సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా నిలుస్తోంది. ఎంత పరిగెత్తిద్దామని ప్రయత్నిస్తున్నా కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగటం లేదు. ఈ ఏడాది చివరికి వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. యూనిట్ కాస్ట్–ఇళ్ల నమూనాలకు మధ్య ఏమాత్రం పొంతన కుదరకపోవడంతో నిర్మాణ సంస్థలు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపటం లేదు. ఇతర పథకాల్లో పనులు అప్పగించేందుకు ప్రాధాన్యమిస్తామంటూ కొందరు మంత్రులు నిర్మాణదారులకు అనధికార హామీలిస్తుండటం, అనుకున్నట్టుగా పనులు లభిస్తుం డటంతో కొన్ని నియోజకవర్గాల్లో కాస్త వేగం కనిపిస్తోంది.
మిగతా చోట్ల ఎంత ప్రయత్నించినా తీరు మారటం లేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తవు తున్నా, ఈ కీలక ప్రాజెక్టులో వేగం లేకపోవటం ఇప్పుడు ఆ పార్టీకే పెద్ద ఇబ్బందిగా మారింది. ఎన్నికలకు సన్న ద్ధమవుతున్న తరుణంలో ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు ఈ పథకంపై ప్రశ్నల వర్షం ఎదురవుతుండటంతో ప్రభుత్వం పథకంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల మంత్రి కె.తారక రామారావు రంగంలోకి దిగి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి స్టీలు తయారీదారులతో సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు. సామాజిక బాధ్యతగా భావించి ఈ పథకానికి తక్కువ ధరకే స్టీల్‌ను సరఫరా చేయాలని కోరారు. రెండుసార్లు జరిగిన సమావేశాల అనంతరం కంపెనీలు మార్కెట్ ధర కంటే మెట్రిక్ టన్నుపై రూ.9 వేలు తక్కువ ధరకు స్టీల్‌ను సరఫరా చేసేందుకు అంగీకరించాయి. దీంతో పనుల్లో కాస్త వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
జూన్ నాటికి పూర్తయ్యేనా?
రాష్ట్రవ్యాప్తంగా 2.38 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు అతి కష్టమ్మీద 8 వేల ఇళ్లను మాత్రం పూర్తి చేయగలిగారు. పరిపాలన అనుమతులు జారీ చేసిన మొత్తం ఇళ్లను సిద్ధం చేయటమంటే జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో కనీసం 60 వేల ఇళ్లను సిద్ధం చేసి డబుల్ బెడ్రూం పథకం వేగం పుంజుకుందని చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జూన్ నాటికి 60 వేల ఇళ్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు లక్ష్యం విధించింది. దీంతో గతంలో టెండర్లకు స్పందన లేని ఇళ్లకు తాజాగా కొత్త టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. కొన్నింటికి నాలుగైదు సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ పాల్గొనకపోవటంతో అవి రద్దయ్యాయి. మరోవైపు ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని గుర్తించి అధికారులు ముందు జాగ్రత్త చర్యగా లబ్ధిదారుల ఎంపికలో వ్యూహాత్మకంగా ఆలస్యం చేస్తున్నారు. ఎంపికలు పూర్తయితే ఇళ్ల కోసం ఒత్తిడి పెరుగుతుందన్న ఉద్దేశంతో పెండింగులో పెడుతూ వస్తున్నారు. ఇప్పటికీ 17 జిల్లాల్లో ఒక్కరంటే ఒక్క లబ్ధిదారుడిని కూడా గుర్తించకపోవటమే ఇందుకు నిదర్శనం. మిగతా జిల్లాల్లో 12,758 మందిని మాత్రమే గుర్తించారు.
సిద్దిపేట ముందు..
పనుల్లో ప్రస్తుతానికి సిద్దిపేట జిల్లా ముందుంది. ఇక్కడ 10,900 ఇళ్లకు టెండర్లు ఖరారు కాగా 10,600 ఇళ్ల నిర్మాణం మొదలైంది. 2 వేల ఇళ్లు సిద్ధమయ్యాయి. యూనిట్ కాస్ట్ ఎక్కువగా ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లకుగాను 92 వేల ఇళ్ల నిర్మాణం మొదలైంది. మహబూబ్‌నగర్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, వరంగల్ అర్బన్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కాస్త కదలిక కనిపిస్తోంది. జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూలు, వనపర్తి, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీమ్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్ రూరల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్తబ్ధత నెలకొంది.
‘డబుల్’.. అదే ట్రబుల్..!
Published Mon, Feb 26 2018 2:59 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment