మీడియాతో మాట్లాడుతున్న మహాకూటమి నేతలు(పాత చిత్రం)
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల చివరి రోజున మహాకూటమిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అనుకున్నదానికన్నా మరో ఐదు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ 94, టీడీపీ 14, తెలంగాణ జన సమితి 8, సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ అదనంగా మరో ఐదుగురు అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేసీ.. టీడీపీ, టీజేఎస్‌లకు షాక్ ఇచ్చింది. టీడీపీకి కేటాయించిన 2 స్థానాల్లో, టీజేఎస్‌కు కేటాయించిన 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. పఠాన్‌చెరులో శ్రీనివాస్ గౌడ్, దుబ్బాకలో నాగేశ్వర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డి రంగారెడ్డి, వరంగల్ తూర్పులో గాయత్రి రవి, మిర్యాలగూడలో ఆర్ కృష్ణయ్యలను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది.
కూటమి పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం సీటును సామ రంగారెడ్డికి కేటాయించిన టీడీపీ.. పఠాన్‌చెరు నుంచి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. టీజేఎస్‌కు కేటాయించిన మిర్యాలగూడ, వరంగల్ తూర్పు, దుబ్బాక స్థానాల నుంచి ఆ పార్టీ విద్యాధర్‌రెడ్డి, ఇన్నయ్య, చిందం రాజ్‌కుమార్‌లకు బీ ఫామ్‌లు అందజేసింది. అయితే ఈ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలపడంపై టీడీపీ, టీజేఎస్‌లు ఎలా స్పందిస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
మహబూబ్‌నగర్‌లో అభ్యర్థిని నిలిపిన టీజేఎస్
కూటమి పొత్తులో భాగంగా మహబూబ్‌నగర్‌ను సొంతం చేసుకున్న టీడీపీ ఆ స్థానం నుంచి ఎర్రశేఖర్‌ను బరిలో నిలిపింది. అయితే మిత్రపక్షమైన టీజేఎస్ కూడా ఆ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. మహబూబ్‌నగర్ స్థానానికిగానూ రాజేందర్‌రెడ్డికి టీజేఎస్ బీ ఫామ్ అందజేసింది. దీంతో టీజేఎస్ మొత్తంగా తొమ్మిది స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలిపినట్టయింది.
Comments
Please login to add a commentAdd a comment