Terrarissam
-
పాక్‌లోనే దావూద్..!
ఇస్లామాబాద్: పూటకో మాట మార్చే తన బుద్ధిని పాకిస్తాన్ మరోసారి బయట పెట్టుకుంది. అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తమ గడ్డ మీదే ఉన్నాడని చెప్పినట్టుగానే చెప్పి యూ టర్న్ తీసుకుంది. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఎప్పట్నుంచో భారత్ చేస్తున్న వాదనలు నిజమేనని తొలిసారిగా ఆ దేశ మీడియా వెల్లడించింది. దావూద్ పాక్ గడ్డ మీదే ఉన్నాడని మీడియా కథనాల ద్వారా అయినా అంగీకరించడం ఇదే మొదటిసారి. పాక్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నిషిద్ధ 88 ఉగ్రవాద సంస్థలు, వారి నాయకుల జాబితాను శనివారం వెల్లడించింది. అందులో భారత్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు దావూద్ ఇబ్రహీం పేరు కూడా ఉంది. తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు, వ్యక్తులపైనే ఆంక్షలు ఉంటాయి కాబట్టి దావూద్ పాక్‌లోనే ఉన్నాడని అంగీకరించినట్లే. కానీ ఎప్పటి మాదిరిగానే పాక్ కుటిల బుద్ధిని బయటపెట్టుకుంటూ దావూద్ తమ గడ్డ మీద లేడని పాత పాటే పాడుతోంది. మీడియా కథనాలు నిరాధారమైనవీ, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారమే ఉగ్ర సంస్థలపై ఆంక్షలు విధించామని, ఇది సాధారణ ప్రక్రియనేనని తెలిపింది. గ్రే లిస్ట్ నుంచి బయటపడడానికే.. ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నందుకుగాను ఫ్రాన్సు రాజధాని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాక్స్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సంస్థ పాకిస్తాన్‌ను 2018 జూన్‌లో గ్రే లిస్ట్‌లో ఉంచింది. 2019 చివరికల్లా ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని గడువు విధించింది. ఆ తర్వాత కరోనా సంక్షోభంతో గడువు పెంచింది. 2020 జూన్ నాటికి కూడా పాక్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గ్రే లిస్టులోనే కొనసాగించాలని నిర్ణయించింది. గ్రే లిస్ట్‌లో ఉంటే అంతర్జాతీయంగా ఎలాంటి ఆర్థిక సాయం పాక్‌కి అందదు. దీంతో గ్రే లిస్ట్ నుంచి బయటపడడానికి పాకిస్తాన్ శుక్రవారం హఫీజ్ సయీద్, మసూద్ అజర్, దావూద్ ఇబ్రహీంతో పాటుగా 88 ఉగ్ర సంస్థలు, వాటి నాయకుల ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు జప్తు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టుగా ది న్యూస్ కథనం వెల్లడించింది. జమాత్ ఉద్ దవా, జైషే మహమ్మద్, తాలిబన్, అల్‌ఖైదా, హక్కానీ గ్రూప్ వంటి సంస్థల అన్ని రకాల ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా ఆ కథనం పేర్కొంది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంను అప్పగించాల్సిందిగా అప్పగించాల్సిందిగా భారత్ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తోంది. ó∙కరాచీలోనే తలదాచుకున్నాడని ఆధారాలను బయట పెట్టినా తమ వద్ద లేడని బుకాయిస్తూ వస్తోంది. -
భారత్‌కు ట్రంప్ నిజమైన ఫ్రెండ్
అమెరికా ‘హౌడీ మోదీ’ అని నినదించింది. టెక్సాస్ మినీ భారత్‌లా మారింది. హ్యూస్టన్ త్రివర్ణ శోభితమయింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ‘ఉమ్మడి స్వప్నం.. ఉజ్వల భవిత’ పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహించిన ఈ కార్యక్రమం ఎన్ఆర్జీ స్టేడియంలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. మోదీ, మోదీ అనే నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాల వెలుగుజిలుగుల మధ్య కోలాహలంగా సాగింది. ట్రంప్ ప్రసంగిస్తున్నంత సేపు ‘యూఎస్ఏ.. యూఎస్ఏ’ అని సభికులు నినదించారు. హ్యూస్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఆదివారం హ్యూస్టన్‌లో జరిగిన మెగా ఈవెంట్ హౌడీ మోదీలో ప్రధాని మోదీ.. ఇక ఉగ్రవాదంపై యుద్ధమే అని గర్జించారు. ఉగ్రవాదంపై, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న, ఆర్థిక మద్దతిస్తున్న దేశాలపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు. ఆ యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ కచ్చితంగా మద్దతిస్తారని, ఆయనే ముందుండి నడుపుతారని ఉద్ఘాటించారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న ట్రంప్‌ను నిలుచుని చప్పట్లు కొడుతూ ప్రశంసించాలని ఆహూతులను కోరారు. ‘అమెరికాలో జరిగిన 9/11 దాడుల వెనుక, భారత్‌లో జరిగిన 26/11(ముంబై దాడులు) నరమేథం వెనుక కుట్రదారులెవరో ప్రపంచం మొత్తానికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. దాదాపు అరగంట పాటు సాగిన ప్రసంగంలో ఇప్పటివరకు ఐదేళ్ల తమ పాలన సాధించిన విజయాలను మోదీ ఏకరువు పెట్టారు. 60 ఏళ్లలో సాధించలేని వాటిని ఐదేళ్లలో సాధించగలిగామన్నారు. భారత్, అమెరికా అభివృద్ధిలో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉందన్న మోదీ.. వారి కోసం భారత్ ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. భారత్, అమెరికాల దోస్తీ 21వ శతాబ్దంలో మరిన్ని ఆవిష్కరణలతో అభివృద్ధి పథంలో సాగాల్సి ఉందన్నారు. మోదీ.. ట్రంప్.. మోదీ కార్యక్రమం ప్రారంభంలో మొదట మోదీ ప్రసంగించి, ట్రంప్ ను భారత్‌కు నిజమైన స్నేహితుడంటూ ఆహూతులకు పరిచయం చేశారు. అనంతరం ట్రంప్ ప్రసంగించారు. అమెరికా అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల పాత్ర ఎంతో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోని దాదాపు 4 మిలియన్ల భారతీయులపై తనకెంతో గౌరవం ఉందన్నారు. ‘వి.. ద పీపుల్’ అనే వాక్యంతోనే భారత్, అమెరికాల రాజ్యాంగ పీఠిక ప్రారంభమవుతుందని, ఇదే ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాలకు రుజవని పేర్కొన్నారు. ట్రంప్ ప్రసంగ సమయంలో ‘యూఎస్ఏ.. యూఎస్ఏ’ అంటూ ప్రేక్షకులు నినదించడం విశేషం. ట్రంప్ ప్రసంగం అనంతరం మోదీ మరోసారి కీలక ప్రసంగం చేశారు. మోదీ తన మొదటి ప్రసంగాన్ని ఇంగ్లీష్‌లో, తదుపరి ప్రసంగాన్ని హిందీలో చేయడం విశేషం. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. హౌడీ మై ఫ్రెండ్స్! టెక్సాస్ అంటే విశాలత్వం.. ఆ విశాలత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మీరు 50 వేలకు పైగా ఉన్నారు. ఇది కేవలం సంఖ్య కాదు. ఇదో చరిత్ర. కొత్త చరిత్ర. ఎన్ఆర్జీ స్టేడియంలో నెలకొన్న ఎనర్జీ. భారత్, అమెరికాల మధ్య పెరుగుతున్న మైత్రికి, సమన్వయానికి నిదర్శనం. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రావడం మనకెంతో గర్వకారణం. ఆయన రాక భారతీయ అమెరికన్ల సామర్థ్యానికి ప్రశంస. ఈ కార్యక్రమం పేరు ‘హౌడీ మోదీ’ అని పెట్టారు. హౌ డు యు డూ మోదీ? అని. మోదీ ఒంటరిగా ఒక శూన్యం.. ఒక సామాన్య వ్యక్తి.. 130 కోట్ల భారతీయుల ఆదేశాలు పాటిస్తున్న సాధారణ వ్యక్తి. అయినా మీరు హౌడీ మోదీ అంటుంటే నాకొకటే అనిపిస్తోంది. నా జవాబు ఒకటే.. భారత్‌లో అంతా బావుంది(భారత్ మే సబ్ అచ్చాహై). (అనంతరం తెలుగులో అంతా బావుంది సహా వివిధ భారతీయ భాషల్లో ఆ పదాన్ని మోదీ ఉచ్ఛరించారు. దాంతో స్టేడియంలో మోదీ నినాదాలు మిన్నంటాయి) ► మేం అధికారంలోకి వచ్చిన తరువాత గత 60 ఏళ్లలో సాధించలేనివెన్నో సాధించాం. న్యూ ఇండియా లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. డేటా భారత్‌లోనే అత్యంత చవక. డిజిటల్ ఇండియాగా భారత్‌ను తీసుకువెళ్తున్నాం. ► 2, 3 రోజుల్లో ట్రంప్‌తో చర్చలు జరపనున్నాం. భారత్, అమెరికాలకు ప్రయోజనం చేకూర్చే మరిన్ని అంశాలపై చర్చించనున్నాం. ఆయన చర్చలు జరపడంలో సిద్ధహస్తుడు. ఆయన నుంచి నేను కూడా నేర్చుకుంటున్నా. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు 21వ శతాబ్దంలో అభివృద్ధి పథంలో సాగేందుకు భారత్, అమెరికాలు కలసి సాగాల్సి ఉంది. చివరగా థాంక్యూ హ్యూస్టన్.. థాంక్యూ అమెరికా.. గాడ్ బ్లెస్ యూ ఆల్.. ► కశ్మీరీల కోసం.. ముఖ్యంగా 70 ఏళ్ల సమస్యకు ఫేర్వెల్ పలికాం.. జమ్మూకశ్మీర్ ప్రజలకు అభివృద్ధిని దూరం చేస్తున్న ఆర్టికల్ 370కి వీడ్కోలు పలికాం. అక్కడి ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యులను చేశాం. 370 రద్దుపై పార్లమెంటులో పెద్ద చర్చే జరిగింది. ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆ బిల్లు విజయం సాధించింది. ఇందుకు మన పార్లమెంటేరియన్లకు మనం నిల్చుని హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలుపుదాం.(స్టేడియంలో స్టాండింగ్ ఒవేషన్). ఇది కొన్ని ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలవారికి(పరోక్షంగా పాక్‌ను ఉద్దేశించి) నచ్చట్లేదు. ఇప్పుడు సమయమొచ్చింది. ఉగ్రవాదంపై, దానికి మద్దతిచ్చే వారిపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి ట్రంప్ నేతృత్వం వహించాలి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హ్యూస్టన్‌లో కార్యక్రమం అనంతరం చేతులు పట్టుకుని ముందుకు సాగుతున్న మోదీ, ట్రంప్ సంప్రదాయం హౌడీ మోదీ వేదికపై నృత్య ప్రదర్శన మేము సైతం కార్యక్రమానికి హాజరైన ముస్లింలు గాంధేయం ఎన్నార్జీ స్టేడియం వద్ద గాంధీజీ వేషధారి అభిమానం భారత సంతతి వారితో ప్రధాని ముచ్చట్లు -
‘ఆవు’, ‘ఓం’ వినగానే గగ్గోలు
మధుర: బీజేపీ హిందుత్వ ఎజెండాను తప్పుపడుతున్నవారిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ‘ఆవు’ ‘ఓం’ అనే పదాలను వినగానే దేశంలో కొందరు వ్యక్తులు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఈ పదాలు భారత్‌ను 16–17వ శతాబ్దాల నాటి కాలంలోకి తీసుకెళ్లిపోయాయన్న రీతిలో వీరు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ను నాశనం చేసేందుకు ఇలాంటివారు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో బుధవారం జాతీయ జంతువ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని(ఎన్ఏడీసీపీ) ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘నేను ఆఫ్రికాలోని రువాండా దేశానికెళ్లా. అక్కడి ప్రభుత్వం గ్రామాల్లోని ప్రతీ ఇంటికి ఓ ఆవును ఇస్తోంది. ఆవులకు ఆడదూడ పుడితే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మరో కుటుంబానికి అప్పగిస్తుంది. పశుపోషణ ద్వారా రువాండా ఆర్థిక వ్యవస్థను బలపర్చుకుంటోంది. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నేను స్వయంగా చూశా. కానీ మన దేశంలో కొందరు వ్యక్తులు మాత్రం ఓం, ఆవు అనే పదాలను వినగానే విద్యుత్ షాక్ కొట్టినట్లు ఉలిక్కిపడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. అసలు పశుపోషణ లేకుండా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా మనుగడ సాధించడం సాధ్యమా? అని మోదీ ప్రశ్నించారు. వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహంతో పాటు స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ పథకాలతో ఆర్థిక వ్యవస్థ, ప్రకృతి మధ్య సమతుల్యత సాధ్యమవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఉగ్రమూకలకు పాక్ అండదండలు.. దాయాది దేశం పాకిస్తాన్‌పై ప్రధాని మోదీ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉగ్రమూకలకు పాకిస్తాన్లో అన్నిరకాలుగా అండదండలు అందజేస్తున్నారనీ, ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశభద్రత విషయంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భారత్‌లో ఉగ్రదాడులకు పాక్ కుట్ర పన్నుతోందన్న నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని ఈ మేరకు స్పందించారు. ‘నేడు ఉగ్రవాదం అన్నది ఓ భావజాలంగా మారిపోయింది. సరిహద్దులు దాటి విస్తరించిన ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది. ఈ ఉగ్రవాదులను మన పొరుగుదేశం(పాకిస్తాన్)లో పెంచిపోషిస్తున్నారు. ఈ భావజాలాన్ని నిరోధించడానికి ఉగ్రమూకలకు మద్దతు ఇస్తూ శిక్షణ, ఆశ్రయం కల్పిస్తున్నవారిపై, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రపంచదేశాలన్నీ ప్రతిజ్ఞ చేయాలి’ అని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం అణచివేతకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ వెల్లడించారు. కాలుష్యం, ఉగ్రవాదం, అనారోగ్యం... ఏ సమస్యను పరిష్కరించాలన్నా ప్రజలు ఏకం కావాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు. 12 వేలకోట్లతో వాక్సినేషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు. దీని కారణంగా పర్యావరణం కలుషితం కావడమే కాకుండా జంతువులు, చేపలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని 50 కోట్ల పాడిపశువులు, గొర్రెలు, మేకలు, పందులకు గాలికుంటు వ్యాధి(ఎఫ్ఎండీ) సోకకుండా రూ.12,652 కోట్లతో వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియకు మోదీ శ్రీకారం చుట్టారు. అనంతరం ఓ మహిళా బృందంతో కలిసి ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నుంచి ప్లాస్టిక్‌ను వేరుచేశారు. 2025 నాటికి జంతు సంబంధిత వ్యాధులను నియంత్రించాలనీ, 2030 నాటికి పూర్తిగా అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ చెప్పారు. 2022 నాటికి దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
రష్యాలో ప్రధాని మోదీ పర్యటన
-
విదేశీ జోక్యానికి నో
వ్లాడివోస్టోక్: భారత్–రష్యాలు తమ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. రష్యాలతో వాణిజ్యం, భద్రత, నౌకాయానం, అంతరిక్ష రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తున్నామనీ, రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని ఎగదోయడం నిలిపివేయాలని హితవు పలికారు. కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ చేస్తున్న ఆందోళనను, వేర్పాటువాదులకు ఇస్తున్న మద్దతును మోదీ ఈ మేరకు పరోక్షంగా తప్పుపట్టారు. రెండ్రోజుల రష్యా పర్యటనలో భాగంగా బుధవారం మోదీ వ్లాడివోస్టోక్ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి రష్యా బలగాలు గౌరవవందనం సమర్పించాయి. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి ‘భారత్–రష్యా 20వ వార్షిక సదస్సు’లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు రక్షణ, అంతరిక్షం, నౌకాయానం, ఇంధనం, సహజవాయువు, పెట్రోలియం, వాణిజ్యం సహా 15 రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. చెన్నై–వ్లాడివోస్టోక్ నౌకామార్గం.. ప్రధాని మోదీ–పుతిన్‌ల నేతృత్వంలో ఇరుదేశాల ప్రతినిధి బృందాల భేటీ అనంతరం భారత్, రష్యాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ....‘తమిళనాడు రాజధాని చెన్నై నుంచి వ్లాడివోస్టోక్ వరకూ పూర్తిస్థాయి నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఎంవోయూ కుదుర్చుకున్నారు. ప్రస్తుతం భారత్–రష్యాల మధ్య రూ.79,247 కోట్లు(11 బిలియన్ డాలర్లు)గా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 నాటికి రూ.2.16 లక్షల కోట్లకు చేర్చాలని మోదీ–పుతిన్ నిర్ణయం తీసుకున్నారు’ అని తెలిపింది. అంతకుముందు అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి ఓ బోటులో 2 గంటల పాటు మోదీ విహరించారు. ఈ సందర్భంగా ఇరువురు వ్లాడివోస్టోక్‌లోని జెవెజ్‌డా నౌకానిర్మాణ కేంద్రాన్ని సందర్శించారు. భారత్ కీలక భాగస్వామి: పుతిన్ మోదీ పర్యటన నేపథ్యంలో పుతిన్ మాట్లాడుతూ.. భారత్ రష్యాకు అత్యంత కీలకమైన భాగస్వామని తెలిపారు. ‘ఇరుదేశాల మధ్య వాణిజ్యం 17 శాతం వృద్ధి చెంది 11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది మరింత వృద్ధి చెందుతుందని నమ్ముతున్నాం. భారత్–యూరేసియన్ ఎకనమిక్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు కృషి చేస్తున్నాం’ అని అన్నారు. ‘గగన్‌యాన్’కు రష్యా సహకారం.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’లో పాల్గొనే వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇవ్వనుందని మోదీ ప్రకటించారు. ఇందుకోసం ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ సన్నిహితంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. అంతరిక్ష వాహకనౌకల ప్రయోగం, అభివృద్ధి, అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు వాడుకునే విషయంలో కలసికట్టుగా పనిచేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయని పేర్కొన్నారు. వ్యోమగాములను ఎంపిక చేసే ప్రక్రియను ఇస్రో ఇప్పటికే ప్రారంభించిందనీ, ఈ ఏడాది నవంబర్ తర్వాత వీరికి రష్యాలో శిక్షణ ఇస్తారని చెప్పారు. గగన్‌యాన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపేందుకు కేంద్రం రూ.10,000 కోట్లను కేటాయించింది. -
ఆ దేశాలే బాధ్యులు
బిష్కెక్: షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, ఆర్థిక సహాయం చేస్తున్న దేశాలను తప్పనిసరిగా బాధ్యుల్ని చేయాలని శుక్రవారం ఇక్కడ జరిగిన సదస్సులో మోదీ ఎస్సీవో నేతలకు స్పష్టం చేశారు.ఆహుతుల్లో ఉన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా మోదీ ఈ వ్యాఖ్య చేశారు.ఉగ్రవాదాన్ని అరికట్టే విషయమై అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని భారత ప్రధాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంతో ఎస్సీవో ప్రదర్శిస్తున్న స్ఫూర్తిని మోదీ కొనియాడారు. ఉగ్రవాద రహిత సమాజం కావాలన్నదే భారత్ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు దేశాలన్నీ సంకుచితత్వాన్ని విడనాడి ఐక్యంగా ముందుకు రావాలన్నారు.ఈ సందర్భంగా ఆయన ఇటీవల శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావించారు.‘గత ఆదివారం నేను శ్రీలంక వెళ్లినప్పుడు సెయింట్ ఆంథోనీ చర్చిని చూశాను.ఉగ్రవాదం వికృత ముఖం నాకక్కడ కనిపించింది’అని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలను తప్పకుండా జవాబుదారుల్ని చేయాలని మోదీ ఉద్ఘాటించారు. ఎస్సీవో ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక విధానం(ర్యాట్స్)కింద ఉగ్రవాదంపై పోరుకు సహకరించాలని ఆయన ఎస్సీవో నేతలను కోరారు.సాహిత్యం ,సంస్కృతి మన సమాజాలకు సానుకూల దృక్ఫధాన్ని అందించాయని, సమాజంలో యువత చెడుమార్గం పట్టకుండా ఇవి నిరోధించాయని మోదీ అన్నారు. ఎస్సీవో సుస్థిరత, భద్రతలకు శాంతియుతమైన, ప్రగతిశీలమైన, భద్రతాయుతమైన ఆఫ్ఘనిస్తాన్ కీలకమని భారత ప్రధాని అన్నారు. ఆప్ఘన్ శాంతి ప్రక్రియకు మద్దతివ్వడమే మన లక్ష్యమన్నారు. భారత దేశం ఎస్‌సివోలో సభ్యురాలై రెండేళ్లు అయిందని,ఈ రెండేళ్లలో ఆ సంస్థ చేపట్టిన కార్యక్రమాల్లో సానుకూల సహకారం అందించామని మోదీ అన్నారు. చైనా నాయకత్వంలో ఎనిమిది దేశాలతో ఎస్సీవో ఏర్పాటయింది.2017లో భారత, పాకిస్తాన్లకు దీనిలో సభ్యత్వం లభించింది. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ మద్దతిస్తోందని భారత్ ఆరోపిస్తోంది.2016లో పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. పాక్ కేంద్రంగా గల ఉగ్రవాదులే ఈ దాడి చేశారని ఆరోపించిన భారత్, పాకిస్తాన్‌తో సంబంధాలను తెంచుకుంది. మరోవైపు, బిష్కెక్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు. మోదీ–ఇమ్రాన్ పలకరింపులు ఎస్సీవో సదస్సు సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వేర్వేరు దేశాధినేతలు ఉన్న లాంజ్‌లో శుక్రవారం ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలసుకున్నారు. భారత సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి ఈ సందర్భంగా ఇమ్రాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు మోదీ ధన్యవాదాలు చెప్పారు. మోదీ–ఇమ్రాన్‌ఖాన్‌ల మధ్య ఎస్సీవో సదస్సు సందర్భంగా భేటీ ఉండదని విదేశాంగశాఖ గతంలోనే స్పష్టం చేసింది. దౌత్య మర్యాదకు ఇమ్రాన్ భంగం షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దౌత్య మర్యాదలను పాటించకుండా దేశాన్ని అపఖ్యాతి పాలు చేశారు.సదస్సు ప్రారంభ సమావేశానికి ఎస్సీవో అధినేతలందరూ వస్తుండగా అప్పటికే హాజరయిన దేశాధినేతలంతా మర్యాద పూర్వకంగా లేచి నిలబడితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం కూర్చునే ఉన్నారు.మోదీ సహా వివిధ దేశాధినేతలు నిలబడి ఉండగా, పాకిస్తాన్ ప్రధాని కూర్చుని ఉన్న వీడియో వైరల్ అయింది.ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధికార ట్విట్టర్లో కూడా ఈ వీడియో వచ్చింది.సమావేశంలో నేతలందరినీ పరిచయం చేస్తున్నసమయంతో తన పేరు ప్రకటించగానే లేచి నిలబడిన ఇమ్రాన్ ఖాన్ వెంటనే కూర్చుండిపోయారు.ఇమ్రాన్ తీరుపై నెటిజన్లు రకరకాల వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
పాక్‌కు బుద్ధిచెప్పండి
బిష్కెక్/వాషింగ్టన్: కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో గురువారం ప్రారంభమైన షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు‡ పుతిన్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం మోదీ స్పందిస్తూ.. జిన్‌పింగ్‌తో భేటీ అత్యంత ఫలప్రదంగా ముగిసిందని తెలిపారు. ‘భారత్–చైనాల మధ్య వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ఈ భేటీలో చర్చించాం’ అని మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న విషయాన్ని మోదీ జిన్‌పింగ్ దృష్టికి తీసుకొచ్చారు. ఉగ్రమూకలపై పాక్ కఠినచర్యలు తీసుకునేలా చూడాలన్నారు. ఉగ్రరహిత వాతావరణంలో పాక్‌తో శాంతి చర్చల ప్రక్రియకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జిన్‌పింగ్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. అంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన మోదీని జిన్‌పింగ్ అభినందించారు. ఇందుకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని.. జూన్ 15న 66వ పుట్టినరోజు జరుపుకోనున్న జిన్‌పింగ్‌కు భారతీయులందరి తరఫున శుభాకాంక్షలు చెప్పారు. ఎస్సీవో సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా భారత్–రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేసుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయించారు. బిష్కెక్లో ఎస్సీవో భేటీ జూన్ 13 నుంచి రెండ్రోజుల పాటు సాగనుంది. మోదీ సరికొత్త నాయకుడు: పాంపియో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ఇండియా ఐడియాస్ సదస్సులో పాంపియో మాట్లాడుతూ.. ‘సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎన్డీయే గెలుపొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు సరికొత్త నాయకుడిగా మోదీ అవతరించారు’ అని కితాబిచ్చారు. భారత యువతకు సుసంపన్నమైన, ఉజ్వల భవిష్యత్తును మోదీ ఇవ్వగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌లతో పాటు అత్యంత భద్రమైన కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు సాయమందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. జూన్ 24 నుంచి 30 వరకూ పాంపియో భారత్, శ్రీలంక, జపాన్, దక్షిణకొరియా దేశాల్లో పర్యటించనున్నారు. -
నిరుద్యోగం, ఉగ్రవాదమే అసలు సవాళ్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముంగిట దేశ ప్రజలు నిరుద్యోగం, ఉగ్రవాదంపైనే ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. దేశం ముందుకు సాగుతున్న తీరుపై చాలా మంది ఆశావహ దృక్పథంతోనే ఉన్నట్లు తేలింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ అధ్యయనం చేపట్టింది. ఉగ్రవాదం, పాక్ నుంచి ముప్పుపై ఎక్కువ శాతం మంది భయాందోళనలు వ్యక్తం చేశారు. 20 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగ్గా ఉందని సుమారు 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న అత్యంత కఠిన సవాలు నిరుద్యోగమే అని 76 శాతం మంది పేర్కొన్నారు. సర్వే ముఖ్యాంశాలు ► పాక్‌తో భారత్‌కు ముప్పు ఉందని 76 శాతం మంది అభిప్రాయపడ్డారు. కశ్మీర్లో తాజా పరిస్థితి తీవ్రమైన సమస్య అని పేర్కొన్న వారు 55 శాతం మంది. ► కశ్మీర్లో పరిస్థితి దిగజారిందని అభిప్రాయపడిన 53 శాతం మంది. ► కొన్నేళ్లుగా ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నా ధరలు పెరగడం సమస్యగా మారిందని 73 శాతం మంది చెప్పారు. ► అవినీతి అధికారులు(66 శాతం), ఉగ్రవాదం (63 శాతం), నేరాలు(64 శాతం) దేశానికి పెద్ద సమస్యలుగా మారాయని పేర్కొన్నారు. ► భారత్‌లో అభద్రతా భావంతో జీవిస్తున్నామని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► 2014 నుంచి మత విద్వేష ఘటనలు పెరిగినా, కేవలం 34 శాతం మందే ఇది పెద్ద సమస్య అని పేర్కొన్నారు. ► ఎన్డీయే హయాంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని 21 శాతం మంది పేర్కొనగా, పరిస్థితి దిగజారిందని 67 శాతం మంది చెప్పారు. ► ధరలు భారీగా పెరిగాయని 65 శాతం మంది, అవినీతి పెచ్చరిల్లుతోందని 65 శాతం మంది, ఉగ్రవాద ఘటనలు పెరిగాయని 59 శాతం మంది అన్నారు. ► ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవినీతిపరులని 69 శాతం పేర్కొనగా, ఎవరు గెలిచినా ఈ పరిస్థితిలో మార్పు రాదని 58 శాతం మంది పౌరులు అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు, ఆరోగ్యానికే ప్రాధాన్యం తర్వాతి స్థానాల్లో తాగునీరు, రోడ్లు ప్రాధాన్యతాంశాలపై ఏడీఆర్ సర్వే న్యూఢిల్లీ: మెరుగైన ఉద్యోగావకాశాలు, ఆరోగ్య సంరక్షణ, సురక్షిత తాగునీరుకే ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సర్వేలో తేలింది. ఓటరు ప్రాధాన్యతా అంశాల్లో ప్రభుత్వ పనితీరు సగటు కన్నా దిగువనే ఉందని తెలిసింది. ఓటరు ప్రవర్తనను ప్రభావితం చేసే కారకాలు, ఓటరు ప్రాధాన్యతా అంశాలు(10), ప్రభుత్వ పనితీరుకు ప్రజలిచ్చిన రేటింగ్ ప్రాతిపదికగా ఈ సర్వే నిర్వహించారు. మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉండాలని 46.80 శాతం మంది, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పించాలని 34.60 శాతం మంది, సురక్షిత తాగునీరు కావాలని 28.34 శాతం మంది అభిప్రాయపడ్డారు. తరువాతి స్థానాల్లో మెరుగైన రోడ్లు(28.34 శాతం), లోపరహిత ప్రజా రవాణా వ్యవస్థ(27.35 శాతం) ఉన్నాయి. ఓటర్ల టాప్ 10 ప్రాధాన్యతా అంశాల్లో వ్యవసాయ సంబంధ విషయాలు కూడా ఉన్నాయి. సాగునీరు(26.40 శాతం) ఆరో స్థానంలో, రుణ పరపతి(25.62 శాతం) ఏడో స్థానంలో, పంట ఉత్పత్తులకు మద్దతు ధర(25.41 శాతం) 8వ స్థానంలో, సబ్సిడీలు(25.06 శాతం) 9వ స్థానంలో ఉన్నాయి. మెరుగైన శాంతి భద్రతలకు 10వ స్థానం దక్కింది. -
‘కశ్మీర్ ఉగ్ర సాయం’పై ఎన్ఐఏ కన్ను
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న వ్యక్తులు, సంస్థలకు చెందిన ఆస్తులను అటాచ్ చేసేందుకు భద్రతా సంస్థలు చర్యలు ప్రారంభించాయి.కశ్మీర్‌కు చెందిన వ్యాపారి జహూర్ అహద్ షా వతాలీకి చెందిన 10 స్థిరాస్తులతోపాటు హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సలాహుద్దీన్‌కు ఇస్లామాబాద్‌లో ఉన్న నివాసం ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఆదాయ పన్ను శాఖ ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి చర్యలు చేపట్టనున్నాయి. ఉగ్ర సంస్థలకు సాయం అందించారన్న కేసులో వతాలీ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. పాక్‌కు చెందిన ఐఎస్ఐ సూచనల మేరకు ఉగ్రవాద సంస్థలకు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్వే వారికి ఆర్థిక సాయం అందజేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలాహుద్దీన్ సహా, హురియత్ నేతలు, వ్యాపారవేత్తలైన 13 మందిని ఎన్ఐఏ ఇప్పటికే గుర్తించింది. వీరి ద్వారా కశ్మీర్లో ఉగ్రవాదుల చేరికలు, శిక్షణ, పేలుడు సామగ్రి, ఆయుధాలు సమకూర్చడం, అల్లర్లకు పాల్పడే వారికి ఆర్థిక సాయం అందించడం వంటివి జరుగుతున్నాయని ఎన్ఐఏ తేల్చింది. కశ్మీర్ యువతను భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపించడంలో ఈ 13 మంది కీలకంగా ఉన్నట్లు గుర్తించింది. -
భారత్‌ది శాంతిమంత్రమే.. కానీ!
న్యూఢిల్లీ: శాంతిమంత్రాన్నే భారత్ బలంగా విశ్వసిస్తుందని.. శాంతి పూర్వక సంబంధాలను ఏర్పాటుచేసుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొ న్నారు. అయితే.. శాంతి కోసం దేశ సార్వభౌమత్వం, ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. మాసాంతపు మన్‌కీబాత్ ప్రసంగంలో.. కొంతకాలంగా పాకిస్తాన్ చేస్తున్న వ్యాఖ్యలు, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే ప్రయత్నాలకు భారత భద్ర తా బలగాలు దీటైన సమాధానం చెబుతాయని మోదీ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమం ద్వారా.. అక్టోబర్ 12న రజతోత్సవం జరుపుకోనున్న ఎన్హెచ్ఆర్సీకీ, అక్టోబర్ 8న వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనున్న భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రచ్ఛన్నయుద్ధానికి దీటైన సమాధానం పిరికితనంతో ప్రచ్ఛన్నయుద్ధం చేస్తున్న శక్తులకు భారత బలగాలు ఇచ్చిన దిమ్మదిరిగే సమాధానమే 2016 సెప్టెంబర్ నాటి సర్జికల్ స్ట్రైక్స్ అని ఆయన పేర్కొన్నారు. ‘భారత్ ఎప్పుడూ అన్యాయంగా ఇతరుల భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయలేదు. చేయదు కూడా’ అని ప్రధాని స్పష్టం చేశారు. పరాక్రమ్ పర్వ్‌ను జరుపుకోవడం ద్వారా దేశ యువతకు సైనికుల పరాక్రమం గుర్తుచేసినట్లవుతుందన్నారు. గోల్డెన్ గ్లోబ్ రేసులో పాల్గొంటూ.. తుపానులో పడవ పాడైనా నడిసంద్రంలో మనోస్థైర్యాన్ని కనబరిచిన నేవీ కమాండర్ అభిలాష్ టామీని ప్రశంసించారు. సహకార విధానమే ప్రత్యామ్నాయం పెట్టుబడి దారీ విధానం, సామ్యవాదాలకు సహకార విధానమే సరైన ఆర్థిక ప్రత్యామ్నాయ పద్ధతి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లో అముల్ డెయిరీ సహకార ఉద్యమ వ్యవస్థాపకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను గుర్తుచేస్తూ.. ఆర్థికాభివృద్ధిలో ప్రజల సహకారాన్ని ఆనాడే ఆయన అమలు చేశారని ప్రశంసించారు. గుజరాత్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి అనంతరం ఆనంద్‌లో ఏర్పాటుచేసిన సభలో మోదీ ప్రసంగించారు. ‘దేశవ్యాప్తంగా సహకార సంస్థల ఏర్పాటు అత్యావశ్యకం. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానంగా సహకార వ్యవస్థ ఎదగాలి. వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడమే రైతుల సమస్యలకు అసలైన పరిష్కారం. మేం ఈ దిశగానే పనిచేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ముఖ్వాజా గ్రామంలో సౌరశక్తి సహకార సొసైటీ ఏర్పాటుచేసిన సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించి.. ఈ దిశగా చొరవతీసుకున్న 11 మంది రైతులను అభినందించారు. అముల్ సంస్థ రూ.533 కోట్లతో ఏర్పాటుచేసిన చాక్లెట్ ప్లాంట్‌ను రిమోట్ కంట్రోల్‌తో ప్రధాని ప్రారంభించారు. ఆనంద్ వర్సిటీలో రూ.8కోట్లతో ఏర్పాటుచేసిన ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను, రూ.20కోట్లతో నిర్వహించనున్న విద్య డెయిరీ ఐస్ క్రీమ్ ప్లాంట్ల ప్రారంభించారు. అనంతరం కచ్ జిల్లా అంజార్‌లో రూ. 6,216కోట్లతో నిర్మించిన పాలన్పూర్–పాలీ–బార్మర్ గ్యాస్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. దేశానికే పేరుతెచ్చిన గాంధీ, పటేల్, అంబేడ్కర్ వంటి మహనీయుల త్యాగాలను తక్కువచేసి చూడటాన్ని మానుకోవాలని కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ‘నన్ను 24 గంటలు విమర్శిస్తూనే ఉన్నారు. ఇబ్బందేం లేదు. కానీ మహనీయులపై నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయొద్దు’ అని సూచించారు. సరోవర్ డ్యాం సమీపంలో ఏర్పాటుచేయనున్న పటేల్ విగ్రహంపై రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ ఈ విమర్శలు చేశారు. ‘గ్రీన్ అవార్డు’కు మహాత్ముడే అర్హుడు అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ మహాత్ముడిని స్మరించుకున్నారు. మన్‌కీ బాత్‌లో.. గుజరాత్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా దేశానికి మార్గదర్శనం చేస్తున్న గాంధీ ఆలోచనలను ప్రధాని ప్రస్తావించారు. గాంధీ జీవితంలో పారిశుద్ధ్యం అత్యంత ముఖ్యమైన భాగమని ప్రధాని గుర్తుచేశారు. ఐక్యరాజ్యసమితి ‘చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్’ (గ్రీన్) అవార్డుకు జాతిపితే అసలైన అర్హుడని పేర్కొన్నారు. అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటుచేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌లు సంయుక్తంగా ఐరాస గ్రీన్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. రాజ్‌కోట్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. ‘చాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు అందుకునేందుకు మహాత్మాగాంధీయే సరైన వ్యక్తి. పారిశుద్ధ్యమా? స్వాతంత్య్రమా అనే ప్రశ్న ఎదురైతే.. ముందు పారిశుద్ధ్యానికే మొగ్గుచూపారాయన’ అని అన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 15నుంచి ప్రారంభం కానున్న ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
‘దేశాన్నిపాలించడం అంటే పిల్లల ఆట కాదు’
ముంబై : బీజేపీపై శివసేన మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. జమ్మూకశ్మీర్‌లో అరాచకత్వాన్ని, హింసను వ్యాప్తి చేసి అధికారం నుంచి తప్పుకుందని విమర్శించింది. కశ్మీర్లో శాంతిని నెలక్పొడంలో బీజేపీ విఫలమైందని దుయ్యబట్టింది. తమ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో బీజేపీని బ్రిటీష్ పరిపాలకులతో పోల్చింది. బ్రిటీష్ ప్రభుత్వం ఇండియా నుంచి తరలిపోయినట్లుగానే బీజేపీ కశ్మీర్లో హింసను పెంచి అధికారం నుంచి తప్పుకుందని ఆరోపించింది. దేశాన్ని పాలించడం అంటే చిన్న పిల్లల ఆట కాదని ఎద్దేవా చేసింది. దురాశ కలిగిన బీజేపీని చరిత్ర మరిచిపోయిందని ధ్వజమెత్తింది. కశ్మీర్లో ఎన్నడూలేని విధంగా వేల మంది జవాన్లు, సామాన్యులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కశ్మీర్లో రక్తపుటేరులు పారుతున్నాయని, దీనికి కారణం బీజేపీయే అని ఆరోపించింది. కానీ అందంతా మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముప్తిపై వేసి ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చిందని పేర్కొంది. -
హక్కానీ టాప్ కమాండర్ హతం
పెషావర్: ఉగ్రవాదంపై పాకిస్తాన్ అలసత్వాన్ని వీడని పక్షంలో తామే ఆ ఉగ్రస్థావరాలను నిర్వీర్యం చేస్తామని ప్రకటించిన అమెరికా.. ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. బుధవారం అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్ మిసైల్ దాడులతో హక్కానీ నెట్వర్క్ కీలక కమాండర్ ఎహసాన్ అలియాస్ ఖవారీని మట్టుబెట్టింది. ఉత్తర వజీరిస్తాన్ (పాకిస్తాన్)లోని గిరిజన ప్రాంతం (అఫ్గాన్ శరణార్థులుండే ప్రాంతం)లోని ఓ ఇంట్లో ఖవారీ ఉన్నాడన్న పక్కా సమాచారంతో.. ఆ ఇంటిపై అమెరికా గూఢచార విమానాలు రెండు డ్రోన్ మిసైల్స్‌ను ప్రయోగించాయి. ఈ దాడిలో ఖవారీ సహా అతని ఇద్దరు అనుచరులు హతమయ్యారు. కాగా, అమెరికా డ్రోన్ దాడులు ‘ఏకపక్షం’ అని పాకిస్తాన్ మండిపడింది. సంకీర్ణ ధర్మాన్ని మరచి తమ భూభాగంలో తమకు సమాచారం లేకుండా ఇలాంటి దాడులకు దిగటం సరికాదని నిరసన తెలిపింది. ‘ఇలాంటి ఏకపక్ష దాడులు ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న అమెరికా, పాకిస్తాన్ దేశాల సహకార స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయి. అఫ్గనిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రస్థావరాలపై అమెరికా మిలటరీ తరచుగా దాడులు జరుపుతోంది. కానీ ఈసారి మా భూభాగంలో.. మాకు సమాచారం ఇవ్వకుండానే దాడి జరిపారు’ అని పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపైనా డ్రోన్ దాడులు పెరిగాయి. అయితే.. తన భూభాగంలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయటంలో పాక్ విఫలమైందంటూ కొంతకాలంగా ట్రంప్ విమర్శిస్తున్నారు. హక్కానీ నెట్వర్క్ లక్ష్యంగా అమెరికా డ్రోన్ దాడులు చేయటం ఈ వారం రోజుల్లో ఇది రెండోసారి. -
మిలటరీ సాయం నిలిపేస్తున్నాం
వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఉగ్రవాదానికి వంతపాడుతున్న పాకిస్తాన్‌కు అమెరికా మరోమారు హెచ్చరికలు జారీచేసింది. పాక్‌కు ఏటా భారీగా ఇస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12.66 వేల కోట్లు) భద్రతా సాయంలో కోతతోపాటుగా మిలటరీ సామగ్రి సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అఫ్గానిస్తాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో సహా పలు ఉగ్రవాద సంస్థలను అడ్డుకోవటంలో, పాక్‌లో వారి స్థావరాలను నిర్వీర్యం చేయటంలో విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు్ల ప్రకటించింది. అమెరికా కోరుకుంటున్నట్లు ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటే సాయం మళ్లీ మొదలవుతుందని సూచించింది. అయితే.. అమెరికా, అంతర్జాతీయ సమాజం కోరుకున్నట్లే వ్యవహరిస్తున్నామని పాక్ పేర్కొంది. భద్రత సాయం నిలుపుదలపై అమెరికా ప్రభుత్వాధికారులతో మాట్లాడుతున్నామని వెల్లడించింది. అలా చేస్తే మళ్లీ సాయం: అమెరికా ‘మేం పాకిస్తాన్‌కు జాతీయ భద్రత సాయాన్ని నిలిపివేస్తున్నాం. పాక్ ప్రభుత్వం అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకోనంతకాలం ఇది కొనసాగుతుంది. ఈ ఉగ్రవాద సంస్థలు అమెరికన్లను లక్ష్యంగా చేసుకోవటంతోపాటు దక్షిణాసియా ప్రాంతంలో అశాంతి చెలరేగేందుకు కారణమవుతున్నారు. అందుకే వీరిని నిర్వీర్యం చేయటంలో విఫలమవుతున్న పాక్‌కు మేం భద్రతాపరమైన సాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హీతర్ నార్ట్ పేర్కొన్నారు. ఈ నిధుల నిలుపుదలలో .. 2016 సంవత్సరానికి విదేశీ మిలటరీ నిధి రూపంలో ఇవ్వాలనుకున్న 225 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,425 కోట్లు), 2017 సంవత్సరానికి సంకీర్ణ మద్దతు నిధి రూపంలో ఇవ్వాలనుకున్న 900 మిలియన్ డాలర్ల (రూ.5.7వేల కోట్లు) సాయం ఉన్నాయి. అమెరికా నిర్ణయాన్ని గౌరవించనంతకాలం పాకిస్తాన్‌కు మిలటరీ పరికరాలను, సంబంధింత నిధులనూ నిలిపేస్తున్నట్లు ఆమె తెలిపారు. ‘ట్రంప్ కొంతకాలంగా దీనిపై స్పష్టమైన సూచనలు చేస్తున్నారు. టిల్లర్సన్, మాటిస్‌లు పాక్ ప్రభుత్వాన్ని కలిసి మరీ తమ ఆందోళన తెలియజేశారు. ఇది శాశ్వతంగా సాయాన్ని నిలిపేయటం కాదు. మేం చెప్పినట్లు చేస్తే (ఉగ్రవాదంపై చర్యలు) నిలిపేసిన సాయం మళ్లీ వారికే అందుతుంది’ అని నార్ట్ స్పష్టం చేశారు. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను విడుదల చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికీ.. తాజాగా సాయం నిలిపివేతకు ఎటువంటి సంబంధం లేదని కూడా నార్ట్ ప్రకటించారు. మేం చేయాల్సింది చేస్తున్నాం: పాక్ ‘అస్పష్ట లక్ష్యాలు, ఏకపక్ష నిర్ణయాల వల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోలేము’ అని అమెరికా తీరుపై పాకిస్తాన్ అసంతృప్తిని తెలియజేసింది. తాజా నిర్ణయాల నేపథ్యంలో భద్రతాపరమైన సాయంపై అమెరికా అధికారులతో మాట్లాడుతున్నట్లు పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ సమాజం, అమెరికా భద్రత ప్రయోజనాలకు అనుగుణంగానే పాకిస్తాన్ వ్యవహరిస్తోందని.. ఉగ్రవాదంపై పోరును కొనసాగిస్తోందని ప్రకటించింది. ‘అల్‌కాయిదా సహా ఇతర ఉగ్రవాద గ్రూపులను నిర్వీర్యం చేయటంలో అమెరికాకు సాయం చేశాం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవటంలో, అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య రాజకీయ పరిస్థితులు నెలకొనేలా చొరవతీసుకున్నాం’ అని పాక్ పేర్కొంది. అమెరికా 15 ఏళ్లుగా పాకిస్తాన్‌కు ఏటా భారీ స్థాయిలో భద్రతా సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. -
ద్వైపాక్షిక విశ్వాసానికి దెబ్బ: పాక్
ఇస్లామాబాద్: ఉగ్రవాదంపై పోరులో ఆర్థిక సాయం పొంది మోసం చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలపై పాకిస్తాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని దెబ్బతిస్తాయని పేర్కొంది. పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ నేతృత్వంలో మంగళవారం జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశమైంది. ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్, హోం మంత్రి అశాన్ ఇక్బాల్, రక్షణ మంత్రి ఖుర్రమ్ ఖాన్, త్రివిధ దళాల చీఫ్‌లు హాజరయ్యారు. ట్రంప్ ఆరోపణలు పూర్తి అసంబద్ధంగా, వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆ తరువాత వెలువడిన ప్రకటనలో మండలి పేర్కొంది. -
పాక్‌తో క్రికెట్ సిరీస్‌కు అవకాశం లేదు
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం, కాల్పుల్ని ఆపేంత వరకూ పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరగక పోవచ్చని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. విదేశాంగ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంట్ సంప్రదింపుల కమిటీకి ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. సరి హద్దుల్లో ఉగ్ర వాదం, కాల్పులు ఆపనంత వరకూ మ్యాచ్‌లకు అవకాశం ఉండదని, ఉగ్రవాదం, క్రికెట్లు కలిసికట్టుగా సాగలేవని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఖైదీలుగా ఉన్న 70 ఏళ్లు దాటిన వారు, మహిళలు, మానసిక స్థితి సరిగా లేని వారిని మానవతా దృక్పథంలో ఇరు దేశాలు విడుదల చేయాలని భారత్‌లోని పాకిస్తాన్ రాయబారికి ప్రతిపాదించినట్లు ఆమె చెప్పారు. -
కలసికట్టుగా ఉగ్రవాదంపై పోరు
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని, ఉగ్రవాదులకు నిధులు అందే మార్గాలకు అడ్డుకట్ట వేయాలని, ఉగ్రవాద స్థావరాలను నిర్వీర్యం చేయాలని భారత్, చైనా, రష్యా నిర్ణయించాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన 15వ రష్యా, భారత్, చైనా (ఆర్ఐసీ) త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్ (భారత్), వాంగ్ యీ(చైనా), సెర్జీ లావ్రోవ్ (రష్యా) ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని దేశాలు ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని, ఇది ఆయా దేశాల బాధ్యత అని ఓ సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చారు. ‘ఉగ్రవాదంపై మేము చర్చించాం. తాలిబాన్, ఐఎస్ఐఎస్, అల్‌కాయిదా, లష్కరే తోయిబా తదితర ఉగ్రవాద సంస్థల ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతు న్నాయి. ఇవి అంతర్జాతీయ శాంతి, భద్రతపైనా అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా, అభివృద్ధిపైనా ప్రభావం చూపుతున్నాయి. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా లాంటి ఉగ్ర సంస్థల కార్యకలా పాలపై మన ఆందోళన తెలియజేశాం’ అని సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. కాగా, డోక్లామ్‌లో భారత బలగాల దురాక్రమణను తాము సంయమనంతో అడ్డుకున్నామని చైనా మంత్రి వాంగ్‌యీ భారత పర్యటనకు బయలుదేరే ముందు బీజింగ్‌లో చెప్పారు. -
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు: భారత్, ఈయూ
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరుకు సహకరించుకోవాలని భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఇరు పక్షాలు అంగీకరిస్తూ ఒక ప్రకటన (డిక్లరేషన్)ను విడుదల చేశాయి. భారత్–ఈయూ 14వ సదస్సు శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ ఫ్రాన్సిజెక్ టస్క్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్, ఇతర ఈయూ నాయకులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఉగ్రవాదంపై పోరు, భద్రత అంశాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించాము’ అని తెలిపారు. టస్క్ మాట్లాడుతూ ‘అతివాదం, తీవ్రవాదం, ఉగ్రవాదంపై పోరాడాలని ఉమ్మడిగా తీర్మానించాము’అని చెప్పారు. -
చైనాకు సంకేతాలు పంపిన భారత్
►టెర్రరిజం గురించి మేం మాట్లాతాం.. నో డౌట్! ►చైనాకు సంకేతాలు పంపిన భారత్ న్యూఢిల్లీ : చైనా తాటాకు చప్పుళ్లుకు భారత్ దీటుగానే బదులిస్తోంది. మొన్న డోక్లాం సమస్య పరిష్కారం అనంతరం.. తాజాగా బ్రిక్స్ వేదికగా భారత్ ఉగ్రవాద సమస్య గురించి, ప్రత్యేకంగా పాకిస్తాన్ గురించి మాట్లాడకూడదని చైనా పంపిన సంకేతాలకు భారత్ గట్టిగానే సమాధానం చెబుతోంది. ఈ నెల 3 నుంచి 5 వరకూ చైనాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదం గురించి గట్టిగా మాట్లాడతారని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు పంపాయి. బ్రిక్స్ వేదికపై ఉగ్రవాదం, పాక్ గురించి మాట్లాడకూడదని చైనా సంకేతాలు పంపింది. అయితే గంటల వ్యవధిలో అందుకు స్పందించిన భారత్.. ప్రధాని మోదీ గట్టిగానే ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తారన్న సిగ్నల్స్‌ను బీజింగ్‌కు పంపింది. బ్రిక్స్ సదస్సుల్లో భాగంగా ఈ నెల 4న అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ఉగ్రవాదం, పాకిస్తాన్ గురించి మోదీ ప్రస్తావించే అవకాశం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. బ్రిక్స్ సమావేశానికి హాజరవుతున్న మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా సమావేశమవుతారా? లేదా? అన్న విషయంపై విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వలేదు. బ్రిక్స్ సదస్సులో భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల అధినేతలు పాల్గొంటారు. -
ఇస్లాంలో ఉగ్రవాదానికి స్థానంలేదు
షాద్‌నగర్: ఇస్లాంలో ఉగ్రవాదానికి, దాడులకు స్థానం ఉండదని షేకుల్ జామే నిజామ్మియా హైదరాబాద్ దక్కన్ ముఫ్తి ఖలీల్ అహ్మద్ అన్నారు. రంజాన్ మాసంలో మక్కా మదీనాలో బాంబ్ దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల చర్యను ఖండిస్తూ ఆదివారం ఫరూఖ్‌నగర్ మజీద్‌లో ముస్లింలు నిరసన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ.. ఇస్లాం అంటే శాంతి అని, ఇస్లాం ముసుగులో కొందరూ మసీదులు, దర్గాలు, దేవాలయాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ముస్లింలందరూ ఈ చర్యలను ఖండించాలన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడి చోటుచేసుకున్నా తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో సయ్యద్ రవూఫ్, పీర్‌షబ్బీర్, మహ్మద్ తాహేర్ ఖసీమీ, సయ్యద్ మున్వర్‌అలీ, అబ్దుల్ ఖదీర్, సయ్యద్ అస్రద్ అలీ, అజిజుల్లా షా ఖాదిరి, ముకారర్ అలీ, మసూద్‌ఖాన్, సయ్యద్ కమ్మర్, సలీం, అన్ను తదితరులు పాల్గొన్నారు.