సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పరిరక్షణ వేదిక (మహాకూటమి)లో తమకు కేటాయించే స్థానాలపై 48 గంటల్లోగా స్పష్టతను ఇవ్వాలంటూ తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత ఎం.కోదండరాం అల్టిమేటం జారీ చేశారు. పొత్తుల్లో పార్టీలకు కేటాయించే సీట్లు తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేయడంపై కోదండరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీజేఎస్‌తోపాటు టీటీడీపీ, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీలకు సీట్లను కేటాయించకుండా కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారాన్ని ఎలా ప్రారంభిస్తుందని కోదండరాం ప్రశ్నించారు. తమకు కేటాయించే సీట్లపై 48 గంటల్లోగా (గురువారం సాయంత్రం) స్పష్టతను ఇవ్వాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అల్టిమేటం ఇచ్చారు. పొత్తుల్లో భాగంగా టీజేఎస్ 19 సీట్లలో పోటీచేయాలని నిర్ణయించిందని చెప్పారు. తాము కోరుకుంటున్న 19 స్థానాలపై ఎల్లుండిలోగా స్పష్టత ఇవ్వకుంటే 21 మందితో టీజేఎస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తామని కోదండరాం మంగళవారం హెచ్చరించారు.
కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ పొత్తుల విషయంలో నాన్చివేత ధోరణిని అవలంభిస్తూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం సాగించడం వల్ల ఇబ్బందులు వస్తాయని కోదండరాం అభిప్రాయపడ్డారు. వెంటనే పొత్తుల అంశాన్ని పూర్తిచేయాలని కోరారు. తాము చెప్పినట్టుగా 48 గంటల్లో 21 మందితో టీజేఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఆ తరువాత మరో 25 మందితో రెండో జాబితాను ప్రకటిస్తామని కోదండరాం స్పష్టం చేశారు.
కోదండరాంతో రమణ భేటీ..
కోదండరాంతో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మంగళవారం భేటీ అయ్యారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలోనే వీరు సమావేశమయ్యారు. పొత్తుల్లో కోరుతున్న స్థానాలు, కాంగ్రెస్ వైఖరి, లాభనష్టాలు, అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపై వీరిద్దరూ చర్చించారు. పొత్తుల్లో సీట్ల సంఖ్య, అభ్యర్థులను వీలైనంత త్వరలో పూర్తిచేయడానికి కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. పొత్తుల్లో సీట్లు, అభ్యర్థులను తేల్చకపోతే జరిగే నష్టాన్ని నివారించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment