ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని ప్రధాని మోదీ మైనపు బొమ్మతో సెల్ఫీ దిగుతున్న ఓ అభిమాని
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు తమ ప్రభుత్వం ఇచ్చినంత గౌరవం మరే ప్రభుత్వం ఇవ్వలేదని ప్రధాని మోదీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దళిత సంఘాలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలోని వెస్ట్రన్‌కోర్టులో నూతన ఎంపీల వసతి కోసం నిర్మించిన అదనపు భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు తమ ప్రభుత్వం ఇచ్చినంత గౌరవం బహుశా మరే ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం అంబేడ్కర్ పేరును వాడటం మానుకోవాలని హితవు పలికారు. అన్ని రాజకీయ పార్టీలు అంబేడ్కర్ చూపిన మార్గంలో ముందుకెళ్లాలని సూచించారు. అంబేడ్కర్ ఆదర్శాలైన సామరస్యం, ఐక్యత స్ఫూర్తితో పేదల సంక్షేమానికి తన ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వెస్ట్రన్‌కోర్టులో ఎంపీల కోసం అదనపు భవనాన్ని నిర్మించడంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పాత్రను మోదీ కొనియాడారు. ఎంపీలను మహాజన్ తల్లిలా చూసుకుంటారని కితాబిచ్చారు. ఢిల్లీలో ఎంపీలు ఫైవ్‌స్టార్ హోటళ్లలోనే ఉంటారని ఓ విమర్శ ఉందనీ, అయితే మాజీ ఎంపీలు తమకు కేటాయించిన భవనాలను ఖాళీ చేయకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment