
విజయవాడ, సాక్షి: తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి(Yanamala Rama Krishnudu) అసమ్మతి గురించి విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీల వీడ్కోలు సభకు రావాలంటూ ఆహ్వానం పంపినప్పటికీ.. ఆయన సీఎం చంద్రబాబు(CM Chandrababu)కి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే గైర్హాజరు అయ్యారని స్పష్టమైన సమాచారం. టీడీపీలో తనకు కొనసాగుతున్న అవమానమే ఇందుకు కారణమని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా.. ఏడుగురు ఎమ్మెల్సీలకు(Seven MLCs) మండలి వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని మండలిలో స్పష్టంగా మెన్షన్ చేశారు కూడా. అయితే తన చేత బలవంతంగా రాజకీయ విరమణ చేయిస్తున్న చంద్రబాబు చర్యలకు ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆ వీడ్కోలు మీటింగ్‌కు కావాలనే డుమ్మా కొట్టి.. టీడీపీలోనే గుసగుసలాడుకునేలా చేశారు.
ఆరుసార్లు వరుస ఎమ్మెల్యే, రెండుసార్లు ఎమ్మెల్సీ, ఒకసారి స్పీకర్, పైగా మంత్రిగా కూడా. టీడీపీలో మొదటి నుంచి ఉన్న యనమలకు చంద్రబాబు ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు. ఆయన కూతురు ఎమ్మెల్యే, బంధువులకు మంచి స్థానాలు దక్కినప్పటికీ.. తనకు ఒక్కసారిగా ప్రాధాన్యం తగ్గించడంపై యనమల రగిలిపోతున్నారు. పైగా గత ఐదేళ్లు మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగినా కూడా తనకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయినట్లు ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పైగా ఎమ్మెల్సీ(MLC)గా రెన్యువల్ అవకాశాలు ఉన్నా చంద్రబాబు ఆ పని చేయలేదు. కనీసం ఆయనకున్న రాజకీయానుభవాన్ని కూడా అధినేత పట్టించుకోవడం లేదని ఆయతన వర్గీయులు అంటున్నారు. పైగా తానే స్వచ్ఛందంగా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్లు.. రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు.. టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించడాన్ని యనమల భరించలేకపోతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర రాజకీయాల్లోనే ఇంకొంత కాలం కొనసాగి.. ఆపై రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని ఆయన భావించారని ఆయన వర్గీయులు అంటున్నారు. ఈలోపు చంద్రబాబు తన మార్క్ వెన్నుపోటు రాజకీయం యనమల మీదకూ ప్రయోగించారని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలతో చివరకు.. చంద్రబాబుతో ఉమ్మడి ఫోటోకి కూడా ఇష్టపడని యనమల వీడ్కోలు మీటింగ్‌కు వెళ్లలేదు. మరోవైపు ‘ఫార్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్’ యనమల లేకుండా ఈ మీటింగ్ జరగడంపై టీడీపీలో ఇప్పుడు విస్తృత చర్చ నడుస్తోంది.
