విదేశీ జోక్యానికి నో | PM Modi explains rationale behind J&K decision to Putin | Sakshi
Sakshi News home page

విదేశీ జోక్యానికి నో

Published Thu, Sep 5 2019 2:28 AM | Last Updated on Thu, Sep 5 2019 9:18 AM

PM Modi explains rationale behind J&K decision to Putin - Sakshi

వ్లాడివోస్టోక్‌లో షిప్‌బిల్డింగ్‌ ప్లాంట్‌ నమూనాను పరిశీలిస్తున్న ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌

వ్లాడివోస్టోక్‌: భారత్‌–రష్యాలు తమ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. రష్యాలతో వాణిజ్యం, భద్రత, నౌకాయానం, అంతరిక్ష రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తున్నామనీ, రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని ఎగదోయడం నిలిపివేయాలని హితవు పలికారు. కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370 రద్దుపై పాకిస్తాన్‌ చేస్తున్న ఆందోళనను, వేర్పాటువాదులకు ఇస్తున్న మద్దతును మోదీ ఈ మేరకు పరోక్షంగా తప్పుపట్టారు.

రెండ్రోజుల రష్యా పర్యటనలో భాగంగా బుధవారం మోదీ వ్లాడివోస్టోక్‌ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి రష్యా బలగాలు గౌరవవందనం సమర్పించాయి. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో కలిసి ‘భారత్‌–రష్యా 20వ వార్షిక సదస్సు’లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు రక్షణ, అంతరిక్షం, నౌకాయానం, ఇంధనం, సహజవాయువు, పెట్రోలియం, వాణిజ్యం సహా 15 రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
 
చెన్నై–వ్లాడివోస్టోక్‌ నౌకామార్గం..
ప్రధాని మోదీ–పుతిన్‌ల నేతృత్వంలో ఇరుదేశాల ప్రతినిధి బృందాల భేటీ అనంతరం భారత్, రష్యాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ....‘తమిళనాడు రాజధాని చెన్నై నుంచి వ్లాడివోస్టోక్‌ వరకూ పూర్తిస్థాయి నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఎంవోయూ కుదుర్చుకున్నారు. ప్రస్తుతం భారత్‌–రష్యాల మధ్య రూ.79,247 కోట్లు(11 బిలియన్‌ డాలర్లు)గా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 నాటికి రూ.2.16 లక్షల కోట్లకు చేర్చాలని మోదీ–పుతిన్‌ నిర్ణయం తీసుకున్నారు’ అని తెలిపింది. అంతకుముందు అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి ఓ బోటులో 2 గంటల పాటు మోదీ విహరించారు. ఈ సందర్భంగా ఇరువురు వ్లాడివోస్టోక్‌లోని జెవెజ్‌డా నౌకానిర్మాణ కేంద్రాన్ని సందర్శించారు.
 
భారత్‌ కీలక భాగస్వామి: పుతిన్‌
మోదీ పర్యటన నేపథ్యంలో పుతిన్‌ మాట్లాడుతూ.. భారత్‌ రష్యాకు అత్యంత కీలకమైన భాగస్వామని తెలిపారు. ‘ఇరుదేశాల మధ్య వాణిజ్యం 17 శాతం వృద్ధి చెంది 11 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇది మరింత వృద్ధి చెందుతుందని నమ్ముతున్నాం. భారత్‌–యూరేసియన్‌ ఎకనమిక్‌ యూనియన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు కృషి చేస్తున్నాం’ అని అన్నారు.
 
‘గగన్‌యాన్‌’కు రష్యా సహకారం..
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’లో పాల్గొనే వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇవ్వనుందని మోదీ ప్రకటించారు. ఇందుకోసం ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ సన్నిహితంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. అంతరిక్ష వాహకనౌకల ప్రయోగం, అభివృద్ధి, అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు వాడుకునే విషయంలో కలసికట్టుగా పనిచేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయని పేర్కొన్నారు. వ్యోమగాములను ఎంపిక చేసే ప్రక్రియను ఇస్రో ఇప్పటికే ప్రారంభించిందనీ, ఈ ఏడాది నవంబర్‌ తర్వాత వీరికి రష్యాలో శిక్షణ ఇస్తారని చెప్పారు. గగన్‌యాన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపేందుకు కేంద్రం రూ.10,000 కోట్లను కేటాయించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement