=నగర శివారులో రూ.3కోట్లతో పౌల్ట్రీఫాం
=తమ కోళ్లను ఎక్కువ ధరకు కొనాలని కుమారుడి ద్వారా బెదిరింపులు
=బెంబేలెత్తిపోతున్న వ్యాపారులు
=డీఐజీకి ఫిర్యాదు చేయూలని ట్రేడర్స్ అసోసియేషన్ నిర్ణయం
వరంగల్ క్రైం, న్యూస్‌లైన్: నగర శివారులో పనిచేస్తున్న ఓ సీఐ సైడ్ బిజినెస్ ప్రారంభించాడు. గతంలో ఏసీబీ అధికారులకు చిక్కిన ఈ సీఐ.. ఉన్నతాధికారులను బతిమిలాడుకుని నగర శివారులో పోస్టింగ్ సంపాధించాడు. విధుల్లో చేరిన నాటినుంచే నాలుగు పైసలు వెనకేసుకునే పనిలో పడ్డాడు. తనకు వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని భావించాడేమో.. కోళ్ల ఫారం పెట్టాడు. తన సర్వీసులో వెనకేసుకున్న సొమ్ములో నుంచి రూ. 5కోట్లు పెట్టి తను పనిచేసే పరిధిలోనే జక్కలొద్ది సమీపంలో ఐదు ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు.
అందులో మరో రూ. 3కోట్లు పెట్టి 50 వేల కోళ్లు పెరిగే సామర్థ్యం ఉన్న కోళ్ల ఫారం ప్రారంభించాడు. కొద్ది రోజులుగా ఈ వ్యాపారం సాగుతున్నది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆ సీఐ వ్యవహారం వివాదాస్పదమవుతున్నది. తనకు కోళ్ల వ్యాపారంలో ఇటీవరూ. ’60 లక్షలు నష్టం వచ్చిందని.. ఆ నష్టం పూడాలంటే మేము చెప్పిన ధరకు కోళ్లు కొనుగోలు చేయూలని వ్యాపారులను తన పుత్ర రత్నం ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఆయన కుమారుడు.. హోల్‌సేల్ వ్యాపారుల(ట్రేడర్స్) వద్దకు వెళ్లి మార్కెట్ రేటుకంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.
మొదట నయానా.. భయానా చెప్పడం.. వినని పక్షంలో దుకాణాల వద్ద వీరంగం ృసష్టించడం సీఐ పుత్ర రత్నం స్టైల్. అయినప్పటికీ ట్రేడర్స్ వినకుంటే మా నాన్నతో మాట్లాడు అంటూ ఫోన్ అందించడం..అటువైపు నుంచి సీఐ బూతుపురాణం.. ఇలా అనేక ప్రాంతాలలో జరుగుతుండడంతో హోల్‌సేల్ వ్యాపారులు లబోదిబోమంటూ ట్రేడర్స్ అసోసియేషన్‌ను సంప్రదించారు. తమను సీఐ కుమారుడు విపరీతంగా భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని, కోళ్లను హైదరాబాద్‌లో నిర్ణయించే రేటుకు కాకుండా ఎక్కువ ధరకు కొనాలని ఒత్తిడి తెస్తున్నాడని ఫిర్యాదు చేశారు.
బర్డ్ ధర కిలో రూ.34 ఉంటే రూ.40కి కొనాలంటూ హంగామా చేస్తున్నాడని, అయితే తాము ‘మీ వరకైతే రెండు రూపాయల వరకు ఎక్కువ ఇస్తాం’ అని చెప్పినప్పటికీ సీఐ కుమారుడు ససేమిరా అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని వ్యాపారులు అసోసియేషన్ ఎదుట వాపోయారు. కనీసం ఆరు రూపాయలైనా ఎక్కువ ఇవ్వాలంటున్నాడని చెప్పారు. కాగా, సదరు సీఐ తీరు మారని పక్షంలో డీఐజీకి ఫిర్యాదు చేయాలని ట్రేడర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. రెండు రోజుల్లో అసోసియేషన్ సభ్యులు డీఐజీని కలవనున్నట్టు తెలిసింది.