‌పై నిషేధం విధిస్తారా? లేదా అనే అంశంపై పలువురు కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్టీఐ చట్టం కింద అడిగారు. అందుకు ప్రభుత్వం బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్‌ను ముందస్తుగా నిషేధించలేమని ధృవీకరించింది. అదే సమయంలో క్రాఫ్టన్ సంస్థ దక్షిణ కొరియాలోని సియోల్‌లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన అధికారులతో గేమ్ ప్రారంభంపై చర్చించారు. ఒప్పందం ప్రకారం 100మిలియన్ల పెట్టుబడి పెట్టారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ గేమ్ తాజా పరిణాలతో విడుదలవుతుందా? నిషేదానికి గురవుతుందా? అనేది కాలమనే నిర్ణయించాలి. చదవండి: BGMI ఆడాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే, లేదంటే బ్లాక్ చేస్తారు -
బిగ్‌బాస్‌కు బిగ్ షాక్..
ముంబై : ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్‌పై దుమారం రేగుతోంది. అశ్లీలం శ్రుతిమించిందని ఆరోపిస్తూ హిందీ బిగ్‌బాస్ సీజన్ 13ను నిషేధించాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) కేంద్ర సమాచార ప్రసార మంత్రి ప్రకాష్ జవదేఖర్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. ఓ ప్రైవేట్ ఛానల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షో కుటుంబంలో అందరితో కలిసి చూసేందుకు అభ్యంతరకరంగా ఉందని అశ్లీల ధోరణిలో సాగుతోందని సీఏఐటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రియాలిటీ షో మన పురాతన సాంస్కృతిక, సంప్రదాయాలను మంటగలిపేలా ఉందని మండిపడింది. టీఆర్పీ, లాభాల వేట కోసం విలువలను గాలికొదిలేసే విధానాన్ని భారత్ వంటి భిన్న సంస్కృతులకు నిలయమైన దేశంలో అనుమతించరాదని కోరింది. బిగ్‌బాస్ కాన్సెప్ట్ తీవ్ర అభ్యంతరకరమని, టెలివిజన్ ప్రపంచంలో నైతిక విలువలకు ఇది పూర్తి విరుద్ధమని పేర్కొంది. ఈ షో ప్రైమ్‌టైమ్‌లో ప్రసారమవతుందన్న ఇంగితం నిర్వాహకులకు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. బిగ్‌బాస్ షో అన్ని విలువలకు తిలోదకాలిచ్చిందని దుయ్యబట్టింది. -
‘విశ్వాస’ ఘాతుకం
న్యూఢిల్లీ: దాయాది దేశాల ప్రజల్లో పరస్పరం విశ్వాసం నెలకొల్పాలన్న సదుద్దేశంతో వాస్తవాధీన రేఖ వెంబడి వాణిజ్యానికి భారత్ ఇచ్చిన అవకాశాన్ని ఉగ్రవాదులు దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవాధీన రేఖకు ఇరువైపుల ఉన్న భారత వ్యతిరేక శక్తులు(హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అక్రమ వ్యాపార లావాదేవీలతో విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ సొమ్ము నంతా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాద మూకలకు అందిస్తున్నాయి. ఆ సొమ్ముతో ఉగ్రవాదులు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సేకరించి భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయి. అంతేకాకుండా ఈ దారి గుండా మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ కూడా భారత దేశంలోకి పెద్ద ఎత్తున వచ్చి పడుతోంది. ఈ విషయం గుర్తించిన భారత దేశం సరిహద్దు వాణిజ్యాన్ని నిషేధించింది. పకడ్బందీగా.... సరిహద్దు ఆవల నుంచి వివిధ పదార్ధాలు, వస్తువులను ఈ మార్గం గుండా భారత దేశానికి రవాణా చేస్తారు. ఆ సమయంలో సరుకు అసలు ధర కంటే బాగా తక్కువ ధరను ఇన్వాయిస్లో చూపిస్తారు. మన దేశంలో వ్యాపారులు ఆ సరుకులను మార్కెట్ ధరకు అమ్మి అత్యధిక లాభాలు సంపాదిస్తున్నారు. ఇలా వచ్చిన అధిక లాభాలను ఉగ్రవాదులకు అందజేస్తున్నారు. ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలతో సంబంధాలు ఉన్న వారు సరిహద్దుకు ఇరువైపుల వ్యాపారాల పేరుతో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని భద్రతా దళ అధికారులు చెబుతున్నారు. వీరే కాకుండా సరిహద్దు దాటి పాక్‌లో ప్రవేశించి అక్కడి ఉగ్ర సంస్థల్లో చేరిన భారతీయులు కొందరు మన దేశంలో ఉన్న వారి బంధు, మిత్రులతో వ్యాపార సంస్థలు పెట్టించి వారి ద్వారా కూడా ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారని వారు వివరించారు. ఈ దారి గుండా జమ్ము,కశ్మీర్లోకి చేరిన మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ, ఆయుధాలు ఇక్కడి ఉగ్రవాద, వేర్పాటు వాదులకు అందుతున్నాయని, ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతున్నాయని వారు తెలిపారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్న ఆరోపణపై అరెస్టు చేసిన జహూ అహ్మద్ వతాలి అనే వ్యాపారి ఎల్వోసీ ట్రేడర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడని తేలింది. జహూకు చెందిన కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. 12 మందిని అరెస్టు చేశారు. వేల కోట్ల వాణిజ్యం భారత ప్రభుత్వం 2008లో వాస్తవాధీన రేఖ వెంబడి రెండు చోట్ల వాణిజ్యానికి అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ఈ దారిలో రూ. 6,900 కోట్ల లావాదేవీలు జరిగాయి. మన దేశం నుంచి అరటిపళ్లు, ఎంబ్రాయిడరీ వస్తువులు, చింతపండు, ఎర్రమిర్చి వంటివి ఎగుమతి అవుతోంటే, కాలిఫోర్నియా బాదంపప్పు, ఎండు ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, మామిడి వంటివి దిగుమతి అవుతున్నాయి. 21 రకాల వస్తువులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో కాలిఫోర్నియా బాదం పప్పు వల్లే వ్యాపారులు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ మార్గంలో అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, పరిస్థితిని సమీక్షించి వాణిజ్యాన్ని మళ్లీ అనుమతించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామని అధికారులు చెప్పారు. -
ఓ సీఐ కోళ్ల దందా!
=నగర శివారులో రూ.3కోట్లతో పౌల్ట్రీఫాం =తమ కోళ్లను ఎక్కువ ధరకు కొనాలని కుమారుడి ద్వారా బెదిరింపులు =బెంబేలెత్తిపోతున్న వ్యాపారులు =డీఐజీకి ఫిర్యాదు చేయూలని ట్రేడర్స్ అసోసియేషన్ నిర్ణయం వరంగల్ క్రైం, న్యూస్‌లైన్: నగర శివారులో పనిచేస్తున్న ఓ సీఐ సైడ్ బిజినెస్ ప్రారంభించాడు. గతంలో ఏసీబీ అధికారులకు చిక్కిన ఈ సీఐ.. ఉన్నతాధికారులను బతిమిలాడుకుని నగర శివారులో పోస్టింగ్ సంపాధించాడు. విధుల్లో చేరిన నాటినుంచే నాలుగు పైసలు వెనకేసుకునే పనిలో పడ్డాడు. తనకు వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని భావించాడేమో.. కోళ్ల ఫారం పెట్టాడు. తన సర్వీసులో వెనకేసుకున్న సొమ్ములో నుంచి రూ. 5కోట్లు పెట్టి తను పనిచేసే పరిధిలోనే జక్కలొద్ది సమీపంలో ఐదు ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు. అందులో మరో రూ. 3కోట్లు పెట్టి 50 వేల కోళ్లు పెరిగే సామర్థ్యం ఉన్న కోళ్ల ఫారం ప్రారంభించాడు. కొద్ది రోజులుగా ఈ వ్యాపారం సాగుతున్నది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆ సీఐ వ్యవహారం వివాదాస్పదమవుతున్నది. తనకు కోళ్ల వ్యాపారంలో ఇటీవరూ. ’60 లక్షలు నష్టం వచ్చిందని.. ఆ నష్టం పూడాలంటే మేము చెప్పిన ధరకు కోళ్లు కొనుగోలు చేయూలని వ్యాపారులను తన పుత్ర రత్నం ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఆయన కుమారుడు.. హోల్‌సేల్ వ్యాపారుల(ట్రేడర్స్) వద్దకు వెళ్లి మార్కెట్ రేటుకంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. మొదట నయానా.. భయానా చెప్పడం.. వినని పక్షంలో దుకాణాల వద్ద వీరంగం ృసష్టించడం సీఐ పుత్ర రత్నం స్టైల్. అయినప్పటికీ ట్రేడర్స్ వినకుంటే మా నాన్నతో మాట్లాడు అంటూ ఫోన్ అందించడం..అటువైపు నుంచి సీఐ బూతుపురాణం.. ఇలా అనేక ప్రాంతాలలో జరుగుతుండడంతో హోల్‌సేల్ వ్యాపారులు లబోదిబోమంటూ ట్రేడర్స్ అసోసియేషన్‌ను సంప్రదించారు. తమను సీఐ కుమారుడు విపరీతంగా భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని, కోళ్లను హైదరాబాద్‌లో నిర్ణయించే రేటుకు కాకుండా ఎక్కువ ధరకు కొనాలని ఒత్తిడి తెస్తున్నాడని ఫిర్యాదు చేశారు. బర్డ్ ధర కిలో రూ.34 ఉంటే రూ.40కి కొనాలంటూ హంగామా చేస్తున్నాడని, అయితే తాము ‘మీ వరకైతే రెండు రూపాయల వరకు ఎక్కువ ఇస్తాం’ అని చెప్పినప్పటికీ సీఐ కుమారుడు ససేమిరా అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని వ్యాపారులు అసోసియేషన్ ఎదుట వాపోయారు. కనీసం ఆరు రూపాయలైనా ఎక్కువ ఇవ్వాలంటున్నాడని చెప్పారు. కాగా, సదరు సీఐ తీరు మారని పక్షంలో డీఐజీకి ఫిర్యాదు చేయాలని ట్రేడర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. రెండు రోజుల్లో అసోసియేషన్ సభ్యులు డీఐజీని కలవనున్నట్టు తెలిసింది.