కాంట్రాక్టర్లకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని నిర్మాణ రంగ కంపెనీలకు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. తక్కువ ధరకే సిమెంట్ విక్రయించేందుకు సిమెంట్ కంపెనీలు సైతం ముందుకు వచ్చాయని, ఇసుక సైతం ఉచితం గా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఈ కార్యక్రమానికి హడ్కో నిధులు మంజూరయ్యాయని, బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు ఉండవన్నారు. నగర శివారులో 600 ఎకరాలను ఇళ్ల నిర్మాణం కోసం గుర్తించామన్నారు. ఒకేచోట భారీ సంఖ్యలో ఇళ్లను నిర్మించే ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఇతర పట్టణాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై పురపాలక శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో బుధవారం ఇక్కడ మంత్రి సమావే శమయ్యారు. దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామన్నారు.
వచ్చే రెండేళ్లలో స్కైవేలు
నగరంలో మౌలిక సదుపాయాల వృద్ధికి అనేక ప్రణాళి కలు రూపొందించామని, వచ్చే రెండేళ్లలోనే స్కైవేలు పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇళ్ల నిర్మాణం కోసం పిలిచిన టెండర్ల గడువును మరో 5 రోజులు పొడిగించాలని కాంట్రాక్టర్లు కోరగా, గడువు పొడిగింపునకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
‘డబుల్’లో భాగస్వాములు కండి!
Published Thu, Mar 2 2017 4:51 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement