ట్రే కేజ్.. ఎంతో క్రేజ్..
- తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు
- ఒక్కో పీతకు రూ.600 లాభం
- సొర్లగొందిలో సిబా ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా సాగు
- ముందుకొస్తున్న మత్స్యకారులు
ట్రే కేజ్ పద్ధతి.. ప్రస్తుతం పీతల వ్యాపారంలో లాభాలు తెచ్చిపెడుతున్న సరికొత్త విధానం. పీతల అమ్మకాల్లో దళారుల బారినపడి నష్టపోతున్న వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. నాగాయలంక మండలం సొర్లగొందిలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వా కల్చర్ (సిబా) ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిపై పీతల సాగుకు శ్రీకారం చుట్టారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. రాష్ట్రంలో తొలి సారిగా చేపట్టిన ఈ పద్ధతిపై మత్స్యకారులు ఆసక్తి కనబరుస్తున్నారు.
నాగాయలంక : సాధారణంగా ఎస్టీలు ఎక్కువగా పీతలు పడుతుంటారు. జిల్లాలోని నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో నదీపాయలు, సముద్రతీర ప్రాంతంలో కొక్కేలు ఉపయోగించి వీటిని వేటాడతారు. ఆ తరువాత మత్స్యకారులు వలలతో పచ్చపీతలు పడతారు. ఈ మండలాల నుంచి రోజుకు 1,500 నుంచి 2వేల కిలోల పీతలు ఎగుమతవుతుంటాయి. బరువును బట్టి పీతల ధర నిర్ణయిస్తారు. కిలోకు పది నుంచి 15 తూగే పీతలను రూ.200కు, నాలుగు తూగే పీతలను రూ.600 నుంచి రూ.700కు, కిలో బరువున్న పీతను రూ.1,100 నుంచి 1,200కు అమ్ముతారు. మెత్తగా ఉన్న పీతనైతే ధరలో సగానికి సగం తగ్గించి విక్రయిస్తారు. అంటే.. కిలో బరువున్న మెత్తని పీతను రూ.500కే అమ్ముతారు. పచ్చిసరుకు కావడం, నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడంతో దళారులు అడిగినంతకు ఇచ్చేస్తూ నష్టపోతుంటారు. ఇలాంటి నష్టాల నుంచి బయటపడేందుకు కనుగొన్నదే ట్రేకేజ్ పద్ధతి.
‘సిబా’ ఆధ్వర్యంలో అవగాహన
ఎస్టీ సబ్‌ప్లాన్ కింద నాగాయలంక మండలంలోని సొర్లగొందిలో నివాసం ఉంటున్న పది కుటుంబాలకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ (సిబా) ఆధ్వర్యంలో గత శనివారం ట్రే కేజ్‌లు పంపిణీ చేశారు. అంతేకాదు.. పీతల పెంపకలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగ్ విధానాన్ని వివరించారు. చెన్నైకి చెందిన సిబా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యామ్ దయాళ్ నేతృత్వంలోని డాక్టర్ అంబాశంకర్, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ కైలాసంతో కూడిన బృందం పీతల పెంపకంపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. జిల్లాలోని మిగిలిన ప్రాంతవాసులు కూడా ఈ పద్ధతిని అనుసరించాలని సూచించింది.
పండుగప్పలనూ పెంచవచ్చు..
ట్రే కేజ్ పద్ధతిలో తక్కువ పెట్టుబడితో పండుగప్ప(సీబాస్)లనూ పెంచుకోవచ్చు. చెరువులు, నదీపాయల్లో వీటిని పెంచవచ్చు. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ కింద సీడ్‌ను సరఫరా చేయడంతో పాటు మేతను అందించేందుకూ సిబా సంస్థ ముందుకొచ్చింది.
ట్రే కేజ్ అంటే..
సాధారణంగా పీతల్లో రెండు రకాలు ఉంటాయి. శరీరమంతా గట్టిగా ఉండే పీతలు తినడానికి అనుకూలంగా ఉండే మొదటిరకం. ఇక రెండో రకానికి చెందిన పీతలు శరీరం గట్టిపడకుండా మెత్తగా ఉంటాయి. ఇవి అంత రుచిగా ఉండవు. ఇటువంటి పీతలను ట్రే కేజ్ పద్ధతి ద్వారా నిల్వ ఉంచి గట్టిపడేలా చేయొచ్చు. మెత్తగా ఉన్న పీతలను నీటిలో పది నుంచి 12 రోజులు ఉంచితే గట్టిపడతాయి. మార్కెట్‌లో కూరగాయలు భద్రపరచుకునే ట్రేలను తీసుకుని, వాటిపైన బలంగా ఉండే ప్లాస్టిక్ వైర్‌ను అల్లుతారు. వీటిలో పీతలను ఉంచి నీటి సదుపాయం ఉన్న ప్రాంతాలు, చెరువుల్లో భద్రపరుస్తారు. ఏరోజుకారోజు పట్టుకొచ్చిన పీతల్లో గట్టిగా ఉన్న వాటిని అమ్ముకుని మెత్తగా ఉన్నవాటిని ట్రే కేజ్‌లో నిల్వ చేస్తారు. అవి గట్టిబడ్డాక విక్రయించి మంచి లాభాలు ఆర్జించే ఈ పద్ధతిని జిల్లాలో ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఎస్టీలకు ప్రయోజనం చేకూర్చాలనే..
పీతల వేటలో ఆరితేరిన యానాదులకు మరింత లాభాలు వచ్చే విధంగా రాష్ట్రంలో తొలిసారి ఈ పథకాన్ని చేపట్టాం. క్షేత్రస్థాయిలో వేటాడిన పీతలు తయారవకుండా మెత్తగా ఉంటే ధర పలకదు. గట్టిపడేందుకు సమయం పడుతుంది. కాబట్టి ఈ ట్రే కేజ్‌లలో పది నుంచి పన్నెండు రోజులు పెంచుతారు. అప్పుడు పీతలు గట్టిబడి మంచి ధర వస్తుంది.
- డాక్టర్ శ్యామ్‌దయాళ్, సిబా ప్రధాన శాస్త్రవేత్త
ఇలాంటి పద్ధతులను ప్రోత్సహిస్తాం..
ఎస్టీ సబ్‌ప్లాన్ కింద చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. మత్స్యశాఖ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి కేజ్ కల్చర్ విధానాలను ప్రొత్సహించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రానున్న కాలంలో ఆక్వా కల్చర్‌లో వచ్చే ఆధునిక మార్పులను అందిపుచ్చుకోవాలి.
- టి.కల్యాణం, డీడీ మత్స్యశాఖ, మచిలీపట్నం
మంచి ఫలితాలు సాధించొచ్చు..
సిబా చేపట్టిన ఈ విధానం ఆసక్తికరంగా ఉంది. అందుకే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని.. పరిశీలన నిమిత్తం మా కళాశాల ఏడో బ్యాచ్ విద్యార్థులు 28 మందిని ఇక్కడకు తీసుకువచ్చాం. విద్యార్థులకు ప్రాక్టికల్స్‌గా ఈ సాగు విధానం ఉపయోగపడుతోంది.
- కేవీ సాంబశివరావు, ల్యాబ్ టెక్నీషియన్, ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల, భావదేవరపల్లి