మీడియాతో మాట్లాడొద్దు ప్లీజ్..
ఎంపీ శివప్రసాద్‌తో మంత్రులు సుజన, అమర్‌నాథ్‌రెడ్డి రాయబారం
తిరుపతి తుడా: రాష్ట్రవ్యాప్తంగా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రభుత్వ తీరును అంబేడ్కర్ జయంతి సభావేదికపై ఎండగట్టిన టీడీపీ చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్‌ను శాంతింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అమర్‌నాథరెడ్డి శనివారం రాత్రి 10 గంటల తరువాత ఫోన్‌ద్వారా రాయబారం నడిపారని విశ్వసనీయ సమాచారం.
ఎంపీ శివప్రసాద్ దళితుడు కాబట్టే ఏకంగా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సస్పెండ్ చేస్తానని బెదిరించి, కబ్జా మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని బాబుపై రాష్ట్రవ్యాప్తంగా దళితసంఘాలు గళం విప్పాయి. దీంతో ప్రస్తుతానికి రాయబారమే సరైందని గుర్తించి సుజనాచౌదరి, అమరనాథరెడ్డిలను ఎంపీ వద్దకు పంపాలని నిర్ణయించారు. దీంతో శనివారం రాత్రి వారిద్దరూ ఫోన్‌చేసి ఎంపీని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. దీంతో శివప్రసాద్ ‘నిజం మాట్లాడితే నన్ను సస్పెండ్ చేస్తానంటారా.. ఎలా చేస్తారో చూస్తాను, దళితులకు అన్యాయం జరుగుతున్నది నిజం కాదా.. అందుకే మాట్లాడాను, మావాళ్లకు నేనేం సమాధానం చెప్పాలి..’ అని తన ఆవేదనను వెళ్లగక్కారు. ఆయన ఎంతకీ ససేమిరా అనడంతో ఆ ఇద్దరు మంత్రులు రేపో ఎల్లుండో తిరుపతి వస్తారని తెలిసింది.