
రాజకీయాల్లో ఇమడలేకపోయా: శారద
నల్లజర్ల : నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగాను కానీ, రాజకీయాల్లో ఎంతమాత్రం రాణించలేక పోయానని ప్రముఖ సినీనటి ఊర్వశి శారద ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. 17 నెలలు లోక్సభ సభ్యురాలిగా సేవలందించినా ఈ కుళ్లు రాజకీయాల్లో ఇమడలేకపోయానన్నారు.
ప్రస్తుతం నటనకు స్వస్తి చెప్పి చెన్నైలో ఉంటున్నట్లు తెలిపారు. కళాకారులకు రిటైర్మెంట్ లేదని, నచ్చిన పాత్ర వస్తే చేయటానికి సిద్ధమని శారద వెల్లడించారు. నేటి సినిమాల్లో నైతిక విలువలు ఉండటం లేదని, మూస కథలు వస్తున్నాయన్నారు. అర్థంపర్ఠం లేని డైలాగులు, డాన్సులు సమాజాన్ని పక్కదారి పట్టించేవిధంగా ఉంటున్నాయన్నారు.
కథా నాయికల వస్త్రధారణ చూస్తే అసహ్యమేస్తోందన్నారు. కుటుంబ సభ్యులంతా కలసి కూర్చుని సినిమాలు చూసే రోజులు పోయాయన్నారు. నేటి సినిమాలు పాతతరం నటులు తలదించుకునేలా ఉన్నాయన్నారు. తెలంగాణ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం ఉంటే బాగుంటుందని శారద అన్నారు.