చెత్త నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్న మహిళా కార్మికులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
మధుర: బీజేపీ హిందుత్వ ఎజెండాను తప్పుపడుతున్నవారిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ‘ఆవు’ ‘ఓం’ అనే పదాలను వినగానే దేశంలో కొందరు వ్యక్తులు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఈ పదాలు భారత్‌ను 16–17వ శతాబ్దాల నాటి కాలంలోకి తీసుకెళ్లిపోయాయన్న రీతిలో వీరు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ను నాశనం చేసేందుకు ఇలాంటివారు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో బుధవారం జాతీయ జంతువ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని(ఎన్‌ఏడీసీపీ) ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘నేను ఆఫ్రికాలోని రువాండా దేశానికెళ్లా. అక్కడి ప్రభుత్వం గ్రామాల్లోని ప్రతీ ఇంటికి ఓ ఆవును ఇస్తోంది.
ఆవులకు ఆడదూడ పుడితే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మరో కుటుంబానికి అప్పగిస్తుంది. పశుపోషణ ద్వారా రువాండా ఆర్థిక వ్యవస్థను బలపర్చుకుంటోంది. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నేను స్వయంగా చూశా. కానీ మన దేశంలో కొందరు వ్యక్తులు మాత్రం ఓం, ఆవు అనే పదాలను వినగానే విద్యుత్ షాక్ కొట్టినట్లు ఉలిక్కిపడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. అసలు పశుపోషణ లేకుండా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా మనుగడ సాధించడం సాధ్యమా? అని మోదీ ప్రశ్నించారు. వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహంతో పాటు స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ పథకాలతో ఆర్థిక వ్యవస్థ, ప్రకృతి మధ్య సమతుల్యత సాధ్యమవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
ఉగ్రమూకలకు పాక్ అండదండలు..
దాయాది దేశం పాకిస్తాన్‌పై ప్రధాని మోదీ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉగ్రమూకలకు పాకిస్తాన్‌లో అన్నిరకాలుగా అండదండలు అందజేస్తున్నారనీ, ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశభద్రత విషయంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భారత్‌లో ఉగ్రదాడులకు పాక్ కుట్ర పన్నుతోందన్న నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని ఈ మేరకు స్పందించారు. ‘నేడు ఉగ్రవాదం అన్నది ఓ భావజాలంగా మారిపోయింది.
సరిహద్దులు దాటి విస్తరించిన ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది. ఈ ఉగ్రవాదులను మన పొరుగుదేశం(పాకిస్తాన్)లో పెంచిపోషిస్తున్నారు. ఈ భావజాలాన్ని నిరోధించడానికి ఉగ్రమూకలకు మద్దతు ఇస్తూ శిక్షణ, ఆశ్రయం కల్పిస్తున్నవారిపై, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రపంచదేశాలన్నీ ప్రతిజ్ఞ చేయాలి’ అని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం అణచివేతకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ వెల్లడించారు. కాలుష్యం, ఉగ్రవాదం, అనారోగ్యం... ఏ సమస్యను పరిష్కరించాలన్నా ప్రజలు ఏకం కావాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు.
12 వేలకోట్లతో వాక్సినేషన్
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు. దీని కారణంగా పర్యావరణం కలుషితం కావడమే కాకుండా జంతువులు, చేపలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని 50 కోట్ల పాడిపశువులు, గొర్రెలు, మేకలు, పందులకు గాలికుంటు వ్యాధి(ఎఫ్‌ఎండీ) సోకకుండా రూ.12,652 కోట్లతో వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియకు మోదీ శ్రీకారం చుట్టారు. అనంతరం ఓ మహిళా బృందంతో కలిసి ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నుంచి ప్లాస్టిక్‌ను వేరుచేశారు. 2025 నాటికి జంతు సంబంధిత వ్యాధులను నియంత్రించాలనీ, 2030 నాటికి పూర్తిగా అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ చెప్పారు. 2022 నాటికి దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment