నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: శాంతిమంత్రాన్నే భారత్ బలంగా విశ్వసిస్తుందని.. శాంతి పూర్వక సంబంధాలను ఏర్పాటుచేసుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొ న్నారు. అయితే.. శాంతి కోసం దేశ సార్వభౌమత్వం, ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. మాసాంతపు మన్‌కీబాత్ ప్రసంగంలో.. కొంతకాలంగా పాకిస్తాన్ చేస్తున్న వ్యాఖ్యలు, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే ప్రయత్నాలకు భారత భద్ర తా బలగాలు దీటైన సమాధానం చెబుతాయని మోదీ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమం ద్వారా.. అక్టోబర్ 12న రజతోత్సవం జరుపుకోనున్న ఎన్‌హెచ్‌ఆర్సీకీ, అక్టోబర్ 8న వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనున్న భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రచ్ఛన్నయుద్ధానికి దీటైన సమాధానం
పిరికితనంతో ప్రచ్ఛన్నయుద్ధం చేస్తున్న శక్తులకు భారత బలగాలు ఇచ్చిన దిమ్మదిరిగే సమాధానమే 2016 సెప్టెంబర్ నాటి సర్జికల్ స్ట్రైక్స్ అని ఆయన పేర్కొన్నారు. ‘భారత్ ఎప్పుడూ అన్యాయంగా ఇతరుల భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయలేదు. చేయదు కూడా’ అని ప్రధాని స్పష్టం చేశారు. పరాక్రమ్ పర్వ్‌ను జరుపుకోవడం ద్వారా దేశ యువతకు సైనికుల పరాక్రమం గుర్తుచేసినట్లవుతుందన్నారు. గోల్డెన్ గ్లోబ్ రేసులో పాల్గొంటూ.. తుపానులో పడవ పాడైనా నడిసంద్రంలో మనోస్థైర్యాన్ని కనబరిచిన నేవీ కమాండర్ అభిలాష్ టామీని ప్రశంసించారు.
సహకార విధానమే ప్రత్యామ్నాయం
పెట్టుబడి దారీ విధానం, సామ్యవాదాలకు సహకార విధానమే సరైన ఆర్థిక ప్రత్యామ్నాయ పద్ధతి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లో అముల్ డెయిరీ సహకార ఉద్యమ వ్యవస్థాపకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను గుర్తుచేస్తూ.. ఆర్థికాభివృద్ధిలో ప్రజల సహకారాన్ని ఆనాడే ఆయన అమలు చేశారని ప్రశంసించారు. గుజరాత్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి అనంతరం ఆనంద్‌లో ఏర్పాటుచేసిన సభలో మోదీ ప్రసంగించారు. ‘దేశవ్యాప్తంగా సహకార సంస్థల ఏర్పాటు అత్యావశ్యకం. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానంగా సహకార వ్యవస్థ ఎదగాలి.
వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడమే రైతుల సమస్యలకు అసలైన పరిష్కారం. మేం ఈ దిశగానే పనిచేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ముఖ్వాజా గ్రామంలో సౌరశక్తి సహకార సొసైటీ ఏర్పాటుచేసిన సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించి.. ఈ దిశగా చొరవతీసుకున్న 11 మంది రైతులను అభినందించారు. అముల్ సంస్థ రూ.533 కోట్లతో ఏర్పాటుచేసిన చాక్లెట్ ప్లాంట్‌ను రిమోట్ కంట్రోల్‌తో ప్రధాని ప్రారంభించారు. ఆనంద్ వర్సిటీలో రూ.8కోట్లతో ఏర్పాటుచేసిన ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను, రూ.20కోట్లతో నిర్వహించనున్న విద్య డెయిరీ ఐస్ క్రీమ్ ప్లాంట్‌ల ప్రారంభించారు.
అనంతరం కచ్ జిల్లా అంజార్‌లో రూ. 6,216కోట్లతో నిర్మించిన పాలన్‌పూర్–పాలీ–బార్మర్ గ్యాస్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. దేశానికే పేరుతెచ్చిన గాంధీ, పటేల్, అంబేడ్కర్ వంటి మహనీయుల త్యాగాలను తక్కువచేసి చూడటాన్ని మానుకోవాలని కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ‘నన్ను 24 గంటలు విమర్శిస్తూనే ఉన్నారు. ఇబ్బందేం లేదు. కానీ మహనీయులపై నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయొద్దు’ అని సూచించారు. సరోవర్ డ్యాం సమీపంలో ఏర్పాటుచేయనున్న పటేల్ విగ్రహంపై రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ ఈ విమర్శలు చేశారు.
‘గ్రీన్ అవార్డు’కు మహాత్ముడే అర్హుడు
అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ మహాత్ముడిని స్మరించుకున్నారు. మన్‌కీ బాత్‌లో.. గుజరాత్‌లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా దేశానికి మార్గదర్శనం చేస్తున్న గాంధీ ఆలోచనలను ప్రధాని ప్రస్తావించారు. గాంధీ జీవితంలో పారిశుద్ధ్యం అత్యంత ముఖ్యమైన భాగమని ప్రధాని గుర్తుచేశారు. ఐక్యరాజ్యసమితి ‘చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్’ (గ్రీన్) అవార్డుకు జాతిపితే అసలైన అర్హుడని పేర్కొన్నారు.
అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటుచేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌లు సంయుక్తంగా ఐరాస గ్రీన్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. రాజ్‌కోట్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. ‘చాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు అందుకునేందుకు మహాత్మాగాంధీయే సరైన వ్యక్తి. పారిశుద్ధ్యమా? స్వాతంత్య్రమా అనే ప్రశ్న ఎదురైతే.. ముందు పారిశుద్ధ్యానికే మొగ్గుచూపారాయన’ అని అన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 15నుంచి ప్రారంభం కానున్న ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment