ఆదిలాబాద్ శివారు మావలలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు
సాక్షి, ఆదిలాబాద్ : పేదలకు డబుల్ బెడ్‌రూం ఆశ చూపిన ప్రభుత్వం ఇప్పటి వరకైతే జిల్లాలో నమూనా మాత్రం చూపించింది. ఈ పథకం ప్రారంభమైన రెండేళ్లలో ఇప్పటివరకు జిల్లాలో ఒకే ఒక ఇంటి నిర్మాణం పూర్తయింది. మొదటి దశలో మంజూరైన లక్ష్యంలో ఇప్పటివరకు సగం ఇళ్ల నిర్మాణం ప్రారంభానికి నోచుకోలేదంటే చోద్యమే. ఇక రెండో దశ కింద భారీగా 2బీహెచ్‌కేలు మంజూరైనా వాటికి ఇప్పటికీ అతీగతి లేదు. టెండర్ దశకు కూడా నోచుకోకపోవడంతో ఇక ఆ దశ ఇళ్ల నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలోనే డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణం ఆశాజనకంగా ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో నిర్మాణం పరంగా 18వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణానికి నిధుల కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మొదటి దశకే మోక్షం లేదు..
జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలకు సంబంధించి మొదటి దశకే ఇంకా పూర్తి స్థాయిలో మోక్షం లభించలేదు. 2015–16లో జిల్లాకు లక్ష్యం కేటాయించినప్పటికీ వాటి ప్రారంభానికి ఆలస్యమైంది. యూనిట్ వ్యయం కింద అర్బన్ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ హాల్, కిచెన్ నిర్మించాలి. మొదటి దశలో యూనిట్ వ్యయంతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి కింద ఒక్కో 2బీహెచ్‌కేకు అదనంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో రూ.75 వేలు కేటాయించారు. ఈ నిధులతో డబుల్ బెడ్‌రూమ్ నిర్మాణం చేపట్టలేమని మొదట్లో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో వీటి ప్రారంభానికి ఆటంకాలు ఎదురయ్యాయి.
పలుమార్లు టెండర్లు జరిగినా కాంట్రాక్టర్లు ఈ నిర్మాణంలో భారం పడుతుందని విముఖత చూపారు. ఐరన్, సిమెంట్, ఇసుక ధరలు అధికంగా ఉండడంతో ఈ నిర్మాణం చేపట్టలేమని ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యానికి జాప్యం జరిగింది. ఆ తర్వాత సిమెంట్ సబ్సిడీపై అందజేస్తామని, ఇసుక విషయంలో స్థానిక రీచ్‌ల నుంచి తెచ్చుకునే విషయంలో ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరించడం, సీనరేజ్ చార్జీల మినహాయింపు ఇవ్వడంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. ఆలా మొదటి దశకు అంకురార్పణ జరిగినప్పటికీ మధ్య మధ్యలో అనేక సమస్యలను ఎదుర్కొంది. పలు చోట్ల స్థలం ఎంపికలో ఆలస్యం జరగగా, కొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలే లేకపోవడం సమస్యకు కారణమైంది. ఆ తర్వాత ఆయా శాఖలు సిమెంట్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నప్పటికీ మధ్యలో సిమెంట్ పంపిణీలో జాప్యం జరగడం వంటి సంఘటనలు కూడా నిర్మాణం ఆలస్యానికి కారణమయ్యాయి. తాజాగా జీఎస్టీ విషయంలోనూ కాంట్రాక్టర్లలో అయోమయం ఉంది. మినహాయింపును ఇస్తేనే ఈ నిర్మాణాలు సాధ్యమని చెబుతున్నారు. ప్రస్తుతం అన్ని సమస్యలను అధిగమించి నిధులు పుష్కలంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికైనా ఇళ్ల నిర్మాణం వేగిరంగా జరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే..
అర్బన్‌లో జీ+1..
రోడ్డు భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) అర్బన్ ప్రాంతాల్లో, పంచాయతీ రాజ్ శాఖ గ్రామీణ ప్రాంతాల్లో, ఏజేన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తోంది. 2బీహెచ్‌కే జిల్లా నోడల్ అధికారిగా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సి.బసవేశ్వర్ వ్యవహరిస్తున్నారు. నోడల్ అధికారి కేవలం పరిపాలనమైన వ్యవహారాల్లోనే అనుసంధాన కర్తగా వ్యవహరిస్తారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాల బాధ్యతను సంబంధిత శాఖలపైనే ఉంటుంది. జిల్లా కలెక్టర్ పరిశీలనలో ఇవన్నీ కొనసాగుతాయి. కాగా డబుల్ బెడ్ రూమ్‌లకు సంబంధించి మొదటి దశలో ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభమైన ఇళ్లలో అర్బన్ ప్రాంతాల్లో నిర్మిస్తున్నవి జీ+1 నమూనాలో చేపట్టారు. కొన్ని చోట్ల జీ+2 నమూనాలను కూడా నిర్మిస్తున్నారు. ఆదిలాబాద్ శివారు మావలలో జీ+2 నమూనాలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మావలలో సుమారు 250 పై చిలుకు డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణాలు చేపట్టారు. ఇక రెండో దశ కింద రెండు నెలల కింద 2016–17కు సంబంధించి భారీగా డబుల్ బీహెచ్‌కే ఇళ్లు మంజూరు అయ్యాయి. వాటికి ప్రధానంగా స్థలభావం సమస్యగా మారింది. రెండో దశతోపాటు మొదటి దశలో ఇంకా ప్రారంభానికి నోచుకోని ఇళ్ల విషయంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ జీ+1 నమూనాలను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. తద్వారా స్థల సమస్య తీరుతుందని చెబుతున్నారు.
జూన్‌లోగా పూర్తి చేయాలి..
మొదటి దశలో నిర్మాణం ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జూన్‌లోగా పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు కలెక్టర్ ఆదేశించారు. మొదటి దశలో ఇంకా ప్రారంభం కాని ఇళ్ల నిర్మాణాలను త్వరలో ప్రారంభిస్తాం. నిధులు పుష్కలంగా ఉన్నాయి. సిమెంటుకు సంబంధించి ఇటీవలే పూర్తి స్థాయిలో పేమెంట్ చేశాం. లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. రెవెన్యూ అధికారులు ఎంపిక చేస్తారు. కలెక్టర్ ఆమోదంతోనే లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు అవుతాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో జీఎస్టీ భారం పడుతుందని కాంట్రాక్టర్లు అనవసరంగా అయోమయం చెందుతున్నారు. జీఎస్టీకి సంబంధించి పూర్తి బిల్లులు అందజేసిన పక్షంలో ప్రభుత్వం ఆ వ్యయాన్ని తిరిగి ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తుంది. – సి.బసవేశ్వర్, జిల్లా నోడల్ అధికారి, గృహ నిర్మాణ శాఖ పీడీ
Comments
Please login to add a commentAdd a comment