పాక్‌ కాల్పులపై భారత్‌ సీరియస్‌ | India Serious On Pakistan Firing In LOC Jammu Kashmir | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ వైపు భారీ నష్టం!

Published Sat, Nov 14 2020 12:58 PM | Last Updated on Sat, Nov 14 2020 3:56 PM

India Serious On Pakistan Firing In LOC Jammu Kashmir - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్‌ కాల్పులపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే సరిహద్దుల్లో పాక్‌  కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడింది. శుక్రవారం పాకిస్తాన్ విచక్షణారహితంగా ‌ జరిపిన కాల్పులపై పాక్‌ దౌత్యాధికారికి భారత్ సమన్లు జారీ చేసింది. జమ్మూ కశ్మీర్‌ సరిహద్దుల వెంట పలు చోట్ల భారత భద్రత బలగాలు, పౌరులపై పాకిస్తాన్‌ శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నలుగురు జవాన్లు, ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారు. అయితే పాక్‌ కాల్పులకు భారత్‌ దీటుగా బదులిచ్చింది. ఈ ప్రతీకార దాడుల్లో పాక్‌ వైపు భారీ నష్టం జరిగిందని భారత ఆర్మీ పేర్కొంది. దానికి సంబంధించి భారత ఆర్మీ వర్గాలు పలు వీడియోలు విడుదల చేశారు. ‘భారత్‌ జరిపిన ఎదురు దాడిలో పాకిస్తాన్‌ భారీగా నష్టపోయింది. భారత్‌ కాల్పుల్లో 8 మంది వరకు పాక్‌ సైనికులు హతమయ్యారు. వారిలో కనీసం ఇద్దరు పాక్‌ సైన్యానికి చెందిన స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ కమెండోలు ఉన్నార’ ని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. చదవండి: (సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి)

పాక్‌ ఆర్మీ స్థావరాలు, ఆయుధ కేంద్రాలు, ఉగ్రవాద చొరబాటు స్థావరాలు భారీగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను ఆర్మీ విడుదల చేసింది. భారత్‌ ప్రయోగించిన క్షిపణి నేరుగా పాక్‌ ఆర్మీ బంకర్‌ను ఢీ కొట్టి ధ్వంసం చేసిన దృశ్యాలు మరో వీడియోలో ఉన్నాయి. భారత్‌ ప్రతిదాడిలో 8 మంది పాక్‌ జవాన్లు చనిపోయారని, 12 మంది గాయపడ్డారని భారత ఆర్మీ తెలిపింది. కాగా, పాక్‌ కాల్పుల్లో చనిపోయిన వారిలో బీఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాకేశ్‌ దోవల్, నలుగురు ఆర్మీ జవాన్లు, ఆరుగురు పౌరులు ఉన్నారు. 8 మంది పౌరులతో పాటు నలుగురు జవాన్లు గాయపడ్డారు. నియంత్రణ రేఖ వెంట ఉడి, దావర్, కేరన్,  నౌగమ్, గురెజ్‌ సహా పలు సెక్టార్లలలో పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. హజీపీర్‌ సెక్టార్లో పాక్‌ జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాకేశ్‌ దోవల్‌ చనిపోయారు. చదవండి: (కశ్మీర్‌లో పాక్‌ దుస్సాహసం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement