Sharada
-
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు
కాళోజీ సెంటర్/హన్మకొండ: వరంగల్ కలెక్టర్‌గా డాక్టర్ సత్య శారదదేవి, హనుమకొండ కలెక్టర్‌గా పి.ప్రావీణ్య ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో వారిని రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఆర్ఓ అయూబ్‌అలీ, డీఈఓ డి.వాసంతి, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, ఆర్డీఓలు సీతం దత్తు, కృష్ణవేణి, ఎల్డీఎం హవేలీ రాజు, కలెక్టరేట్ ఏఓలు శ్రీకాంత్, అబీద్ అలీ, తహశీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వరరావు, ఫణికుమార్, విజయ్, రవిచంద్రారెడ్డి, పర్యవేక్షకులు మంజుల, చంద్రశేఖర్ ఉన్నారు. హనుమకొండ కలెక్టర్‌ను కలిసిన వారిలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా(లోకల్ బాడీస్), వెంకట్‌రెడ్డి (రెవెన్యూ), డీ.ఆర్.ఓ. వై.వి.గణేష్ ఉన్నారు. -
ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా?
చిన్న చిన్న ఎడ్లబండ్లు వాటిలో గ్రామీణ మహిళల బొమ్మలు, చెక్క కుర్చీలు వాటి ముందు చిట్టి చిట్టి బొమ్మలు, హంసలు, పక్షులు, గూళ్లు, గుడిసెలు.. ఇలా ముచ్చటైన వస్తువుల కూర్పుతో ట్రే గార్డెన్‌ను ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపాటి స్థలంలో కూడా వీటిని అందంగా అలంకరించవచ్చు.ఈ విషయాన్ని తన కళతో నిరూపిస్తోంది హర్యానాలోని ఫరీదాబాద్ వాసి యాభై ఐదేళ్ల శారదా గోదారా. తోటలు, పార్కులను పోలిన మినియేచర్ ట్రే గార్డెన్స్‌ను రూపొందిస్తోందామె. నడివయసులో ఒంటరితనం పోగొట్టుకోవడానికి చేసిన ఆలోచన ఆమెను ఇలా అందమైన లోకంలో విహరించేలా చేసింది. తన ఇంటిలో వెయ్యి మొక్కలతో మినీ జంగిల్‌ను క్రియేట్ చేసింది.‘మా ఇంటి బయట, మెట్లు, బాల్కనీలు, పెరడు వరకు రకరకాల అందమైన మొక్కలతో నింపేశా. ఆ తర్వాత చిన్న ట్రే గార్డెన్ల తయారీని మొదలుపెట్టాను. అభిరుచి ఉంటే చాలు ఒంటరితనానికి ఎదర్కోవడానికి, ఇంటిని అందంగా అలంకరించడానికి ఇదొక మంచి మార్గం. ఒక గంటలోపు ఒక మినీ ట్రే గార్డెన్‌ను రూపొందించుకోవచ్చు. రంగు రంగుల గులకరాళ్లు, చిట్టి పొట్టి మొక్కలు, చిన్న చిన్న మెట్లు, గుడిసెలు.. ఇతర అలంకరణ వస్తువులతో తయారైన ఈ మినీ ట్రే గార్డెన్లను చూస్తుంటే ఎంతో ఆనందంగా కలుగుతుంది’ అని తన గార్డెన్ పెంపకం విషయాలను ఆనందంగా చెబుతుందామె.ట్రే గార్డెన్‌ని మీరూ ఇలా సృష్టించుకోవచ్చు...ముందుగా గార్డెన్ థీమ్‌ను దృష్టిలో ఉంచుకొని, కాగితం మీద స్కెచ్ వేసుకోవాలి. పరిమాణం, ఆకారం, మట్టి, ఇతర అలంకార వస్తువులను బట్టి తగిన సిరామిక్ ట్రేని ఎంచుకోవాలి.గార్డెన్‌కు బేస్‌ను సృష్టించడానికి పాటింగ్ మిక్స్‌తో ట్రేని నింపాలి. సారవంతమైన మట్టిలో 15 శాతం ఆవుపేడ, 15 శాతం కోకోపిట్ కలపాలి.వీటిలో స్నేక్‌ప్లాంట్, స్పైడర్ వంటి చిన్న చిన్న మరుగుజ్జు మొక్కలను నాటాలి. పైనుంచి మట్టిని గట్టిగా నొక్కి, నీళ్లు పోయాలి. తర్వాత రంగు రంగుల గులకరాళ్లు, గంటలు, బొమ్మలు వంటి అలంకరణ వస్తువులతో ట్రే తోటను అలంకరించాలి. స్ప్రే బాటిల్‌ను ఉపయోగించి ట్రేలోని మొక్కలకు నీళ్లు పోయాలి.ఫంగల్ దాడుల నుంచి మొక్కలను కాపాడుకోవడానికి అరటి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ తొక్కలు.. వంటి వంటగది వ్యర్థాలను ఉపయోగించి చేసే ద్రవ కంపోస్ట్‌ను పిచికారీ చేసుకోవచ్చు..ఇవి చదవండి: ఫోటోగ్రాఫర్..! -
గంటా.. ఒక భార్య.. రెండు పాన్లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు చట్టం తెలియదా? లేకపోతే తననెవరేం చేస్తార్లే అన్న ధీమానా? ఎందుకంటే ఏ వ్యక్తికైనా రెండు పాన్ నెంబర్లుండటం చట్టరీత్యా నేరం. శిక్షార్హులు కూడా. కానీ గంటాది కళ్లు మూసేసుకుని... తననెవ్వరూ చూడటం లేదనుకునే బాపతు. అందుకే... గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు తన భార్య పాన్ నంబరును మార్చేశారు. భార్య శారద పేరుతో గత ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్‌కు, ఈ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నంబర్‌కు సంబంధం లేకపోవటంతో దీనివల్ల ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమోనని ఆయన అనుచరులే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు.... నాటి అఫిడవిట్లో తన సతీమణి శారద పాన్ నంబరు ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చే అలవాటున్న గంటా ఈ సారి పట్టుబట్టి, చంద్రబాబు నాయుడిని ఎదిరించి మరీ భీమిలి టికెట్టు సాధించుకున్నారు. శుక్రవారం నామినేషన్ వేస్తూ... అఫిడవిట్ దాఖలు చేశారు. దీన్లో భార్య శారద పాన్ నంబరును మాత్రం ఏబీపీపీజీ2216ఏగా పేర్కొన్నారు. అంటే... 2215ఏ, 2216ఏ నంబర్లతో దాదాపు ఒకేసారి రెండు పాన్ నంబర్లను తీసుకున్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. అంతా నగదు రూపంలోనే...! ఆదాయపన్నుశాఖ చట్టం ప్రకారం నగదు లావాదేవీలు రూ.2 లక్షలకు మించి జరగకూడదు. ఒకవేళ జరిగితే అది నేరం అవుతుంది. అయితే, గంటా శ్రీనివాసరావు తన సతీమణి పేరుతో 2018లో భీమునిపట్నం పరిధిలో భూమిని కొన్నపుడు పెద్దమొత్తంలో నగదు రూపంలోనే చెల్లించడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. రూ.92,98,000ను నగదు రూపంలోనే ఇచ్చినట్టు చూపించారు. అంతేకాకుండా మరో రూ.25 లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపి సర్వే నంబరు టీఎస్ నంబరు 1,490, బ్లాక్ నంబరు 17, వార్డు నంబరు 24లోని 1,936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్ నంబరును పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ గంటా శారద 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు ఏ ఒక్క సంవత్సరంలోనూ ఐటీ రిటర్న్‌లు దాఖలు చెయ్యలేదు. వాస్తవానికి ఆ పాన్ నెంబర్లను చూసినపుడు రెండూ ఒకే సమయంలో తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఐటీ రిటర్నుల కోసం ఒకటి, భారీ నగదు లావాదేవీల కోసం మరొకటి వినియోగిస్తూ ఉండవచ్చని, ఆ రెండింటినీ చెక్ చేస్తే ఆదాయపు పన్నును మోసం చేసిన వ్యవహారాలు చాలావరకూ బయటపడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇలా రెండు పాన్ నెంబర్లను కలిగి ఉండటం నేరమని, మంత్రిగా పనిచేసిన గంటాకు ఇది తెలియనిదేమీ కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా అఫిడవిట్ ప్రకారం గంటాపై ఏడు కేసులున్నాయి. భార్యాభర్తలిద్దరి పేరిటా మొత్తం రూ.23.36 కోట్ల స్థిర, చరాస్తులున్నాయని, కాకపోతే సొంత కారు మాత్రం లేదని గంటా పేర్కొన్నారు. ఆస్తుల కొనుగోలుకు మరో పాన్ అసలు కథేమిటంటే... 2018లో తన సతీమణి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తి కోసం పాన్ నంబర్‌ను ఏబీపీపీజీ2216ఏగా గంటా పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా 2019 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. అంటే... అప్పట్లో కొన్న ఆస్తిని గత ఎన్నికల్లో చూపించలేదు. పైపెచ్చు 2018లో కొనుగోలు చేసిన భూ లావాదేవీలన్నీ నగదు రూపంలోనే సతీమణి పేరుతో కొనసాగించిన గంటా.. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రిటర్న్స్‌ను కూడా దాఖలు చెయ్యలేదు. ఈ వ్యవహారాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి భూ లావాదేవీల కోసం పేర్కొన్న పాన్ నంబర్‌ను అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. నిజానికి ఒకే వ్యక్తికి రెండు పాన్ నంబర్లు ఉండటం చట్టరీత్యా నేరమని, అంతేగాకుండా ఒక్కోసారి ఒక్కో విధంగా ఎన్నికల అఫిడవిట్లో వివరాలివ్వటం కూడా ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. -
National Animal Rights Day: జంతువులను ప్రేమిద్దాం..
మన కాలనీలో ఓ కుక్క కాలు విరిగి ఈడ్చుకుంటూ వెళుతుంటుంది... చూసి, పట్టనట్టు వెళ్లిపోతుంటాం. ఓ చిన్న సందులో పిల్లి ఇరుక్కుని గిలగిల్లాడుతుంటుంది ... దానిని కాపాడటం మన పని కాదులే అని తప్పుకుంటాం. వాటికి ఆకలేసినా, ప్రమాదాలు జరిగినా మనసున్న మనుషులుగా మనమెంతవరకు పట్టించుకుంటున్నాం? మనతో పాటు మూగజీవాలకూ బతికే హక్కు ఉందని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిది అని అంటున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న జంతుప్రేమికులు సాయిశ్రీ, పంచ్, శారద, డాక్టర్ కృష్ణప్రియ. ప్రజలలో మూగ జీవాల పట్ల అవగాహన కలిగించేందుకు, సురక్షితంగా ఉంచేందుకు నార్డ్ గ్లోబల్ ఆర్గనైజేషన్‌తో కలిసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేషనల్ యానిమల్ రైట్స్ డే సందర్భంగా జంతు ప్రేమికులు చెబుతున్న విషయాలు. స్కూల్, కాలేజీలకు వెళ్లి.. జంతువులకు కూడా జీవించే హక్కు ఉంది అని చెప్పడానికి నార్డ్ అనే సంస్థ అంతర్జాతీయంగా వర్క్ చేస్తుంది. కొన్ని ఆర్గనైజేషన్స్‌తో కలిసి వర్క్ చేస్తాం. ప్రజల్లో అవగాహన కల్పించడమే ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. మూడేళ్లుగా యానిమల్ సేవలో పాల్గొంటున్నాను. మనిషి కారణంగా ఏ జంతువూ బాధపడకూడదు. ఎవరూ వాటిని హింసించకూడదు. నేను ఒక స్ట్రీట్ డాగ్‌ను దత్తత తీసుకున్నా. అప్పటి నుంచి నాకు ఈ సేవ పట్ల ఆసక్తి పెరిగింది. స్కూల్, కాలేజీలకు వెళ్లి కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తుంటాం. జంతు ఆధారిత ఉత్పత్తులను ఏవీ ఉపయోగించం. – పంచ్, యానిమల్ యాక్టివిస్ట్, సైనిక్‌పురి పూర్తి సమయం కేటాయింపు.. మన వీధిలో ఒక కుక్క ఉందంటే అది ఆ కాలనీవారందరి బాధ్యతగా ఉండాలి. దానికి ఏదైనా దెబ్బ తగిలినా, తిండి లేకుండా పడి ఉన్నా ఎవరూ పట్టించుకోరు. అలాంటి కుక్కలు, పిల్లలు, గోవులు... వీధుల్లో తిరిగేవాటిని తీసుకొచ్చి, సేవ చేస్తాం. వీధుల్లో ఉండే కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయిస్తాం. ఐదేళ్లయ్యింది ఈ వర్క్ చేయబట్టి. ఎనిమిదేళ్ల క్రితం మా ఫ్రెండ్ అక్కవాళ్ల దగ్గర నుంచి ఒక కుక్కను తీసుకున్నాను. స్ట్రీట్ డాగ్స్‌కు దెబ్బలు తగిలినప్పుడు ట్రీట్మెంట్ చేసేదాన్ని, చేయించేదాన్ని. ఆ తర్వాత షెల్టర్ స్టార్ట్ చేశాను. దీనికి మరొక ఫౌండర్ జత కలవడంతో ఇప్పుడు ఇక్కడ రెండు వందల వరకు యానిమల్స్ ఉన్నాయి. గోవులు ఆరున్నాయి. ఇప్పటి వరకు నాలుగు వేల స్ట్రీట్ యానిమల్స్‌కి సేవలందించాను. నేషనల్ బాక్సర్‌గా ఉన్న నేను ఈ వైపుగా ఆసక్తి పెరగడంతో పూర్తి సమయాన్ని జంతువుల సేవకే కేటాయిస్తున్నాను. వీగన్ పదార్థాల తయారీ, ప్రొడక్ట్స్ బిజినెస్ కూడా చేస్తుంటాను. వీటి వల్ల వచ్చే ఆదాయంలో 15 శాతం జంతు సేవలకే ఉపయోగిస్తుంటాను. – సాయి శ్రీ, బోరంపేట్, దుండిగల్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది.. మా అపార్ట్మెంట్ దగ్గర 20 కుక్కలను సేవ్ చేసి, వాటికి షెల్టర్ ఏర్పాటు చేశాను. ఇందుకు చాలా మందితో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కుక్కలకు ఆహారం పెడుతుంటే, పై నుంచి బాటిల్స్ వేసినవారున్నారు. అవే కుక్కల మీద పడితే, వాటికి ఎంత ప్రమాదం జరిగేదో అస్సలు ఆలోచించరు. న్యూసెన్స్ అవుతుందని కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది. యానిమల్ రైట్స్ గురించి చెప్పినప్పుడు, అందరూ తగ్గారు. మొదట్లో స్ట్రీట్ డాగ్‌ని దత్తత తీసుకొని, పెంచేదాన్ని. ఆ తర్వాత ఆ కాలనీలో తిరుగుతున్నవాటిని రెస్క్యూ చేయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఫ్రెండ్ షెల్టర్‌కి పంపిస్తుంటాను. – శారద, యానిమల్ యాక్టివిస్ట్, ప్రగతినగర్ బ్లడ్ అవసరమైతే.. నేను డెంటిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. అలాగే, అవసరమైన డాగ్స్‌కి బ్లడ్ అందేలా చూస్తుంటాను. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ల కుక్కకు ప్రమాదం జరిగి, బ్లడ్ అవసరమైంది. ఆ సమయంలో మరో కుక్క నుంచి బ్లడ్ తీసి, మ్యాచ్ చేసి ప్రమాదం నుంచి గట్టెక్కించారు. అప్పటి నుంచి కుక్కలకు కూడా బ్లడ్ అవసరం అని భావించి, రికార్డ్ చేస్తున్నాను. ఇందుకు సంబంధించి వెటర్నరీ డాక్టర్స్‌ని, వారి ద్వారా అవసరమైన కుక్కలకు మరో పెట్ పేరెంట్ ద్వారా బ్లడ్ అందేలా చూస్తుంటాను. – డాక్టర్ కృష్ణప్రియ, మలక్‌పేట – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తెలుగు స్త్రీలకు వెలుగునిచ్చిన విద్యాలయం
20వ శతాబ్దం ప్రారంభం నాటికి అవిద్య, బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం వంటి అనేక సమస్యలతో భారత స్త్రీలు కొట్టుమిట్టాడుతుండేవారు. ఇంటి నాలుగు గోడల మధ్య బందీలై, బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి వారిది. దీనికి తోడు ఆనాటికి ప్రబలి ఉన్న మూఢ విశ్వాసాలు వారికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేవి. ఈ స్థితిలో స్త్రీలను ఉద్ధరించడానికి కందుకూరి వీరేశలింగం వంటివారు నడుం బిగించారు. ఆ కోవకు చెందినవారే ఉన్నవ లక్ష్మీనారాయణ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ దంపతులు కూడా. వారు స్త్రీవిద్య కోసం గుంటూరులో ‘శారదా నికేతనం’ స్థాపించారు. దానికి నూరు వసంతాలు నిండాయి. ఉన్నవ లక్ష్మీనారాయణ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ ఉన్నవ దంపతులు గుంటూరు కేంద్రంగా జాతీయోద్యమం, స్త్రీ జనోద్ధరణ, సంస్కరణోద్యమాలకు తమ జీవితాలను అంకితం చేసి చరితార్థులయ్యారు. స్త్రీలకై ఒక విద్యాలయం నడపాలని భావించిన వారి ఆశయ ఫలితంగా... గుంటూరు గాంధీపేటలో సనాతన ధర్మమండలి హాలులో 1922 నవంబరు 22న, దేశో ద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ప్రారంభకులుగా ‘శారదా నికేతనము’ స్థాపితమైంది. స్త్రీలలో జాతీయ భావాన్ని రేకెత్తించే పద్ధతులను అనుసరించి విద్య నేర్పటానికి ఏర్పాటైన ‘శారదా నికేతనము’లో సంస్కృతము, తెలుగు, హిందీ, సంగీ తము, చిత్ర లేఖనము, నూలు వడకుట, నేత, కుట్టు పని మొద లగు వృత్తి విద్యలు ప్రవేశపెట్టారు. విద్యార్థినులకు వసతి గృహం కూడా ఏర్పాటు అయింది. 1922లో గుంటూరు అరండల్‌పేటలో ప్రారంభించిన శారదా నికేతనము... తరువాతి సంవత్సరంలో మునగాల జమీందారు నాయని వెంకట రంగారావు, బ్రాడీపేట 2వ లైనులో కొండా వెంక టప్పయ్య నివాసానికి (దేశభక్త భవనము) చేరువలో విరాళంగా ఇచ్చిన రెండు ఎకరాల స్థలం స్థలంలోకి మార్చబడింది. ఇప్పటికీ అదే స్థలంలో ఈ నికేతనం కొనసాగుతోంది. శారదా నికేతనంలో ఆంధ్రదేశం నలుమూలల నుండేకాక, దక్షిణాఫ్రికా, రంగూన్, ఖరగ్‌పూర్, హైదరాబాదు వంటి పలు నగరాల నుండి తెలుగు విద్యార్థినులు ఇక్కడికి వచ్చి గురుకుల వాసం చేస్తూ విద్యాభ్యాసం చేసేవారు. ఈ విద్యాలయం రెండు స్థాయుల్లో కోర్సులను నిర్వహించేది. మొత్తం ఎనిమిదేళ్ల కాల వ్యవధి. మొదటి 5 ఏళ్లూ సాహితీ ప్రకరణమనీ, మిగిలిన 3 ఏళ్లూ విదుషీ ప్రకరణమనీ విభజిం చారు. బాగా చదవటం, రాయటం వచ్చి ప్రైమరీ తరగతి వరకు చదివిన బాలికలను 5 ఏళ్ల సాహితీ ప్రకరణ కోర్సులో చేర్చుకునేవారు. 5 సంవత్సరాలు పూర్తి అయేసరికి బాలికలకు సంస్కృతాంధ్రాలలో కొంత కావ్యజ్ఞానం అలవడి, సంగీత – చిత్రలేఖనాలలో ఒకదానిలో మంచి జ్ఞానం సంపాదించేవారు. అలాగే చేతిపనులలో ఒకటి నేర్చుకుని, భూగోళము, వైద్యము, చరిత్రలో మంచి పరిచయం పొందేవారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులయిన వారు ‘సాహితీ’ బిరుదమును పొందేవారు. తరువాతి 3 ఏళ్లు సంస్కృతాంధ్ర భాషలలో ఒకటీ, ఆంగ్ల, హిందీ భాషలలో ఒకటీ అభిమాన భాషలుగా చదివి పరీక్షలో ఉత్తీర్ణులయినవారు ‘విదుషీ’ పట్టభద్రులు అయ్యేవారు. గవర్న మెంటు వారి పరీక్షలతో గానీ, పర్యవేక్షణతోగానీ సంబంధం లేకుండా విద్యాలయం వారే తరగతులన్నిటికీ వార్షిక పరీక్షలు జరిపి, పట్టాలను ఇచ్చేవారు. బాలికలకు విద్యా బోధనతో పాటూ... అనాథలకు, బాల వితంతువులకు, వితంతువులకు, భర్త వదిలి పెట్టినవారికి ఉచి తంగా భోజన వసతి, వస్త్ర సదు పాయాలు కల్పించి; అభాగ్య స్త్రీల పాలిట ఆశ్రిత కల్పవక్షంగా శారదా నికేతనం పేరు ప్రఖ్యాతులు పొందింది. 1927 ఏప్రిల్ 17వ తేదీన గాంధీమహాత్ముడు ఈ సంస్థని దర్శించి, ఇటువంటి సంస్థ ఆంధ్రదేశంలోనే కాదు, యావద్భారత దేశంలోనే లేదని ప్రశంసించారు. పూరిపాకలలోను, చెట్ల నీడలోను ప్రారంభంలో తరగతులు నిర్వహించినా... కాలక్రమంలో స్త్రీ విద్యాభిమానులయిన వదా న్యుల సహకారంతో సొంత భవనాలను, భూమి తదితర స్థిరాస్తులను సంపాదించుకోగలిగింది. ఆంధ్రదేశంలోని మున్సి పాలిటీలు, తాలూకా బోర్డులు, జిల్లా బోర్డులు తగిన విధంగా ఈ విద్యాలయానికి ఆర్థిక సహకారం అందించేవి. 1937లో ఆంధ్ర విశ్వ విద్యాలయం వారిచే ఈ సంస్థలోని సంస్కృతాంధ్రశాఖ– ‘ప్రాచ్య భాషాకళాశాల’గా గుర్తింపునొందింది. తరువాత కాలంలో ఇందలి పారిశ్రామిక శాఖను ప్రత్యేక పాఠశాలగా గవర్నమెంటు గుర్తించింది. ఒక స్వతంత్ర సంస్థగా రిజిష్టరైన ‘శ్రీశారదా నికేతన్’ ప్రయివేటు యాజమాన్యంలో ప్రధా నంగా ఉన్నవ దంపతులచే నిర్వహింపబడింది. 1955లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయశాఖ అధీనంలోకి తీసు కునేవరకూ ఈ సంస్థకు ముఖ్యదాత అయిన మునగాల జమిం దారు రాజా నాయని వెంకట రంగారావు బహద్దరు అధ్యక్షులుగా కొనసాగారు. ప్రస్తుతం ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నియ మించిన కార్య నిర్వహణాధికారి ఆధ్వర్యంలో శారదా నికేతనం విద్యాసంస్థల నిర్వహణ సాగుతోంది. దరిశి అన్నపూర్ణమ్మ (గదర్ విప్లవ వీరుడు దరిశి చెంచయ్య భార్య), సంగెం లక్ష్మీబాయమ్మ (నిజామాబాద్ బాన్సువాడ నియోజకవర్గం నుండి గెలుపొంది, విద్యాశాఖ ఉప మంత్రిగా బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో పనిచేసిన ప్రథమ తెలంగాణ మహిళ), బొందలపాటి శకుంతలాదేవి (త్రిపురనేని గోపీచంద్ భార్య), భారతీదేవి (ఆచార్య ఎన్.జి.రంగా భార్య) వంటి పేరెన్నికగన్న స్త్రీ మూర్తులు శ్రీశారదా నికేతనం పూర్వ విద్యార్థినులే. ఇంతటి చరిత్ర గలిగిన శారదానికేతనం 2022 నవంబరు 22 తేదీన వందేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శారదానికేతనంలో– ప్రాథమిక పాఠశాల (బాల బాలికలకు), ఉన్నత పాఠశాల (బాలికలకు), ఓరియంటల్ డిగ్రీ కళాశాల(బాలికలకు) నిర్వహిస్తున్నారు. ఈ మూడింటా సుమారు 500 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. తెలుగు ఆడపడుచులకు విద్యా, విజ్ఞానాలను అందించి వారి కాళ్లపై వారు నిలబడ గలమనే ధైర్యాన్ని నింపిన శారదా నికేతన్... ఒక చారిత్రక పాత్ర పోషించిందనడంలో అతిశయోక్తి లేదు. దాని స్ఫూర్తిని అందు కోవలసిన బాధ్యత మన తరానిదే! ఎమ్.వి.శాస్త్రి వ్యాసకర్త సింగరేణి కాలరీస్ హెచ్ఆర్ మేనేజర్ (రిటైర్డ్) మొబైల్: 94413 42999 -
బీజేపీలో ‘మణి’పూస: కౌన్సిలర్ నుంచి అధ్యక్షురాలిగా..
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువ. అయినప్పటికీ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా వారికి తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అలాంటి సమయంలో మహిళా ఓటర్లే లక్ష్యంగా బీజేపీ తొలిసారిగా ఒక మహిళకి రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని పెంచేలా శారదాదేవి మణిపూర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మహిళా నేతలు పెద్దగా కనిపించడం లేదు. మణిపూర్‌లో మాత్రం అన్నీ తానై, అంతటా తానై శారద బీజేపీ గెలుపు భారాన్ని తన భుజస్కంధాలపై మోస్తున్నారు. ► శారదా దేవి 1995 జూన్‌లో భారతీయ జనతా పార్టీలో చేరారు ► ఇంఫాల్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి వార్డు నెం.7 నుంచి కౌన్సిలర్‌గా గెలిచారు ► బీజేపీలో పలు కీలక పదవులు నిర్వహించారు. 1997–2000 వరకు జాతీయ కార్యదర్శిగా సేవలు అందించారు. 2010–2012 వరకు జాతీయ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. (క్లిక్: ఆ పార్టీకి బలమూ ఆయనే.. బలహీనత ఆయనే) ► 2012–2016 వరకు జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. ► మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో మొదట్నుంచీ చురుగ్గా వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ, టికెట్ కమిటీలో 1998 సంవత్సరం నుంచి సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ► మణిపూర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.టికెన్ కోవిడ్–19 బారిన పడి గత ఏడాది మేలో మరణించారు. దీంతో శారద 2021, జూన్‌లో బీజేపీ రాష్ట్ర తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ► బహుముఖ పోటీ నెలకొన్న మణిపూర్‌లో మహిళా ఓటర్లను ఆకర్షించడానికి వ్యూహాత్మకంగానే బీజేపీ ఎన్నికలకు ముందు సంవత్సరం ఒక మహిళని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టిందన్న విశ్లేషణలున్నాయి. (క్లిక్: పొలిటికల్ ప్లేయర్.. ప్రత్యర్థులతో ఫుట్‌బాల్ ఆడేయగలరు) ► రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 20,34,966 ఉంటే వారిలో పురుష ఓటర్లు 9,85,119 మంది ఉంటే మహిళా ఓటర్లు 10,49,639 ఉన్నారు. అంటే మహిళా ఓటర్లు 64 వేల మంది ఎక్కువ ఉన్నట్టు లెక్క. ప్రతీ నియోజకవర్గంలోనూ మహిళా ఓటర్లు కీలకమైన నేపథ్యంలో శారదా దేవి నియామకం పార్టీకి కలిసి వస్తుందన్న భావనలో బీజేపీ ఉంది. ► మొత్తం 60 స్థానాలున్న రాష్ట్రంలో తాను చెప్పిన వారికి టికెట్లు ఇస్తే 40 సీట్లలో విజయం ఖాయమని శారదా దేవి చెప్పారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం లేదు. 2017 ఎన్నికల్లో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టారు. ► శారద పట్టుబట్టి ముగ్గురు మహిళా అభ్యర్థులకి టికెట్లు ఇప్పించారు. ► ఇప్పటికే బహుముఖ పోటీ నెలకొనడంతో పాటు టికెట్ల పంపిణీ తర్వాత బీజేపీలో ఒక్కసారిగా అసమ్మతి సెగ రాజుకుంది. టికెట్లు రాని వాళ్లు పార్టీ కార్యాలయం మీద కూడా దాడులకు దిగారు. కొందరు పార్టీకి కూడా గుడ్‌బై కొట్టేశారు. ► పార్టీలో అసమ్మతిదారుల్ని బుజ్జగించడంతో పాటు 40 సీట్ల లక్ష్యాన్ని సాధించడం అంటే శారదా దేవి గట్టి సవాల్ కిందే లెక్క. అయినా ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంగా శ్రేణుల్ని ఉత్తేజపరిచే పనిలో ఉన్నారు. కార్యకర్తలతో అరమరికలు లేకుండా కలిసిపోయే తత్వం ఆమెది. అదే ఇప్పుడు బీజేపీని క్షేత్రస్థా యిలో పటిష్టపరుస్తుందని అందరూ విశ్వసిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
మరో విషాదం, ప్రముఖ నటి కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటి కోజికోడ్ శారద(84) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు సోమవారం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కేరళలోని కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పోందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో మంగళవారం(నవంబర్ 9) ఉదయం తుదిశ్వాస విడిచారు. శారద మృతి పట్ల కేరళ ఫిల్మ్స్ అండ్ కల్చరల్ మంత్రి సాజి చెరియన్ సంతాపం తెలిపారు. చదవండి: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్ అలాగే మలయాళ సినీ పరిశ్రమకు స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్‌తో పాటు పలువురు నటీనటులు ఆమె మృతికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం ఆమె స్వస్థలమైన కోజికోడ్‌లో శారద అంత్యక్రియలు జరిగినట్లు తెలుస్తోంది. మలయాళ ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న శారద, రంగస్థలంపై తన నటన జీవితాన్ని ప్రారంభించారు. 1979లో ‘అంగక్కురి’ చిత్రంతో ఆమె పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా నటిగా రాణించిన ఆమె దాదాపు 90కి పైగా చిత్రాల్లో నటించారు. అలాగే పలు మలయాళ టీవీ సీరియల్స్‌లో కూడా శారద నటించారు. Rest in peace 🙏 pic.twitter.com/aR4DyQLP5e — Prithviraj Sukumaran (@PrithviOfficial) November 9, 2021 -
డీజీపీ ఎదుట లొంగిపోనున్న మావోయిస్టు నేత శారదక్క
-
నీ అనురాగం... ఎన్నో జన్మల పుణ్యఫలం
‘ఓ అన్నా... నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’... ఈ పాట ప్రతి రాఖీ పండక్కీ వినిపిస్తుంది. ఇళ్లల్లో అన్నదమ్ములకు జరక్కపోయినా చెల్లెళ్లకు ముద్దు మురిపాలు జరుగుతాయి. తండ్రో లేకుంటే అన్నయ్యలో ఆమెను భుజాల మీదకు ఎక్కించుకుని ఆడిస్తారు. తల్లి కోపగించాలని చూసినా గారం చేసి వెనకేసుకు వస్తారు. తండ్రి, అన్నదమ్ముల ప్రేమ పొందిన చెల్లెలు తన జీవితంలో భర్తగా వచ్చే పురుషుడి నుంచి కూడా అలాంటి ప్రేమనే ఆశిస్తుంది. అక్కడ ఏదైనా లోటు జరిగితే అన్నదమ్ముల తోడ ఆ లోటును పూడ్చుకుందామని చూసుకుంటుంది. ఒకప్పటి కాలంలో ఆమె పురుషుల మీద ఆధారపడే స్త్రీ అయినా నేడు ఆర్థికంగా, వ్యక్తిత్వపరంగా స్వతంత్రతను, ఉనికిని చాటుతున్నా అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అనురాగంలో ఎటువంటి మార్పూ ఉండదు. ఉండబోదు. వారు కలిసి పెరిగారు. కలసి బాల్యం పంచుకున్నారు. వారు ఒకరికొకరు తెలిసినట్టుగా మరొకరికి తెలియరు. అందుకే ఆపద వస్తే చెల్లెలు ‘అన్నా’ అంటుంది. అన్న ఉలికిపాటుకు గురైతే చెల్లెలు హాజరవుతుంది. మేనమామ, మేనత్తలుగా ఈ అన్నాచెల్లెళ్లు పిల్లలకు ప్రియ బంధువులవుతారు. అపురూపమైన మానవ బంధాల నిర్మాణం ఇది. చందురుని మించు అందమొలికించు ఎన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెళ్లా అని జనం అనుకున్నారుగాని వారిద్దరూ ‘రక్తసంబంధం’లో అన్నాచెల్లెళ్లుగా చిరకాలం గుర్తుండిపోయే నటనను ప్రదర్శించారు. ఆ అన్నకు చెల్లెలి కోసం సర్వస్వం వదులుకునేంత ప్రేమ. ఆ చెల్లెలికి ఆ అన్న కోసం ప్రాణమే ఇచ్చే పాశం. అబ్బ... ఆ అవినాభావ బంధం చాలా ఉద్వేగపూరితమైనది. ఇదే ఎన్.టి.ఆర్ ‘చిట్టిచెల్లెలు’లో వాణిశ్రీ కోసం ఏడ్చి ఏడ్చి మనకు ఏడుపు తెప్పిస్తాడు. ‘అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప’.. అన్నాచెల్లెళ్ల పాటల్లో కంటిపాప వంటి పాట. అక్కినేని ‘బంగారు గాజులు’లో విజయనిర్మలతో ఈ అనుబంధాన్ని గొప్పగా పండించాడు. ‘అన్నయ్య సన్నిధి... అదే నాకు పెన్నిధి’ పాటలో అన్నగా ఆయనను చూడాలి. శోభన్‌బాబు ‘చెల్లెలి కాపురం’ సినిమా చెల్లెలి సెంటిమెంట్ వల్లే హిట్. ఆయన నటించిన ‘శారద’ సినిమాలో శారదకు అన్నయ్యగా కైకాల సత్యనారాయణ నటించి విలన్ నుంచి పూర్తి స్థాయి కేరెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. ‘కానిస్టేబుల్ కూతురు’లో జగ్గయ్య, కృష్ణకుమారి అన్నాచెల్లెళ్లుగా నటించారు. చెల్లెల్ని ఆట పట్టిస్తూ జగ్గయ్య పి.బి.శ్రీనివాస్ గొంతుతో పాడే ‘చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా’ చాలా బాగుంటుంది. పగ–ప్రతీకారాల దశాబ్దం 1980లు వచ్చే సరికి తెలుగు సినిమాలో చెల్లెలి పాత్ర పరమ స్టీరియోటైప్‌గా మారింది. హీరోకు చెల్లెలు ఉంటే చాలు ఆమె విలన్ బాధలకు బలి అవనున్నదని ప్రేక్షకులకు తెలిసిపోయేది. ఈ పిచ్చి సినిమాల మధ్య కూడా ‘చట్టానికి కళ్లులేవు’లాంటి చిత్రాలు వచ్చాయి. ఇందులో అక్కగా లక్ష్మి, తమ్ముడిగా చిరంజీవి ఘర్షణతో కూడిన బంధంలో కనిపిస్తారు. ఎన్.టి.ఆర్ ‘డ్రైవర్ రాముడు’లో అంధురాలైన తన చెల్లి రోజా రమణితో ‘ఏమని వర్ణించను’ పాట పాడతాడు. తమిళం నుంచి బాపు రీమేక్ చేసిన ‘సీతమ్మ పెళ్లి’లో మోహన్‌బాబు బహుశా తన గొప్ప పెర్ఫార్మెన్స్లలో ఒకటిగా నటించాడు. ఇందులోనే ‘తల్లివైనా చెల్లివైనా’ పాట ఉంది. కొంచెం కాలం ముందుకు నడిస్తే చిరంజీవి తన ‘లంకేశ్వరుడు’లో చెల్లెలి సెంటిమెంట్‌ను చూపడానికి ప్రయత్నించాడు. ఆ సినిమా పని చేయకపోయినా నలుగురు చెల్లెళ్లతో ఆ తర్వాత నటించిన ‘హిట్లర్’ సెకండ్ ఇన్నింగ్స్‌ను చాన్స్ ఇచ్చింది. బాలకృష్ణ ‘ముద్దుల మావయ్య’ సినిమాలో ‘మావయ్య అన్న పిలుపు’ పాట పాడి పెద్ద ఎత్తున హిట్ కొట్టాడు. కృష్ణంరాజు, రాధిక అన్నాచెల్లెళ్లుగా నటించిన ‘పల్నాటి పౌరుషం’ గట్టి కథాంశమే అయినా అంతగా ఆడలేదు. పూర్ణిమ, శివకృష్ణలతో వచ్చిన పరుచూరి రచన ‘ఆడపడుచు’ పెద్ద హిట్ అయ్యింది. నీ పాదం మీద పుట్టుమచ్చనై... ఆ సమయంలోనే గద్దర్ రాసిన ‘మల్లెతీగకు పందిరివోలే’ పాట ‘ఒరేయ్ రిక్షా’ సూపర్‌హిట్ కావడానికి ముఖ్యకారణంగా మారింది. 1995లో వచ్చిన ఈ సినిమా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా... తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’ అనే గొప్ప లైన్‌ను ఇచ్చింది. అయితే ఈ సమయంలోనే వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమా చెల్లెలి పాత్రను చాలా కొత్తగా చూపించింది. ఇందులో పవన్‌కల్యాణ్, వాసుకి మధ్య సన్నివేశాలు గొప్పగా పండాయి. 2000 సంవత్సరం తర్వాత కాలం మారినా చెల్లెలి బంధం మారదు. సినిమాలూ ఆ కథను ఎంచుకోక మానలేదు. ‘పుట్టింటికిరా చెల్లి’ వంటి పాతవాసన వేసే టైటిల్ పెట్టి సినిమా తీస్తే సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. అర్జున్, స్వప్నమాధురి అద్భుతంగా నటించారు. మహేశ్‌బాబు ‘అర్జున్’లో అక్క కీర్తి రెడ్డిని కాపాడుకునే తమ్ముడిగా గొప్పగా నటించాడు. పవన్ కల్యాణ్ ‘అన్నవరం’ చెల్లెలి రక్షణకు వేట కొడవలి పట్టిన అన్నను చూపిస్తుంది. కృష్ణవంశీ ‘రాఖీ’ అనే టైటిల్ పెట్టి మరీ ప్రతి మగవాడు స్త్రీలను సోదరుడిలా చూసుకోవాలనే సందేశంతో హిట్ కొట్టాడు. జూనియర్ ఎన్.టి.ఆర్కు ఆ సమయంలో అవసరమైన హిట్ అది. ఇక రాజశేఖర్, మీరా జాస్మిన్ నటించిన ‘గోరింటాకు’ గొప్ప కరుణరసం పండించి అన్నాచెల్లెళ్ల బంధానికి తిరుగులేదని నిరూపించింది. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకునే ఈ రాఖీ పండగ నాడు ఆ సెంటిమెంట్‌ను పండిస్తూ తీసిన, నటించిన తెలుగు సినిమా వారికి కూడా శుభాకాంక్షలు చెబుదాం. చెల్లెలి క్షేమం కోరుకోని అన్న అన్న శ్రేయస్సు కాంక్షించని చెల్లెలు ఉండరు. తల్లిదండ్రులు ఉన్నా గతించినా తల్లి అంశ చెల్లిలో తండ్రి అంశ అన్నలో చూసుకుంటారు పరస్పరం అన్నాచెల్లెళ్లు. అది రక్తసంబంధం. యుగాలుగా ఏర్పడింది. యుగాంతం వరకూ ఉంటుంది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే భావోద్వేగాలు ఎన్నో సినిమా కథలయ్యాయి. పాటలయ్యాయి. అవుతూనే ఉంటాయి. రాఖీ సందర్భంగా కొన్నింటిని గుర్తు చేసే ప్రయత్నం ఇది. -
నేను బతికే ఉన్నాను, పూర్తి ఆరోగ్యంగా ఉన్నా: శారద
ప్రముఖ సీనియర్ నటి శారద(ఊర్వశి) కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అది చూసి సినీ ప్రముఖులు, నటీనటుటు ఆమె అభిమానులంతా ఆందోళన చెందారు. అయితే దీనిపై స్పష్టత కోసం వారంత ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో తాను బతికేఉన్నానంటూ ఆడియో రూపంలో ఆమె ఓ ప్రకటన విడుదల చేసి తన మరణంపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు. ‘నేను బ్రతికే ఉన్నాను. పూర్తి ఆరోగ్యంతో చెన్నైలోని నా నివాసంలో ఆనందంగా ఉన్నాను. కాకపోతే కాస్తా నలతగా ఉంది అంతే. నా ఆరోగ్యంపై, నా మృతి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకండి. నా ఆరోగ్యం బాగానే ఉంది. ఒక వ్యక్తి చేసిన పొరపాటుకు అందరూ ఆందోళ చెందుతున్నారు. దయ చేసి ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించకండి. నిజానిజాలు తెలుసుకొకుండా ఇలాంటివి వ్యాప్తి చేయడం బాధాకరం’ అని ఆమె అసహనం వ్యక్తం చేశారు. కాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో ఆమె కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఉత్తమ నటిగా మూడు స్లార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 76 సంవత్సరాలు. -
అంతర్ధానమైన అభినయ శారద
డ్యాన్సా.. తనేం చేస్తుంది? అంత మాట అంటారా? కమల కుమారికి ఎక్కడలేని పట్టుదల వచ్చింది. భవిష్యత్‌లో మంచి డ్యాన్సర్ అనిపించుకుంది. ఏంటీ.. భాష రానివాళ్లను పెట్టారెందుకు? జయంతిపై సావిత్రి ఆగ్రహం. జయంతికి పట్టుదల వచ్చింది. భవిష్యత్‌లో ‘నంబర్ వన్ హీరోయిన్’ అంటూ సావిత్రియే మెచ్చుకునే రేంజ్‌కి వెళ్లారు. ‘నీ వల్ల కాదు’ అంటే ‘నా వల్ల అవుతుంది’ అని చేసి చూపించడం కమల కుమారి అలియాస్ జయంతి అలవాటు. అందుకే... ‘అభినయ శారద’గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారు. ‘జెను గూడు (1963).. కథానాయికగా జయంతికి తొలి చిత్రం ఇది. అంటే.. తేనె తుట్టె అని అర్థం. నటిగా జయంతి కెరీర్ తీయగా సాగింది. జయంతి అనేది స్క్రీన్ నేమ్. అసలు పేరు కమల కుమారి. 1945 జనవరి 6న బళ్లారిలో పుట్టింది కమల. తండ్రి బాలసుబ్రహ్మణ్యం ఇంగ్లీష్ లెక్చరర్. ఇద్దరు తమ్ముళ్లు. మగపిల్లలను ఎలా పెంచారో కూతురినీ తల్లిదండ్రులు అలానే పెంచారు. కమల తీరు మగరాయుడిలానే ఉండేది. స్కూల్లో జరిగే కార్యక్రమాల్లో తప్పనిసరిగా డ్యాన్స్ చేసేది. కూతురి డ్యాన్స్ చూసి, ‘క్లాసికల్ డ్యాన్సర్’ని చేస్తే బాగుంటుందని, మదరాసు తీసుకెళ్లారు కమల తల్లి సంతాన లక్ష్మి. సినిమాల్లో డ్యాన్సర్‌గా చేస్తూ, డ్యాన్స్ స్కూల్ నడుపుతున్న చంద్రకళ దగ్గర చేర్పించారు. అయితే కొత్తగా చేరిన కమల భవిష్యత్‌లో సినిమా తారగా రాణిస్తుందని, డ్యాన్స్ బాగా చేస్తుందని ఊహించక ‘తనేం డ్యా¯Œ ్స చేస్తుంది. కాలూ చేయీ ఊపితే డ్యాన్స్ అయిపోతుందా?’ అని డ్యాన్స్ స్కూల్లో సీనియర్లు ఏడిపించారు. పట్టుదలతో నేర్చుకుంది కమల. నటిగా భవిష్యత్‌లో జయంతి చేసిన డ్యాన్సులు అందర్నీ ఆకట్టుకున్నాయి. తెరపైకి జయంతిగా... కమల సినిమాల్లోకి రావాలనుకోలేదు. అనుకోకుండా జరిగిపోయింది. డ్యాన్స్ టీచర్‌కి షూటింగ్ ఉంటే ఆమెతో పాటు వెళ్లింది. అక్కడే ఉన్న కన్నడ దర్శకుడు వైఆర్ స్వామి ముగ్గురు కథానాయికలున్న సినిమా ప్లాన్ చేస్తున్నారు. పండరీ భాయ్, చంద్రకళను ఎంపిక చేశారు. మూడో హీరోయిన్ కోసం వెతుకుతున్న ఆయన కళ్లల్లో కమల పడింది. ముందు కమల తల్లి ఒప్పుకోకపోయినా, స్వామి ఒప్పించారు. అలా ‘జెను గూడు’ సినిమాకి నటిగా తొలిసారి మేకప్ వేసుకుంది కమల కుమారి. ‘నీ చుట్టూ జనం ఉన్నారని మర్చిపో. నేను చెప్పినట్లు చెయ్’ అన్నారు స్వామి. చేసేసింది. అందరూ చప్పట్లు కొట్టారు. అయితే స్క్రీన్ నేమ్ కమల కుమారి అంటే పెద్దగా ఉంటుందని ‘జయంతి’ అని నిర్ణయించారు. పేరు పెట్టిన ముహూర్తం మంచిది. పేరు బలం సెంటిమెంటూ వర్కవుట్ అయింది. సినిమా కూడా సూపర్ హిట్. జయంతి బిజీ కథానాయిక అయ్యారు. చిన్న దేవకన్యగా... నిజానికి కథానాయికగా ‘జెను గూడు’లో కనిపించకముందే తెలుగు, తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేసింది కమల. డ్యా¯Œ ్స నేర్చుకోవడానికి మదరాస్ వెళ్లినప్పుడు ఎన్టీఆర్‌ని చూడ్డానికి వెళ్లింది. అప్పుడాయన ఒళ్లో కూర్చోబెట్టుకుని ‘నాతో యాక్ట్ చేస్తావా?’ అని అడిగారు. నిజంగానే ఎన్టీఆర్ సరసన నటించింది. ఎన్టీఆర్ ‘జగదేకవీరుని కథ’లో చిన్న దేవకన్యగా చేసింది కమల. అయితే దేవకన్య అంటే వయ్యారంగా నడవాలి. టామ్ బాయ్ కమల విసావిసా నడుచుకుంటూ వెళుతుంటే, ‘అబ్బాయిలా నడుస్తున్నారేంటి?’ అని ఎలా నడవాలో చూపించారు ఎన్టీఆర్. ‘ఆ తర్వాత నా నడక మారింది’ అని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయంతి అన్నారు. ‘దొంగ మొగుడు’లో..., ‘మిస్ లీలావతి’లో... స్విమ్ సూట్లో... వరుసగా ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చిన జయంతి ‘మిస్ లీలావతి’ (1965)లో స్విమ్ సూట్ ధరించడం చర్చనీయాంశమైంది. అప్పటివరకూ లంగా, వోణీ, చీరలకే పరిమితమైన కన్నడ సినిమా ఆ తర్వాత స్కర్ట్స్–టీషర్ట్.. ఇలా ఆధునిక దుస్తులకు మారింది. ఆ సినిమాలో నటనకుగాను జయంతికి మంచి మార్కులు పడ్డాయి. సొంత గొంతుతో... ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాషలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు జయంతి. కొత్త భాషలు నేర్చుకోవాలనే పట్టుదల జయంతికి కలగడానికి కారణం సావిత్రి. ఓ తమిళ సినిమాలో సావిత్రి కాంబినేష¯Œ లో చేస్తున్నప్పుడు జయంతి డైలాగ్ చెప్పడానికి తడబడ్డారు. ‘భాష రానివాళ్లను తీసుకొచ్చారేంటి’ అని సావిత్రి విసుక్కున్నారు. దాంతో మాస్టారుని పెట్టుకుని, తమిళం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఓ సినిమాలో ఆమెకు అత్తగా సావిత్రి నటించారు. ఆ షూట్లో సావిత్రిని ఆశీర్వదించమని జయంతి అడిగితే, ‘కన్నడంలో నంబర్ వన్ హీరోయి¯Œ వి. నా కాళ్ల మీద పడుతున్నావేంటి?’ అన్నారామె. ‘నేను ఇలా ఉన్నానంటే కారణం మీరే. భాష నేర్చుకునేలా చేశారు’ అన్న జయంతిని సావిత్రి ఆశీర్వదించారు. కన్నడ, తెలుగు, తమిళం తదితర భాషల్లో హీరోయిన్గా నటించిన జయంతి ‘పెదరాయుడు’, ‘వంశానికొక్కడు’, ‘ఘరానా బుల్లోడు’, ‘రాముడొచ్చాడు’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లోనూ మెప్పించారు. రాజకీయాల్లోనూ... 1998 లోక్‌సభ ఎన్నికల్లో చిక్ బళ్ళాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు కానీ జయంతికి విజయం దక్కలేదు. 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కోరటగీరె నియోజకవర్గం నుండి పోటీ చేసి, ఓటమి చెందారు. నిద్రలోనే... ఆదివారం బనశంకరిలోని తన నివాసంలో కన్నుమూశారు జయంతి. కొన్నాళ్లుగా ఆమె శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డారు. ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు. దక్షిణాదితో పాటు హిందీ, మరాఠీ భాషల్లో కలిపి దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ఈ అభినయ శారద భౌతికంగా అంతర్థానమైనప్పటికీ అద్భుత పాత్రల ద్వారా ప్రేక్షకుల గుండెల్లో మిగిలిపోతారు. ‘కొండవీటి సింహం’లో..., ‘పెదరాయుడు’లో... జయంతి అంత్యక్రియలు నేడు (మంగళవారం) బెంగళూరులోని బనశంకరి స్మశానవాటికలో జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రవీంద్ర కళాక్షేత్రంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం అంత్యక్రియలను పూర్తి చేయనున్నట్లు జయంతి తనయుడు కృష్ణకుమార్ తెలిపారు. తెలుగు దర్శకుడు పేకేటి శివరాంతో జయంతి పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటగానే సాగింది. కొన్నాళ్లకే వారు విడిపోయారు. తనయుడు కృష్ణకుమార్‌కి సినిమాలంటే ఆసక్తి లేకపోవడంతో ఇటువైపుగా తీసుకురాలేదామె. ఇందిరా గాంధీ చేతుల మీదుగా... జయంతికి ‘గ్లామర్ దివా’ పేరు తెచ్చిన ‘మిస్ లీలావతి’ ఆమెకు ప్రెసిడెంట్ మెడల్ దక్కేలా చేసింది. ఆ సమయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ మెడల్ అందించి, ముద్దాడి.. జయంతికి గుడ్ లక్ చెప్పారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇచ్చిన ‘అభినయ శారదె’ (అభినయ శారద) బిరుదుతో పాటు మరెన్నో అవార్డులు అందుకున్నారు. ఆ హెడ్‌లైన్స్‌తో జోడీ కట్ కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్–జయంతి కలిసి దాదాపు 45 సినిమాలు చేశారు. ఈ జంటకు ‘రాజా జోడీ’ అని పేరు. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రాల్లో ‘బహద్దూర్ గండూ’ది ప్రత్యేకమైన స్థానం. నువ్వా? నేనా అన్నట్టుగా నటించారు. ఆ సినిమా విడుదలయ్యాక ఇంగ్లీష్ మ్యాగజీ¯Œ ్స అన్నీ ‘జయంతి స్టీల్స్ ది షో’ అని రాశాయి. అంతే.. రాజ్‌కుమార్‌తో జయంతికి అదే చివరి సినిమా. ఆ హెడ్లై¯Œ ్స రాయకుంటే మరిన్ని సినిమాలు చేసేవాళ్లమేమో అని ఓ సందర్భంలో జయంతి అన్నారు. అయితే రాజ్‌కుమార్ ఉన్నంతవరకూ ఆయనతో స్నేహం అలానే ఉంది. – డి.జి.భవాని -
Maoist Party : హిడ్మా, శారద క్షేమమే
సాక్షి, హైదరాబాద్/గంగారం: తమ పార్టీ అగ్రనేతలు మడవి హిడ్మా, శారద అలియాస్ జజ్జర్ల సమ్మక్కలు క్షేమంగానే ఉన్నారని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. హిడ్మా, శారదక్కలు మరణించారంటూ పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఒకవేళ వారు మరణిస్తే తామే సమాచారం ఇస్తామని వెల్లడించారు. ఇటీవల మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, మరో నేత భారతక్క కరోనా బారినపడిన సమయంలో పోలీసులు, గ్రేహౌండ్స్ జవాన్లు తమపై దాడికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అందుకే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తమ అగ్రనేతలకు సరైన చికిత్స అందించలేకపోయామని పేర్కొన్నారు. ఎవరి మాటలు నమ్మాలి: లింగమ్మ కరోనా నేపథ్యంలో ఇటీవల తన అల్లుడు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మృతి చెందినట్లు ప్రచారం అయిందని, చివరికి ఇదే విషయాన్ని మావోయిస్టులు అధికారికంగా ప్రకటించారని శారదక్క తల్లి లింగమ్మ అన్నారు. అది జరిగాక నాలుగు రోజులకే తన కూతురు శారదక్క కూడా మృతి చెందిందని ప్రచారం జరగడంతో తామంతా దుఃఖ సాగరంలో మునిగి పోయామన్నారు. భార్యాభర్తలు చనిపోవడంతో ఇద్దరికీ కలిపి పెద్దకర్మ చేసేందుకు కార్డులను ముద్రించామని చెప్పారు. కానీ ఇప్పుడు శారదక్క బతికుందని మావోయిస్టు పార్టీ ప్రకటించడంతో కుటుంబసభ్యులమంతా అయోమయంలో పడిపోయామని తెలిపారు. ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదన్నారు. చదవండి: దళిత సాధికారత: మేధావులకు సీఎం కేసీఆర్ పిలుపు -
మహిళా నమామి వారధి
‘దేవుడు అన్నిచోట్లా ఉండలేక..’ అని మనకో స్త్రీ–స్తుతి ఉంది. అన్నిచోట్లా ఉండలేక ఆ భగవంతుడు స్త్రీని సృష్టించాడని! నిజమే. ఈ పన్నెండు నెలలూ స్త్రీ చాలా చోట్ల ఉండవలసి వచ్చింది. ఏం చేస్తుంది మరి?! దేవుడు పరుగులు తీయలేకపోయాడు. ఆమెకంటే అధికుడిననుకునే మానవుడు ‘నేనూ అన్నిచోట్లా ఉండలేను’ అనేశాడు! ఇక ప్రతి చోటా స్త్రీనే. పనిగంటలు పెరిగిన వంటిళ్లలో అన్నపూర్ణమ్మగా.. చెత్త పేరుకుపోతున్న వీధులలో పారిశుధ్య ప్రాణదాతగా.. ఊరెంతకీ రాని ఎండ దారుల్లో వలసమాతగా.. ఊపిరులు పోస్తున్న ఆసుపత్రులలో అమృతమయిగా; ఇంటింటా గడపల్లో, ఊరూరా కూడళ్లలో ఒక్కర్నీ బయటికి రానివ్వని రక్షణనేత్రిగా ప్రతిచోటా స్త్రీనే. అన్నమూ నీళ్లిస్తూ హైవేలలో, ఉన్నదేదో పంచి ఇస్తూ చుట్టుపక్కల్లో, విరుగుడు కనిపెడుతూ లేబరేటరీల్లో.. మనిషి ఆశ, ఆయువు తనే అయి, తిరగడం ఆగబోతున్న గ్లోబుకు గ్లూకోజ్ అందించి తిరిగే వేగాన్ని పెంచిందీ, మానవ జీవనాన్ని మళ్లీ గాడిలో పెట్టిందీ స్త్రీనే. ఎంత శక్తి, ఎంత ఓర్పు, ఎంత నేర్పు, ఎంత నిబ్బరం, ఎంత త్యాగం.. దేవుడు కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు స్త్రీలోని తన ప్రతిరూపాన్ని ఇంత మల్టీటాస్కింగ్‌లో చూసి! ఐక్యరాజ్య సమితి కూడా అలాగే స్టన్ అయింది. ‘వ్వావ్ షి ఈజ్ ద లీడర్’ అంది! భద్రమైన భావి సమాజ నిర్మాణానికి మహిళే లీడర్ అని ప్రకటించింది. అటువంటి కొందరు లీడర్స్‌కి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’ నమస్సులు తెలియజేస్తోంది. నమో నమామి మహిళామూర్తి.. మానవీయ స్ఫూర్తి. క్యాన్సర్ రోగుల చివరి మజిలీకి ‘స్పర్శ్’ ద్వారా స్వస్థత కలిగిస్తున్న శారద లాక్డౌన్ టైమ్‌లో అందించిన సేవలు, ధైర్యం, టీమ్ లీడింగ్ అసమానమైనవి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఈ స్వస్థత ఆలయంలోకి అడుగు పెడితే అక్కడ కనిపించే దృశ్యాలు మనసును తడి చేస్తాయి. ‘కరోనా కష్టం సామాన్యమైనది కాదు. కానీ, ఎదుర్కోవాల్సిందే అనుకున్నా’ అంటూ లాక్డౌన్ టైమ్‌ని వివరించారు శారద. ‘‘లాక్డౌన్ ప్రకటించగానే మనల్ని మనం రిస్క్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా.. అనే దశ నుంచి ఆలోచించాను. ‘నేనే ఇలా భయపడితే... రేపో మాపో చనిపోతామని తెలిసిన వాళ్లని వదిలేయచ్చా..’ అనిపించింది. దాంతో నాకేదో వస్తుందేమో అనే ఆలోచననే మానేశాను. ధైర్యంగా ముందడుగు నాతో పాటు నలుగురు నర్సులు, ఐదుగురు ఆయాలు క్లినిక్‌లో, బయట వాలంటీర్లు పని చేస్తున్నారు. అందరికీ కరోనా ఏ రూపంలో వస్తుందో అనే భయం. టీమ్ లీడర్‌గా జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యమిస్తూ ముందుకు తీసుకెళ్లడం పెద్ద టాస్క్. ‘మా అమ్మగారు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మాకేం చేయాలో తెలియట్లేదు’ అంటూ విదేశాల్లో ఉండిపోయి రాలేకపోయిన పిల్లల అభ్యర్థన. అలాంటి తల్లులకు, తండ్రులకు దాదాపు 30 ఇళ్లకు వెళ్లి సేవలు అందించాం. ఇంత మంది చనిపోయారు అని రోజూ సాయంత్రం హెల్త్ బులెటెన్.. ‘మాక్కూడా కరోనా వస్తుందా? చనిపోతామా’ అనేవారు పేషెంట్లు. వారిలో మనోధైర్యం నింపడానికి ప్రతి క్షణం పనిచేశాను. అంతిమయాత్ర మరో రిస్క్ మరణించినవారికి గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన సమయంలో ఒంటరిగా అంతిమయాత్ర కు వెళుతున్నారని వార్తలు. అలాంటిది క్యాన్సర్ పేషంట్ చనిపోతే.. అదో పెద్ద కష్టం. చనిపోతున్న తల్లికి బిడ్డలు కూడా రాలేని పరిస్థితి. విపరీతమైన క్షోభ. నెల రోజులు, రెండు నెలలు, 15 రోజుల వ్యవధిలో చనిపోయిన వారున్నారు. మనుషుల భావోద్వేగాలకు సంబంధించిన సేవ ఇది. ‘ఒకబ్బాయి ఇసిఐఎల్ నుంచి బంజారాహిల్స్‌లో మా క్లినిక్‌కి వాళ్లమ్మ కోసం రోజూ ఉదయం నడుచుకుంటూ వచ్చేవాడు. వాళ్లమ్మది చివరి స్టేజ్. అతను అమ్మకు దగ్గరగా ఉండలేడు. అంత దూరం నుంచి ఎందుకు రిస్క్.. అంటే మీ ద్వారా మా అమ్మ గురించి వినడానికైనా ఇక్కడుంటాను కదా! అనేవాడు. అలా చివరి మజిలీ పేషెంట్స్ 11 మంది ఉండేవారు. వాళ్ల పిల్లలతో వీడియో కాల్ చేసి మాట్లాడించేవాళ్లం. అడ్డు చెప్పద్దని అడ్డుకున్నాను నాకు 57 ఏళ్లు. మా వారు అమ్మాయిని చూడటానికని అమెరికా వెళ్లి, లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. ఇక్కడ నేనొక్కదాన్నే. ఈ వయసు వారికి కరోనా త్వరగా ఎఫెక్ట్ అవుతుందన్న వార్తలు. మా వారు, అమ్మాయి నుంచి ఫోన్లు. కరోనా కాలం ఈ సేవలు ఆపేయమని. ‘కష్టకాలంలో ఆపేస్తే నన్ను నేను క్షమించుకోలేను, అడ్డుచెప్పద్దు’ అన్నాను. కళ్లతో ప్రేమను పంచుతూ.. స్పర్శ అనేది శక్తిమంతమైన విధానం. ఆ స్పర్శనే వద్దనేది కరోనా నినాదం. చాలా కఠినమైన సందేశం. కళ్లతో ప్రేమను చూపుతూ, మాటల్లో ధైర్యం చెబుతూ కదిలాం. కోవిడ్ సమయంలో 24 గంటలు సేవలో ఉన్నా మాలో ఎవరికీ కోవిడ్ రాలేదు. అదంతా మా సంకల్పమే. కష్టకాలంలోనూ చివరిమజిలీకి చేరుకున్నవారికి చేయూత అందించాను అనే తృప్తి మిగిలింది’’ అని శారద వివరించారు. క్యాన్సర్ ఇక చికిత్సకు తగ్గదని నిర్ధారించిన పేషంట్లను పాలియేటివ్ కేర్‌కు రిఫర్ చేస్తారు వైద్యులు. అలా వచ్చిన వారు కుటుంబం నుంచి దూరమయ్యామనే బాధ, నొప్పి, సామాజికం గా దూరం, ఆర్థిక సమస్యలతో పాటు ఆధ్యాత్మికంగానూ ఎన్నో బాధలు ఉంటాయి. ‘నేనేం తప్పు చేశాను. భగవంతుడా నాకెందుకీ శిక్ష వేశావు’ అని మధనపడుతుంటారు. అలాంటి వారికి స్పర్శ్‌లో స్వస్థత అందుతుంది. ఇక్కడ పేషంట్లను బతికున్నన్ని రోజులు భద్రంగా చూసుకునే ఆలయం. అలాంటి వారి మీద కరోనా పిడుగు పడినప్పుడు అండగా నిలిచారు శారద. ఊహించని కష్టం వచ్చిపడినప్పుడు ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని కష్టంలో ఉన్నప్పుడు చివరి మజిలీలో ఉన్న తల్లికి అసహాయ స్థితిలో ఉన్న బిడ్డకు వారధిగా నిలిచారు శారద లింగరాజు. డాక్టర్ దణ్ణం పెట్టారు చిత్తశుద్ధితో సేవచేసిన వైద్యదూత మా ఆస్పత్రిని కోవిడ్ నోడల్ సెంటర్‌గా ప్రకటించారు. ప్రాణభయంతో వణికిపోతున్న కరోనా బాధితులకు సేవలు అందించడమే మహాభాగ్యం అనుకున్నా. తొమ్మిది నెలలపాటు అలుపెరుగకుండా పనిచేశాం. పీపీఈ కిట్ లోపల చెమటకు చీమలు కుట్టినట్లు శరీరమంతా చురుక్కుమనేది. నాలుక పిడచకట్టుకు పోతున్నా, డీహైడ్రేషన్‌తో చుక్క నీళ్లు కూడా తాగే అవకాశం లేదు. పంటిబిగువున అన్నిబాధలను భరిస్తూ డ్యూటీ చేశాం. కరోనా ఏడాదిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. గతేడాది మార్చిలోనే గాంధీలో మొదటి కరోనా మృతి నా ఎదురుగానే అయింది. ఆయనను కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. అప్పటినుంచి ప్రతి పేషెంట్‌కీ వైద్యసేవతోపాటు కౌన్సెలింగ్ ఇచ్చి మనోధైర్యం కల్పించే వాళ్లం. పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్టు కరోనాతో గాంధీలో చేరింది. డిశ్చార్జ్ అయి వెళ్తూ ఆమె రెండు చేతులెత్తి నమస్కరించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. వేలాది ప్రాణాలకు కాపాడడంలో మా సేవ ఉందని సంతృప్తి ఉంది. భారత సైనికదళాలు... గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై పూలవర్షం కురిపించిన తర్వాత... స్థానికులు, కుటుంబ సభ్యులు నాపై పూలవర్షం కురిపించి అభినందించడాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. వేలాది మంది కరోనా బాధితుల మధ్య విధులు నిర్వహించినా కరోనా రాకపోవడం నిజంగా అదృష్టమే. జోజి కే అలెక్స్, స్టాఫ్‌నర్సు, గాంధీ హాస్పిటల్ సేవకు ఏటీఎమ్ స్ఫూర్తి జీవనంలో పేదరాలే కానీ, సేవలో సంపన్నురాలు అనిపించుకుంది ఎల్బినగర్ రాక్హిల్స్ కాలనీకి చెందిన లక్ష్మమ్మ. ఒక అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పనిచేసే లక్ష్మమ్మ నెల జీతం ఆరువేల రూపాయలు. లాక్డౌన్ టైమ్‌లో అందులో సగం డబ్బును ఖర్చుపెట్టి, వలసకార్మికుల కోసం ఆహారం వండిపెట్టేది. ఆమె చేసిన సేవ మరికొందరికి స్ఫూర్తినిచ్చింది. లాక్డౌన్ సమయంలో చేసిన పని గురించి అడిగితే ‘కష్టం చూడలేక తోచిన సాయం చేశాను’ అని తెలిపింది. వలసకార్మికులకు వండి పెడుతూ... ‘‘నేను పనిచేసే అపార్ట్మెంట్లో పది ప్లాట్లు ఉంటాయి. ఉన్న ఊరు వదిలిపెట్టి బతుకుతెరువు కోసం పట్నం వచ్చినం. రెక్కల కష్టంతో గడుపుకొస్తున్నం. కరోనా భయంతో ఎవరూ ఇళ్లు వదిలిపెట్టి రాలేని పరిస్థితి. మేమూ అదే పాటించేవాళ్లం. అయితే, మా చుట్టుపక్కల బిల్డింగ్ పనులు చేసేవారు కొందరున్నారు. వారంతా వలస వచ్చి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అందులో పిల్లలు, చంటి పిల్లల తల్లులూ ఉన్నారు. బిల్డింగ్‌ల పనులు ఆగిపోవడంతో వారికి పనిలేదు, చేతిల పైసలు లేవు. వారి అవస్థలు చూడలేక రోజూ కొంతమందికి అన్నం వండి పెట్టేదాన్ని’ అని తన దయార్ద్ర మనసును చాటుకుంది లక్ష్మమ్మ. ఒక అడుగుతో కదిలిన వేయి అడుగులు లక్ష్మమ్మ చేస్తున్న సాయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాము రైస్ ఏటీఎమ్‌ను ఏర్పాటు చేసి, ఇప్పటికీ పేదలకు సాయం అందిస్తున్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడం కోసం మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని 80 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంచుతున్నారు. లాక్డౌన్ టైమ్ నాటి సంఘటనలను, తనలో స్ఫూర్తిని నింపిన లక్ష్మమ్మ గురించి వివరించిన రాము దోసపాటి మాట్లాడుతూ –‘ఒక రోజు మా అబ్బాయి కోసం చికెన్ షాప్‌కి వెళితే, అక్కడ 20 కేజీల చికెన్ తీసుకుంటున్న లక్ష్మమ్మను చూశాను. ఈ సమయంలో అంత చికెన్ ఎందుకని అడిగాను. ‘వలస కార్మికులు తిండి లేక అవస్థపడుతున్నారు సారు. వారి కోసం వండిపెడుతున్నాను. చాలా ఆశ్చర్యపోయాను. ఆమె చేస్తున్న సేవను స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆమె చెప్పిన వివరాలతో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో భవన నిర్మాణ, వలసకార్మికులు ఎంతమంది ఉన్నారో చూశానో. వారి దయనీయ పరిస్థితికి కళ్లలో నీళ్లు వచ్చాయి. రైస్ ఏటీఎమ్ ద్వారా పేదలకు ఇప్పటికీ సాయం చేస్తున్నాను’ అని తెలిపారు. మనసెరిగిన నేస్తం చేయూత ఫ్యాషన్ డిజైనర్‌గా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి నేను సైతం అంటూ ముందడుగు వేసింది నిహారికారెడ్డి. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడాలో తన డిజైనర్ స్టూడియో ద్వారా 15 మందికి ఉపాధి కల్పిస్తోంది. లాక్డౌన్ సమయంలో తన దగ్గర పనిచేసే వారిని వారి ఊళ్లకు, ఇళ్లకు చేర్చడమే కాకుండా చేనేత రంగానికి తన వంతు సాయం చేయడానికి ముందుకు కదిలింది. నిత్యావసర సరుకుల పంపిణీలో మరొక అడుగు ముందుకు వేసి అమ్మాయిలకు శానిటరీ న్యాప్కిన్స్ పంచింది. ‘‘మా వారు కణ్ణన్ సినిమా రంగంలో ఉన్నారు. ఓ రోజు మా ఇంటికి నెలకు సరిపడా సరుకులున్న బ్యాగ్ వచ్చింది. చిరంజీవిగారు అందరికీ సరుకులు పంచారని తెలిసింది. అది చూశాక ఇలాంటి పాకెట్స్ నిరుపేదలకు అందివ్వాలనే ఆలోచన వచ్చింది. దాంతోపాటు అమ్మాయిలు, అమ్మలు గుర్తుకువచ్చారు. వారి కోసం శానిటరీ ప్యాడ్స్ కొనుగోలు చేసి, సరుకులతో పాటు అందించాం. మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పేద ఇళ్ల ముందుకు తీసుకెళ్లి మేం సిద్ధం చేసిన ప్యాకెట్స్ పెట్టి వచ్చాం. చేనేతకు చేరువగా.. నేను డిజైనర్ కావడంతో చేనేత కార్మికుల పరిస్థితి లాక్డౌన్ టైమ్‌లో ఎలా ఉందో ఊహించగలను. చీరలు అమ్ముడు పోకపోతే డబ్బు చేతికి రాదు, వారి రోజువారి జీవనం కష్టమైపోతుంది. అందుకే పర్మిషన్ తీసుకుని నేరుగా నారాయణపేట్ చేనేతకార్మికుల దగ్గరకు వెళ్లి వారి నుంచి మెటీరియల్ కొన్నాను. ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రామ్స్ చేశాను. వారి స్థితి చూసి, కొంతమంది ఆర్డర్ మీద అప్పటికప్పుడు ఆ చీరలను తెప్పించుకున్నారు. లాక్డౌన్ టైమ్‌లో కొన్న చేనేతచీరలతో ఇప్పుడు రీక్రియేషన్ డిజైన్స్ చేస్తున్నాను. బంగారం తాకట్టు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు అందివ్వడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ ఇందుకు సంబంధించిన డబ్బును షాపుల్లో కడుతున్నాను. నా సేవకు మిత్రులు కొంత సాయంగా నిలిచారు. అయినా డబ్బు సరిపోక పోతే నా బంగారం పై లోను తీసుకున్నాను. దీంతో సరుకుల పంపిణీ కార్యక్రమం ఒక యజ్ఞంలా నడించింది. కరోనా సమయంలో సేవలు అందించినందుకు గాను చిరంజీవిగారి చేతుల మీదుగా కరోనా వారియర్ అవార్డు అందుకున్నాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద’ని వివరించారు. – నిర్మలారెడ్డి -
‘సాఫ్ట్వేర్ శారద’కు సోనూసూద్ జాబ్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన టెకీ శారదకు తన వంతు సహాయం చేస్తానని నటుడు సోనూసూద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం తన ప్రతినిధి ఆమెకు జాబ్ ఆఫర్ లెటర్ అందించినట్లు సోనూసూద్ సోషల్ మీడియాలో వెల్లడించారు. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన శారద జీవితంపై ‘సాక్షి’వెలువరించిన కథనంపై స్పందించాల్సిందిగా కోరిన ఓ నెటిజన్ విజ్ఞప్తిపై.. ఆయన ఈ మేరకు స్పందించారు. ‘‘మా ప్రతినిధి తనను కలిశారు. ఇంటర్వ్యూ పూర్తైంది. జాబ్ లెటర్ కూడా పంపించాం. జై హింద్’’అని సోనూసూద్ ట్వీట్ చేశారు.(సోనూ భాయ్‌కే పన్నులు కట్టేద్దాం!) కాగా కరోనా లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శారద కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె జీవన గమనంపై ‘సాక్షి’ వెలువరించిన కథనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉద్యోగం కోల్పోయినంత మాత్రాన దిగులుపడాల్సిన పనిలేదని, బతికేందుకు ఎన్నో మంచి మార్గాలు ఉన్నాయన్న ఆమె మాటలు యువతరానికి ఆదర్శంగా నిలిచాయి. ఈ క్రమంలో సమస్యలకు ఎదురొడ్డి పోరాడాలన్న శారద కథనం.. ‘రియల్ హీరో’ సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఈ మేరకు సానుకూలంగా స్పందించారు. ఇక కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో వారందరి కోసం సోనూ సూద్ ఓ కొత్త యాప్‌ను తయారు చేయించిన విషయం విదితమే. ఈ యాప్ ద్వారా అవసరంలో ఉన్నవారి అర్హతలను బట్టి ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు చేస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు.(8 లక్షల ట్రాక్టర్, రొటావేటర్..) యాప్‌తో ఉద్యోగం My official met her. Interview done. Job letter already sent. Jai hind 🇮🇳🙏 @PravasiRojgar https://t.co/tqbAwXAcYt — sonu sood (@SonuSood) July 27, 2020 -
సోనూ భాయ్‌కే పన్నులు కట్టేద్దాం!
ముంబై: ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా సాగుతున్న నటుడు సోనూ సూద్‌ను దేశమంతా రియల్ హీరో అంటూ కీర్తిస్తోంది. ఆయన మేలు పొందినవారు, అభిమానులు సోనూను దేవదూతగా అభివర్ణిస్తున్నారు. మార్చిలో విధించిన లాక్డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను బస్సుల్లో ఇళ్లకు చేర్చే సేవలకు ఆయన శ్రీకారం చుట్టారు. అక్కడితో ఆగకుండా తర్వాత రైళ్లలో కార్మికుల స్వస్థలాల తరలింపునకు నడుం బిగించారు. తాజాగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సొంత ఖర్చులతో స్వదేశానికి రప్పిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా జలసీగా ఫీలయ్యేంత పేరు గడించారు. ఎప్పటికప్పుడు తన సేవలను సోషల్ మీడియాలో వెల్లడి చేస్తూ ఆర్థులకు చేయూత నిచ్చేందుకు మరింత మంది ముందుకు వచ్చేలా చేస్తున్నారు. ఇక ఈ రియల్ హీరో గొప్ప మనసుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వర్షం కురుస్తోంది. ‘యావత్ భారతం సోనూ సూద్ అని నినదిస్తోంది. ఇచ్చిన హామీలు ఇంత త్వరగా నిజ రూపం దాల్చడం అద్భుతం’ అని ఒకరు.. ‘ఇంత మందికి, ఇన్ని రకాల సేవలు చేస్తూ ఆదుకుంటున్న సోనూ భాయ్‌కే మనమంతా పన్నులు చెల్లిస్తే బాటుంటుంది కదా!’ అని మరొకరు తమ అభిమానాన్ని చాటుకున్నారు. (చదవండి: ఇష్టపడిన వ్యక్తితో కోర్టులో వివాహం.. వన్ సెకన్!) దూరమెంతో లేదుగా.. తాజాగా కిర్గిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పిస్తానని సోనూ మాటిచ్చారు. సోమవారం (జులై 27) బిష్కేక్ నుంచి ఢిల్లీకి మీరంతా చేరుకుంటారని ట్విటర్లో వెల్లడించారు. ఇప్పటికే కిర్గిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను వారణాసి, విశాఖపట్నానికి సొంత విమాన ఖర్చులతో ఆయన రప్పించారు. తాజాగా ఫిలిప్పీన్స్‌లో చిక్కుకున్న వారిని కూడా భారత్‌కు రప్పిస్తానని సోనూ తెలిపారు. ‘మీరంతా త్వరలో భారత్‌లో ఉంటారు. దిగులు పడొద్దు’అని ట్వీట్ చేశారు. ఫిలిప్పీన్స్ మనకు దగ్గరేగా అని భరోసా నిచ్చారు. గంటల్లోనే నిజమయ్యే మాటలు ఇక చిత్తూరు జిల్లాకు చెందిన నాగేశ్వరరావు అనే రైతు, అతని భార్యాబిడ్డలు పడుతున్న కష్టం చూసి చలించిన సోనూ వారికి ట్రాక్టర్ అందించి ఆదుకున్నారు. హామీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే సోనూ సూద్ సాయం చేయడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. దీంతోపాటు లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్వేర్ శారద కథనంపై స్పందించిన సోనూ సూద్ ఆమె ఫోన్ నెంబర్ కనుక్కుని, ఆమె కుటుంబానికి వ్యక్తిగతంగా సాయం చేస్తానని ప్రకటించారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన శాంతా బాలు పవార్ (85)కు అండగా ఉంటానని సోనూ ప్రకటించారు. మహిళలకు ఆత్మరక్షణా టెక్నిక్‌లు నేర్పించేందుకు బామ్మతో ఓ ట్రైనింగ్ స్కూల్‌ను పెట్టిస్తానని తెలిపారు. పొట్టకూటి కోసం కర్రసాము చేసిన బామ్మ వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. 😂🙏 https://t.co/zYdfidNWVj — sonu sood (@SonuSood) July 26, 2020 -
జీవితం పచ్చగా ఉంది
బీటెక్ కంప్యూటర్స్ చేసింది. కూరగాయలు అమ్ముతోంది. ఏం పచ్చగా ఉన్నట్లు?! మూడు నెలలు జీతం తీసుకుంది. తర్వాతి నెల్లో జాబ్ పోయింది. ఏం పచ్చగా ఉన్నట్లు?! నాలుగు రాళ్లు వస్తున్నాయి. మూడు రాళ్లు ఇంటి అద్దెకే పోతున్నాయి. ఏం పచ్చగా ఉన్నట్లు?! అన్నీ ఉండటం పచ్చదనం మనకు. కష్టకాలంలోనూ.. ధైర్యమే పచ్చదనం శారదకు. ‘నీ కష్టం, శ్రమ లేకుండా నీకు అంది వచ్చిన గౌరవాలేవీ నీకు సంతృప్తినివ్వలేవు’ ఈ కొటేషన్ చెప్పింది తత్వవేత్త కాదు. ఒక మామూలు అమ్మాయి. అత్యంత సామాన్యమైన అమ్మాయి. ఈ ఒక్కమాటలో ఆమె తన జీవితాన్ని చెప్పుకుంది. నిజమే... ఇది ఆమెకు ఆమె చెప్పుకున్న సూక్తి. అలాంటి ఎన్నో సూక్తులను సొంతంగా రాసుకుంది శారద. తాను రాసుకున్న ఆ సూక్తులతోనే తనను తాను చైతన్యవంతం చేసుకుంది ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా ఆమె రాసుకున్న స్ఫూర్తిదాయకమైన వచనాలే ఆమెను ధైర్యంగా నిలబెట్టాయి. ‘‘కరోనా కష్టకాలంలో ఎదురైన చేదు అనుభవం నుంచి నన్ను నేను నిలబెట్టుకున్న ధైర్యవచనాలవి’’ అంటోంది శారద. కూరగాయలతో కొత్త దారి శారద బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి, కొన్నాళ్లు ఢిల్లీలో ఉద్యోగం చేసింది. తర్వాత హైదరాబాద్‌లోనే ఉద్యోగం చూసుకుందామనుకుని వెనక్కి వచ్చేసి కొత్త ఉద్యోగంలో చేరింది. కార్మికనగర్‌కు దగ్గరలోని ఎస్పీఆర్ హిల్స్‌లో నివాసం. ఓ ఆరు నెలల కిందట మరో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ మూడు నెలలు జీతం తీసుకోగానే ఓ విపత్తు. కరోనా విలయతాండవం మొదలైంది. ఆ కంపెనీ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం సంక్షోభంలో పడింది. ఉద్యోగులను సమావేశ పరిచి ‘ఈ పరిస్థితుల్లో సంస్థను నడిపించడం కష్టం కాబట్టి అర్థం చేసుకోవలసింది’గా సూచించారు పై స్థాయి ఉద్యోగులు. ‘‘జీవితంలో ఎదురయ్యే సంఘటనలన్నీ మనకు నచ్చినవే ఉండవు. ఎదురైన వాటిని యథాతథంగా స్వీకరించి తీరాల్సిందే. మనకు మరొక ఆప్షన్ ఉండదని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. అయితే ఆ క్షణంలో ఉద్వేగాన్ని అదిమి పెట్టుకోగలిగాను కానీ, ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాత్రంతా ఏడ్చాను. ఉదయానికి ఒక నిర్ణయానికి వచ్చేశాను’’ అని చెప్పింది శారద. ఆ నిర్ణయమే ఇప్పుడామె చేస్తున్న కూరగాయల వ్యాపారం. ‘‘సౌకర్యవంతమైన జీవితం అనేది దేవుడిచ్చే బహుమతి. ఆ బహుమతిని దేవుడు ఇచ్చినప్పుడు ఆస్వాదించాలి. ఇవ్వనప్పుడు మనంతట మనం మనకు సాధ్యమైన జీవితాన్ని జీవించాలి. అంతే’’ అని చిరునవ్వు నవ్వింది. ఇంత చిన్న వయసులో ఆమెలో ఇంతటి పరిణతి, జీవితం పట్ల ఆ అమ్మాయికి ఉన్న స్పష్టత ఆశ్చర్యం కలిగిస్తాయి. పెద్ద పాఠాలున్న తన చిన్న జీవితాన్ని శారద అలవోకగా వివరించింది. ర్యాంక్ రుచి ‘‘మాది వరంగల్ జిల్లా వర్ధన్నపేట. నాన్న వెంకటయ్య, అమ్మ సరోజిని వ్యవసాయం చేసేవాళ్లు. మేము ముగ్గురమ్మాయిలం, ఒక అబ్బాయి. చెల్లికి రెండేళ్ల వయసులో మా కుటుంబం హైదరాబాద్‌కి వచ్చేసింది. నలుగురు పిల్లలను పెంచడానికి నాన్న ఎంతో కష్టపడ్డాడు. కూరగాయలమ్మేవాడు. వాచ్‌మన్‌గా పని చేశాడు. అమ్మ ఇళ్లలో పని చేసింది. వాళ్లు ఎన్ని కష్టాలు పడినప్పటికీ మమ్మల్ని చదివించడంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. మేము బాగా చదువుకుంటూ ఉండడంతో మా ఇంటి దగ్గర ఉండే గోవిందరెడ్డి సార్, ప్రభావతి మేడమ్ ఇంకా కొందరు సహాయం చేశారు. నాలుగో తరగతిలో అనుకుంటాను నాకు ఒకసారి థర్డ్ ర్యాంక్ వచ్చింది. ర్యాంక్‌తో వచ్చే సంతోషం ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ నా టార్గెట్ అయింది. టెన్త్ సెవెన్టీ పర్సెంట్‌తో పాసయ్యాను. జీవితంలో మంచిగా స్థిరపడాలంటే ఇది చాలదు, పర్సంటేజ్ ఇంకా పెంచుకోవాలనిపించింది. ఇంటర్ ఎనభైశాతంతో పాసయ్యాను. బీటెక్‌లో ఫ్రీ సీట్ వచ్చింది. నాదే కాదు, మా అక్క, చెల్లిది కూడా ఫ్రీ సీటే. మేము జీవితకాలమంతా మర్చిపోలేని స్కీమ్ ఫీజ్ రీయింబర్స్మెంట్. నేను బీటెక్‌లోకి వచ్చేటప్పటికీ వైఎస్ఆర్ లేరు. కానీ మాలాంటి వాళ్ల కోసం ఆయన వేసిన అక్షరాల బాట ఉంది. మా అమ్మానాన్నలకు మమ్మల్ని చదివించాలనే కోరిక ఎంతలా ఉన్నా, ముగ్గురికి వేలాది రూపాయల ఫీజులు కట్టి ఇంజనీరింగ్ కోర్సు చేయించగలిగేవాళ్లు కాదు. స్కూల్ ఫీజులు, పుస్తకాలకు పెద్ద మనసున్న వాళ్లు సహాయం చేశారు. కానీ ఇంజనీరింగ్ ఫీజులు కట్టమని ఎవరినీ అడగలేం కదా! అంతంత ఫీజు కట్టాలంటే ఎవరికైనా కష్టమే. వైఎస్ఆర్ అనే మహానుభావుడు మా ముగ్గురినే కాదు, మా కాలనీలో ఉన్న మూడు వందల కుటుంబాల్లో కనీసం వంద మందిని గ్రాడ్యుయేట్లను చేశారు. మా జీవితమంతా ఆయన పట్ల కృతజ్ఞతతో ఉంటాం’’ అని చెమర్చిన కళ్లతో చెప్పింది శారద. నాన్న పడిన కష్టం ఇక చాలు మా అక్క ఎంటెక్ చేసి వరంగల్‌లో వాగ్దేవి కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తోంది. చెల్లి హైదరాబాద్, బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ పాలసీ మేకర్. అన్నయ్య టెన్త్‌తో ఆపేశాడు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేసేవాడు. కరోనా లాక్డౌన్ వల్ల అన్నయ్యకు కూడా ఉద్యోగం పోయింది. నాన్న మనందరినీ కూరగాయల బండి మీదనే బతికించాడు. అదే కూరగాయలతో మనం మాత్రం బతకలేమా!, గౌరవంగా డబ్బు సంపాదించుకునే ఏ పనినైనా చేసుకోవచ్చని అన్నయ్యకు నచ్చచెప్పాను. అడవిలో వదిలినా బతికేయగలననే నమ్మకం ఉంది. నాన్నను ఇంట్లోనే ఉండమని చెప్పాం. దుకాణాన్ని విస్తరించాం. ఇక నాకు మనసు బాధ పడిన క్షణాలంటే... నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బులో పెద్ద మొత్తం ఇంటి అద్దెకే వెళ్లిపోతోంది. నేను అద్దె కడుతున్నప్పుడు నాకు అనుభవంలోకి వచ్చిన ఆవేదన ఇది. ఇన్నాళ్లూ మా అమ్మానాన్న రెక్కల కష్టంలో కూడా ఎక్కువ భాగం అద్దెలకే సరిపోయింది. అలాగని కుంగిపోవడం ఏమీ ఉండదు. ఉన్నంతలో హాయిగా తింటున్నాం, దేవుడి దయ వల్ల అనారోగ్యాల్లేవు, ఆరోగ్యంగా బతుకుతున్నాం. ‘నా పెళ్లి కోసం అప్పులు చేయవద్దు. నేను సంపాదించుకున్న తర్వాత చేసుకుంటాను’... అని మా నాన్నకు చెప్పేశాను. ‘ఇంకా ఎప్పుడు చేసుకుంటావే’ అని అమ్మ తిడుతోంది’’ అని నవ్వుతూ చెప్పింది శారద. శారద మాటలు వింటుంటే... ‘‘నీలో దృఢనిశ్చయం శక్తిమంతంగా ఉండాలి. ఆత్మస్థయిర్యం అత్యున్నత స్థాయిలో ఉండాలి. నీ కలల మీదనే దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడే నీ గమ్యాన్ని చేరగలుగుతావు’’ అని ఆమె రాసుకున్న కొటేషన్‌ను అక్షరాలా ఆచరణలో పెడుతున్నట్లు అనిపించింది. కాలేజీ రోజుల్నుంచి తనకు వచ్చిన భావాన్ని కాగితం మీద రాసుకోవడం ఆమెకు అలవాటు. అలా ఆమె రాసుకున్న కొటేషన్లు ముప్పైకి పైగా ఉన్నాయి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి ఒకటి పోతే మరొకటి ఉంటుంది రోజూ ఉదయాన్నే అన్నయ్య మార్కెట్‌కెళ్లి కూరగాయలు తెస్తాడు. నేను షాప్‌లో అమ్ముతున్నాను. ఉద్యోగం పోతే బతకలేమని భయపడే వాళ్లకు నేను చెప్పేదొక్కటే. మీ అమ్మానాన్నలు చేసిన పనినే చేయండి. వాళ్లకంటే మరింత మెరుగ్గా చేయండి. మా మట్టుకు మేము మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను అలాగే అమ్మకుండా శుభ్రం చేసి అమ్ముతున్నాం. మనకు తెలిసిన నైపుణ్యాలతో జీవితాన్ని నిలబెట్టుకోవాలి కానీ కుంగిపోతే సాధించేదేమీ ఉండదు. ఒకటి చేజారి పోయిందంటే... మనకోసం మరొకటేదో ఉండి ఉంటుందని నమ్ముతాను. – శారద, సాఫ్ట్వేర్ ఇంజనీర్ -
‘సాఫ్ట్వేర్ శారద’ కథనంపై స్పందించిన సోనూ సూద్
సాక్షి, హైదరాబాద్: ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించి రియల్ హీరో అనిపించుకుంటున్న నటుడు సోనూ సూద్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. సాఫ్ట్వేర్ శారదకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. సాక్షి టీవీ కథనానికి స్పందించిన సోనూ సూద్ సాఫ్ట్వేర్ ఆమె ఫోన్ నంబర్ అడిగి తెలుసుకున్నారు. శారదకు వ్యక్తిగతంగా సాయం చేస్తానని హామీనిచ్చారు. కాగా, కరోనా లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన యువ సాఫ్ట్వేర్ శారద తల్లిదండ్రులకు సాయంగా కూరగాయల వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో యువ సాఫ్ట్వేర్ జీవిత గమనంపై ‘సాక్షి’ కథనం ప్రచురించడంతో వైరల్ అయింది. (చదవండి: రైతు కుటుంబానికి ట్రాక్టర్ అందించిన సోనూసూద్) జీవితంలో ఆటుపోట్లు సహజమని, ఉద్యోగం కోల్పోయినంత మాత్రాన దిగులుపడొద్దని శారద యువతకు సందేశమిచ్చారు. బతికేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని, సమస్యలకు ఎదురొడ్డి పోరాడాలని చెప్పారు. ఇక శారద స్ఫూర్తిదాయకమైన కథనంపై వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, ఉపరాష్ట్రపతి కార్యాలయం, తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించారు. ప్రభుత్వ పరంగా శారద కుంటుంబాన్ని ఆదుకుంటామని వరంగల్ ఎంపీ దయాకర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇప్పటికే వెల్లడించారు. ఇదిలాఉండగా.. కటిక దారిద్ర్యంలో ఉన్న చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ రైతును ఆదుకునేందుకు కూడా తాజాగా సోనూ సూద్ ముందుకొచ్చారు. ఎద్దులు లేక ఇబ్బంది పడుతున్న రైతుకు ఏకంగా ట్రాక్టర్‌నే అందించారు. (‘సాఫ్ట్వేర్ శారద’ కథనంపై స్పందించిన ఎంపీ) -
‘సాఫ్ట్వేర్ శారద’ కథనంపై స్పందించిన ఎంపీ
సాక్షి, హైదరాబాద్/వరంగల్: కరోనా లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముతున్న యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శారద స్ఫూర్తిదాయకమైన కథనంపై పలువురు ప్రముఖులు స్పందించారు. కష్టపడి పనిచేయాలన్నది శారద ఆదర్శంగా తీసుకున్నారని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. తద్వారా యువతకు ఆదర్శంగా నిలిచిచారని కొనియాడారు. శారద కష్టపడేతత్వం చూసి గర్వంగా ఫీలవుతున్నానని తెలిపారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. శారద కుంటుంబాన్ని కలుస్తానని ఎంపీ వెల్లడించారు. స్టాఫ్‌వేర్ ఉద్యోగిగా పనిచేసి కూరగాయలు అమ్ముతున్న శారద కథనం తనను ఎంతగానో కదిలించిందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శారద ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ప్రభుత్వం తరఫున శారద కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ఇక సాఫ్ట్వేర్ శారదపై సాక్షి కథనానికి ఉపరాష్ట్రపతి కార్యాలయం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం, తెలంగాణ బీజేపీ నాయకులు, పలువురు ఎన్ఆర్ఐలు స్పందించారు. ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు పలు ఐటీ సంస్థలు ముందుకొచ్చాయి. (చదవండి: భూ వివాదం : సెల్ టవర్ ఎక్కిన యువకుడు) జీవితం అంటే అదొక్కటే కాదు ఉద్యోగం ఒక్కటే లైఫ్ కాదని యువ సాఫ్ట్వేర్ శారద అన్నారు. నెగటివ్‌గా ఆలోచించి ఆత్మహత్యలకు పాల్పడవద్దని సాక్షి టీవీతో మాట్లాడుతూ ఆమె యువతకు సందేశం ఇచ్చారు. ఓడిపోయినా ధైర్యంగా నిలబడి విజయం సాధించవచ్చని తెలిపారు. ఇదిలాఉండగా.. కుటుంబం కోసమే శారద కూరగాయలు అమ్ముతోందని ఆమె తల్లి తెలిపారు. శారదను చదివించేందుకు చాలా కష్టపడ్డానని చెప్పారు. చిన్నతనం నుంచి శారద బాగా కష్టపడేదని అన్నారు. వయసు పైబడిన తండ్రికి సాయం చేస్తోందని అన్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్లు సాప్ట్వేర్ ఉద్యోగం చేసిన శారద ఇటీవల హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్యాకేజీకి కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యారు. మూడు నెలల పాటు ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. అంతలోనే కరోనా వ్యాప్తి మొదలవడం, దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో సదరు కంపెనీ యాజమన్యం ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. అయినప్పటికీ ఎలాంటి కుంగుబాటుకు లోనవకుండా ఆమె తల్లిదండ్రులకు తోడుగా కూరగాయల వ్యాపారం ప్రారంభించారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు. (కూరగాయలు అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్) -
వైరల్ వీడియో: శారద.. నీకు సెల్యూట్
సాక్షి, హైదరాబాద్ : అసలే పేదరికం.. కుటుంబం గడవడమే కష్టం. అంతలోనే కరోనా.. చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది. తల్లిదండ్రులకు అసరాగా ఉంటునన్న ఆనందం ఆవిరైపోయింది. ఆపై ఆర్థికంగా ఇబ్బందులు. కానీ ఇవేమి ఆ పేదింటి ఆడబిడ్డను అంగుళం కదిలించలేకపోయాయి. ఈ కరోనా కాలంలో వచ్చిన కష్టాలతో కుంగిపోలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం పోతేనేం కూరగాయలమ్మి కుటుంబానికి అండగా ఉంటాననని నడుం బిగించింది ఓరుగల్లు పోరుబిడ్డ శారద. ఉద్యోగం కోల్పోయిన ఏ మాత్రం వెనకడుగు వేయకుండా స్వశక్తితో కుటుంబాన్ని పోషించేందుకు కూరగాయలు అమ్ముతూ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. కూరగాయలను అమ్ముతున్నందుకు ఏ మాత్రం నామోషి పడటం లేదంటోంది యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్లు సాప్ట్వేర్ ఉద్యోగినిగా విధులు నిర్వర్తించిన శారద ఇటీవల హైదరాబాద్‌లో కొత్త జాబ్‌లో జాయిన్ అయ్యారు. మంచి వేతనంతో తొలి మూడు నెలల పాటు ట్రైనింగ్ పూర్తి చేసిన ఆమెకు.. కరోనా వెంటాడింది. లాక్డౌన్ విధించడంతో కంపెనీ యాజమన్యం ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీంతో ఎలాంటి కుంగుబాటకు గురికాని శారద.. తల్లిదండ్రులకు తోడుగా కూరగాయల వ్యాపారం ప్రారంభించింది. ఉద్యోగం కోల్పోయి మానసిన వేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఎంతోమందికి ఆదర్శంగా ఉంటున్న యువ సాప్ట్‌వేర్‌ను ‘సాక్షి’ పలకరించింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆమె మాటలపై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శభాష్ తల్లీ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. కాగా దేశంలో రోజు రోజుకరూ నిరుద్యోగం పెరిగిపోతోంది. కరోనా కారణంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో కూలీలు ఉపాధికి దూరమయ్యారు. వివిధ రంగాల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా వైరస్ దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం చేస్తోంది. ముఖ్యంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి దేశంలో పేద, సామాన్య ప్రజలు దిక్కులేనివారయ్యారు. అప్పటివరకూ కూలీనాలీ చేసుకొని బతికేవారంతా రోడ్డున పడ్డారు. లాక్‌డౌన్‌ను అంతకంతకూ పొడిగిస్తుంటే... మరింత మంది ఉద్యోగాలు పోతున్నాయి. ఫలితంగా ఇప్పటికే దేశంలో 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. దేశంలో నిరుద్యోగం 27.1 శాతానికి చేరిందని తేలింది. Must watch video.. really very INSPIRING. You are great thalli. pic.twitter.com/Sj1hh4Fbgf — Gopi Ganesh (@MeGopiganesh) July 26, 2020 -
ఇదిగో ‘శారద’ కుటుంబం..
సాక్షి, తెనాలి(గుంటూరు) : తెనాలిలోని ఓ బ్యాంకు శాఖ...కంప్యూటర్లోకి చూస్తున్న ఉద్యోగి, కౌంటరు దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి, తన వెనుక తదేకంగా చూస్తుండటాన్ని కళ్లజోడులోంచి గమనించాడు. వెనక్కి చూస్తే, గోడకు తగిలించిన 2018 క్యాలెండర్ కనిపించింది. అందులో కనిపిస్తున్న ఫొటోను చూస్తున్న ఆ వ్యక్తి, ‘సార్ ఆ క్యాలెండరు ఇవ్వగలరా’ అంటూ అభ్యర్థించాడు. ‘దానికేం...పాతదే కదా!’ అంటూ తీసిచ్చాడు. అపురూపంగా పట్టుకుని తీసుకెళుతున్న అతడిని ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. మరో రెండురోజులకు ఇంటికొచ్చిన అతడి సోదరుడి కోసమని మరొకటి సంపాదిద్దామని, క్యాలెండరులోని ఫోను నెంబర్లను సంప్రదించారు. ‘పోయినేడాది క్యాలెండరు ఎందుకండీ...ఎవరు మీరు?’ అన్న ప్రశ్నకు, ‘మా నాన్న శారద ఫొటో కోసమండీ’ అన్న సమాధానం...! వినగానే సంబ్రమాశ్చర్యం...! శారద మరణతో ఆయన కుటుంబం జాడ ఎవరికీ తెలీదు. గత 64 ఏళ్లుగా సాహితీ ప్రపంచానికి ప్రశ్న మినహా ఇప్పటికీ సమాధానం లేదు. కేవలం క్యాలెండరులోని శారద బొమ్మతో ఇప్పటికి వెలుగులోకి వచ్చారు. ఆ వివరాలతో ప్రత్యేక కథనం. శారద (ఎస్.నటరాజన్) గురించి... ‘వాస్తవానికి వీసమెత్తు మారకుండా, మారినట్టు కనిపించే కుంభకోణమే ఈ శతాబ్దంలోని విశిష్టత. ఆపడానికి ఇష్టంలేని యుద్ధానికి సంవత్సరాల తరబడి సమాలోచనలు..దూరపుకొండలైన ‘శాంతి’కి సంతకాల సంరంభం..స్వంతాన కథ లేనివాడికి పాతపత్రికలు శరణ్యం...సరుకు లేని పత్రిక్కి మెరిసే ముఖచిత్రం...’ ఇలాంటి మాటలతో సాహిత్య విస్ఫోటనం చేసిన శారద అసలు పేరు ఎస్.నటరాజన్. పూర్తిపేరు సుబ్రమ్మణ్యయ్యరు నట రాజన్. తెలుగు సాహిత్యంలో కొత్త వెలుగులు కురిపించిన తమిళ నటరాజన్ కవి, కథకుడు, నవలా రచయిత, నాటక రచయిత, వ్యాస రచయిత, లిఖిత పత్రికా సంపాదకుడు. 1937లో బతుకుదెరువు కోసం తండ్రితో కలిసి తెనాలి చేరిన నటరాజన్, హోటల్ కార్మికుడిగా చాలీచాలని సంపాదనతో తండ్రిని సాకుతూ జీవితం ఆరంభించారు. పదిహేనేళ్ల వయసులో తండ్రి పోవటంతో క్షోభతో మూర్ఛరోగానికి గురయ్యాడు. హోటల్ వృత్తిలో వుంటూనే తెలుగు నేర్చాడు. నాటి తెలంగాణ పోరాటం, ఆర్థికమాంద్యం, సామాజిక సంక్షోభాలు, కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలతో ఆయన సాహిత్య సృజన వేయిరేకులై వికసించింది. భౌతికజీవితం 30 ఏళ్లయితే సాహిత్యజీవితం ఏడేళ్లు మాత్రమే. ఆ వ్యవధిలోనే శారద కలంపేరుతో నూరుకు పైగా కథలు, ఆరేడు నవలలూ రాశారు. ఆయన రచనలు ‘మంచీచెడూ’, ‘అపస్వరాలు’, ‘ఏది సత్యం’ సంచలనం రేకెత్తించాయి. దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తూ శారద కన్నుమూశారు. తెనాలిలోనే స్థిరనివాసం.. తెనాలిలోని పాండురంగపేటలో 1955 ఆగస్టు 17న శారద కన్నుమూశారు. భార్య అన్నపూర్ణ. నిండు గర్భిణి. అప్పటికే ఇద్దరు కొడుకులున్నారు. భర్త పోయిన నెలరోజులకు జన్మించిన ఆడశిశువుకు తన భర్త పేరిట ‘శారద’గా నామకరణం చేశారు. ఊహ తెలీని చిన్న కొడుకు రాధాకృష్ణమూర్తిని ఇక్కడే తెలిసినావిడకు దత్తతనిచ్చారు. శారద రచనలు, అసంపూర్తి రచనలు, ఉత్తరాలతో సహా ఆయన స్నేహితుడైన ఆలూరి భుజంగరావుకు అప్పగించారు. భర్త ఉన్నపుడే దుర్భర దారిద్య్రంలో మగ్గిన ఆ కుటుంబం, ఆయన పోయాక ఎలా వుంటుందో చెప్పేదేముంది? పెద్దకొడుకు సుబ్రహ్మణ్యం, కుమార్తె శారదతో పట్టణం వదిలి వెళ్లిపోయారు. కట్‌చేస్తే...ప్రస్తుతం అన్నపూర్ణ భౌతికంగా లేరు. పెద్దకొడుకు నందిరాజు సుబ్రహ్మణ్యం తిరుపతిలో వుంటున్నారు. రెండో కుమారుడు నూతలపాటి రాధాకృష్ణమూర్తి తెనాలిలో నివసిస్తున్నారు. జంపని చక్కెర ఫ్యాక్టరీలో ఉద్యోగిగా చేస్తూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. చివరి బిడ్డ కడమేరి శారద కూడా చిన్న అన్నయ్యకు దగ్గరగా తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. సోదరుడు రాధాకృష్ణమూర్తి రెండో కుమార్తె శ్రీలక్ష్మికి తన కొడుకు రఘుబాబుతో వివాహం చేసి అన్నాచెల్లెలు వియ్యంకులయ్యారు. శారద బిడ్డల సంతానం, అంటే మనుమ సంతానం ప్రైవేటు/ ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిలయ్యారు. కష్టాలకు దూరంగా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. జీవనం కోసం నందిరాజు ఉమామహేశ్వరరావును అన్నపూర్ణ రెండో వివాహం చేసుకున్నారు. పోలీసు ఉద్యోగం, హోటల్ వ్యాపారంతో సహా జీవనోపాధి కోసం ఆయన రకరకాల పనులు చేశారు. కొంతకాలం ప్రకాశం జిల్లా కామేపల్లి, గుంటూరు జిల్లా రేపల్లె, తర్వాత తెలంగాణలో వుండిపోయారు. ‘రెండో పెళ్లితో ‘మొదటి భర్త శారదతో కథ సమాప్తం’...అన్నట్టుగా మా తల్లిగారు గతంలోని విషయాలేవీ ప్రస్తావించేవారు కాదు...తమ్ముడిని తెనాలిలో దత్తత ఇచ్చినట్టు ఊహ ఉన్నందున వయసుకొచ్చాక, వెతుక్కుంటూ తెనాలి వచ్చి కలుసుకున్నా’నని సుబ్రహ్మణ్యం చెప్పారు. అప్పుడప్పుడు కలుస్తుంటాం.. ‘భర్త పోవటంతో మా తల్లిగారు ఆర్థికంగా నానా బాధలు పడ్డారు. బంధువులు పట్టించుకోలేదు. పెద్దమ్మ భర్త గంగానమ్మగుడి దగ్గర కొబ్బరికాయల కొట్ల బజారులో హోటల్ పెట్టించారు. అప్పుడప్పుడు సరుకులు ఇస్తుండేవారు. వేరే పెళ్లిచేసుకున్నాక అవికూడా మానేశారు..విధిలేని స్థితిలోనే తల్లిగారు ఊరొదిలి వెళ్లారు’ అని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఆయన్ను చేసుకోవటంతో శారద తరపు అందరితోనూ సంబంధాలు బంద్ అయ్యాయి. రాకపోకలు, పలకరింపులు లేకుండా ఒంటరిగాళ్లమయ్యామని చెప్పారు. పెద్దయ్యాక ఎవరి బతుకులు వారివి అయ్యాయి. తల్లి కాలం చేయటంతో ఎవరితో ఏ సంబంధాలు లేకుండా ఈ ముగ్గురు తరచూ కలుసుకుంటూ బంధుత్వం కూడా కలుపుకొని ఆత్మీయంగా ఉంటున్నారు. ‘మగపిల్లలు చదువుల్లేకుండా తిరుగుతుంటే చెడిపోతారు...ఎవరికైనా ఇస్తే బాగుపడతాడని దత్తతనిచ్చా’నని అమ్మ చెప్పిందనీ, పెద్దవాడిని పెద్దగా చదివించే శక్తి లేకుండా పోయిందని నాకు చెప్పి ఏడ్చేది’ అని తల్లి గురించి కుమార్తె శారద గుర్తుచేసుకున్నారు. -
శాండల్‌వుడ్ సీనియర్ నటి కన్నుమూత
ప్రముఖ కన్నడ సినీ నటి ఎల్వీ శారద (78) గురువారం బెంగళూరులో కన్నుమూశారు. వంశవృక్ష సినిమా ద్వారా కన్నడ సినీ రంగంలో అడుగుపెట్టిన ఆమె, తొలి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా అందుకున్నారు. ఆ తరువాత అనేక సినిమాలో ఆమె రాణించారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక చిత్రాల్లో తన ప్రతిభను చాటారు. శంకరాచార్య, మధ్వాచార్య, నక్కళారాజకుమారి, ఒందు ప్రేమ కథ సినిమాలలో నటించారు. వెండి తెరకు దూరమైన తరువాత పలు డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకతక్వం వహించారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న బెంగళూరులోని శంకర హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. -
శారద, కాంచనలకు కలైమామణి అవార్డు
చెన్నై : తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక కలైమామణి అవార్డులను ప్రకటించింది. అలనాటి నటీమణులు శారద, కాంచనలతో పాటు కుట్టి పద్మినికి ఈ అవార్డు లభించింది. అలాగే నటులు సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా, విజయ్ ఆంటోని, శశికరుమార్, సంతానం, సూరి, నటి ప్రియమణి, నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు హరిలకు కూడా అవార్డులు దక్కాయి. కళారంగంలో విశేష సేవలు అందించినందుకుగానూ వీరికి ఈ అవార్డును ప్రకటించారు. ప్రముఖ నటీమణి వైజయంతిమాల బాలి...బాలసరస్వతి అవార్డుకు ఎంపికయ్యారు. -
సాహిత్య బాటసారి శారద
‘‘అది 1937వ సంవత్సరం. చలికాలపు ఓ ఉదయం. పన్నెండేళ్ల పిల్లవాడు తెనాలి రైల్వేప్లాట్‌ఫాంపై కాలుమోపాడు. తెలుగు ఒక్క ముక్క రాదు. ఎక్కడో పుదుక్కోటలో పుట్టి, మద్రాసులో పెరిగి, జానెడు పొట్టకోసం తెనాలి వచ్చాడు. హోటల్ కార్మికుడిగా చేరి తెలుగు నేర్చుకున్నాడు. అతనికి చదువు ఒక వ్యసనం. తనలోని తీవ్రమైన భావావేశాన్ని ప్రకటించడానికి రచనను ఆశ్రయించాడు. తోటి హోటల్ కార్మికులమైన మాకు తెలుగుతోపాటు తమిళ అక్షరాలు కూడా నేర్పాడు, పుస్తకాలు చదివించాడు. తను రాయడమే కాకుండా, నాచేత, ప్రకాశరావు, అబ్బరాజు నాగభూషణరావు, ముక్కామల మల్లికార్జునరావు చేత రాయించి మమ్మల్ని రచయితలను చేశాడు’’ అంటూ ఆలూరి భుజంగరావు తన జీవిత చట్రం నుంచి శారద జీవితాన్ని ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే ‘సాహిత్య బాటసారి శారద స్మృతి శకలాలు’. ఈ పుస్తకం 1985లో వచ్చింది. శారద తుపాను వేగంతో సాహిత్యంలోకొచ్చాడు. అంతేవేగంతో జీవితం నుంచి నిష్క్రమించాడు. బతికినంత కాలం హోటల్ కార్మికుడిగానే బతికాడు. ఒక చేత్తో రచనలు చేస్తూనే, మరో చేత్తో రోడ్డుపక్క మసాలా గారెలు, మిరపకాయ బజ్జీలు అమ్మాడు. బస్సుల్లో నిమ్మకాయ మజ్జిగ, రోడ్డుపక్క పాతపుçస్తకాలు అమ్మాడు. అసలు పేరు ఎస్. నటరాజన్. శారద, గంధర్వుడు, శక్తి అన్న పేర్లతో వందకుపైగా కథలు రాశాడు. అపస్వరాలు, మంచి–చెడు, ఏదిసత్యం, సరళాదేవి హత్య, మహీపతి, అందాల దీవి వంటి ఆరు నవలలు రాశాడు. ముప్ఫై ఏళ్లే జీవించాడు. ‘‘అది 1947 ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు. నేను, శారద పనికోసం తెనాలి వీధులన్నీ తిరిగాం. మాకు పనులు ఇవ్వని హోటల్ యజమానులు, మమ్మల్ని కొట్టిన యజమానులు, మా జీతాలు ఎగ్గొట్టిన యజమానులు ఆరోజు జెండాల్ని ఎగరేశారు. ఆరోజు మా పొయ్యిలో పిల్లి లేవలేదు. నేను, శారద, అమ్మ కటిక పస్తులు పడుకున్నాం’’ అంటూ భుజంగరావు చెప్పిన విషయాలు కంటతడి పెట్టిస్తాయి. ‘‘ఆనాటి హోటల్ వృత్తి అవగుణాల నిలయం. పొద్దుగూకులూ బండెడు చాకిరీ చేయాల్సి ఉండేది. నాలుగు డబ్బులు చేతికి వచ్చిన రోజున ఏ చీట్లాటకో, తాగుడుకో, దొమ్మరిగుడిసెలకో వెళుతుండేవారు. అంతటి కల్మషంలో బతుకుతున్నా కూడా కథలు రాయాలన్న అపురూప ఊహ కలిగించినవాడు శారద.’’ ‘‘ఆరోజు ఆగస్టు 17, 1955వ సంవత్సరం. ‘కాఫీకి రారా బుజ్జీ’ అని శారద కేకవేశాడు. ‘నేను రానురా కథరాసుకుంటున్నా’ అన్నాను. తలెత్తి గేటువేపు చూశాను. అదే ఆఖరి చూపు. రాత్రి తొమ్మిది గంటలకు ‘శారద చనిపోయాడు’ అన్నారెవరో! మర్నాడు శవసంస్కారానికి బజారున పడ్డాం చందాలకు. అప్పటికతనికి ఇద్దరు పిల్లలు. భార్య నిండు గర్భవతి.’’ ‘‘శారద కథ రాయాలంటే అరకప్పు కాఫీ తాగి, æతాజ్ మహల్ బీడీకట్ట దగ్గర పెట్టుకుంటేనేగానీ కలం కదిలేది కాదు. పరిచయమున్న వారందరినీ కాఫీకి, బీడీలకు అణాడబ్బులడిగేవాడని అపప్రధ ఉండేది. ఎక్కడో తమిళ దేశంలో పుట్టి, తెనాలికొచ్చి తెలుగు నేర్చుకుని, తెలుగు జీవితాన్ని అక్షరబద్ధం చేసిన శారదకు కాఫీ కోసం, బీడీల కోసం ఎన్ని అణాలిస్తే అతని రుణం తీర్చుకోగలం!’’ అన్న భుజంగరావు మాటలు మనల్ని వెంటాడుతాయి. - రాఘవ శర్మ -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - శారద
-
తండ్రి కాటికి.. తల్లి ఆసుపత్రికి..
సాక్షి,వేమనపల్లి(బెల్లంపల్లి): ఆదివారం సాయంత్రం సిరొంచలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్, వరంగల్‌లో పట్టణాల్లో ఉండి చదువుకుంటున్న కూతురు సుష్మ, కుమారుడు ప్రణీత్‌కు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. లైన్మెన్గా పనిచేస్తున్న వేమునూరి రమేశ్‌రెడ్డి మృతి చెందగా, ఆయన భార్య శారదను స్థానికులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్చారు. దహన సంస్కారాలకు ఆయన మృతదేహాన్ని స్వగ్రామం నీల్వాయికి తరలించారు. శారద నడవలేని స్థితిలో ఉండి కూడా ఆసుపత్రి నుంచి భర్త కడచూపు కోసం నీల్వాయికి వచ్చింది. భర్త మృతదేహం పక్కనే గాయాలతో ఆమె కదల్లేని స్థితిలో విలపించడం పలువురిని కలచివేసింది. నిత్యం ఫోన్లో యోగక్షేమాలు తెలుసుకునే తమ తండ్రి ఇకలేడనే విషయం తెలిసిన చిన్నారులు గుండెలవిసేలా రోదించారు. ఆ దృశ్యాలు అక్కడున్న జనం గుండెలను పిండేశాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు ప్రణీత్ తండ్రికి అంతిమ సంస్కారాలు చేశాడు. అనంతరం శారదను ఉన్నత వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. జెడ్పీటీసీ ఆర్.సంతోశ్‌కుమార్, ఏఎమ్‌సీ వైస్‌చైర్మన్ కోళి వేణుమాధవ్, ఎంపీపీ కుర్రువెంకటేశ్, సర్పంచ్‌లు మల్లిక, కుబిడే వెంకటేశ్ తదితర నాయకులు, సహచర ఉద్యోగులు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. రమేశ్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని డీఈ నాగేశ్వర్రావు తెలిపారు.