పెషావర్: ఉగ్రవాదంపై పాకిస్తాన్ అలసత్వాన్ని వీడని పక్షంలో తామే ఆ ఉగ్రస్థావరాలను నిర్వీర్యం చేస్తామని ప్రకటించిన అమెరికా.. ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. బుధవారం అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్ మిసైల్ దాడులతో హక్కానీ నెట్‌వర్క్ కీలక కమాండర్ ఎహసాన్ అలియాస్ ఖవారీని మట్టుబెట్టింది. ఉత్తర వజీరిస్తాన్ (పాకిస్తాన్)లోని గిరిజన ప్రాంతం (అఫ్గాన్ శరణార్థులుండే ప్రాంతం)లోని ఓ ఇంట్లో ఖవారీ ఉన్నాడన్న పక్కా సమాచారంతో.. ఆ ఇంటిపై అమెరికా గూఢచార విమానాలు రెండు డ్రోన్ మిసైల్స్‌ను ప్రయోగించాయి. ఈ దాడిలో ఖవారీ సహా అతని ఇద్దరు అనుచరులు హతమయ్యారు. కాగా, అమెరికా డ్రోన్ దాడులు ‘ఏకపక్షం’ అని పాకిస్తాన్ మండిపడింది. సంకీర్ణ ధర్మాన్ని మరచి తమ భూభాగంలో తమకు సమాచారం లేకుండా ఇలాంటి దాడులకు దిగటం సరికాదని నిరసన తెలిపింది.
‘ఇలాంటి ఏకపక్ష దాడులు ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న అమెరికా, పాకిస్తాన్ దేశాల సహకార స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయి. అఫ్గనిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రస్థావరాలపై అమెరికా మిలటరీ తరచుగా దాడులు జరుపుతోంది. కానీ ఈసారి మా భూభాగంలో.. మాకు సమాచారం ఇవ్వకుండానే దాడి జరిపారు’ అని పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపైనా డ్రోన్ దాడులు పెరిగాయి. అయితే.. తన భూభాగంలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయటంలో పాక్ విఫలమైందంటూ కొంతకాలంగా ట్రంప్ విమర్శిస్తున్నారు. హక్కానీ నెట్‌వర్క్ లక్ష్యంగా అమెరికా డ్రోన్ దాడులు చేయటం ఈ వారం రోజుల్లో ఇది రెండోసారి.
Comments
Please login to add a commentAdd a comment