
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు రూలింగ్‌కు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఈనెల 9న భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. సర్వోన్నత న్యాయస్ధానం మార్చి 20న ఇచ్చిన ఉత్తర్వులతో నీరుగార్చిన ఎస్సీ,ఎస్టీ చట్ట నిబంధనలను పునరుద్ధరించాలని అఖిల భారత అంబేడ్కర్ మహాసభ (ఏఐఏఎం) నేతృత్వంలో దళిత సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
కాగా, దళితుల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేస్తూ భారత్ బంద్‌లో పాల్గొనరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో శాంతి, సామరస్యం, సోదరభావాలను కొనసాగించేలా సహకరించాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్టులను నిలువరిస్తూ నిర్ధిష్ట చర్యలను చేపట్టాలన్న సుప్రీం ఉత్తర్వులను పక్కనపెడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పటిష్టం చేసే బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ,ఎస్టీ బిల్లు, బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన క్రమంలో ఈ బిల్లులు చారిత్రాత్మకమైనవని మంత్రి పేర్కొన్నారు. దళితుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment