
విశాఖ : ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ పెద్దలు చెప్పేవి గొప్ప మాటలని, చేసేది మాత్రం శూన్యమన్నారు బొత్స. ‘రాష్ట్ర ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేదు. పెట్టుబడులో రావాలంటే మేమే అని అంటారు. ప్రభుత్వ ఉద్దేశంలో పరిశ్రమలను ప్రోత్సాహించడం అంటే పొగపెట్టడమే.
కడపలో యాష్ కోసం కూటమి నేతల గొడవలు ప్రజలు చూశారు. ఇదొక్కటే కాదు.. కృష్ణపట్నం పోర్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో ఇదే జరిగింది. ఎచ్చెర్ల లిక్కర్ ఫ్యాక్టరీ వద్ద కూడా కూటమి నేతలు డబ్బులు వసూలు చేశారు. జిందాల్ పరిశ్రమపై కేసులు పెట్టి వేదిస్తే ఆ కంపెనీ గుజరాత్ కు వెళ్ళిపోయింది. పరిశ్రమలను ఇబ్బంది పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరిస్థితి ఇలా ఉంటే పరిశ్రమలు ఎలా వస్తాయి. విద్యుత్ చార్జీలు పెంచి ఆ నెపాన్ని వైఎస్సార్ సీపీ నేతలపై నెడుతున్నారు. మిర్చి రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పింది.
ఒక్క టన్ను మిర్చి అయినా ప్రభుత్వం కొన్నదా?, రాష్ట్రంలో ఏ రైతుకి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తున్నారు..? , పొగాకు రైతులకు ఏమైనా మేలు చేశారా..? , ఒకవైపు పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి.. మరోవైపు కార్మికులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించడం లేదు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, దౌర్జన్యాలు చేస్తుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని జులుం చేస్తుంది. ఈ ప్రభుత్వ అలసత్వం, నిర్వాకం వలన రాబోయే తరానికి ముప్పు వాటిల్లుతుంది. ఇంత అప్పు గతంలో ఎప్పుడూ లేదు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత అప్పులు లేవు. ఏ శాఖలో కూడా జవాబుదారీ తనం లేదు.

ఏ మంత్రి అయినా నా శాఖలో ఇంత కచ్చితత్వం ఉందని ఎవరైనా చెప్పగలరా..? , కొత్త పెన్షన్లు రాష్ట్రంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. పేద పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్ మెంట్ కూడా లేదు. విద్య, వైద్యం రాష్ట్రంలో లేవు. ఏ శాఖలో కూడా నిర్ధిష్టమైన విధానం లేదు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఈరోజుకి కూడా అలానే ఉంధి. ప్రభుత్వం అసలు ఆలోచన కూడా చెయ్యడం లేదు. సంవత్సరం సమయం ఇచ్చారు ఈ ప్రభుత్వానికి ఇంకేం కావాలి. ధీటుగా ఎదుర్కోవాలి అని చంద్రబాబు మంత్రులకు చెప్పారు. ఏముందని.. ఏం చేశారని ధీటుగా ఎదుర్కొంటారు. పరిశ్రమలను ఇబ్బంది పెడుతున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. పెండింగ్ అర్జీ దారులకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారు’ అని బొత్స నిలదీశారు.