
బాకు: దేశరాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని వాయు కాలుష్యం ఇక్కడి ప్రజలను ఇబ్బందుల పాలు చేయడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు కూడా దారితీసింది. అజర్‌బైజాన్ రాజధాని బాకులో పర్యావరణంపై జరిగిన కాప్-29 శిఖరాగ్ర సదస్సులో ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరిగింది.
కాప్-29 సదస్సులో పాల్గొన్న నిపుణులు వాయు కాలుష్యంతో వచ్చే అనారోగ్య సమస్యల గురించి హెచ్చరించారు. క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ ఆర్తీ ఖోస్లా మాట్లాడుతూ ఢిల్లీలోని ఏక్యూఐ ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని, కొన్ని ప్రాంతాల్లో క్యూబిక్ మీటర్‌కు 1,000 మైక్రోగ్రాముల కంటే అధికస్థాయి కాలుష్యం నమోదవుతున్నదన్నారు. బ్లాక్ కార్బన్, ఓజోన్, శిలాజ ఇంధనాల దహనం, ఫీల్డ్ మంటలు వంటి అనేక కారణాలతో కాలుష్యం ఏర్పడుతున్నదని తెలిపారు. వీటన్నింటిని ఎదుర్కొనే పరిష్కార మార్గాలను తక్షణం అమలు చేయాల్సివున్నదన్నారు.
ఢిల్లీలోని గాలి అత్యంత విషపూరితంగా మారిందని, అక్కడి ప్రజలు ప్రతిరోజూ 49 సిగరెట్లకు సమానమైన పొగను పీలుస్తున్నారన్నాని ఖోస్లా పేర్కొన్నారు. తక్కువ గాలి వేగం గాలిలో కాలుష్య కారకాలను బంధిస్తుందని, ఇటువంటి పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు.
గ్లోబల్ క్లైమేట్ అండ్ హెల్త్ అలయన్స్ వైస్ ప్రెసిడెంట్ కోర్ట్నీ హోవార్డ్ కెనడాలో జరిగిన ఉదంతాన్ని ఉదహరిస్తూ 2023లో అడవిలో కార్చిచ్చు కారణంగా, వాయు కాలుష్యం ఏర్పడి 70 శాతం జనాభా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వచ్చిందని అన్నారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు పేద దేశాలకు సంపన్న దేశాలు ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రీత్ మంగోలియా సహ వ్యవస్థాపకుడు ఎంఖున్ బైయాంబాడోర్జ్ తమ దేశంలోని తీవ్రమైన వాయు కాలుష్య సమస్యను గురించి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలతో పోలిస్తే నగరాల్లో నివసించే పిల్లల ఊపిరితిత్తుల సామర్థ్యం 40 శాతం తక్కువగా ఉందన్నారు.
ఇది కూడా చదవండి: తాజ్ మహల్ మాయం.. పొద్దున్నే షాకింగ్ దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment