అమెరికా ‘హౌడీ మోదీ’ అని నినదించింది. టెక్సాస్ మినీ భారత్‌లా మారింది. హ్యూస్టన్ త్రివర్ణ శోభితమయింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ‘ఉమ్మడి స్వప్నం.. ఉజ్వల భవిత’ పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహించిన ఈ కార్యక్రమం ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. మోదీ, మోదీ అనే నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాల వెలుగుజిలుగుల మధ్య కోలాహలంగా సాగింది. ట్రంప్ ప్రసంగిస్తున్నంత సేపు ‘యూఎస్‌ఏ.. యూఎస్‌ఏ’ అని సభికులు నినదించారు.
హ్యూస్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఆదివారం హ్యూస్టన్‌లో జరిగిన మెగా ఈవెంట్ హౌడీ మోదీలో ప్రధాని మోదీ.. ఇక ఉగ్రవాదంపై యుద్ధమే అని గర్జించారు. ఉగ్రవాదంపై, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న, ఆర్థిక మద్దతిస్తున్న దేశాలపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు. ఆ యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ కచ్చితంగా మద్దతిస్తారని, ఆయనే ముందుండి నడుపుతారని ఉద్ఘాటించారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న ట్రంప్‌ను నిలుచుని చప్పట్లు కొడుతూ ప్రశంసించాలని ఆహూతులను కోరారు.
‘అమెరికాలో జరిగిన 9/11 దాడుల వెనుక, భారత్‌లో జరిగిన 26/11(ముంబై దాడులు) నరమేథం వెనుక కుట్రదారులెవరో ప్రపంచం మొత్తానికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. దాదాపు అరగంట పాటు సాగిన ప్రసంగంలో ఇప్పటివరకు ఐదేళ్ల తమ పాలన సాధించిన విజయాలను మోదీ ఏకరువు పెట్టారు. 60 ఏళ్లలో సాధించలేని వాటిని ఐదేళ్లలో సాధించగలిగామన్నారు. భారత్, అమెరికా అభివృద్ధిలో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉందన్న మోదీ.. వారి కోసం భారత్ ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. భారత్, అమెరికాల దోస్తీ 21వ శతాబ్దంలో మరిన్ని ఆవిష్కరణలతో అభివృద్ధి పథంలో సాగాల్సి ఉందన్నారు.
మోదీ.. ట్రంప్.. మోదీ
కార్యక్రమం ప్రారంభంలో మొదట మోదీ ప్రసంగించి, ట్రంప్ ను భారత్‌కు నిజమైన స్నేహితుడంటూ ఆహూతులకు పరిచయం చేశారు. అనంతరం ట్రంప్ ప్రసంగించారు. అమెరికా అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల పాత్ర ఎంతో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోని దాదాపు 4 మిలియన్ల భారతీయులపై తనకెంతో గౌరవం ఉందన్నారు. ‘వి.. ద పీపుల్’ అనే వాక్యంతోనే భారత్, అమెరికాల రాజ్యాంగ పీఠిక ప్రారంభమవుతుందని, ఇదే ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాలకు రుజవని పేర్కొన్నారు. ట్రంప్ ప్రసంగ సమయంలో ‘యూఎస్‌ఏ.. యూఎస్‌ఏ’ అంటూ ప్రేక్షకులు నినదించడం విశేషం. ట్రంప్ ప్రసంగం అనంతరం మోదీ మరోసారి కీలక ప్రసంగం చేశారు. మోదీ తన మొదటి ప్రసంగాన్ని ఇంగ్లీష్‌లో, తదుపరి ప్రసంగాన్ని హిందీలో చేయడం విశేషం.
మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
హౌడీ మై ఫ్రెండ్స్! టెక్సాస్ అంటే విశాలత్వం.. ఆ విశాలత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మీరు 50 వేలకు పైగా ఉన్నారు. ఇది కేవలం సంఖ్య కాదు. ఇదో చరిత్ర. కొత్త చరిత్ర. ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో నెలకొన్న ఎనర్జీ. భారత్, అమెరికాల మధ్య పెరుగుతున్న మైత్రికి, సమన్వయానికి నిదర్శనం. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రావడం మనకెంతో గర్వకారణం. ఆయన రాక భారతీయ అమెరికన్ల సామర్థ్యానికి ప్రశంస. ఈ కార్యక్రమం పేరు ‘హౌడీ మోదీ’ అని పెట్టారు. హౌ డు యు డూ మోదీ? అని. మోదీ ఒంటరిగా ఒక శూన్యం.. ఒక సామాన్య వ్యక్తి.. 130 కోట్ల భారతీయుల ఆదేశాలు పాటిస్తున్న సాధారణ వ్యక్తి. అయినా మీరు హౌడీ మోదీ అంటుంటే నాకొకటే అనిపిస్తోంది. నా జవాబు ఒకటే.. భారత్‌లో అంతా బావుంది(భారత్ మే సబ్ అచ్చాహై). (అనంతరం తెలుగులో అంతా బావుంది సహా వివిధ భారతీయ భాషల్లో ఆ పదాన్ని మోదీ ఉచ్ఛరించారు. దాంతో స్టేడియంలో మోదీ నినాదాలు మిన్నంటాయి)
► మేం అధికారంలోకి వచ్చిన తరువాత గత 60 ఏళ్లలో సాధించలేనివెన్నో సాధించాం. న్యూ ఇండియా లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. డేటా భారత్‌లోనే అత్యంత చవక. డిజిటల్ ఇండియాగా భారత్‌ను తీసుకువెళ్తున్నాం.
► 2, 3 రోజుల్లో ట్రంప్‌తో చర్చలు జరపనున్నాం. భారత్, అమెరికాలకు ప్రయోజనం చేకూర్చే మరిన్ని అంశాలపై చర్చించనున్నాం. ఆయన చర్చలు జరపడంలో సిద్ధహస్తుడు. ఆయన నుంచి నేను కూడా నేర్చుకుంటున్నా. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు 21వ శతాబ్దంలో అభివృద్ధి పథంలో సాగేందుకు భారత్, అమెరికాలు కలసి సాగాల్సి ఉంది. చివరగా థాంక్యూ హ్యూస్టన్.. థాంక్యూ అమెరికా.. గాడ్ బ్లెస్ యూ ఆల్..
► కశ్మీరీల కోసం..
ముఖ్యంగా 70 ఏళ్ల సమస్యకు ఫేర్‌వెల్ పలికాం.. జమ్మూకశ్మీర్ ప్రజలకు అభివృద్ధిని దూరం చేస్తున్న ఆర్టికల్ 370కి వీడ్కోలు పలికాం. అక్కడి ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యులను చేశాం. 370 రద్దుపై పార్లమెంటులో పెద్ద చర్చే జరిగింది. ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆ బిల్లు విజయం సాధించింది. ఇందుకు మన పార్లమెంటేరియన్లకు మనం నిల్చుని హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలుపుదాం.(స్టేడియంలో స్టాండింగ్ ఒవేషన్). ఇది కొన్ని ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలవారికి(పరోక్షంగా పాక్‌ను ఉద్దేశించి) నచ్చట్లేదు. ఇప్పుడు సమయమొచ్చింది. ఉగ్రవాదంపై, దానికి మద్దతిచ్చే వారిపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి ట్రంప్ నేతృత్వం వహించాలి.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
హ్యూస్టన్‌లో కార్యక్రమం అనంతరం చేతులు పట్టుకుని ముందుకు సాగుతున్న మోదీ, ట్రంప్
సంప్రదాయం
హౌడీ మోదీ వేదికపై నృత్య ప్రదర్శన
మేము సైతం
కార్యక్రమానికి హాజరైన ముస్లింలు
గాంధేయం
ఎన్నార్జీ స్టేడియం వద్ద గాంధీజీ వేషధారి
అభిమానం
భారత సంతతి వారితో ప్రధాని ముచ్చట్లు
Comments
Please login to add a commentAdd a comment