Travels company
-
ఒకపుడు తినడానికి లేదు..ఇపుడు 600 లగ్జరీ కార్లు..‘బిలియనీర్ బాబు’ స్టోరీ చూస్తే..!
బెంగళూరు రమేష్ బాబు లేదా ‘ఇండియన్ ' బిలియనీర్ బార్బర్’. 600 కార్ల కలెక్షన్‌ను గమనిస్తే ఎవరైనా ఔరా అనక తప్పదు. అందులోనూ అన్నీ ఖరీదైన కార్లే. ఎక్కువ భాగం బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్ రోవర్ రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ బ్రాండ్సే.బిలియనీర్ బాబుగా పాపులర్ అయిన రమేష్ బాబు ఒకప్పుడు కడు పేదవాడే. ఒక పూట తింటే రెండోపూటకు కష్టమే. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కూలిపనులకెళ్లాడు. జీవితం గడవడానికి అమ్మకు తోడుగా చాలా ఉద్యోగాలు చేశాడు. మరి బిలియనీర్‌గా ఎలా అవతరించాడు..? రమేష్ బాబు తండ్రి గోపాల్ బెంగళూరులో క్షురకుడుగా పని చేసేవారు. రమేష్ ఏడేళ్ల వయస్సులోనే తండ్రి కన్నుమూశారు. దీంతో తల్లి ముగ్గురు పిల్లలున్న కుటుంబానికి బెంగళూరులోని బ్రిడ్జ్ రోడ్‌లోని చిన్న బార్బర్ షాప్ ఒక్కటే జీవనాధారం. కేవలం 40-50 రూపాయలతో పిల్లల్ని పోషించేది. పిల్లల్ని చదివించింది. బట్టలు, పుస్తకాలు, ఫీజులు, అన్నింటికీ వినియోగించేది. మరోవైపు బార్బర్షాప్ను నిర్వహించలేక రోజుకు రూ.5 అద్దెకు ఇచ్చేయడంతో పరిస్థితి మరింత దుర్భరమైంది. ఒక్కపూట భోజనంతో సరిపెట్టుకునే వారు. 13 సంవత్సరాల వయస్సులో న్యూస్ పేపర్ డెలివరీ,మిల్క్ హోమ్ డెలివరీలాంటి ఎన్నో పనులు చేసిన కుటుంబ పోషణలో తల్లి ఆసరాగా ఉండేవాడు. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ 10వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి, చివరికి తండ్రి పాత దుకాణం 'ఇన్నర్ స్పేస్' లో బార్బర్‌గా పని చేయడం ప్రారంభించాడు. పట్టుదలతో కష్టించి పనిచేశాడు. అది త్వరలోనే ట్రెండీ స్టైలింగ్ అవుట్‌లెట్‌గా మారిపోయింది. హెయిర్స్టయిలిస్ట్గా బాగా పేరు గడించాడు. ఆ తర్వాత రమేష్ బాబు 1993లో తన మామ దగ్గర కొంత డబ్బు తీసుకుని మారుతీ ఓమ్నీ వ్యాన్ కొనుగోలు చేశాడు. ఈ కారు ఈఎంఐ చెల్లించేలేక ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించాడు. అలా తన తల్లి పనిచేసే కుటుంబానికి చెందిన ఇంటెల్ కంపెనీ ఉద్యోగులను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకొచ్చే పని తీసుకుని ట్రావెల్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అది లాభసాటిగా ఉండటంతోపాటు, పర్యాటక రంగానికి ప్రభుత్వంప్రోత్సాహంతో 2004లో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ని లాంచ్ చేసి లగ్జరీ కార్ రెంటల్ అండ్ సెల్ఫ్ డ్రైవ్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ముప్పై ఏళ్లుగా సేవలందిస్తూ, ఖరీదైన కార్లను సేకరిస్తూనే ఉన్నాడు. అలా 600కు పైగా కార్లు అతని గారేజ్‌లో ఉన్నాయి.దాదాపు అన్నీ బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లంటేనే అతని వ్యాపారాన్ని అర్థం చేసుకోవచ్చు. వీటితోపాటు వ్యాన్లు, మినీబస్సులు కూడా ఉన్నాయి. తొలి లగ్జరీ కారు మెర్సిడెస్ ఈ కాస్ల్ సెడాన్ అతని తొలి లగ్జరీ కారు. దీని ధర రూ.38 లక్షలు. ప్రస్తుతం 3 కోట్ల ఆర్ఆర్ ఘోస్ట్, 2.6 కోట్ల ఖరీదైన మేబ్యాచ్ అతని ట్రావెల్స్‌లో ఉన్నాయి. రమేష్ బాబు కంపెనీ ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో నడుస్తుంది. అదే సమయంలో, అతని వ్యాపారం కొన్ని ఇతర దేశాలలో కూడా విస్తరించింది. దాదాపు 300 పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు. బిగ్‌బీ, ఆమీర్ ఖాన్ లాంటి సెలబ్రిటీ కస్టమర్లు రమేష్ అన్ని కార్లను డ్రైవ్ చేయగలడు. అతని క్లయింట్ల జాబితా అంతా సెలబ్రిటీలు, బిలియనీర్లే. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్ లాంటి వారితోపాటు, ప్రముఖ రాజకీయ నాయకులు ధనిక పారిశ్రామికవేత్తలు కూడా వారు పట్టణంలో ఉన్నప్పుడు కార్లను అద్దెకు తీసుకుంటారట. రోజుకు వసూలు చేసే అద్ద 50వేల రూపాయలకు పై మాటే. అన్నట్టు ఇప్పటికీ తన వృత్తిని వదులుకోకపోవడం విశేషం. బిలియనీర్ బాబు మెర్సిడెస్ లేదా రోల్స్ రాయిస్‌లోని తన దుకాణానికి వెళ్తాడు. నిజంగా రమేష్ బాబు కథ స్ఫూర్తిదాయకం. 2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే రిచెస్ట్ బార్బర్‌గా ఫోర్బ్స్ గుర్తించింది. -
నమ్మకమే పెట్టుబడి: మాంచి ముహూర్తం చూసుకుని.. 130 కార్లతో జంప్!
దొడ్డబళ్లాపురం: ట్రావెల్స్ వ్యాపారం పేరుతో సుమారు 130 కార్లను అద్దెకు తీసుకున్న ఓ వ్యక్తి.. ఒకానొక రోజు మంచి ముహూర్తం చూసుకుని కార్లు అన్నిటినీ చాప చుట్టేసి, వాటి యజమానుల్ని నిండా ముంచేసి మాయమయ్యాడు. ఈ ఉందంతం బెంగళూరు సమీపంలోని నెలమంగల తాలూకాలో వెలుగుచూసింది. తమిళనాడుకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి సంవత్సరం క్రితం తాలూకాలోని నాగసంద్రలో ఆర్ఎస్ ట్రావెల్స్ పేరుతో ఆఫీసు తెరిచాడు. చుట్టుపక్కల వారి నమ్మకాన్ని చూరగొన్నాడు. మీ కార్లను నా దగ్గర ఉంచితే వాటిని అద్దెకు తిప్పి మీకు డబ్బులు ఇస్తానని చెప్పి.. సుమారు 130 కార్లను ఆధీనంలో ఉంచుకున్నాడు. వీటన్నింటి విలువ రూ.10 కోట్ల పైనే. ప్రారంభంలో ప్రతి నెలా 8వ తేదీన కార్ల యజమానులకు అద్దె డబ్బులను అకౌంట్లలో వేసేవాడు. నవంబర్ నెల అద్దె చెల్లించకపోవడంతో కార్ల యజమానులు శివకుమార్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. అనుమానం వచ్చి ట్రావెల్స్ ఆఫీసు వద్దకు వచ్చి చూడగా తాళం వేసి ఉంది. తామంతా మోసపోయామని తెలుసుకున్న యజమానులు బాగలగుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
వెలుగులోకి మోసాల చిట్టా
భేటీ...రాజంపేట: కేఎస్ఎస్ ట్రావెల్స్ బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా రాజంపేటలో బాధితులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. 70మంది వద్ద రూ.26 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో పట్టణ పోలీసుస్టేషన్లో బాధితులతో డీఎస్పీ లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. బాధితుల కథనం మేరకు.. పెనగలూరు మండలం కొత్తపల్లెకు చెందిన షేక్ షామీర్‌బాషా ఈ ఏడాది ఏప్రిల్‌లో మక్కాకు పోవాలనే ఉద్దేశంతో రాజంపేట బైపాస్‌రోడ్డులోని కేఎస్ఎస్ ట్రావెల్స్‌కు చెందిన అలీపీర్‌కు మార్చి 23వతేదీ రూ.23వేలు నగదు ఇచ్చారు. అందుకు రసీదు కూడా ఇచ్చారు. మక్కాకు వెళ్లేందుకు పాస్పోర్టుతో పాటు ధ్రువీకరణపత్రాలను తీసుకున్నారు. వీసా తదితరాలను తానే కల్పిస్తానని నమ్మబలికారు. ఏప్రిల్ 25 నుంచి మే 5వతేదీలోపు పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు. మే 5న బాధితుడు తనను మక్కా ఎందుకు పంపలేదని నిలదీశారు. దానికి సమాధానం ఇవ్వకుండా నిర్వహకుడు జారుకున్నారు. ఈనెల 27న ఉదయం రాజంపేట బైపాస్‌లో ఉన్న కేఎస్ఎస్ ట్రావెల్స్ దగ్గరకు పోగా మూసివేశారు. అలీపీరాకు ఫోన్ చేయగా 28న కడప ఆల్మాస్పేట్లోని మెయిన్బ్రాంచికి రావాలన్నారు. అలాగే అక్కడికి వెళితే మెయిన్ ఆఫీస్ కూడా మూసివేయడంతో ఆరా తీశారు. వారు మోసం చేశారని తెలుసుకున్నారు. రాజంపేటకు వచ్చి విచారిస్తే సత్తార్, కరీముల్లా, సుభాన్‌తో పాటు మరికొంతమంది కూడా మోసపోయారని తెలుసుకున్నారు. దీంతో బాధితులు మూకుమ్మడిగా స్టేషన్‌కు వచ్చి అలీతోపాటు కేఎస్ఎస్ ట్రావెల్స్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, మాడబ్బులు, పాస్‌పోర్టులను వెనక్కి ఇప్పించాలని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పట్టణ పోలీసుస్టేషన్‌కు చేరుకున్న డీఎస్పీ, సీఐలు విచారణ చేశారు. బాధితుల మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ రాజగోపాల్ తెలిపారు. -
కాశ్మీర దీపకళిక!
భౌగోళికంగానూ, ప్రకృతి అందాలతోనూ దేశానికి తలమానికంగా ఉన్నది కాశ్మీర్. అయితే ఆ హిమపు సౌధంలో రగిలిన జ్వాల చాలా జీవితాలను నాశనం చేసింది. ప్రత్యేకించి ఎక్కడైనా యుద్ధానికి తొలి బాధితులు అయ్యే మహిళలు, చిన్నపిల్లలను ఇళ్లకే పరిమితం చేసింది. అలాంటి గడ్డ మీద ఇప్పుడిప్పుడే అక్కడక్కడ ఒక్కో కలువా విరబూస్తోంది. ఒక్కోటే వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారిలో థిన్లాస్ కోరల్ ఒకరు. కాశ్మీర్‌లోని తొలి మహిళా ట్రావెల్స్ కంపెనీ యజమాని ఈమె. ట్రెక్కింగ్‌లో సుశిక్షితురాలై... లడఖ్‌లోని మంచుకొండల అందాలను అందరికీ పరిచయం చేస్తూ, తాను ఉపాధి పొంది,అనేక మందికి ఉపాధిని చూపుతూ వ్యాపారవేత్తగా ఎదుగుతున్న మహిళ ఈమె. అందచందాలనే ఆభరణాలు చేసుకొని కళకళలాడే నేల కాశ్మీర్. పక్కదేశాల నుంచి చొరబాట్లు, సీమాంతర ఉగ్రవాదం ఫలితంగా కర్ఫ్యూలతో వెలవెలబోతున్న గడ్డ కూడా అదే.. అయినా ఒక్కసారి ఆ అందాలను తనివితీరా చూడాలని తపించే వాళ్లు ఎంతోమంది. కానీ భారతీయుడు అయినా సరే కాశ్మీర్ లోయల్లో ప్రయాణం అంటే అది సాహసమే. జీవితంలో ఒక్కసారి ఆ సాహసం చేసినా అది అద్భుతమైన అనుభవం అవుతుంది. అనుదినం అలాంటి సాహసం చేస్తూ, ఆ సాహసం చేయడాన్నే కెరీర్గామార్చుకొని, అనేక మందికి స్ఫూర్తిగా మారిన మహిళ థిన్లాస్ (33). తొలి మహిళా టూరిస్ట్‌గైడ్... లడఖ్ పర్వతసానువుల్లోని ఒక గ్రామంలో వ్యవసాయాధార బౌద్ధ కుటుంబంలో జన్మించిన థిన్లాస్కు అమ్మానాన్నల వెంట పొలానికి వెళ్లడం అంటే భలే ఇష్టం. చిన్నప్పుడే అమ్మచనిపోవడం, నాన్న రెండోపెళ్లి చేసుకోవడంతో కొంత అంతర్ముఖురాలిగా తయారయ్యిందామె. అటువంటి సమయంలో ఆమెకు అక్కడి కొండలూ లోయలతో స్నేహం కుదిరింది. వాటిల్లో ఆడిపాడటానికి మించిన ఆనందం మరేదీ లేకుండా పోయింది. జమ్మూ యూనివర్సిటీలో బీఏ డిగ్రీని పూర్తి చేసి తిరిగి సొంతూరు చేరుకొందామె. ఒక అమ్మాయిని అంతవరకూ చదివించడమే ఎక్కువ. ఇక ఉద్యోగం అంటూ వెళ్లే పరిస్థితులు లేవు. అందుకే ఏం చేయాలా అని ఆలోచించింది. లడఖ్‌లో కాస్తంత చదువుకొన్న అబ్బాయిలంతా టూరిస్ట్ గైడ్లు అయిపోతుంటారు. వచ్చీరాని ఇంగ్లిష్‌లో టూరిస్టులతో మాట్లాడుతుంటారు. వాళ్లతో పోలిస్తే తను స్వచ్ఛమైన ఇంగ్లిష్ మాట్లాడగలదు, హిందీ కూడా వచ్చు. మరి తానెందుకు ఒక గైడ్‌గా మారకూడదు అనుకుంది. అయితే అమ్మాయిలు ఎవ్వరూ అక్కడ టూరిస్ట్‌గైడ్‌లుగా లేరు, అది అబ్బాయిలు చేసే పని అంటూ తన మనసు నుంచే సమాధానం వచ్చింది. తన సమాధానానికి తనే నవ్వుకొని, అటువైపు వెళ్లొద్దన్న ఇంట్లో వాళ్లకు సర్ది చెప్పి.. మహిళా టూరిస్ట్‌గైడ్‌గా మారింది థిన్లాస్. ఆ ప్రాంతంలో తిరుగుతుంటే.. తన చిన్ననాటి నేస్తాలను మళ్లీ పలకరించినట్టు అయ్యింది. దాంతో ట్రెక్కింగ్‌ను నేర్చుకోవాలి.. ఆ కొండలను మరింతగా చుట్టేయాలన్న అభిలాష కలిగింది. కానీ ట్రెక్కింగ్‌లోనూ పురుషాధిపత్యమే! అయితేనేం... ముందడుగు వేయడం అప్పటికే అలవాటు కావడంతో ఒకవైపు ఫ్రీలాన్స్ టూరిస్ట్‌గైడ్‌గా పనిచేస్తూనే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ మూవ్మెంట్ ఆఫ్ లడఖ్(ఎస్ఈసీఎమ్ఓఎల్)లో శిక్షణ పొంది, కొంతకాలానికే ట్రెక్కింగ్‌లో ప్రావీణ్యత సాధించింది. లడఖ్‌లోని ఫస్ట్ ప్రొఫెషనల్ ట్రైన్డ్ ఫిమేల్ ట్రెక్కింగ్ గైడ్‌గా అవతరించింది. అలాగే 2007లో నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెయినీరింగ్లో శిక్షణ పూర్తి చేసుకొంది. ఆరు సంవత్సరాలు గైడ్‌గా కెరీర్ కొనసాగించాక.. ‘లడఖీ ఉమెన్స్ ట్రెవెల్ కంపెనీ’ని స్థాపించింది. అంచలంచెలుగా ఎదిగి... థిన్లాస్ టూరిస్ట్ కెరీర్లోకి ప్రవేశించిన తర్వాత లడఖ్‌లోని అనేక మంది అమ్మాయిలు ఆమె నుంచి స్ఫూర్తి పొందారు. చదువుకొన్న అమ్మాయిల్లో చాలా మంది టూరిస్ట్‌గైడ్‌లుగా మారారు. అలాంటి వారందరినీ కలుపుకొని, తమ శక్తిని ఉమ్మడిగా మార్చుకొని ‘లడఖి ఉమెన్స్ ట్రావెల్ కంపెనీ’ విస్తరించింది థిన్లాస్. ఐదేళ్లుగా విజయవంతంగా నడుస్తున్న ఈ ట్రావెల్ కంపెనీ ఇప్పుడు అనేక రకాలుగా వినుతికెక్కింది. ఒక మహిళ చేత నడపబడుతూ, అందరూ మహిళలు పనిచేసే ట్రావెల్ కంపెనీగానూ, లడఖ్ ప్రాంతంలోని ప్రముఖ ట్రావెల్ కంపెనీగానూ, గ్రామీణ ప్రాంతంలో సాగుతున్న వ్యాపారాల్లో స్వల్ప కాలంలోనే లాభాల బాట పట్టిన సంస్థగానూ థిన్లాస్ వాళ్ల సంస్థ పేరు తెచ్చుకొంది. భారతదేశంలో ఒక మహిళ స్వశక్తితో ఎదిగిందంటేనే.. అది ఒక అద్భుతం. అందులోనూ ప్రత్యేక పరిస్థితులున్న కాశ్మీర్లో ఒక మహిళ స్థానిక పరిస్థితులతోనే మమేకం అయ్యి, ఈ స్థాయికి చేరి, కొత్తకళను తీసుకొచ్చిన ఆమెను కాశ్మీర దీపకళిక అనవచ్చు! తన ట్రావెల్ కంపెనీతో మహిళా వ్యాపారవేత్తగానూ, గ్రామీణ వ్యాపారవేత్తగానూ థిన్లాస్ సత్కారాలు అందుకొంది. తను చదివిన జమ్మూ యూనివర్సిటీ నుంచే ‘లడఖీ విమెన్స్ రైటర్స్ అవార్డు’ అందుకుంది. ఇండియన్ మర్చెంట్స్ చాంబర్ లేడీస్ వింగ్నుంచి జానకీ దేవి పురస్కారాన్ని అందుకొంది. థిన్లాస్ ఎకోఫ్రెండ్లీ టూరిజం కార్యకర్త కూడా. ఐస్ హాకీ ప్లేయర్ కూడా అయినా ఆమె... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. -
లీజు భూమిలో ‘దేశం’ దందా
=పార్టీ కార్యాలయ భూమిలో ప్రైవేటు వ్యాపారం =ట్రావెల్స్ సంస్థకు అద్దెకు.. =అసాంఘిక కార్యక్రమాలకు నెలవు! = హైదరాబాద్ జిల్లా టీడీపీ శాఖ నిర్వాకం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ శాఖ ‘సైడ్ బిజినెస్’ చేస్తోంది. పార్టీ కార్యాలయం నిమిత్తం ప్రభుత్వం నుంచి కారుచౌకగా భూమిని లీజుకు పొంది.. ఆ స్థలంలో కొంత భాగాన్ని మరో సంస్థ (థర్డ్‌పార్టీ)కి సబ్‌లీజుకిచ్చి వ్యాపారం నిర్వహిస్తోంది. దీన్ని నివారించాల్సింది పోయి పార్టీ రాష్ట్ర కార్యాలయ నేతలు సైతం పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. దీంతో జిల్లా నేతలు జంకూగొంకూ లేకుండా దందా కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యాలయం కంటే ప్రైవేటు సంస్థ స్వాధీన స్థలమే ఎక్కువగా ఉండటంతో పాటు అందులో అడపాదడపా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఇదిలా ఉండగా, కారుచౌకగా పొందిన లీజు భూమికి రెండేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో సంబంధిత హిమాయత్‌నగర్ మండల రెవెన్యూ అధికారులు ఇటీవల నోటీసు జారీ చేశారు. ఇదీ గ‘లీజు’ వ్యవహారం.. నగరం నడిబొడ్డున ఎంతో మార్కెట్ డిమాండ్ ఉన్న దోమలగూడ ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో 3000 చదరపు గజాల స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసమని ఏడాదికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం నుంచి 30 ఏళ్లపాటు దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నారు. 2004లో కుదిరిన లీజు ఒప్పందం మేరకు, ప్రతి ఐదేళ్లకోసారి లీజు అద్దె పది శాతం పెంచాలి. ఆ లెక్కన ప్రస్తుతం ఏడాదికి రూ. లక్షా పదివేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. సువిశాల విస్తీర్ణంలోని భూమిలో కొంత భాగం మేర మాత్రం పార్టీ కార్యాలయం, సభా కార్యక్రమాల కోసం మరో రేకుల షెడ్డు నిర్మించారు. మొత్తం స్థలంలో దాదాపు 75 శాతం మేర ఖాళీగా ఉండటంతో దాన్ని ‘గణేశ్ట్రావెల్స్’ సంస్థకు వాహనాలు నిలుపుకునేందుకు (పార్కింగ్‌కు) అద్దెకిచ్చారు. అందుకు నెలకు దాదాపు రూ. 30 వేల మేరకు అద్దె వసూలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అంటే ఏటా అద్దె రూపేణా రూ. 3.60 లక్షలు పొందుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన లీజు అద్దె రూ. 1.10 లక్షలు పోను రూ. 2.50 లక్షలు ‘దేశం’ నేతలు వెనకేసుకుంటున్నారు. ఈ ఆదాయం నుంచే కార్యాలయ నిర్వహణ ఖర్చులు వెళ్లదీస్తున్నారని సమాచారం. గతంలో జిల్లా కార్యాలయ నిర్వహణతోపాటు సిబ్బంది వేతనాలు, తదితర ఖర్చులు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి అందేవి. ప్రస్తుతం నిర్వహణ ఖర్చులు తగ్గినందున కాబోలు రాష్ట్ర కార్యాలయం సైతం ఈ ‘దందా’ను నివారించే పనిచేయలేదని తెలుస్తోంది. తొలుత ఈ అంశం దష్టికి వచ్చినప్పుడు ట్రావెల్స్ యజమాని పార్టీ మద్దతుదారుడని, కొద్ది రోజుల కోసం తాత్కాలికంగా వాహనాలు నిలుపుకునేందుకు అనుమతించామని తెలిపినట్లు సమాచారం. అనంతరం అక్కడి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో బహిరంగంగానే కార్యాలయ స్థలాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పరం చేశారు. ట్రావెల్స్ కోసం వచ్చే,పోయే వారు పార్టీ కార్యాలయ సిబ్బంది లేని సమయంలో పేకాట వంటి కార్యక్రమాలు సాగిస్తుం డటం తెలిసి.. గత వారం పోలీసులు పట్టుకునేందుకు రాగా, పేకాటరాయుళ్లు పారిపోయినట్లు సమాచారం. పార్టీ కార్యాలయ స్థలాన్ని ప్రైవేటుకు లీజుకివ్వడంతో ఇలాంటి అప్రదిష్ట రావడమే కాక పార్టీ కార్యక్రమాలు జరిగినప్పుడు నాయకులు, కార్యకర్తలు వాహనాలు నిలుపుకునేందుకు స్థలం లేక బయట రహదారిపైనే వాహనాలు నిలుపుకొంటున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని నాయకుడొకరు వాపోయారు. లీజు భూమిలో ప్రైవేటు ట్రావెల్స్ పార్కింగ్ గురించి ఇటీవలే తమ దృష్టికీ వచ్చిందని, విచారణ జరిపాక ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు చెప్పారు.