ఇస్లామాబాద్: పూటకో మాట మార్చే తన బుద్ధిని పాకిస్తాన్ మరోసారి బయట పెట్టుకుంది. అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తమ గడ్డ మీదే ఉన్నాడని చెప్పినట్టుగానే చెప్పి యూ టర్న్ తీసుకుంది. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఎప్పట్నుంచో భారత్ చేస్తున్న వాదనలు నిజమేనని తొలిసారిగా ఆ దేశ మీడియా వెల్లడించింది. దావూద్ పాక్ గడ్డ మీదే ఉన్నాడని మీడియా కథనాల ద్వారా అయినా అంగీకరించడం ఇదే మొదటిసారి. పాక్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నిషిద్ధ 88 ఉగ్రవాద సంస్థలు, వారి నాయకుల జాబితాను శనివారం వెల్లడించింది.
అందులో భారత్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు దావూద్ ఇబ్రహీం పేరు కూడా ఉంది. తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు, వ్యక్తులపైనే ఆంక్షలు ఉంటాయి కాబట్టి దావూద్ పాక్‌లోనే ఉన్నాడని అంగీకరించినట్లే. కానీ ఎప్పటి మాదిరిగానే పాక్ కుటిల బుద్ధిని బయటపెట్టుకుంటూ దావూద్ తమ గడ్డ మీద లేడని పాత పాటే పాడుతోంది. మీడియా కథనాలు నిరాధారమైనవీ, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారమే ఉగ్ర సంస్థలపై ఆంక్షలు విధించామని, ఇది సాధారణ ప్రక్రియనేనని తెలిపింది.
గ్రే లిస్ట్ నుంచి బయటపడడానికే..
ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నందుకుగాను ఫ్రాన్సు రాజధాని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాక్స్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) సంస్థ పాకిస్తాన్‌ను 2018 జూన్‌లో గ్రే లిస్ట్‌లో ఉంచింది. 2019 చివరికల్లా ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని గడువు విధించింది. ఆ తర్వాత కరోనా సంక్షోభంతో గడువు పెంచింది. 2020 జూన్ నాటికి కూడా పాక్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గ్రే లిస్టులోనే కొనసాగించాలని నిర్ణయించింది. గ్రే లిస్ట్‌లో ఉంటే అంతర్జాతీయంగా ఎలాంటి ఆర్థిక సాయం పాక్‌కి అందదు.
దీంతో గ్రే లిస్ట్ నుంచి బయటపడడానికి పాకిస్తాన్ శుక్రవారం హఫీజ్ సయీద్, మసూద్ అజర్, దావూద్ ఇబ్రహీంతో పాటుగా 88 ఉగ్ర సంస్థలు, వాటి నాయకుల ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు జప్తు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టుగా ది న్యూస్ కథనం వెల్లడించింది. జమాత్ ఉద్ దవా, జైషే మహమ్మద్, తాలిబన్, అల్‌ఖైదా, హక్కానీ గ్రూప్ వంటి సంస్థల అన్ని రకాల ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా ఆ కథనం పేర్కొంది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంను అప్పగించాల్సిందిగా అప్పగించాల్సిందిగా భారత్ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తోంది. ó∙కరాచీలోనే తలదాచుకున్నాడని ఆధారాలను బయట పెట్టినా తమ వద్ద లేడని బుకాయిస్తూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment