సాక్షి, హైదరాబాద్: నిర్వహణ లోపాలతో ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన రెండు పడక గదుల ఇళ్ల విషయంలో కొత్త సమస్య తలెత్తింది. ప్రాజెక్టు యూనిట్ కాస్ట్‌ను భారీగా పెంచాలని కాంట్రాక్టర్లు గృహనిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు. ఒక్కో ఇంటిపై రూ.లక్ష చొప్పున యూనిట్ కాస్ట్‌ను సవరించాలని, లేని పక్షంలో పనులు కొనసాగించలేమని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇప్పుడు అధికారులు ఇదే విషయాన్ని కొత్త ప్రభుత్వం ముందు ప్రతిపాదించనున్నారు.
అసలే ఖజానాకు తీవ్ర భారంగా మారిన ఈ ప్రాజెక్టును గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టి గృహలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పనులు ప్రారంభించిన ఇళ్లను మాత్రం పూర్తి చేసి, టెండర్లు పిలవాల్సిన వాటిని ప్రారంభించకపోవటమే మంచిదన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఇప్పుడు కాంట్రాక్టర్ల కొత్త డిమాండ్‌తో, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయటం కొత్త సవాల్‌గా మారబోతోంది.
ఎందుకు పెంచుతున్నారంటే..
ఇల్లు లేని పేదలకు ఏకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఉచితంగా అందించాలని అప్పట్లో బీఆర్‌ఎస్ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కావటంతో ఒక్కో ఇంటికి ప్రాంతాల వారీగా రూ.5.10 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ, ఆ మొత్తం కూడా సరిపోదని, యూనిట్ కాస్ట్‌ను పెంచాలని పథకాన్ని ప్రారంభించిన కొత్తలోనే కాంట్రాక్టర్లు కోరారు. దీంతో చాలా ప్రాంతాల్లో టెండర్లకు స్పందన కూడా లేకుండా పోయింది.
కాంట్రాక్టర్లతో పలువురు మంత్రులు స్వయంగా భేటీ అవుతూ, ఇతర ప్రాజెక్టుల్లో పనులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొనటంతో కొన్ని ప్రాంతాల్లో టెండర్లకు స్పందన వచ్చింది. ఆ క్రమంలో పనులు మొదలైనా, ఆ యూనిట్ కాస్ట్‌తో ప్రాజెక్టులు పూర్తి చేయటం కష్టమంటూ చాలా మంది పనులను నెమ్మదిగా చేస్తూ వచ్చారు. తాజాగా ఇప్పుడు యూనిట్ కాస్ట్‌ను పెంచకుంటే పనులు చేయలేమని, ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని, రూ.లక్ష మేర పెంచాలంటూ ఇటీవల వారు ప్రతిపాదించినట్టు తెలిసింది.
ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.4500 కోట్లు అవసరం
రాష్ట్రవ్యాప్తంగా 2.93 లక్షల ఇళ్లను నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇవ్వగా, 2.29 లక్షల ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. వీటిల్లో ఇప్పటి వరకు 1.55 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా 74 వేల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. వీటిల్లో 45 వేలు తుది దశలో ఉన్నాయి. వీటిని కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో యూనిట్ కాస్ట్ పెంచాల్సిందే. ఈ మేరకు ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.4500 కోట్లు అవసరం. కాగా, లబ్ధిదారుల జాబితా రూపొందించకుండానే పనులు జరుపుతున్న తీరును తప్పుపడుతూ కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాసయోజన నిధులు ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో నిధుల కోసం తీవ్ర ఇబ్బందులు ఉన్న తరుణంలో, అదనంగా భారం పడటం పథకానికి శరాఘాతంగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment