అడ్డంకిగా మారిన ని‘బంధనా’లు..శాఖల మధ్య సమన్వయ లోపం..అధికారుల్లో కొర వడిన చిత్తశుద్ధి.. బ్యాంకర్ల చిన్నచూపు వెరసి మత్స్యకారులకు శాపంగా మారింది. రూ.కోట్లు కళ్లెదుట ఉన్నా ఉపాధినిచ్చే ఆసరా లేక విలవిల్లాడిపోతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఒక్క యూనిట్‌గ్రౌండ్ చేయలేని పరిస్థితితో ప్రభుత్వం మంజూరుచేసిన రూ.6కోట్లు వెనక్కి మళ్లిపోయే దుస్థితి దాపురించింది.
సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ ధాటికి మత్స్యకారులకు అపార నష్టం వాటిల్లింది. మెకనైజ్డ్ బోట్లతో వందలాది ఫైబర్‌బోట్లు, తెప్పలు, వలలు కొట్టుకుపోయాయి. సర్వేల అనంతరం 62 మెకమనైజ్డ్ బోట్లతో పాటు 2415 తెప్పలు, పడవలు, వలలకు నష్టం వాటిల్లినట్టు గుర్తించారు.మత్స్యశాఖ పరిధిలో రూ.38.07 కోట్ల నష్టమొచ్చినట్టు లెక్కతేల్చారు. మత్స్యకారులకు జరిగిన నష్టానికి రూ.8.07 కోట్ల పరిహారం ప్రభుత్వం విడుదల చేస్తే విడతల వారీ ఇప్పటి వరకు రూ.ఐదుకోట్ల వరకు పంపిణీ చేయగలిగింది.
మరమ్మతు చేసుకునేందుకు కూడా వీలు లేని విధంగా బోట్లు దెబ్బతిన్న మత్స్యకారులకు కొత్త బోట్ల కొనుగోలు కోసం డిసెంబర్‌లో ప్రభుత్వం రూ.6కోట్లు మంజూరు చేసింది. ఒక్కొక్క యూనిట్ విలువ రూ.4లక్షలు కాగా, అందులో సబ్సిడీ మొత్తం రూ.2 లక్షలు. బ్యాంకు రుణం రూ.2లక్షలుగా నిర్ణయించారు. ఇంజన్ బోటు నిర్మించుకోవాలంటే కనీసం ఆరు ఏడులక్షలకు పైగా ఖర్చవుతుంది. కనీసం 50శాతం సబ్సిడీతో ప్రభుత్వం రూ.4లక్షల చొప్పున మంజూరు చేస్తే మిగిలిన మొత్తాన్ని అప్పులు చేసైనా సమకూర్చుకుని బోటు నిర్మించు కోవచ్చనిమత్స్యకారులు ఆశించారు. కానీ ఆచరణలో మాత్రం వారికి రిక్తహస్తమే మిగిలింది. నిధులుండీ కొత్త బోట్లు నిర్మించుకోలేని దుస్థితిలో వారుకొట్టుమిట్టాడుతున్నారు.
ఒక్కయూనిట్ గ్రౌండ్ కాలేదు
గడచిన మూడు నెలల్లో ఎంతగా ఒత్తిడి తెచ్చినా అతికష్టమ్మీద 11 యూనిట్లకు మాత్రమే ప్రతిపాదనలు వచ్చాయి. అధికారుల నిర్లక్ష్యం..శాఖల మధ్య సమన్వయం లోపం.. మరీ ముఖ్యంగా బ్యాంకర్ల నిరాసక్తత వల్ల కనీసం 300యూనిట్లు గ్రౌండ్ చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఏ ఒక్కటీ గ్రౌండ్ చేయలేకపోయారు. రెండురోజుల క్రితం జరిగిన జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఇదే అంశంపై చర్చించారు. హుద్‌హుద్ వల్ల బోట్లు పూర్తిగా దెబ్బతిని ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు 50 శాతం రాయితీతో ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్లను ఎందుకు గ్రౌండ్ చేయలేక పోయారని ప్రశ్నిస్తే అధికారుల వద్ద సమాధానం లేకుండా పోయింది.
తుఫాన్ వల్ల దెబ్బ తిన్న లబ్ధిదారుల వద్ద ష్యూరిటీ పెట్టేందుకు ఏమీ లేవని..ష్యూరిటీ లేకుండా బ్యాంకర్ల రుణం ఇవ్వ లేమని తెగేసి చెబుతున్నారని, అందువలనే ఈ యూనిట్లు గ్రౌండ్ చేయలేకపోతున్నామని అధికారులు చె ప్పారు. ఇది సరైన పద్ధతి కాదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మీ పనితీరు వల్ల నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యకార లబ్ధిదారులకు యూనిట్లు మంజూరులో బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని క్లాస్ తీసుకున్నారు.
ఏమిటా ఆ మెలికలు?
ఈ రుణం మంజూరుకు బ్యాంకర్ల నుంచి అంగీకారపత్రం పొందిన తర్వాతే ప్రతిపాదనలను ప్రాజెక్టు అధికారి, యూసీడీ, ఎమ్డీవోలకు సమర్పించాలని మెలిక పెట్టారు. పైగా తమకు నచ్చిన చోట బోటు నిర్మాణం చేయించుకోడానికి వీల్లేదని, మత్స్యశాఖ కమిషనర్ సిఫారసు చేసే బోటుయార్డులోనే పడవలను కట్టించుకోవాలని ఆదేశాలు జారీచేశారు. బోటు నిర్మాణానికి అయ్యే యూనిట్ విలువ, ఓబీఎంల రేట్లను మత్స్యశాఖ కమిషనర్ నిరా్ధారణ చేస్తారని..వాటికి అభ్యర్థులు అంగీకారం మాత్రమే తెలియ జేయాలని షరతు పెట్టారు. పైగా రుణం మంజూరుకు బ్యాంకరు అడిగిన మేరకు ఆస్తులను చూపించాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని తేల్చిచెప్పారు. ఈ ప్రతిపాదనతో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, మత్స్య శాఖాధికారి జారీ చేసే ధ్రువీకరణ పత్రం, బ్యాంకు అంగీకారపత్రం, గ్రామసభ తీర్మానం నకలు కాపీలు విధిగా ఉండాలంటూ పెట్టిన నిబంధనలు లబ్ధిదారులకు శాపంగా మారాయి.
మరికొంతకాలం పొడిగించాలని కోరాం
నిజమే..ఒక్కటంటే ఒక్కయూనిట్ కూడా గ్రౌండ్ కాలేదు. నిబంధనల వల్ల ఆశించిన స్థాయిలో ప్రతిపాదనలు పంపలేకపోయాం. నిధులు మురుగిపోకుండా ఈ పథకానికి మరికొంత గడువు కావాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇటీవలే జిల్లా కలెక్టర్ యువరాజ్ నివేదిక పంపారు. ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందిస్తుందని భావిస్తున్నాం.
- కోటేశ్వరరావు, జేడీ, మత్స్యశాఖ
ని‘బంధనా’లు
Published Sun, Mar 22 2015 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM
Advertisement
Advertisement