side business
-
ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!
బాలీవుడ్ హీరోయిన్లు రెమ్యూనరేషన్ విషయంలో హీరోలకు ఏ మాత్రం తీసిపోరు. జవాన్ చిత్రంలో నటిస్తోన్న దీపికా పదుకొణె భారీగానే పారితోషికం అందుకోనుంది. సినిమాలతో పాటు మరోవైపు యాడ్స్‌లో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. గ్లామర్ ఫీల్డ్ వారికి సాధారణంగానే ఆదరణ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటి వ్యక్తులు నటనతో పాటు బిజినెస్‌పై దృష్టి సారిస్తున్నారు. సినిమాలతో పాటు వ్యాపారం రంగంలో రాణిస్తూ ఆదాయాన్ని మరింత పెంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్ర తారలు చేస్తున్న వ్యాపారాలపై ఓ లుక్కేద్దాం. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు బిజినెస్‌లో కూడా జోరు కొనసాగిస్తున్నారు. కొంతమంది నటీమణులు సైడ్ బిజినెస్ చేస్తూ పారిశ్రామికవేత్తలు కూడా రాణిస్తున్నారు. ఈ నటీమణులు తమ సైడ్ బిజినెస్ ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఆదిపురుష్ భామ కృతి సనన్: ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌లో నటించింది. పలు భాషల్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రాలను అందించిన నటి కృతి సనన్ ఇటీవలే తన సోదరి నూపూర్‌తో కలిసి సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది. కాగా.. కృతి సనన్ నిర్మాణ సంస్థ పేరు బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్. తాను ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాలు చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఇదే ప్రొడక్షన్ హౌస్‌లో దో పట్టి సినిమా నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో నటి కాజోల్ కూడా నటిస్తోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. సీనియర్ నటి సుస్మితా సేన్ సుస్మితా సేన్: మరో బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితా సేన్ మంచి నటి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె జ్యువెలరీ బ్రాండ్‌ను కలిగి ఉన్నారు. అంతే కాకుండా తంత్ర ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్‌కు యజమాని కూడా ఉన్నారు. సుస్మితకు అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. 2022 ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం సుస్మితా సేన్ బిజినెస్ టర్నోవర్ విలువ రూ.74 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. విరాట్ భార్య అనుష్క శర్మ అనుష్క శర్మ: బాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలను అందించిన నటీమణులలో అనుష్క శర్మ ఒకరు. అనుష్క తన సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించింది. ఆమె ప్రొడక్షన్ హౌస్ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌తో పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంది. అనుష్కకు నుష్ అనే డ్రెస్ బ్రాండ్ వ్యాపారం కూడా ఉంది. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనుష్క.. సినిమాల్లో కంటే బిజినెస్‌లోనే బాగా రాణిస్తోంది. దీపికా పదుకొణె బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్లో కూడా ఎన్నో సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. తాజాగా ఆమె షారూక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో కనిపించనుంది. 'ఆల్ అబౌట్ యు' అనే దుస్తుల బ్రాండ్‌ను నడుపుతోంది. అంతే కాకుండా 'లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్' వ్యవస్థాపకురాలు కూడా. ఓ కథనం ప్రకారం దీపికా పదుకొణె బిజినెస్ నికర విలువ రూ.498 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు బాలీవుడ్ హీరోయిన్స్‌తో పాటు.. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్‌వుడ్, కోలీవుడ్ సహా ఇతర సినీ రంగాలకు చెందిన పలువురు నటీమణులు సైతం.. సొంతంగా సైడ్ బిజినెస్‌లు చేస్తూ రెండు చేతులతో భారీగా సంపాదిస్తున్నారు. -
ఒక చేత్తో ఆట... మరో చేత్తో వ్యాపారం...
భారత జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా వస్తారా? అని ఆస్ట్రేలియన్ లెజండరీ క్రికెటర్ స్టీవ్‌వాను మీడియా ఆరాతీస్తే.. ‘టీమిండియాపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తట్టుకోవడం కష్టం. అంత సాహ సం నేను చేయలేనేమో..’ అంటూ సమాధానం ఇచ్చాడాయన. కోచ్‌గా రావడానికి స్టీవ్‌కు ధైర్యం లేదు. ఎందుకంటే.. జట్టు ఓడితే ఆటగాళ్లతో పాటు కోచ్‌ను కూడా తూర్పారబట్టే చరిత్ర మనది. మరి ఇలాంటి జట్టులో సభ్యులుగా ఉన్న క్రికెటర్లు మాత్రం నూటా ఇరవై కోట్ల మంది ఆశలను మోస్తూ కూడా ఇతర రంగాల్లో కూడా రాణించేస్తున్నారు! ఒక్కో ఆటగాడు ఒక్కోరకమైన ఆలోచనలతో సైడ్బిజినెస్లు చేసుకొంటున్నారు. మరి వీరిని సమర్థులు అనుకోవాలో...ఆటపై అంకితభావం తగ్గిన వాళ్లు అనుకోవాలో మాత్రం అర్థం కాదు. ముందుగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ నుంచి సంపదను తోడి వ్యాపారాలు చేస్తున్న వ్యక్తిగా ఫోర్బ్స్ పత్రిక విశ్లేషణల్లో చోటు సంపాదించాడు. మ్యాచ్‌ఫీజులు, ఐపీఎల్, ఎండార్స్మెంట్ ద్వారా మాత్రమే కాకుండా తన వ్యాపారాల ద్వారా ధోనీ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని ఫోర్బ్స్ అంచనా. ధోనీకి రిథీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా జిమ్ కమ్ ఫిట్నెస్ సెంటర్లున్నాయి. హీరో హాకీ ఇండియా లీగ్‌లో రాంచీ ప్రాంచైజ్కు యజమాని మహేంద్ర సింగ్ధోనీయే. అలాగే మోటార్ రేసింగ్ స్పోర్ట్స్‌లోని ఒక జట్టులో కూడా ధోనీకి వాటాలున్నాయి. ధోనీ చూపిన దోవలో... వన్డే క్రికెట్లో ధోనీకి డిప్యూటీగా ఉన్న విరాట్ కొహ్లీ కూడా కెప్టెన్ చూపిన బాటలోనే నడుస్తున్నాడు. ఇటీవలే విరాట్ కూడా జిమ్ కమ్ ఫిట్నెస్ సెంటర్ల నిర్వహణ వ్యాపారంలో ముందడుగు వేశాడు. విరాట్ అండ్ కంపెనీ 90 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సెంటర్లను ప్రారంభించనుంది. మలిదశలో మరో వందకోట్ల రూపాయలను జోడించి వ్యాపారాన్ని విస్తరిస్తారట. చిజెల్ ఫిటెనెస్ సంస్థ విరాట్‌తో భాగస్వామి. ఇతడికే ఇండియన్ సూపర్‌లీగ్‌లో ఆడే ఎఫ్‌సీ గోవా ఫుట్‌బాల్ జట్టులో వాటా కూడా ఉంది. వీళ్లకే కాదు... జట్టులో చోటు కోసం తీవ్రమైన ప్రయత్నాలే సాగిస్తున్న యువరాజ్ సింగ్‌కు మొబైల్ ఆధారిత బ్యూటీ అండ్ వెల్నెస్ స్టార్టప్ వ్యోమోలో వాటాలున్నాయి. కొంతకాలం కిందట జాతీయ జట్టులో స్థానం కోల్పోయి ఐపీఎల్‌కు పరిమితమైన రాబిన్ ఊతప్పకు ‘ఐ టిఫిన్’ అనే ఫుడ్ స్టార్టప్‌లో వాటాలున్నాయి. జట్టులో స్థానం లేకపోయినా ఐపీఎల్‌తో కనిపిస్తున్న జహీర్‌ఖాన్, హర్బజన్ సింగ్‌లకు కూడా రెస్టారెంట్ వ్యాపారాలున్నాయి. జాతీయ జట్టు సభ్యులైన ఆటగాళ్లు ఇలా వ్యాపారాలపై దృష్టి సారించడం అభిమానులను ఒకింత నిరాశపరుస్తుంది. వీళ్లు ఆటకే పరిమితమైతే మంచిదనేది వారి అభిప్రాయం. వ్యాపారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే జాతీయ జట్టులో స్థానం మాత్రం ఎప్పుడూ ఉండదు. అయితే సెలెక్టర్లు, బీసీసీఐ మాత్రం ఆటగాళ్ల ఈ వ్యక్తిగత వ్యాపారాల గురించి పట్టించుకోవడం లేదు. - జీవన్ సచిన్, సౌరవ్లు ఫెయిలయ్యారు! ఒకరు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ బాగా అభిమానించే అటగాడు, మరొకరు జాతికి బాగా ఇష్టమైన కెప్టెన్.. అంతర్జాతీయ క్రికెట్లో వీళ్లకంటూ ప్రత్యేక స్థానం ఉంది. మరి క్రికెటర్లుగా దశాబ్దాలకు దశాబ్దాల పాటు రాణించిన వీళ్లు వ్యాపారవేత్తలుగా మాత్రం రాణించలేకపోయారు. సచిన్ ముంబైలో ‘టెండూల్కర్స్’ అనే రెస్టారెంట్‌ను, ‘సచిన్స్’ అనే కేఫ్‌ను కొన్ని సంవత్సరాల కిందట ప్రారంభించాడు. హొటలియర్గా పేరు పొందిన మార్స్ గ్రూప్ అధినేత సంజయ్ నారంగ్‌తో కలసి సచిన్ వీటిని ప్రారంభించాడు. అయితే ఈ ఫుడ్ బిజినెస్ కలసి రాకపోవడంతో మాస్టర్ వాటిని మూసివేశాడు. బెంగాలీదాదా గంగూలీ కోల్‌కతాలో ‘సౌరవ్స్’ పేరుతో నాలుగంతస్తుల భవనంలో రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. అది కూడా సచిన్ వ్యాపారాలదారిలోనే నడిచి మూతపడింది. విశేషం ఏమిటంటే.. వీరి స్పూర్తితో రెస్టారెంట్ బిజినెస్‌లోకి ప్రవేశించిన ఢిల్లీ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్‌కు కూడా చేదు అనుభవమే మిగిలింది. ఢిల్లీలో వీరూ ప్రారంభించిన రెస్టారెంట్ మూతపడింది. -
ఓ సీఐ కోళ్ల దందా!
=నగర శివారులో రూ.3కోట్లతో పౌల్ట్రీఫాం =తమ కోళ్లను ఎక్కువ ధరకు కొనాలని కుమారుడి ద్వారా బెదిరింపులు =బెంబేలెత్తిపోతున్న వ్యాపారులు =డీఐజీకి ఫిర్యాదు చేయూలని ట్రేడర్స్ అసోసియేషన్ నిర్ణయం వరంగల్ క్రైం, న్యూస్‌లైన్: నగర శివారులో పనిచేస్తున్న ఓ సీఐ సైడ్ బిజినెస్ ప్రారంభించాడు. గతంలో ఏసీబీ అధికారులకు చిక్కిన ఈ సీఐ.. ఉన్నతాధికారులను బతిమిలాడుకుని నగర శివారులో పోస్టింగ్ సంపాధించాడు. విధుల్లో చేరిన నాటినుంచే నాలుగు పైసలు వెనకేసుకునే పనిలో పడ్డాడు. తనకు వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని భావించాడేమో.. కోళ్ల ఫారం పెట్టాడు. తన సర్వీసులో వెనకేసుకున్న సొమ్ములో నుంచి రూ. 5కోట్లు పెట్టి తను పనిచేసే పరిధిలోనే జక్కలొద్ది సమీపంలో ఐదు ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు. అందులో మరో రూ. 3కోట్లు పెట్టి 50 వేల కోళ్లు పెరిగే సామర్థ్యం ఉన్న కోళ్ల ఫారం ప్రారంభించాడు. కొద్ది రోజులుగా ఈ వ్యాపారం సాగుతున్నది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆ సీఐ వ్యవహారం వివాదాస్పదమవుతున్నది. తనకు కోళ్ల వ్యాపారంలో ఇటీవరూ. ’60 లక్షలు నష్టం వచ్చిందని.. ఆ నష్టం పూడాలంటే మేము చెప్పిన ధరకు కోళ్లు కొనుగోలు చేయూలని వ్యాపారులను తన పుత్ర రత్నం ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఆయన కుమారుడు.. హోల్‌సేల్ వ్యాపారుల(ట్రేడర్స్) వద్దకు వెళ్లి మార్కెట్ రేటుకంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. మొదట నయానా.. భయానా చెప్పడం.. వినని పక్షంలో దుకాణాల వద్ద వీరంగం ృసష్టించడం సీఐ పుత్ర రత్నం స్టైల్. అయినప్పటికీ ట్రేడర్స్ వినకుంటే మా నాన్నతో మాట్లాడు అంటూ ఫోన్ అందించడం..అటువైపు నుంచి సీఐ బూతుపురాణం.. ఇలా అనేక ప్రాంతాలలో జరుగుతుండడంతో హోల్‌సేల్ వ్యాపారులు లబోదిబోమంటూ ట్రేడర్స్ అసోసియేషన్‌ను సంప్రదించారు. తమను సీఐ కుమారుడు విపరీతంగా భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని, కోళ్లను హైదరాబాద్‌లో నిర్ణయించే రేటుకు కాకుండా ఎక్కువ ధరకు కొనాలని ఒత్తిడి తెస్తున్నాడని ఫిర్యాదు చేశారు. బర్డ్ ధర కిలో రూ.34 ఉంటే రూ.40కి కొనాలంటూ హంగామా చేస్తున్నాడని, అయితే తాము ‘మీ వరకైతే రెండు రూపాయల వరకు ఎక్కువ ఇస్తాం’ అని చెప్పినప్పటికీ సీఐ కుమారుడు ససేమిరా అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని వ్యాపారులు అసోసియేషన్ ఎదుట వాపోయారు. కనీసం ఆరు రూపాయలైనా ఎక్కువ ఇవ్వాలంటున్నాడని చెప్పారు. కాగా, సదరు సీఐ తీరు మారని పక్షంలో డీఐజీకి ఫిర్యాదు చేయాలని ట్రేడర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. రెండు రోజుల్లో అసోసియేషన్ సభ్యులు డీఐజీని కలవనున్నట్టు తెలిసింది. -
లీజు భూమిలో ‘దేశం’ దందా
=పార్టీ కార్యాలయ భూమిలో ప్రైవేటు వ్యాపారం =ట్రావెల్స్ సంస్థకు అద్దెకు.. =అసాంఘిక కార్యక్రమాలకు నెలవు! = హైదరాబాద్ జిల్లా టీడీపీ శాఖ నిర్వాకం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ శాఖ ‘సైడ్ బిజినెస్’ చేస్తోంది. పార్టీ కార్యాలయం నిమిత్తం ప్రభుత్వం నుంచి కారుచౌకగా భూమిని లీజుకు పొంది.. ఆ స్థలంలో కొంత భాగాన్ని మరో సంస్థ (థర్డ్‌పార్టీ)కి సబ్‌లీజుకిచ్చి వ్యాపారం నిర్వహిస్తోంది. దీన్ని నివారించాల్సింది పోయి పార్టీ రాష్ట్ర కార్యాలయ నేతలు సైతం పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. దీంతో జిల్లా నేతలు జంకూగొంకూ లేకుండా దందా కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యాలయం కంటే ప్రైవేటు సంస్థ స్వాధీన స్థలమే ఎక్కువగా ఉండటంతో పాటు అందులో అడపాదడపా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఇదిలా ఉండగా, కారుచౌకగా పొందిన లీజు భూమికి రెండేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో సంబంధిత హిమాయత్‌నగర్ మండల రెవెన్యూ అధికారులు ఇటీవల నోటీసు జారీ చేశారు. ఇదీ గ‘లీజు’ వ్యవహారం.. నగరం నడిబొడ్డున ఎంతో మార్కెట్ డిమాండ్ ఉన్న దోమలగూడ ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో 3000 చదరపు గజాల స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసమని ఏడాదికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం నుంచి 30 ఏళ్లపాటు దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నారు. 2004లో కుదిరిన లీజు ఒప్పందం మేరకు, ప్రతి ఐదేళ్లకోసారి లీజు అద్దె పది శాతం పెంచాలి. ఆ లెక్కన ప్రస్తుతం ఏడాదికి రూ. లక్షా పదివేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. సువిశాల విస్తీర్ణంలోని భూమిలో కొంత భాగం మేర మాత్రం పార్టీ కార్యాలయం, సభా కార్యక్రమాల కోసం మరో రేకుల షెడ్డు నిర్మించారు. మొత్తం స్థలంలో దాదాపు 75 శాతం మేర ఖాళీగా ఉండటంతో దాన్ని ‘గణేశ్ట్రావెల్స్’ సంస్థకు వాహనాలు నిలుపుకునేందుకు (పార్కింగ్‌కు) అద్దెకిచ్చారు. అందుకు నెలకు దాదాపు రూ. 30 వేల మేరకు అద్దె వసూలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అంటే ఏటా అద్దె రూపేణా రూ. 3.60 లక్షలు పొందుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన లీజు అద్దె రూ. 1.10 లక్షలు పోను రూ. 2.50 లక్షలు ‘దేశం’ నేతలు వెనకేసుకుంటున్నారు. ఈ ఆదాయం నుంచే కార్యాలయ నిర్వహణ ఖర్చులు వెళ్లదీస్తున్నారని సమాచారం. గతంలో జిల్లా కార్యాలయ నిర్వహణతోపాటు సిబ్బంది వేతనాలు, తదితర ఖర్చులు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి అందేవి. ప్రస్తుతం నిర్వహణ ఖర్చులు తగ్గినందున కాబోలు రాష్ట్ర కార్యాలయం సైతం ఈ ‘దందా’ను నివారించే పనిచేయలేదని తెలుస్తోంది. తొలుత ఈ అంశం దష్టికి వచ్చినప్పుడు ట్రావెల్స్ యజమాని పార్టీ మద్దతుదారుడని, కొద్ది రోజుల కోసం తాత్కాలికంగా వాహనాలు నిలుపుకునేందుకు అనుమతించామని తెలిపినట్లు సమాచారం. అనంతరం అక్కడి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో బహిరంగంగానే కార్యాలయ స్థలాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పరం చేశారు. ట్రావెల్స్ కోసం వచ్చే,పోయే వారు పార్టీ కార్యాలయ సిబ్బంది లేని సమయంలో పేకాట వంటి కార్యక్రమాలు సాగిస్తుం డటం తెలిసి.. గత వారం పోలీసులు పట్టుకునేందుకు రాగా, పేకాటరాయుళ్లు పారిపోయినట్లు సమాచారం. పార్టీ కార్యాలయ స్థలాన్ని ప్రైవేటుకు లీజుకివ్వడంతో ఇలాంటి అప్రదిష్ట రావడమే కాక పార్టీ కార్యక్రమాలు జరిగినప్పుడు నాయకులు, కార్యకర్తలు వాహనాలు నిలుపుకునేందుకు స్థలం లేక బయట రహదారిపైనే వాహనాలు నిలుపుకొంటున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని నాయకుడొకరు వాపోయారు. లీజు భూమిలో ప్రైవేటు ట్రావెల్స్ పార్కింగ్ గురించి ఇటీవలే తమ దృష్టికీ వచ్చిందని, విచారణ జరిపాక ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు చెప్పారు.