చిన్న చిన్న ఎడ్లబండ్లు వాటిలో గ్రామీణ మహిళల బొమ్మలు, చెక్క కుర్చీలు వాటి ముందు చిట్టి చిట్టి బొమ్మలు, హంసలు, పక్షులు, గూళ్లు, గుడిసెలు.. ఇలా ముచ్చటైన వస్తువుల కూర్పుతో ట్రే గార్డెన్‌ను ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపాటి స్థలంలో కూడా వీటిని అందంగా అలంకరించవచ్చు.
ఈ విషయాన్ని తన కళతో నిరూపిస్తోంది హర్యానాలోని ఫరీదాబాద్ వాసి యాభై ఐదేళ్ల శారదా గోదారా. తోటలు, పార్కులను పోలిన మినియేచర్ ట్రే గార్డెన్స్‌ను రూపొందిస్తోందామె. నడివయసులో ఒంటరితనం పోగొట్టుకోవడానికి చేసిన ఆలోచన ఆమెను ఇలా అందమైన లోకంలో విహరించేలా చేసింది. తన ఇంటిలో వెయ్యి మొక్కలతో మినీ జంగిల్‌ను క్రియేట్ చేసింది.
‘మా ఇంటి బయట, మెట్లు, బాల్కనీలు, పెరడు వరకు రకరకాల అందమైన మొక్కలతో నింపేశా. ఆ తర్వాత చిన్న ట్రే గార్డెన్‌ల తయారీని మొదలుపెట్టాను. అభిరుచి ఉంటే చాలు ఒంటరితనానికి ఎదర్కోవడానికి, ఇంటిని అందంగా అలంకరించడానికి ఇదొక మంచి మార్గం. ఒక గంటలోపు ఒక మినీ ట్రే గార్డెన్‌ను రూపొందించుకోవచ్చు. రంగు రంగుల గులకరాళ్లు, చిట్టి పొట్టి మొక్కలు, చిన్న చిన్న మెట్లు, గుడిసెలు.. ఇతర అలంకరణ వస్తువులతో తయారైన ఈ మినీ ట్రే గార్డెన్లను చూస్తుంటే ఎంతో ఆనందంగా కలుగుతుంది’ అని తన గార్డెన్ పెంపకం విషయాలను ఆనందంగా చెబుతుందామె.
ట్రే గార్డెన్‌ని మీరూ ఇలా సృష్టించుకోవచ్చు...
ముందుగా గార్డెన్ థీమ్‌ను దృష్టిలో ఉంచుకొని, కాగితం మీద స్కెచ్ వేసుకోవాలి. పరిమాణం, ఆకారం, మట్టి, ఇతర అలంకార వస్తువులను బట్టి తగిన సిరామిక్ ట్రేని ఎంచుకోవాలి.
గార్డెన్‌కు బేస్‌ను సృష్టించడానికి పాటింగ్ మిక్స్‌తో ట్రేని నింపాలి. సారవంతమైన మట్టిలో 15 శాతం ఆవుపేడ, 15 శాతం కోకోపిట్ కలపాలి.
వీటిలో స్నేక్‌ప్లాంట్, స్పైడర్ వంటి చిన్న చిన్న మరుగుజ్జు మొక్కలను నాటాలి. పైనుంచి మట్టిని గట్టిగా నొక్కి, నీళ్లు పోయాలి. తర్వాత రంగు రంగుల గులకరాళ్లు, గంటలు, బొమ్మలు వంటి అలంకరణ వస్తువులతో ట్రే తోటను అలంకరించాలి. స్ప్రే బాటిల్‌ను ఉపయోగించి ట్రేలోని మొక్కలకు నీళ్లు పోయాలి.
ఫంగల్ దాడుల నుంచి మొక్కలను కాపాడుకోవడానికి అరటి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ తొక్కలు.. వంటి వంటగది వ్యర్థాలను ఉపయోగించి చేసే ద్రవ కంపోస్ట్‌ను పిచికారీ చేసుకోవచ్చు..
ఇవి చదవండి: ఫోటోగ్రాఫర్..!
Comments
Please login to add a commentAdd a comment