=పార్టీ కార్యాలయ భూమిలో ప్రైవేటు వ్యాపారం
=ట్రావెల్స్ సంస్థకు అద్దెకు..
=అసాంఘిక కార్యక్రమాలకు నెలవు!
= హైదరాబాద్ జిల్లా టీడీపీ శాఖ నిర్వాకం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ శాఖ ‘సైడ్ బిజినెస్’ చేస్తోంది. పార్టీ కార్యాలయం నిమిత్తం ప్రభుత్వం నుంచి కారుచౌకగా భూమిని లీజుకు పొంది.. ఆ స్థలంలో కొంత భాగాన్ని మరో సంస్థ (థర్డ్‌పార్టీ)కి సబ్‌లీజుకిచ్చి వ్యాపారం నిర్వహిస్తోంది. దీన్ని నివారించాల్సింది పోయి పార్టీ రాష్ట్ర కార్యాలయ నేతలు సైతం పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. దీంతో జిల్లా నేతలు జంకూగొంకూ లేకుండా దందా కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యాలయం కంటే ప్రైవేటు సంస్థ స్వాధీన స్థలమే ఎక్కువగా ఉండటంతో పాటు అందులో అడపాదడపా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఇదిలా ఉండగా, కారుచౌకగా పొందిన లీజు భూమికి రెండేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో సంబంధిత హిమాయత్‌నగర్ మండల రెవెన్యూ అధికారులు ఇటీవల నోటీసు జారీ చేశారు.
ఇదీ గ‘లీజు’ వ్యవహారం..
నగరం నడిబొడ్డున ఎంతో మార్కెట్ డిమాండ్ ఉన్న దోమలగూడ ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో 3000 చదరపు గజాల స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసమని ఏడాదికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం నుంచి 30 ఏళ్లపాటు దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నారు. 2004లో కుదిరిన లీజు ఒప్పందం మేరకు, ప్రతి ఐదేళ్లకోసారి లీజు అద్దె పది శాతం పెంచాలి. ఆ లెక్కన ప్రస్తుతం ఏడాదికి రూ. లక్షా పదివేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. సువిశాల విస్తీర్ణంలోని భూమిలో కొంత భాగం మేర మాత్రం పార్టీ కార్యాలయం, సభా కార్యక్రమాల కోసం మరో రేకుల షెడ్డు నిర్మించారు.
మొత్తం స్థలంలో దాదాపు 75 శాతం మేర ఖాళీగా ఉండటంతో దాన్ని ‘గణేశ్‌ట్రావెల్స్’ సంస్థకు వాహనాలు నిలుపుకునేందుకు (పార్కింగ్‌కు) అద్దెకిచ్చారు. అందుకు నెలకు దాదాపు రూ. 30 వేల మేరకు అద్దె వసూలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అంటే ఏటా అద్దె రూపేణా రూ. 3.60 లక్షలు పొందుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన లీజు అద్దె రూ. 1.10 లక్షలు పోను రూ. 2.50 లక్షలు ‘దేశం’ నేతలు వెనకేసుకుంటున్నారు.
ఈ ఆదాయం నుంచే కార్యాలయ నిర్వహణ ఖర్చులు వెళ్లదీస్తున్నారని సమాచారం. గతంలో జిల్లా కార్యాలయ నిర్వహణతోపాటు సిబ్బంది వేతనాలు, తదితర ఖర్చులు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి అందేవి. ప్రస్తుతం నిర్వహణ ఖర్చులు తగ్గినందున కాబోలు రాష్ట్ర కార్యాలయం సైతం ఈ ‘దందా’ను నివారించే పనిచేయలేదని తెలుస్తోంది. తొలుత ఈ అంశం దష్టికి వచ్చినప్పుడు ట్రావెల్స్ యజమాని పార్టీ మద్దతుదారుడని, కొద్ది రోజుల కోసం తాత్కాలికంగా వాహనాలు నిలుపుకునేందుకు అనుమతించామని తెలిపినట్లు సమాచారం.
అనంతరం అక్కడి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో బహిరంగంగానే కార్యాలయ స్థలాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పరం చేశారు. ట్రావెల్స్ కోసం వచ్చే,పోయే వారు పార్టీ కార్యాలయ సిబ్బంది లేని సమయంలో పేకాట వంటి కార్యక్రమాలు సాగిస్తుం డటం తెలిసి.. గత వారం పోలీసులు పట్టుకునేందుకు రాగా, పేకాటరాయుళ్లు పారిపోయినట్లు సమాచారం.
పార్టీ కార్యాలయ స్థలాన్ని ప్రైవేటుకు లీజుకివ్వడంతో ఇలాంటి అప్రదిష్ట రావడమే కాక పార్టీ కార్యక్రమాలు జరిగినప్పుడు నాయకులు, కార్యకర్తలు వాహనాలు నిలుపుకునేందుకు స్థలం లేక బయట రహదారిపైనే వాహనాలు నిలుపుకొంటున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని నాయకుడొకరు వాపోయారు. లీజు భూమిలో ప్రైవేటు ట్రావెల్స్ పార్కింగ్ గురించి ఇటీవలే తమ దృష్టికీ వచ్చిందని, విచారణ జరిపాక ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు చెప్పారు.