Tray
-
ఈ 'ట్రే గార్డెన్' ని ఎప్పుడైనా చూశారా?
చిన్న చిన్న ఎడ్లబండ్లు వాటిలో గ్రామీణ మహిళల బొమ్మలు, చెక్క కుర్చీలు వాటి ముందు చిట్టి చిట్టి బొమ్మలు, హంసలు, పక్షులు, గూళ్లు, గుడిసెలు.. ఇలా ముచ్చటైన వస్తువుల కూర్పుతో ట్రే గార్డెన్‌ను ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపాటి స్థలంలో కూడా వీటిని అందంగా అలంకరించవచ్చు.ఈ విషయాన్ని తన కళతో నిరూపిస్తోంది హర్యానాలోని ఫరీదాబాద్ వాసి యాభై ఐదేళ్ల శారదా గోదారా. తోటలు, పార్కులను పోలిన మినియేచర్ ట్రే గార్డెన్స్‌ను రూపొందిస్తోందామె. నడివయసులో ఒంటరితనం పోగొట్టుకోవడానికి చేసిన ఆలోచన ఆమెను ఇలా అందమైన లోకంలో విహరించేలా చేసింది. తన ఇంటిలో వెయ్యి మొక్కలతో మినీ జంగిల్‌ను క్రియేట్ చేసింది.‘మా ఇంటి బయట, మెట్లు, బాల్కనీలు, పెరడు వరకు రకరకాల అందమైన మొక్కలతో నింపేశా. ఆ తర్వాత చిన్న ట్రే గార్డెన్ల తయారీని మొదలుపెట్టాను. అభిరుచి ఉంటే చాలు ఒంటరితనానికి ఎదర్కోవడానికి, ఇంటిని అందంగా అలంకరించడానికి ఇదొక మంచి మార్గం. ఒక గంటలోపు ఒక మినీ ట్రే గార్డెన్‌ను రూపొందించుకోవచ్చు. రంగు రంగుల గులకరాళ్లు, చిట్టి పొట్టి మొక్కలు, చిన్న చిన్న మెట్లు, గుడిసెలు.. ఇతర అలంకరణ వస్తువులతో తయారైన ఈ మినీ ట్రే గార్డెన్లను చూస్తుంటే ఎంతో ఆనందంగా కలుగుతుంది’ అని తన గార్డెన్ పెంపకం విషయాలను ఆనందంగా చెబుతుందామె.ట్రే గార్డెన్‌ని మీరూ ఇలా సృష్టించుకోవచ్చు...ముందుగా గార్డెన్ థీమ్‌ను దృష్టిలో ఉంచుకొని, కాగితం మీద స్కెచ్ వేసుకోవాలి. పరిమాణం, ఆకారం, మట్టి, ఇతర అలంకార వస్తువులను బట్టి తగిన సిరామిక్ ట్రేని ఎంచుకోవాలి.గార్డెన్‌కు బేస్‌ను సృష్టించడానికి పాటింగ్ మిక్స్‌తో ట్రేని నింపాలి. సారవంతమైన మట్టిలో 15 శాతం ఆవుపేడ, 15 శాతం కోకోపిట్ కలపాలి.వీటిలో స్నేక్‌ప్లాంట్, స్పైడర్ వంటి చిన్న చిన్న మరుగుజ్జు మొక్కలను నాటాలి. పైనుంచి మట్టిని గట్టిగా నొక్కి, నీళ్లు పోయాలి. తర్వాత రంగు రంగుల గులకరాళ్లు, గంటలు, బొమ్మలు వంటి అలంకరణ వస్తువులతో ట్రే తోటను అలంకరించాలి. స్ప్రే బాటిల్‌ను ఉపయోగించి ట్రేలోని మొక్కలకు నీళ్లు పోయాలి.ఫంగల్ దాడుల నుంచి మొక్కలను కాపాడుకోవడానికి అరటి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ తొక్కలు.. వంటి వంటగది వ్యర్థాలను ఉపయోగించి చేసే ద్రవ కంపోస్ట్‌ను పిచికారీ చేసుకోవచ్చు..ఇవి చదవండి: ఫోటోగ్రాఫర్..! -
వినూత్న అవగాహన కార్యక్రమం... యాష్ట్రేల ప్రదర్శన
మద్దిలపాలెం (విశాఖతూర్పు) : ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా మానడం లేదు. పొగచూరిపోతున్న యువతరాన్ని మేల్కోపేందుకు ఓ విశ్రాంతి ఉద్యోగి వినూత్న ప్రయాత్నానికి శ్రీకారం చుట్టారు. పూర్వం ధూమపానం ప్రియు లు వినియోగించే యాష్ ట్రేలను సేకరించి వాటిని ప్రతి ఏడాది పొగాకు రహిత దినోత్సవం నాడు ప్రదర్శిస్తున్నారు. పొగాకు వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నట్టు జేఆర్‌నగర్ కాలనీకి చెందిన విశ్రాంత జిల్లా సహకార బ్యాంకు మేనేజర్ జి.ఎస్.శివప్రకాష్ చెప్పారు. సోమవారం తన నివాసంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. యాష్ ట్రేలు వారి వ్యసనానికి సాక్షిగా నిలిచాయని నేటి తరానికి తెలియజేయడమే తన ఉద్దేశమన్నారు. ధూమపానం వలన పర్యావరణానికి ఎంతో చేటు కలుగుతుందని ఆ వ్యసానానికి దూరంగా యువతరం ఉండేలా తన వంతు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. పొగాకు నిర్మూలనతోనే వ్యాధుల నివారణ ఎంవీపీకాలనీ: పొగాకు నిర్మూలనతోనే నేడు సమాజాన్ని పీడిస్తున్న అనేక వ్యాధులకు నివారణ సాధ్యమవుతుందని మహాత్మగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ మురళీకృష్ణ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని డబ్లుహెచ్‌ఓ ఈ ఏడాది నినాదం ‘పర్యావరణం కాపాడుదాం’ అంశంపై ఆయన సోమవారం ఎంవీపీ కాలనీలోని ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. సమాజంలో సంభవిస్తున్న ఎక్కువ వ్యాధులకు, మరణాలకు పొగాకే కారణంగా నిలుస్తోందన్నారు. క్యాన్సర్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్, ఊపిరి తిత్తుల సంబంధిత వ్యాధులు ప్రస్తుతం ఎక్కువ అవుతున్నాయన్నారు. దీంతో పాటు సిగరెట్ పీకలలో వాడే మైక్రో ప్లాస్టిక్, నాన్ బయోడిగ్రేడబుల్ పౌచ్‌ల ద్వారా మట్టి పెద్ద ఎత్తున కలుషితం అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నినాదం పర్యావరణం కాపాడుదాం విజయవంతానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలన్నారు. దేశంలో పొగాకు ఉత్పత్తుల అమ్మకం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.18 వేల కోట్లు ఆదాయం వస్తుండగా వాటి వినియోగించడం ద్వారా వ్యాధుల భారిన పడుతున్న వారి చికిత్సకు రూ.లక్ష కోట్లు ఖర్చువుతుందన్నారు. క్యాన్సర్ మరణాలు అయితే 20శాతానికి పైగా పొగాకు వాడకం ద్వారానే వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు నిర్మూలపై ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పొగాకు పండించే రైతులకు పత్యామ్నాయమార్గాలు చూపించడం, పొగాకు వాడకం ద్వారా వచ్చే నష్టాలపై ప్రజలను పెద్ద ఎత్తున చైతన్యవంతం చేయడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. సామాజిక బాధ్యతలో భాగంగా మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి తరఫున ఏటా పదుల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ ప్రజలను పొగాకు రహిత జీవనంపై చైతన్యం కలిగిస్తున్నట్లు తెలిపారు. -ఎంజీ క్యాన్సర్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ మురళీకృష్ణ (చదవండి: ప్రాణాన్ని బలిగొన్న ‘ఉచ్చు’) -
నులక మంచం ట్రే, తోపుడి బండి ట్రే.. బడ్జెట్ ధరలోనే!
ఇంటి అలంకరణలో పాత ఒక వింత ఎలా అవుతుందో చూడాలంటే ఇంట్లో కాఫీ, టీ సర్వింగ్‌లో ఉపయోగించే ట్రే ను గమనిస్తే చాలు. కళాత్మకత ఇంటి గోడలు, పై కప్పు, ఫ్రేమ్స్, ప్లాంట్స్.. విషయంలోనే కాదు వాడుకునే వస్తువుల్లోనూ కనువిందు చేస్తోంది అనకుండా ఉండలేరు. కాదేదీ అలంకరణకు అనర్హం అనే పదం ఇప్పుడు మంచాలు, తోపుడుబండ్లు, ఆట వస్తువులకూ వచ్చేసింది. వీటిలో ప్రతీదాన్ని హోమ్ క్రియేషన్‌లో భాగం చేసుకోవచ్చు. నులక మంచం ట్రే పల్లెటూళ్లలో బామ్మల కాలం నాటి నవారు మంచాలు, నులక మంచాలు ఇప్పుడు నగరీకరణ విల్లాలలో సెంటర్ టేబుల్ మీద ఖుషీగా విందు చేసుకుంటున్నాయి. నాలుగు కప్పులు, ఆరు బిస్కెట్లు పట్టేటంత పరిమాణంలో బుజ్జి మంచాల ట్రేలు అబ్బురంగా కనిపిస్తున్నాయి. కళాభిలాషుల కోసం మార్కెట్లోకి వచ్చిన ఈ తరహా ట్రే లు ‘ఎంత బాగున్నాయో కదా!’ అనిపించేస్తున్నాయి. రూ. 700 నుంచి రూ.1,500 వరకు ఇవి లభిస్తున్నాయి. టేబుల్ పరిమాణం అంత నులక మంచాన్ని మూలల్లో అలంకరణగానూ వాడచ్చు. తోపుడి బండి ట్రే కూరగాయలు, పండ్లు లాంటివి తోపుడు బండ్ల మీద పెట్టుకొని అమ్ముతుంటారు బడుగు జీవులు. ఆ తోపుడు బండి మీద తినుబండారాలు పెట్టుకొని అతిథులకు కొత్తగా ఆహ్వానం పలుకుతున్నారు ఇంటి సభ్యులు. కలప, ఐరన్ జోడీతో తయారుచేసే ఈ తోపుడు బండి ట్రేలు క్రియేటివిటీ, క్వాలిటీని బట్టి రూ. 500 నుంచి వేలల్లో ధరలు పలుకుతున్నాయి. టేబుల్ ఎక్కిన టేబుల్ ఇది కొంచెం సింపుల్ అనిపించినా బెడ్ మీద కూర్చొని తినేవారికి టేబుల్ ట్రే మరింత సౌలభ్యంగా ఉంటుంది. కూచొని, పడుకుని ల్యాప్‌టాప్ వర్క్ చేసుకొనేవారికి ఇది అనువుగానూ ఉంటుంది. టేబుల్ మీద పెట్టినా అందుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. అందుకే టేబుల్ స్టైల్ ట్రే టేబుల్ ఎక్కి మరీ దర్జా పోతోంది. బెడ్ మీద హాయిగా వాలిపోతుంది. రూ.300 నుంచి నాణ్యతను బట్టి రూ.1000 ఆ పైన ధరలు ఉన్నాయి. ఆట వస్తువులూ ట్రే రూపంలో.. గాలిపటాల్లో వాడే థ్రెడ్ రోలర్, క్రికెట్ బ్యాట్, టేబుల్ టెన్నిస్ బ్యాట్ కూడా స్నాక్స్ అందించడానికి కొత్తగా ముస్తాబు అయ్యాయి. ఇంటి అతిథ్యంలోనూ తమదే పై చేయి అంటూ క్రియేటివ్‌గా టీపాయ్ మీదకు చేరాయి. ధరలు రూ.1000 నుంచి రూ.3,000 కు సెట్‌గా మార్కెట్లో లభిస్తున్నాయి. -
ట్రే కేజ్.. ఎంతో క్రేజ్..
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఒక్కో పీతకు రూ.600 లాభం సొర్లగొందిలో సిబా ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా సాగు ముందుకొస్తున్న మత్స్యకారులు ట్రే కేజ్ పద్ధతి.. ప్రస్తుతం పీతల వ్యాపారంలో లాభాలు తెచ్చిపెడుతున్న సరికొత్త విధానం. పీతల అమ్మకాల్లో దళారుల బారినపడి నష్టపోతున్న వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. నాగాయలంక మండలం సొర్లగొందిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వా కల్చర్ (సిబా) ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిపై పీతల సాగుకు శ్రీకారం చుట్టారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. రాష్ట్రంలో తొలి సారిగా చేపట్టిన ఈ పద్ధతిపై మత్స్యకారులు ఆసక్తి కనబరుస్తున్నారు. నాగాయలంక : సాధారణంగా ఎస్టీలు ఎక్కువగా పీతలు పడుతుంటారు. జిల్లాలోని నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో నదీపాయలు, సముద్రతీర ప్రాంతంలో కొక్కేలు ఉపయోగించి వీటిని వేటాడతారు. ఆ తరువాత మత్స్యకారులు వలలతో పచ్చపీతలు పడతారు. ఈ మండలాల నుంచి రోజుకు 1,500 నుంచి 2వేల కిలోల పీతలు ఎగుమతవుతుంటాయి. బరువును బట్టి పీతల ధర నిర్ణయిస్తారు. కిలోకు పది నుంచి 15 తూగే పీతలను రూ.200కు, నాలుగు తూగే పీతలను రూ.600 నుంచి రూ.700కు, కిలో బరువున్న పీతను రూ.1,100 నుంచి 1,200కు అమ్ముతారు. మెత్తగా ఉన్న పీతనైతే ధరలో సగానికి సగం తగ్గించి విక్రయిస్తారు. అంటే.. కిలో బరువున్న మెత్తని పీతను రూ.500కే అమ్ముతారు. పచ్చిసరుకు కావడం, నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడంతో దళారులు అడిగినంతకు ఇచ్చేస్తూ నష్టపోతుంటారు. ఇలాంటి నష్టాల నుంచి బయటపడేందుకు కనుగొన్నదే ట్రేకేజ్ పద్ధతి. ‘సిబా’ ఆధ్వర్యంలో అవగాహన ఎస్టీ సబ్‌ప్లాన్ కింద నాగాయలంక మండలంలోని సొర్లగొందిలో నివాసం ఉంటున్న పది కుటుంబాలకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ (సిబా) ఆధ్వర్యంలో గత శనివారం ట్రే కేజ్‌లు పంపిణీ చేశారు. అంతేకాదు.. పీతల పెంపకలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగ్ విధానాన్ని వివరించారు. చెన్నైకి చెందిన సిబా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యామ్ దయాళ్ నేతృత్వంలోని డాక్టర్ అంబాశంకర్, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ కైలాసంతో కూడిన బృందం పీతల పెంపకంపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. జిల్లాలోని మిగిలిన ప్రాంతవాసులు కూడా ఈ పద్ధతిని అనుసరించాలని సూచించింది. పండుగప్పలనూ పెంచవచ్చు.. ట్రే కేజ్ పద్ధతిలో తక్కువ పెట్టుబడితో పండుగప్ప(సీబాస్)లనూ పెంచుకోవచ్చు. చెరువులు, నదీపాయల్లో వీటిని పెంచవచ్చు. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ కింద సీడ్‌ను సరఫరా చేయడంతో పాటు మేతను అందించేందుకూ సిబా సంస్థ ముందుకొచ్చింది. ట్రే కేజ్ అంటే.. సాధారణంగా పీతల్లో రెండు రకాలు ఉంటాయి. శరీరమంతా గట్టిగా ఉండే పీతలు తినడానికి అనుకూలంగా ఉండే మొదటిరకం. ఇక రెండో రకానికి చెందిన పీతలు శరీరం గట్టిపడకుండా మెత్తగా ఉంటాయి. ఇవి అంత రుచిగా ఉండవు. ఇటువంటి పీతలను ట్రే కేజ్ పద్ధతి ద్వారా నిల్వ ఉంచి గట్టిపడేలా చేయొచ్చు. మెత్తగా ఉన్న పీతలను నీటిలో పది నుంచి 12 రోజులు ఉంచితే గట్టిపడతాయి. మార్కెట్లో కూరగాయలు భద్రపరచుకునే ట్రేలను తీసుకుని, వాటిపైన బలంగా ఉండే ప్లాస్టిక్ వైర్‌ను అల్లుతారు. వీటిలో పీతలను ఉంచి నీటి సదుపాయం ఉన్న ప్రాంతాలు, చెరువుల్లో భద్రపరుస్తారు. ఏరోజుకారోజు పట్టుకొచ్చిన పీతల్లో గట్టిగా ఉన్న వాటిని అమ్ముకుని మెత్తగా ఉన్నవాటిని ట్రే కేజ్‌లో నిల్వ చేస్తారు. అవి గట్టిబడ్డాక విక్రయించి మంచి లాభాలు ఆర్జించే ఈ పద్ధతిని జిల్లాలో ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎస్టీలకు ప్రయోజనం చేకూర్చాలనే.. పీతల వేటలో ఆరితేరిన యానాదులకు మరింత లాభాలు వచ్చే విధంగా రాష్ట్రంలో తొలిసారి ఈ పథకాన్ని చేపట్టాం. క్షేత్రస్థాయిలో వేటాడిన పీతలు తయారవకుండా మెత్తగా ఉంటే ధర పలకదు. గట్టిపడేందుకు సమయం పడుతుంది. కాబట్టి ఈ ట్రే కేజ్‌లలో పది నుంచి పన్నెండు రోజులు పెంచుతారు. అప్పుడు పీతలు గట్టిబడి మంచి ధర వస్తుంది. - డాక్టర్ శ్యామ్దయాళ్, సిబా ప్రధాన శాస్త్రవేత్త ఇలాంటి పద్ధతులను ప్రోత్సహిస్తాం.. ఎస్టీ సబ్‌ప్లాన్ కింద చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. మత్స్యశాఖ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి కేజ్ కల్చర్ విధానాలను ప్రొత్సహించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రానున్న కాలంలో ఆక్వా కల్చర్‌లో వచ్చే ఆధునిక మార్పులను అందిపుచ్చుకోవాలి. - టి.కల్యాణం, డీడీ మత్స్యశాఖ, మచిలీపట్నం మంచి ఫలితాలు సాధించొచ్చు.. సిబా చేపట్టిన ఈ విధానం ఆసక్తికరంగా ఉంది. అందుకే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని.. పరిశీలన నిమిత్తం మా కళాశాల ఏడో బ్యాచ్ విద్యార్థులు 28 మందిని ఇక్కడకు తీసుకువచ్చాం. విద్యార్థులకు ప్రాక్టికల్స్‌గా ఈ సాగు విధానం ఉపయోగపడుతోంది. - కేవీ సాంబశివరావు, ల్యాబ్ టెక్నీషియన్, ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల, భావదేవరపల్లి