DALIT ASSOCIATIONS
-
చంద్రబాబు ఎప్పటికీ దళిత ద్రోహే
తిరుపతి ఎడ్యుకేషన్/అలిపిరి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పటికీ దళిత వ్యతిరేకేనని, అది ఎన్నటికీ మారదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన దళితుల ఆత్మీయ సదస్సుకు ఆయన విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని, మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరిగినా, దళిత మహిళను వివస్త్రను చేసినా చంద్రబాబు నోరు మెదపలేదన్నారు. పైగా దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా... అంటూ దళితులను అవమానించేలా మాట్లాడిన ఘనత చంద్రబాబుదేనన్నారు. దళితులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషిని ఓర్వలేక బురదజల్లే కార్యక్రమానికి తెరతీశారంటూ విమర్శించారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా దళితులకు సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక సీఎం జగన్ అపి అన్నారు. సబ్ ప్లాన్ కంటే అధికంగా దళితులకు ఖర్చు చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని స్పష్టం చేశారు. రాష్ట్ర అటవీ, భూగర్భ గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తూ రాష్ట్రంలో అసమానత్వాన్ని తొలగించి సమానత్వం కోసం కృషి చేస్తున్న నాయకుడు సీఎం జగన్ అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 98.44శాతం ఎన్నికల హామీలను అమలుచేసిన ఘనత జగన్‌దేనన్నారు. అంబేడ్కర్ ఆశయాలను ఔపోసనం చేసుకుని వాటిని చక్కగా అమలుచేస్తున్న జగన్‌కు దళితులందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రి ఆర్కే రోజా, ఎంపీలు డాక్టర్ గురుమూర్తి, రెడ్డప్ప, తిరుపతి, సత్యవేడు, గూడూరు, పలమనేరు ఎమ్మేల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆదిమూలం, వరప్రసాద్, వెంకటె గౌడ, తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రాంతాల్లో సభపెట్టి మూడు రాజధానులు వద్దని చెప్పగలవా? చంద్రబాబు ఉత్తరాంధ్ర, తిరుపతిలో బహిరంగ సమావేశాలు పెట్టి మూడు రాజధానులు వద్దని మాట్లాడగలడా... అని మంత్రి మేరుగు నాగార్జున సవాల్ విసిరారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కుమారుడి స్నేహితులే పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని విమర్శించారు. ‘నీ వాళ్ల చేతితోనే నేడు రాళ్లు వేయించుకున్నావు.. భవిష్యత్‌లో ప్రజలే నీపై రాళ్లు వేస్తారు’ అంటూ చంద్రబాబుపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటం గ్రామంలో అభివృద్ధి పనులు చేయడంతోపాటు రోడ్డు విస్తరణ చేస్తుంటే అవగాహన లేకుండా జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
దేశ రాజధానిలో దళితుల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో రవిదాస్ మందిర్ కూల్చివేతకు నిరసనగా వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన దళితులు బుధవారం భారీ నిరసన చేపట్టారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 10న ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) అధికారులు రవిదాస్ మందిర్‌ను కూలగొట్టారు. నీలం రంగు టోపీలు ధరించి జెండాలు చేబూనిన దళితులు పెద్దసంఖ్యలో అంబేద్కర్ భవన్ నుంచి రాంలీలా మైదాన్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. పంజాబ్, రాజస్ధాన్, హర్యానా, యూపీ సహా పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన దళితులు ఆలయ కూల్చివేతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మందిర్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం తమకు స్థలం కేటాయించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పలు రాజకీయ పార్టీలు ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చాయి. రవిదాస్ మందిర్‌ను ప్రస్తుతమున్న తుగ్లకాబాద్ అటవీ ప్రాంతంలో నిర్మించాలని లేనిపక్షంలో ప్రత్యామ్నాయంగా వేరొక ప్రాంతంలో నిర్మించాలని దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. మరోవైపు దళితుల నిరసన కార్యక్రమంలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, ఢిల్లీ సామాజిక న్యాయశాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతం పలువురు మత పెద్దతలు పాల్గొన్నారు. -
దళితులకు సీఎం జగన్ పెద్దపీట
సాక్షి, పెదవేగి రూరల్: దేశం అంతా రాష్ట్రం వైపు తొంగి చూసే విధంగా దళితులకు సీఎం పెద్ద పీట వేశారని వైసీపీ నియోజకవర్గ ఎస్సీసెల్ ఇన్చార్జ్ మెండెం ఆనంద్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లో దళితజాతి ముద్దుబిడ్డ, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం దుగ్గిరాల తన నివాసంలో గ్రామ ఎస్సీసెల్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సరికొత్త రాజకీయ చరిత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక దృఢ సంకల్పంతో శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో చరిత్ర సృష్టించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విప్లవం సృష్టిస్తూ నవయుగానికి నాంది పలికారని, ఎస్సీలకు రాజకీయంగా అత్యున్నత గుర్తింపునిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం, అంతేకాకుండా ఏకంగా ఐదు మంత్రి పదవులను కేటాయించడం ద్వారా ఎస్సీ వర్గాలకు తాను ఎంతటి ప్రాధాన్యమిస్తున్నారో చేతల్లోనే చూపించారని తెలిపారు. సమావేశంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు దాసరి తంబి, పెదవర్తి చిన్న, పులవర్తి యాకోబు, సంజీవరావు, కొత్తపల్లి బాబి, తలారి దాసు, మెండెం జోసఫ్ పాల్గొన్నారు. -
మిర్యాలగూడలో ఆందోళనలు
నల్గొండ: ప్రేమ వివాహం చేసుకున్న దళిత యువకుడు హత్యకు గురికావడంతో దళిత సంఘాలు శనివారం మిర్యాలగూడ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. పట్టణంలోని వీధులలో దళిత సంఘాల నాయకులు శనివారం ఆందోళనలు నిర్వహించారు. హత్యకు కుట్ర పన్నిన మారుతీ రావు కఠినంగా శిక్షించాలని, ఆయన ఆస్తులను జప్తు చేసి బాధిత కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు మేల్కొని ఉద్యమించాలని కోరారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మారుతీరావు ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన నిందితుడు మారుతీ రావును హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కత్తితో హత్య చేసిన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం ప్రణయ్ మృతదేహానికి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
9న భారత్ బంద్
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు రూలింగ్‌కు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఈనెల 9న భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. సర్వోన్నత న్యాయస్ధానం మార్చి 20న ఇచ్చిన ఉత్తర్వులతో నీరుగార్చిన ఎస్సీ,ఎస్టీ చట్ట నిబంధనలను పునరుద్ధరించాలని అఖిల భారత అంబేడ్కర్ మహాసభ (ఏఐఏఎం) నేతృత్వంలో దళిత సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, దళితుల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేస్తూ భారత్ బంద్‌లో పాల్గొనరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో శాంతి, సామరస్యం, సోదరభావాలను కొనసాగించేలా సహకరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్టులను నిలువరిస్తూ నిర్ధిష్ట చర్యలను చేపట్టాలన్న సుప్రీం ఉత్తర్వులను పక్కనపెడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పటిష్టం చేసే బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ,ఎస్టీ బిల్లు, బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన క్రమంలో ఈ బిల్లులు చారిత్రాత్మకమైనవని మంత్రి పేర్కొన్నారు. దళితుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారిస్తే సహించం
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చాలని చూస్తే సహించబోమని దళిత సంఘాలు కేంద్రా న్ని హెచ్చరించాయి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాన్ని పటిష్టపరిచేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ, మాలమహానాడు జాతీయ సమన్వయకర్త అద్దంకి దయాకర్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...దళితుల హక్కులను కాలరాసే విధంగా సుప్రీంకోర్టు, కేంద్రం వ్యవహరించడం విచారకరమన్నారు. ఈ ప్రయత్నాలను తాము తిప్పి కొడతామని, ఆగస్టు 8న ఢిల్లీ వేదికగా తమ గళాన్ని కేంద్రానికి వినిపిస్తామన్నారు. రాంలీలా మైదానం లో దేశవ్యాప్తంగా ఉన్న 71 దళిత సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ర్యాలీకి తెలుగు రాష్ట్రాల నుంచి దళితులు తరలిరావాలని కోరారు. -
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నేడు ‘భారత్ బంద్’
న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగ రంగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు మంగళవారం ‘భారత్ బంద్’ను నిర్వహించనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాలను హోంశాఖ ఆదేశించింది. ఎక్కడైనా శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే ఆ ప్రాంతానికి చెందిన కలెక్టర్, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఇటీవల దళిత సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారి 12 మంది మరణించడం తెల్సిందే. సోషల్‌మీడియాల్లో కొన్ని సంస్థలు కుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చాయని హోంశాఖ ఉన్నతాధికారి చెప్పారు. -
అంబేడ్కర్ అంటే అపార గౌరవం
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు తమ ప్రభుత్వం ఇచ్చినంత గౌరవం మరే ప్రభుత్వం ఇవ్వలేదని ప్రధాని మోదీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దళిత సంఘాలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలోని వెస్ట్రన్కోర్టులో నూతన ఎంపీల వసతి కోసం నిర్మించిన అదనపు భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు తమ ప్రభుత్వం ఇచ్చినంత గౌరవం బహుశా మరే ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అంబేడ్కర్ పేరును వాడటం మానుకోవాలని హితవు పలికారు. అన్ని రాజకీయ పార్టీలు అంబేడ్కర్ చూపిన మార్గంలో ముందుకెళ్లాలని సూచించారు. అంబేడ్కర్ ఆదర్శాలైన సామరస్యం, ఐక్యత స్ఫూర్తితో పేదల సంక్షేమానికి తన ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వెస్ట్రన్కోర్టులో ఎంపీల కోసం అదనపు భవనాన్ని నిర్మించడంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పాత్రను మోదీ కొనియాడారు. ఎంపీలను మహాజన్ తల్లిలా చూసుకుంటారని కితాబిచ్చారు. ఢిల్లీలో ఎంపీలు ఫైవ్‌స్టార్ హోటళ్లలోనే ఉంటారని ఓ విమర్శ ఉందనీ, అయితే మాజీ ఎంపీలు తమకు కేటాయించిన భవనాలను ఖాళీ చేయకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందన్నారు. -
ముక్కు నేలకు రాయించాడు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: బీజేపీ మాజీ నాయకుడు భరత్‌రెడ్డి అకృత్యా లు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నా యి. మొరం అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారనే ఆగ్రహంతో దళిత యువకులు బచ్చల రాజేశ్వర్, కొండ్రా లక్ష్మణ్‌ను దూషిస్తూ నీటి కుంటలో ముంచిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా బాధితులతో ముక్కు నేలకు రాయించిన దృశ్యాలు వెలుగు లోకి వచ్చాయి. భరత్‌రెడ్డి ఈ ప్రాంతంలో సెటిల్మెంట్ల దందా నడుపుతున్నట్లు ఆరోప ణలున్నాయి. తాజాగా ఈ ప్రాంతంలో జరిగే మొరం అక్రమ తవ్వకాలకు, ఇసుక దందా వంటి వాటికి అండగా నిలుస్తాడనే విమర్శలూ ఉన్నాయి. భరత్‌కు రాజకీయ నేతల అండ దండలతో అకృత్యాలకు అడిగే నాథుడే లేకుండా పోయారు. భరత్‌రెడ్డి ఆగడాలపై ఆదివారం దళిత, విద్యార్థి, ప్రజాసంఘాలు నవీపేట్, అభంగపట్నం గ్రామాల్లో భారీ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించాయి. వివిధ వర్శిటీల నుంచి విద్యార్థి సంఘాలు ఈ ఆందోళన కార్యక్రమానికి తరలివచ్చి మద్దతు తెలిపాయి. భరత్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి. టీఆర్ఎస్ నేత కారులోనే కిడ్నాప్.. బాధితులను కుంటలో ముంచిన వీడియా ఈనెల 11న వైరల్ కావడంతో అప్రమత్తమైన భరత్‌రెడ్డి బాధితులను ఈనెల 12న కిడ్నాప్ చేశాడు. ఈ మేరకు బాధితుల కుటుంబసభ్యు లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భరత్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు కూడా నమోదు చేసిన విషయం విదితమే. కాగా, బాధితులను కిడ్నాప్ చేసింది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కారులోనే కావడం గమనార్హం. నవీపేట్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌కు చెందిన వాహనంలోనే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. చైర్మన్ కారును భరత్‌రెడ్డి హైదరాబాద్‌లో వదిలి వెళ్లడంతో దానిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నరేశ్ ‘సాక్షి’కి చెప్పారు. కాగా, పరారీలో ఉన్న భరత్‌రెడ్డి కోసం రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ పోలీసులు సైతం వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్, మహారాష్ట్ర తదితర చోట్లలో గాలిస్తున్నాయి. భరత్‌రెడ్డి ఆచూకీ కోసం ఆయన బంధువులు, సన్నిహితులను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే రెండు హత్య కేసుల్లో నిందితుడైన భరత్‌రెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేసేందుకు పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. -
మీడియాతో మాట్లాడొద్దు ప్లీజ్..
ఎంపీ శివప్రసాద్‌తో మంత్రులు సుజన, అమర్నాథ్రెడ్డి రాయబారం తిరుపతి తుడా: రాష్ట్రవ్యాప్తంగా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రభుత్వ తీరును అంబేడ్కర్ జయంతి సభావేదికపై ఎండగట్టిన టీడీపీ చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్‌ను శాంతింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అమర్నాథరెడ్డి శనివారం రాత్రి 10 గంటల తరువాత ఫోన్‌ద్వారా రాయబారం నడిపారని విశ్వసనీయ సమాచారం. ఎంపీ శివప్రసాద్ దళితుడు కాబట్టే ఏకంగా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సస్పెండ్ చేస్తానని బెదిరించి, కబ్జా మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని బాబుపై రాష్ట్రవ్యాప్తంగా దళితసంఘాలు గళం విప్పాయి. దీంతో ప్రస్తుతానికి రాయబారమే సరైందని గుర్తించి సుజనాచౌదరి, అమరనాథరెడ్డిలను ఎంపీ వద్దకు పంపాలని నిర్ణయించారు. దీంతో శనివారం రాత్రి వారిద్దరూ ఫోన్‌చేసి ఎంపీని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. దీంతో శివప్రసాద్ ‘నిజం మాట్లాడితే నన్ను సస్పెండ్ చేస్తానంటారా.. ఎలా చేస్తారో చూస్తాను, దళితులకు అన్యాయం జరుగుతున్నది నిజం కాదా.. అందుకే మాట్లాడాను, మావాళ్లకు నేనేం సమాధానం చెప్పాలి..’ అని తన ఆవేదనను వెళ్లగక్కారు. ఆయన ఎంతకీ ససేమిరా అనడంతో ఆ ఇద్దరు మంత్రులు రేపో ఎల్లుండో తిరుపతి వస్తారని తెలిసింది. -
‘అందుకే నాపై చంద్రబాబు నిందలు’
చిత్తూరు: దళితులకు జరుగుతున్న అన్యాయంపై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్. శివప్రసాద్ స్పష్టం చేశారు. దళితులకు న్యాయం చేయాలని తాను అడగడం తప్పా అని ప్రశ్నించారు. డీకేటీ భూముల రెగ్యులరైజేషన్ హామీ ఏమైంది, బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు, ఎస్సీ సబ్ ప్లాన్ కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. ఈ ప్రశ్నలు అడినందుకే తనపై సీఎం చంద్రబాబు నిందలు వేస్తున్నారని వాపోయారు. కాగా, శివప్రసాద్ కు సంఘీభావం తెలిపేందుకు దళిత సంఘాల నేతలు పెద్దఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలపై దళిత సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో దళితులకు టీడీపీ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని అంబేడ్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం శివప్రసాద్ చిత్తూరులో ధ్వజమెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివప్రసాద్ పై చర్యలు తప్పవని చంద్రబాబు సూచనప్రాయంగా వెల్లడించారు. -
కలెక్టర్ వేధింపులు ఆపకపోతే ఉద్యమం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : దళిత నాయకుడు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్వీ సాగర్‌పై కలెక్టర్ వేధింపులు ఆపకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని వివిధ దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. మంగళవారం స్థానిక రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలపాల రవి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, కొంత కాలంగా దళిత ఉద్యోగులే లక్ష్యంగా అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండగా ఉద్యోగులను బదిలీ చేయకూడదనే నిబంధన కలెక్టర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. దళిత ఉద్యోగులను అవినీతిపరులుగా చూపించడానికి కలెక్టర్ చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ భాస్కర్ దళిత ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని మొండెం సంతోష్ కుమార్, మున్నుల జాన్‌గురునా«థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ బదిలీ అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దళిత నాయకులు పులవర్తి కొండబాబు, ఎం.ఆనందరావు, పలివెల చంటి, కందుల రమేష్, దాసరి నాగేంద్రకుమార్, మేతర అజయ్, అంతర్వేది కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. సాగర్ వేధిస్తున్నారు.. రేషన్ డీలర్ల ఆరోపణ ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దార్ ఎల్వీ సాగర్ వేధిస్తున్నారని పలువురు రేషన్ డీలర్లు ఆరోపించారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్, రేషన్ డీలర్ రాయి విమలాదేవి మాట్లాడుతూ తాను ప్రజాప్రతినిధినైనా ఏకవచనంతో సంబోధిస్తూ మహిళనని కూడా చూడకుండా సాగర్ కించపరుస్తున్నారని ఆరోపించారు. గతంలో ప్రొటోకాల్ నిమిత్తం తమ అసోసియేషన్ నాయకుడు గంగాధర్ నెలకి రూ.500 చొప్పున వసూలు చేసేవారని, సాగర్ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఈ మొత్తాన్ని రూ.1,600కు పెంచారని, భరించలేమని చెబితే దానిని రూ.1,000కి తగ్గించారన్నారు. విషయాన్ని గంగాధర్‌కు చెబితే అతను కూడా సాగర్‌కు అనుకూలంగా మారి తమను వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వారిలో బినామీ డీలర్లు ఎవరూ లేరని, అందరూ కుటుంబసభ్యులు మాత్రమే దుకాణాలను నిర్వహిస్తున్నామన్నారు. మారిన పరిస్థితుల్లో ఒక్కో డీలర్ పరిధిలో సుమారు 300కు మించి కార్డులు లేవని, అయితే గంగాధర్‌కు 800 కార్డులున్నాయన్నారు. గంగాధర్‌కు మూడు బినామీ దుకాణాలు ఉన్నాయని ఆరోపించారు. అటువంటి వ్యక్తి తమ కష్టాలపై పోరాడాల్సింది పోయి ఫిర్యాదు చేసిన వారు బినామీ డీలర్లని ప్రచారం చేయడం తగదన్నారు. విలేకరుల సమావేశంలో రేషన్ డీలర్లు దాసరి ఆంజనేయులు, ఈపిచర్ల కాశి, మాదాల రాజశేఖర్, పీవీ రమణ, ఎం.శారద, డి.గంగ, సీహెచ్ రమేష్ పాల్గొన్నారు.