the fisherman
-
ని‘బంధనా’లు
అడ్డంకిగా మారిన ని‘బంధనా’లు..శాఖల మధ్య సమన్వయ లోపం..అధికారుల్లో కొర వడిన చిత్తశుద్ధి.. బ్యాంకర్ల చిన్నచూపు వెరసి మత్స్యకారులకు శాపంగా మారింది. రూ.కోట్లు కళ్లెదుట ఉన్నా ఉపాధినిచ్చే ఆసరా లేక విలవిల్లాడిపోతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఒక్క యూనిట్గ్రౌండ్ చేయలేని పరిస్థితితో ప్రభుత్వం మంజూరుచేసిన రూ.6కోట్లు వెనక్కి మళ్లిపోయే దుస్థితి దాపురించింది. సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ ధాటికి మత్స్యకారులకు అపార నష్టం వాటిల్లింది. మెకనైజ్డ్ బోట్లతో వందలాది ఫైబర్‌బోట్లు, తెప్పలు, వలలు కొట్టుకుపోయాయి. సర్వేల అనంతరం 62 మెకమనైజ్డ్ బోట్లతో పాటు 2415 తెప్పలు, పడవలు, వలలకు నష్టం వాటిల్లినట్టు గుర్తించారు.మత్స్యశాఖ పరిధిలో రూ.38.07 కోట్ల నష్టమొచ్చినట్టు లెక్కతేల్చారు. మత్స్యకారులకు జరిగిన నష్టానికి రూ.8.07 కోట్ల పరిహారం ప్రభుత్వం విడుదల చేస్తే విడతల వారీ ఇప్పటి వరకు రూ.ఐదుకోట్ల వరకు పంపిణీ చేయగలిగింది. మరమ్మతు చేసుకునేందుకు కూడా వీలు లేని విధంగా బోట్లు దెబ్బతిన్న మత్స్యకారులకు కొత్త బోట్ల కొనుగోలు కోసం డిసెంబర్లో ప్రభుత్వం రూ.6కోట్లు మంజూరు చేసింది. ఒక్కొక్క యూనిట్ విలువ రూ.4లక్షలు కాగా, అందులో సబ్సిడీ మొత్తం రూ.2 లక్షలు. బ్యాంకు రుణం రూ.2లక్షలుగా నిర్ణయించారు. ఇంజన్ బోటు నిర్మించుకోవాలంటే కనీసం ఆరు ఏడులక్షలకు పైగా ఖర్చవుతుంది. కనీసం 50శాతం సబ్సిడీతో ప్రభుత్వం రూ.4లక్షల చొప్పున మంజూరు చేస్తే మిగిలిన మొత్తాన్ని అప్పులు చేసైనా సమకూర్చుకుని బోటు నిర్మించు కోవచ్చనిమత్స్యకారులు ఆశించారు. కానీ ఆచరణలో మాత్రం వారికి రిక్తహస్తమే మిగిలింది. నిధులుండీ కొత్త బోట్లు నిర్మించుకోలేని దుస్థితిలో వారుకొట్టుమిట్టాడుతున్నారు. ఒక్కయూనిట్ గ్రౌండ్ కాలేదు గడచిన మూడు నెలల్లో ఎంతగా ఒత్తిడి తెచ్చినా అతికష్టమ్మీద 11 యూనిట్లకు మాత్రమే ప్రతిపాదనలు వచ్చాయి. అధికారుల నిర్లక్ష్యం..శాఖల మధ్య సమన్వయం లోపం.. మరీ ముఖ్యంగా బ్యాంకర్ల నిరాసక్తత వల్ల కనీసం 300యూనిట్లు గ్రౌండ్ చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఏ ఒక్కటీ గ్రౌండ్ చేయలేకపోయారు. రెండురోజుల క్రితం జరిగిన జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఇదే అంశంపై చర్చించారు. హుద్‌హుద్ వల్ల బోట్లు పూర్తిగా దెబ్బతిని ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు 50 శాతం రాయితీతో ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్లను ఎందుకు గ్రౌండ్ చేయలేక పోయారని ప్రశ్నిస్తే అధికారుల వద్ద సమాధానం లేకుండా పోయింది. తుఫాన్ వల్ల దెబ్బ తిన్న లబ్ధిదారుల వద్ద ష్యూరిటీ పెట్టేందుకు ఏమీ లేవని..ష్యూరిటీ లేకుండా బ్యాంకర్ల రుణం ఇవ్వ లేమని తెగేసి చెబుతున్నారని, అందువలనే ఈ యూనిట్లు గ్రౌండ్ చేయలేకపోతున్నామని అధికారులు చె ప్పారు. ఇది సరైన పద్ధతి కాదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మీ పనితీరు వల్ల నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యకార లబ్ధిదారులకు యూనిట్లు మంజూరులో బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని క్లాస్ తీసుకున్నారు. ఏమిటా ఆ మెలికలు? ఈ రుణం మంజూరుకు బ్యాంకర్ల నుంచి అంగీకారపత్రం పొందిన తర్వాతే ప్రతిపాదనలను ప్రాజెక్టు అధికారి, యూసీడీ, ఎమ్డీవోలకు సమర్పించాలని మెలిక పెట్టారు. పైగా తమకు నచ్చిన చోట బోటు నిర్మాణం చేయించుకోడానికి వీల్లేదని, మత్స్యశాఖ కమిషనర్ సిఫారసు చేసే బోటుయార్డులోనే పడవలను కట్టించుకోవాలని ఆదేశాలు జారీచేశారు. బోటు నిర్మాణానికి అయ్యే యూనిట్ విలువ, ఓబీఎంల రేట్లను మత్స్యశాఖ కమిషనర్ నిరా్ధారణ చేస్తారని..వాటికి అభ్యర్థులు అంగీకారం మాత్రమే తెలియ జేయాలని షరతు పెట్టారు. పైగా రుణం మంజూరుకు బ్యాంకరు అడిగిన మేరకు ఆస్తులను చూపించాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని తేల్చిచెప్పారు. ఈ ప్రతిపాదనతో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, మత్స్య శాఖాధికారి జారీ చేసే ధ్రువీకరణ పత్రం, బ్యాంకు అంగీకారపత్రం, గ్రామసభ తీర్మానం నకలు కాపీలు విధిగా ఉండాలంటూ పెట్టిన నిబంధనలు లబ్ధిదారులకు శాపంగా మారాయి. మరికొంతకాలం పొడిగించాలని కోరాం నిజమే..ఒక్కటంటే ఒక్కయూనిట్ కూడా గ్రౌండ్ కాలేదు. నిబంధనల వల్ల ఆశించిన స్థాయిలో ప్రతిపాదనలు పంపలేకపోయాం. నిధులు మురుగిపోకుండా ఈ పథకానికి మరికొంత గడువు కావాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇటీవలే జిల్లా కలెక్టర్ యువరాజ్ నివేదిక పంపారు. ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందిస్తుందని భావిస్తున్నాం. - కోటేశ్వరరావు, జేడీ, మత్స్యశాఖ -
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు
మలికిపురం: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది పల్లిపాలెంలో మత్స్యకారులకు మంగళవారం సముద్రంలో అరుదైన సముద్ర శీలావతి, కచ్చా గొరక చేపలు లభించాయి. సముద్ర శీలావతి చేప సుమారు నాలుగు అడుగుల పొడవుంది. వెన్నుపై రంగురంగులతో ఉన్న ఈ చేప స్థానికులను ఆకర్షించింది. కచ్చా గొరక చేప సుమారు 12 కిలోల బరువుంది. సముద్ర శీలావతి అరుదుగా లభిస్తుందని, కచ్చా గొరక సాధారణంగా ఇంత బరువు ఉండదని మత్స్యకారులు చెప్పారు. -
‘సముద్ర'మంత సంతోషం
బాపట్ల : మత్స్యకారులు చేపల పండగ చేసుకుంటున్నారు. హుదూద్ తుపాను కారణంగా సముద్రంలో ఏర్పడిన సుడిగుండాలతో చేపలు తీరప్రాంతానికి కొట్టుకొస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో వేటకు విరామం పకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు వేట సక్రమంగా సాగక అసంతృప్తితో ఉన్న మ త్స్యకారులకు ఇప్పుడు పంట పండినట్లైంది. సముద్రంలో రెండు,మూడు రోజులు వేట చేస్తే కనీస కూలి కూడా గిట్టని పరిస్థితుల్లో ఐలు వలలకు భారీగా చేపలు చిక్కడంతో వారి ఆనందానికి అవధులు లేనట్లైంది. దీనికి తోడు మార్కెట్లో చేపల ధర కూడా ఆశాజనకంగా ఉండటం ఈ ఏడాది సీజన్ కలిసొచ్చినట్లు భావిస్తున్నారు. గత వారం హుదూద్ తుపాను కారణంగా సముద్రంలో సుడిగుండాలు ఏర్పడటం, ప్రస్తుతం అమావాస్య రోజులు కావటంతో సముద్రం లోపల ఉన్న చేపలు భారీగా తీరం చేరుతున్నాయి. ముఖ్యంగా ఆక్వా, కోళ్ల పరిశ్రమలకు సంబంధించి మక్కిన రకం చేపలు ఐలు వలలకు చిక్కుతున్నాయి. దీంతో మత్స్యకారులు తీరప్రాంతంలో వేట ముమ్మరం చేశారు. ఒక్కో ఐలు వలకు కనీసం 30 నుంచి 40 టన్నుల వరకు చేపలు పడటంతో తీరంలో సందడి వాతావరణం నెలకొంది. వేట సాగుతుంది ఇలా... బాపట్ల మండలం రామానగర్, అడవిపల్లిపాలెం, కృపానగర్, ముత్తాయిపాలెం, దానవాయిపేటకు చెందిన మత్స్యకారులు మొత్తం సూర్యలంక సముద్ర తీరానికి చేరుకుంటున్నారు. ఒక్కొక్క ఐలు వలను కనీసం 150 నుంచి 200 మంది మత్స్యకారులు లాగాల్సివస్తోంది. మూడు విడతలుగా వేట సాగిస్తూ రెండు, మూడు గంటల్లో ఒక ఐలు వలకు చిక్కిన మొత్తం మత్స్య సంపదను ఒడ్డుకు చేరుస్తున్నారు. ఓ వైపు చేపలతో నిండిన ఐలు వల లాగుతుంటే మరో వైపు మత్స్య సంపదను ట్రాక్టర్లకు లోడ్ చేస్తున్నారు. ఇలా సూర్యలంక సముద్ర తీరం సందడి సందడిగా మారింది. పచ్చిచేపలు టన్ను రూ.10వేలు, ఎండబెట్టి విక్రయిస్తే టన్ను రూ.20వేలు చొప్పున ధర లభించనుంది. ఖర్చులన్నీపోనూ ఒక్కో మత్స్యకారునికి రోజుకు వెయ్యి రూపాయల కూలి గిట్టుబాటుఅవుతోంది. రోజుకు ఒక్కొక్క ఐలు వలకు రెండు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు మత్స్యసంపద పడుతోంది. ఇలా దీపావళి వరకు మత్స్యసంపద చిక్కే అవకాశం ఉందని మత్స్యకారులు బెబుతున్నారు. -
హుదూద్ అలజడి
పునరావాసాలకు మత్స్యకార్ల ససేమిరా ప్రత్యేక బలగాలు మోహరింపు యలమంచిలి : తీర ప్రాంత గ్రామాల్లో హుదూద్ కల్లోలం రేపుతోంది. ఈ పెను తుపాను పెద్ద ఎత్తున విరుచుకుపడుతుందన్న హెచ్చరికలతో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో తీరం చిగురుటాకులా వణికిపోతోంది. మరోవైపు తుపానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ముందస్తు చర్యలకుపక్రమించింది. తీరానికి అనుకుని ఉన్న కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తమకు జీవనాధారమైన బోట్లు, వలలు వదిలి రావడానికి మత్స్యకారులు ససేమిరా అంటున్నారు. దీంతో వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు, అధికారులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. పూడిమడక పంచాయతీలో కడపాలెం, జాలారిపాలెం, కొండపాలెం, పూడిమడక ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు సముద్రతీరంలో ఉండొద్దన్న హెచ్చరికలు అధికారులు చేస్తున్నారు. పూడిమడక మేజర్ పంచాయతీలో పూరిగుడిసెల్లో ఉంటున్న 3,500 మందిని జెడ్పీ హైస్కూలకు తరలిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వారికి భోజనం పెట్టారు. నర్సీపట్నం ఏఎస్పీ బి.సత్యఏసుబాబు, యలమంచిలి సీఐ హెచ్.మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో 50 మంది సభ్యుల జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందం, 30 మంది సభ్యుల రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ బృందాలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు, నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, సర్కిల్ పరిధిలో పోలీసు సిబ్బంది పునరావాస ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉపాధి హామీ పథకం పీడీ శ్రీరాములనాయుడు, ఏపీడీ గోవిందరావు, అచ్యుతాపురం తహశీల్దార్ కె.వి.వి.శివ, ప్రభుత్వ శాఖల సిబ్బంది పూడిమడక చేరుకున్నారు. తుపానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ముందస్తు చర్యలు తీసుకుని నష్టతీవ్రతను తగ్గించగలమన్న ఆశాభావాన్ని ఉపాధి హామీ పీడీ శ్రీరాములనాయుడు విలేకరులకు చెప్పారు. అచ్యుతాపురంలో.. అచ్యుతాపురం మండలంలోనూ అలలు ఐదు అడుగుల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. అధికారుల హెచ్చరికలతో మత్స్యకారులు తమ పడవల్ని, వలలను భద్రపర్చుకున్నారు. పూడిమడకలో జట్టీ లేకపోవడంతో చెట్లకు తాళ్లతో కట్టి పడవలను తీరం వద్ద ఉంచారు. ఇంజన్లు, వలలను ఇళ్లకు తరలించారు. ఏఎస్పీ సత్యఏసుబాబు పరిస్థితిని సమీక్షించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించారు. తీరం వెంబడి 100 ఇళ్లను ఖాళీచేయించారు. అత్యవసర సేవలకోసం ప్రత్యేక బలగాలు ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజీలో బస చేశారు. 15 బస్సులను తీరం వద్ద ఉంచారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తదితరులు పరిస్థితిని సమీక్షించారు. పాయకరావుపేట మండలంలో.. పాయకరావుపేట : హూదూద్ తుపాను ప్రభావంతో పాయకరావుపేట మండలంలో సముద్రంలో అలల తాకిడి, ఈదురుగాలులు ఎక్కువయ్యాయి. కోఆర్డినేటింగ్ ఆఫీసర్ పి.చిన్నయ్య, ఎంపీడీవో సంతోసం, తహశీల్దార్ సుమతీబాయి, రెవెన్యూ, పోలీస్, మెరైన్ శాఖల అధికారులు తీర ప్రాంతగ్రామాల్లో పరిస్థితి సమీక్షించారు. పెంటకోట, వెంకటనగరం. గజపతినగరం, పాల్మన్‌పేట, రాజయ్యపేట, గజపతినగరం, రాజవరం కొర్లయ్యపేట, కుమారపురం, తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు బోట్లను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. పెంటకోట, వెంకటనగరం ప్రాంతం నుంచి అద్దరిపేట వరకూ తీర ప్రాంతంలో ఒడ్డు మీటరు ఎత్తున కోతకు గురయింది. గజపతినగరం పునరావాస కేంద్రాన్ని ఐజీ అతుల్‌సింగ్, ఎస్పీ కె.ప్రవీణ్ పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత గజపతినగరం, వెంకటనగరం, పాల్మన్‌పేట తీరప్రాంత గ్రామలను సందర్శించారు. రేవుపోలవరంలో... ఎస్.రాయవరం : హుదూద్ తీవ్రతతో రేవుపోలవరం తీరంలో శనివారం సుమారు 150 మీటర్ల ముందుకు వచ్చింది. సాధారణ స్థాయి కంటే సముద్రం ముందుకురావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. తుఫాన్ తీరాన్ని తాకకముందే అలల తీవ్రత ఇలా ఉంటే తాకాక మరెంత ప్రమాదస్థాయిలో ఉంటుందోనని భయపడుతున్నారు. పోలీస్ ప్రత్యేక బలగాలు, ఎస్ఐ కె.శ్రీనివాసరావు తీరం పరిసరాలను సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. అలాగే బంగారమ్మపాలెం లో గ్రామస్తులకు ఉదయం అల్పాహారం, భోజన సదుపాయం కల్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, ఎంపీపీ యేజర్ల పెరుమాళ్లరాజు తుఫాన్ సహకచర్యలు సమీక్షించారు. తీరంలో హదూద్ వణుకు.. రాంబిల్లి : హుదూద్ పెనుతుపాన్ తరుముకొస్తుండటంతో తీర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సముద్రం సుమారు 60 అడుగులు ముందుకు చొచ్చుకొని రావడంతో రాంబిల్లి, కొత్తపట్నం తీరం కోతకు గురైంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. జిల్లాలో అధికంగా తీర ప్రాంత గ్రామాలు రాంబిల్లి మండలంలో ఉన్నాయి. వీటిలో కొత్తపట్నం, వాడనర్సాపురం, లోవపాలెం, రాంబిల్లి శివారు వాడపాలెం, గజిరెడ్డిపాలెం, లోవపాలెం, వెంకయ్యపాలెం, సీతపాలెం తీర ప్రాంతలున్నాయి. ఈ గ్రామాల్లో ఎవరూ ఉండరాదని అధికారులు హెచ్చరించారు. శనివారం ఈ గ్రామాలకు చెందిన సుమారు 900 మందిని రాంబిల్లి ఉన్నత పాఠశాల, క స్తూర్బా పాఠశాల, వెంక య్యపాలెం తుపాన్ షెల్టర్‌లోని పునరావాస కేంద్రాలకు తరలించిన ట్టు ప్రత్యేకాధికారి పి. కోటేశ్వరరావు తెలిపారు. మండలంలో 40 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఆర్డీవో వసంతరాయుడు కొత్తపట్నం తీర ప్రాంతాన్ని పరిశీలించారు. మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. గంగపుత్రుల బిక్కుబిక్కు నక్కపల్లి : హదూద్ తుపాను హెచ్చరికలతో గంగపుత్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని తీర గ్రామాల్లో పలుచోట్ల సముద్రం 100 మీటర్లకు పైగా ముందుకు చొచ్చుకువచ్చింది. అలలు 20-30 అడుగుల వరకు ఎగసిపడుతున్నాయి. గ్రామాలకు సమీపం వరకూ తెప్పలను తెచ్చుకోవడానికి తిప్పలు పడుతున్నారు. నియోజక వర్గంలో దాదాపు 14 మత్య్సకార గ్రామాల్లో 20వేల మంది మత్య్సకారులు సముద్రతీరం వెంబడి ఉన్న గ్రామాల్లో నివసిస్తున్నట్టు గుర్తించారు. వీరిలో ఐదు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించారు. 14 చోట్ల ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసారు. నక్కపల్లి మండలంలో 2017 మందికి గాను వెయ్యి మందిని తరలించి తర లించి వారికి ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు. మండలప్రత్యేకాధికారి శివప్రసాద్ పర్యవేక్షణలోతహశీల్దార్, ఎంపిడీవో, సీఐ గఫూర్, ఇతర అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయంలోకంట్రోలురూం ఏర్పాటు చేసారు. మన్యంలోనూ హుదూద్ భయం! పాడేరు : హుదూద్ తుపాను టెన్షన్ మన్యంలోనూ నెలకొంది. శనివారం వేకువజాము నుంచే వాతావరణం ఒక్కసారిగా మారింది. తేలికపాటి జల్లులతోపాటు ఈదురుగాలులు కూడా వీయడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. సముద్ర మట్టానికి సుమారు 3 వేల అడుగుల ఎత్తులో ఉన్న పాడేరు ఘాట్, వనుగుపల్లి, డల్లాపల్లి, మోదాపల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులు ఉధృతంగా వీచాయి. దీంతో గిరిజనులు చలిగాలులతో ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఖరీఫ్ వరిపంట గింజదశలో ఉండగా తుపానుతో తీవ్రంగా పంటను నష్టపోతామనే భయం గిరి రైతులను వెంటాడుతోంది. అలాగే రాజ్మా, ఇతర కాయగూరల సాగుదారులు కూడా తుపాను సమాచారంతో బెంగగా ఉన్నారు. రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని సబ్‌కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. అన్ని మండల తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. తుపానుతో ఎలాంటి నష్టం వాటిల్లినా సకాలంలో కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వాలని మన్యం వాసులను కోరారు. -
ట్రే కేజ్.. ఎంతో క్రేజ్..
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఒక్కో పీతకు రూ.600 లాభం సొర్లగొందిలో సిబా ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా సాగు ముందుకొస్తున్న మత్స్యకారులు ట్రే కేజ్ పద్ధతి.. ప్రస్తుతం పీతల వ్యాపారంలో లాభాలు తెచ్చిపెడుతున్న సరికొత్త విధానం. పీతల అమ్మకాల్లో దళారుల బారినపడి నష్టపోతున్న వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. నాగాయలంక మండలం సొర్లగొందిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వా కల్చర్ (సిబా) ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిపై పీతల సాగుకు శ్రీకారం చుట్టారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. రాష్ట్రంలో తొలి సారిగా చేపట్టిన ఈ పద్ధతిపై మత్స్యకారులు ఆసక్తి కనబరుస్తున్నారు. నాగాయలంక : సాధారణంగా ఎస్టీలు ఎక్కువగా పీతలు పడుతుంటారు. జిల్లాలోని నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో నదీపాయలు, సముద్రతీర ప్రాంతంలో కొక్కేలు ఉపయోగించి వీటిని వేటాడతారు. ఆ తరువాత మత్స్యకారులు వలలతో పచ్చపీతలు పడతారు. ఈ మండలాల నుంచి రోజుకు 1,500 నుంచి 2వేల కిలోల పీతలు ఎగుమతవుతుంటాయి. బరువును బట్టి పీతల ధర నిర్ణయిస్తారు. కిలోకు పది నుంచి 15 తూగే పీతలను రూ.200కు, నాలుగు తూగే పీతలను రూ.600 నుంచి రూ.700కు, కిలో బరువున్న పీతను రూ.1,100 నుంచి 1,200కు అమ్ముతారు. మెత్తగా ఉన్న పీతనైతే ధరలో సగానికి సగం తగ్గించి విక్రయిస్తారు. అంటే.. కిలో బరువున్న మెత్తని పీతను రూ.500కే అమ్ముతారు. పచ్చిసరుకు కావడం, నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడంతో దళారులు అడిగినంతకు ఇచ్చేస్తూ నష్టపోతుంటారు. ఇలాంటి నష్టాల నుంచి బయటపడేందుకు కనుగొన్నదే ట్రేకేజ్ పద్ధతి. ‘సిబా’ ఆధ్వర్యంలో అవగాహన ఎస్టీ సబ్‌ప్లాన్ కింద నాగాయలంక మండలంలోని సొర్లగొందిలో నివాసం ఉంటున్న పది కుటుంబాలకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ (సిబా) ఆధ్వర్యంలో గత శనివారం ట్రే కేజ్‌లు పంపిణీ చేశారు. అంతేకాదు.. పీతల పెంపకలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగ్ విధానాన్ని వివరించారు. చెన్నైకి చెందిన సిబా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యామ్ దయాళ్ నేతృత్వంలోని డాక్టర్ అంబాశంకర్, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ కైలాసంతో కూడిన బృందం పీతల పెంపకంపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. జిల్లాలోని మిగిలిన ప్రాంతవాసులు కూడా ఈ పద్ధతిని అనుసరించాలని సూచించింది. పండుగప్పలనూ పెంచవచ్చు.. ట్రే కేజ్ పద్ధతిలో తక్కువ పెట్టుబడితో పండుగప్ప(సీబాస్)లనూ పెంచుకోవచ్చు. చెరువులు, నదీపాయల్లో వీటిని పెంచవచ్చు. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ కింద సీడ్‌ను సరఫరా చేయడంతో పాటు మేతను అందించేందుకూ సిబా సంస్థ ముందుకొచ్చింది. ట్రే కేజ్ అంటే.. సాధారణంగా పీతల్లో రెండు రకాలు ఉంటాయి. శరీరమంతా గట్టిగా ఉండే పీతలు తినడానికి అనుకూలంగా ఉండే మొదటిరకం. ఇక రెండో రకానికి చెందిన పీతలు శరీరం గట్టిపడకుండా మెత్తగా ఉంటాయి. ఇవి అంత రుచిగా ఉండవు. ఇటువంటి పీతలను ట్రే కేజ్ పద్ధతి ద్వారా నిల్వ ఉంచి గట్టిపడేలా చేయొచ్చు. మెత్తగా ఉన్న పీతలను నీటిలో పది నుంచి 12 రోజులు ఉంచితే గట్టిపడతాయి. మార్కెట్లో కూరగాయలు భద్రపరచుకునే ట్రేలను తీసుకుని, వాటిపైన బలంగా ఉండే ప్లాస్టిక్ వైర్‌ను అల్లుతారు. వీటిలో పీతలను ఉంచి నీటి సదుపాయం ఉన్న ప్రాంతాలు, చెరువుల్లో భద్రపరుస్తారు. ఏరోజుకారోజు పట్టుకొచ్చిన పీతల్లో గట్టిగా ఉన్న వాటిని అమ్ముకుని మెత్తగా ఉన్నవాటిని ట్రే కేజ్‌లో నిల్వ చేస్తారు. అవి గట్టిబడ్డాక విక్రయించి మంచి లాభాలు ఆర్జించే ఈ పద్ధతిని జిల్లాలో ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎస్టీలకు ప్రయోజనం చేకూర్చాలనే.. పీతల వేటలో ఆరితేరిన యానాదులకు మరింత లాభాలు వచ్చే విధంగా రాష్ట్రంలో తొలిసారి ఈ పథకాన్ని చేపట్టాం. క్షేత్రస్థాయిలో వేటాడిన పీతలు తయారవకుండా మెత్తగా ఉంటే ధర పలకదు. గట్టిపడేందుకు సమయం పడుతుంది. కాబట్టి ఈ ట్రే కేజ్‌లలో పది నుంచి పన్నెండు రోజులు పెంచుతారు. అప్పుడు పీతలు గట్టిబడి మంచి ధర వస్తుంది. - డాక్టర్ శ్యామ్దయాళ్, సిబా ప్రధాన శాస్త్రవేత్త ఇలాంటి పద్ధతులను ప్రోత్సహిస్తాం.. ఎస్టీ సబ్‌ప్లాన్ కింద చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. మత్స్యశాఖ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి కేజ్ కల్చర్ విధానాలను ప్రొత్సహించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రానున్న కాలంలో ఆక్వా కల్చర్‌లో వచ్చే ఆధునిక మార్పులను అందిపుచ్చుకోవాలి. - టి.కల్యాణం, డీడీ మత్స్యశాఖ, మచిలీపట్నం మంచి ఫలితాలు సాధించొచ్చు.. సిబా చేపట్టిన ఈ విధానం ఆసక్తికరంగా ఉంది. అందుకే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని.. పరిశీలన నిమిత్తం మా కళాశాల ఏడో బ్యాచ్ విద్యార్థులు 28 మందిని ఇక్కడకు తీసుకువచ్చాం. విద్యార్థులకు ప్రాక్టికల్స్‌గా ఈ సాగు విధానం ఉపయోగపడుతోంది. - కేవీ సాంబశివరావు, ల్యాబ్ టెక్నీషియన్, ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల, భావదేవరపల్లి