కాశ్మీర దీపకళిక! | Kashmira dipakalika! | Sakshi
Sakshi News home page

కాశ్మీర దీపకళిక!

Published Sun, Aug 3 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

కాశ్మీర దీపకళిక!

కాశ్మీర దీపకళిక!

భౌగోళికంగానూ, ప్రకృతి అందాలతోనూ దేశానికి తలమానికంగా ఉన్నది కాశ్మీర్. అయితే ఆ హిమపు సౌధంలో రగిలిన జ్వాల చాలా జీవితాలను నాశనం చేసింది. ప్రత్యేకించి ఎక్కడైనా యుద్ధానికి తొలి బాధితులు అయ్యే మహిళలు, చిన్నపిల్లలను ఇళ్లకే పరిమితం చేసింది. అలాంటి గడ్డ మీద ఇప్పుడిప్పుడే అక్కడక్కడ ఒక్కో కలువా విరబూస్తోంది. ఒక్కోటే వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారిలో థిన్లాస్ కోరల్ ఒకరు. కాశ్మీర్‌లోని తొలి మహిళా ట్రావెల్స్ కంపెనీ యజమాని ఈమె. ట్రెక్కింగ్‌లో సుశిక్షితురాలై... లడఖ్‌లోని మంచుకొండల అందాలను అందరికీ పరిచయం చేస్తూ, తాను ఉపాధి పొంది,అనేక మందికి ఉపాధిని చూపుతూ వ్యాపారవేత్తగా ఎదుగుతున్న మహిళ ఈమె.
 
అందచందాలనే ఆభరణాలు చేసుకొని కళకళలాడే నేల కాశ్మీర్. పక్కదేశాల నుంచి చొరబాట్లు, సీమాంతర ఉగ్రవాదం ఫలితంగా కర్ఫ్యూలతో వెలవెలబోతున్న గడ్డ కూడా అదే.. అయినా ఒక్కసారి ఆ అందాలను తనివితీరా చూడాలని తపించే వాళ్లు ఎంతోమంది. కానీ భారతీయుడు అయినా సరే కాశ్మీర్  లోయల్లో ప్రయాణం అంటే అది సాహసమే. జీవితంలో ఒక్కసారి ఆ సాహసం చేసినా అది అద్భుతమైన అనుభవం అవుతుంది. అనుదినం అలాంటి సాహసం చేస్తూ, ఆ సాహసం చేయడాన్నే కెరీర్‌గామార్చుకొని, అనేక మందికి స్ఫూర్తిగా మారిన మహిళ థిన్లాస్ (33).
 
తొలి మహిళా టూరిస్ట్‌గైడ్...

 
లడఖ్ పర్వతసానువుల్లోని ఒక గ్రామంలో వ్యవసాయాధార బౌద్ధ కుటుంబంలో జన్మించిన థిన్లాస్‌కు అమ్మానాన్నల వెంట పొలానికి వెళ్లడం అంటే భలే ఇష్టం. చిన్నప్పుడే అమ్మచనిపోవడం, నాన్న రెండోపెళ్లి చేసుకోవడంతో కొంత అంతర్ముఖురాలిగా తయారయ్యిందామె. అటువంటి సమయంలో ఆమెకు అక్కడి కొండలూ లోయలతో స్నేహం కుదిరింది. వాటిల్లో ఆడిపాడటానికి మించిన ఆనందం మరేదీ లేకుండా పోయింది.
 
జమ్మూ యూనివర్సిటీలో బీఏ డిగ్రీని పూర్తి చేసి తిరిగి సొంతూరు చేరుకొందామె. ఒక అమ్మాయిని అంతవరకూ చదివించడమే ఎక్కువ. ఇక ఉద్యోగం అంటూ వెళ్లే పరిస్థితులు లేవు. అందుకే ఏం చేయాలా అని ఆలోచించింది. లడఖ్‌లో కాస్తంత చదువుకొన్న అబ్బాయిలంతా టూరిస్ట్ గైడ్‌లు అయిపోతుంటారు. వచ్చీరాని ఇంగ్లిష్‌లో టూరిస్టులతో మాట్లాడుతుంటారు. వాళ్లతో పోలిస్తే తను స్వచ్ఛమైన ఇంగ్లిష్ మాట్లాడగలదు, హిందీ కూడా వచ్చు.

మరి తానెందుకు ఒక గైడ్‌గా మారకూడదు అనుకుంది. అయితే అమ్మాయిలు ఎవ్వరూ అక్కడ టూరిస్ట్‌గైడ్‌లుగా లేరు, అది అబ్బాయిలు చేసే పని అంటూ తన మనసు నుంచే సమాధానం వచ్చింది. తన సమాధానానికి తనే నవ్వుకొని, అటువైపు వెళ్లొద్దన్న ఇంట్లో వాళ్లకు సర్ది చెప్పి.. మహిళా టూరిస్ట్‌గైడ్‌గా మారింది థిన్లాస్. ఆ ప్రాంతంలో తిరుగుతుంటే.. తన చిన్ననాటి నేస్తాలను మళ్లీ పలకరించినట్టు అయ్యింది. దాంతో ట్రెక్కింగ్‌ను నేర్చుకోవాలి.. ఆ కొండలను మరింతగా చుట్టేయాలన్న అభిలాష కలిగింది.

కానీ ట్రెక్కింగ్‌లోనూ పురుషాధిపత్యమే! అయితేనేం... ముందడుగు వేయడం అప్పటికే అలవాటు కావడంతో ఒకవైపు ఫ్రీలాన్స్ టూరిస్ట్‌గైడ్‌గా పనిచేస్తూనే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్(ఎస్‌ఈసీఎమ్‌ఓఎల్)లో శిక్షణ పొంది, కొంతకాలానికే ట్రెక్కింగ్‌లో ప్రావీణ్యత సాధించింది. లడఖ్‌లోని ఫస్ట్ ప్రొఫెషనల్ ట్రైన్డ్ ఫిమేల్ ట్రెక్కింగ్ గైడ్‌గా అవతరించింది. అలాగే 2007లో నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెయినీరింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకొంది. ఆరు సంవత్సరాలు గైడ్‌గా కెరీర్ కొనసాగించాక.. ‘లడఖీ ఉమెన్స్ ట్రెవెల్ కంపెనీ’ని స్థాపించింది.
 
అంచలంచెలుగా ఎదిగి...

థిన్లాస్ టూరిస్ట్ కెరీర్‌లోకి ప్రవేశించిన తర్వాత లడఖ్‌లోని అనేక మంది అమ్మాయిలు ఆమె నుంచి స్ఫూర్తి పొందారు. చదువుకొన్న అమ్మాయిల్లో చాలా మంది టూరిస్ట్‌గైడ్‌లుగా మారారు. అలాంటి వారందరినీ కలుపుకొని, తమ శక్తిని ఉమ్మడిగా మార్చుకొని ‘లడఖి ఉమెన్స్ ట్రావెల్ కంపెనీ’ విస్తరించింది థిన్లాస్. ఐదేళ్లుగా విజయవంతంగా నడుస్తున్న ఈ ట్రావెల్ కంపెనీ ఇప్పుడు అనేక రకాలుగా వినుతికెక్కింది. ఒక మహిళ చేత నడపబడుతూ, అందరూ మహిళలు పనిచేసే ట్రావెల్ కంపెనీగానూ, లడఖ్ ప్రాంతంలోని ప్రముఖ ట్రావెల్ కంపెనీగానూ, గ్రామీణ ప్రాంతంలో సాగుతున్న వ్యాపారాల్లో స్వల్ప కాలంలోనే లాభాల బాట పట్టిన సంస్థగానూ థిన్లాస్ వాళ్ల సంస్థ పేరు తెచ్చుకొంది. భారతదేశంలో ఒక మహిళ స్వశక్తితో ఎదిగిందంటేనే.. అది ఒక అద్భుతం. అందులోనూ ప్రత్యేక పరిస్థితులున్న కాశ్మీర్‌లో ఒక మహిళ స్థానిక పరిస్థితులతోనే మమేకం అయ్యి, ఈ స్థాయికి చేరి, కొత్తకళను తీసుకొచ్చిన ఆమెను కాశ్మీర దీపకళిక అనవచ్చు!
 
 తన ట్రావెల్ కంపెనీతో మహిళా వ్యాపారవేత్తగానూ, గ్రామీణ వ్యాపారవేత్తగానూ థిన్లాస్ సత్కారాలు అందుకొంది. తను చదివిన జమ్మూ యూనివర్సిటీ నుంచే ‘లడఖీ విమెన్స్ రైటర్స్ అవార్డు’ అందుకుంది. ఇండియన్ మర్చెంట్స్ చాంబర్ లేడీస్ వింగ్‌నుంచి జానకీ దేవి పురస్కారాన్ని అందుకొంది. థిన్లాస్ ఎకోఫ్రెండ్లీ టూరిజం కార్యకర్త కూడా. ఐస్ హాకీ ప్లేయర్ కూడా అయినా ఆమె... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement