కలెక్టర్‌ వేధింపులు ఆపకపోతే ఉద్యమం | COLLECTOR HARASSMENT NOT STOP.. AGITATION | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ వేధింపులు ఆపకపోతే ఉద్యమం

Published Wed, Mar 8 2017 12:43 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

కలెక్టర్‌ వేధింపులు ఆపకపోతే ఉద్యమం

కలెక్టర్‌ వేధింపులు ఆపకపోతే ఉద్యమం

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : దళిత నాయకుడు, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎల్‌వీ సాగర్‌పై కలెక్టర్‌ వేధింపులు ఆపకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని వివిధ దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. మంగళవారం స్థానిక రెవెన్యూ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలపాల రవి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, కొంత కాలంగా దళిత ఉద్యోగులే లక్ష్యంగా అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉండగా ఉద్యోగులను బదిలీ చేయకూడదనే నిబంధన కలెక్టర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. దళిత ఉద్యోగులను అవినీతిపరులుగా చూపించడానికి కలెక్టర్‌ చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని హితవు పలికారు. కలెక్టర్‌ భాస్కర్‌ దళిత ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని మొండెం సంతోష్‌ కుమార్, మున్నుల జాన్‌గురునా«థ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ బదిలీ అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దళిత నాయకులు పులవర్తి కొండబాబు, ఎం.ఆనందరావు, పలివెల చంటి, కందుల రమేష్, దాసరి నాగేంద్రకుమార్, మేతర అజయ్, అంతర్వేది కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
 
సాగర్‌ వేధిస్తున్నారు.. రేషన్‌ డీలర్ల ఆరోపణ
 ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దార్‌ ఎల్‌వీ సాగర్‌ వేధిస్తున్నారని పలువురు రేషన్‌ డీలర్లు ఆరోపించారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్‌ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్, రేషన్‌ డీలర్‌ రాయి విమలాదేవి మాట్లాడుతూ తాను ప్రజాప్రతినిధినైనా ఏకవచనంతో సంబోధిస్తూ మహిళనని కూడా చూడకుండా సాగర్‌ కించపరుస్తున్నారని ఆరోపించారు. గతంలో ప్రొటోకాల్‌ నిమిత్తం తమ అసోసియేషన్‌ నాయకుడు గంగాధర్‌ నెలకి రూ.500 చొప్పున వసూలు చేసేవారని, సాగర్‌ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఈ మొత్తాన్ని రూ.1,600కు పెంచారని, భరించలేమని చెబితే దానిని రూ.1,000కి తగ్గించారన్నారు. విషయాన్ని గంగాధర్‌కు చెబితే అతను కూడా సాగర్‌కు అనుకూలంగా మారి తమను వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వారిలో బినామీ డీలర్లు ఎవరూ లేరని, అందరూ కుటుంబసభ్యులు మాత్రమే దుకాణాలను నిర్వహిస్తున్నామన్నారు. మారిన పరిస్థితుల్లో ఒక్కో డీలర్‌ పరిధిలో సుమారు 300కు మించి కార్డులు లేవని, అయితే గంగాధర్‌కు 800 కార్డులున్నాయన్నారు. గంగాధర్‌కు మూడు బినామీ దుకాణాలు ఉన్నాయని ఆరోపించారు. అటువంటి వ్యక్తి తమ కష్టాలపై పోరాడాల్సింది పోయి ఫిర్యాదు చేసిన వారు బినామీ డీలర్లని ప్రచారం చేయడం తగదన్నారు. విలేకరుల సమావేశంలో రేషన్‌ డీలర్లు దాసరి ఆంజనేయులు, ఈపిచర్ల కాశి, మాదాల రాజశేఖర్, పీవీ రమణ, ఎం.శారద, డి.గంగ, సీహెచ్‌ రమేష్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement