సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో రవిదాస్ మందిర్ కూల్చివేతకు నిరసనగా వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన దళితులు బుధవారం భారీ నిరసన చేపట్టారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 10న ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) అధికారులు రవిదాస్ మందిర్‌ను కూలగొట్టారు. నీలం రంగు టోపీలు ధరించి జెండాలు చేబూనిన దళితులు పెద్దసంఖ్యలో అంబేద్కర్ భవన్ నుంచి రాంలీలా మైదాన్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. పంజాబ్, రాజస్ధాన్, హర్యానా, యూపీ సహా పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన దళితులు ఆలయ కూల్చివేతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మందిర్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం తమకు స్థలం కేటాయించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పలు రాజకీయ పార్టీలు ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చాయి. రవిదాస్ మందిర్‌ను ప్రస్తుతమున్న తుగ్లకాబాద్ అటవీ ప్రాంతంలో నిర్మించాలని లేనిపక్షంలో ప్రత్యామ్నాయంగా వేరొక ప్రాంతంలో నిర్మించాలని దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. మరోవైపు దళితుల నిరసన కార్యక్రమంలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, ఢిల్లీ సామాజిక న్యాయశాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతం పలువురు మత పెద్దతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment