హుద్‌హుద్ తుఫాన్‌కు పాడైన రహదారి
మానని గాయాలు
Published Mon, Aug 8 2016 8:36 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
హుద్‌హుద్ తుఫాన్‌తో దెబ్బతిన్న రహదారులు
ప్రపంచ బ్యాంకు నిధులకోసం ఎదురుచూపు
ఆన్‌లైన్ ప్రతిపాదించినా మంజూరు కాని వైనం
ఇతర నిధులు కేటాయించని సర్కారు
విజయనగరం కంటోన్మెంట్: హుద్‌హుద్... ఆ పెను విపత్తు ఇంకా జిల్లా ప్రజల మనోఫలకం నుంచి చెరిగిలేదు. ఆ భయం జాడలు వీడలేదు. ఇంకా శిథిలమైన రహదారులు ఆ గాయాన్ని చెరిగిపోని జ్ఞాపకాలుగానే ఉన్నాయి. వాటి మరమ్మతుకు ప్రపంచ బ్యాంకు నిధులొస్తాయని సర్కారు ఎదురుచూస్తోంది. ఆ నిధుల జాడ కానరావడంలేదు. మరే ఇతర నిధులు సమకూర్చేందుకు అధికారులూ యత్నించడంలేదు. ఉత్తరాంధ్రను కుదిపేసిన హుద్‌హుద్ ప్రళయ జాడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మూడు జిల్లాల్లో నష్టపోయిన వివిధ శాఖలకు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు వస్తాయని, ఇందుకోసం ముందుగానే ప్రతిపాదనలు చేసుకోవాలని ఆదేశాలందాయి. మొత్తంగా రూ. 2,400 కోట్లు మంజూరు చేసి ఆయా నష్టాలు భర్తీ చేసుకోవాలన్నారు. ఇందులో ఈపీడీసీఎల్‌కు సుమారు రూ. 650 కోట్లు, పంచాయితీ రాజ్‌కు రూ. 350 కోట్లు కేటాయించారు. అయితే జిల్లాకు సంబంధించి పంచాయతీ రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల నడవటానికి వీలు లేకుండా తయారయ్యాయి. కోతకు గురై పెద్ద గండ్లు ఏర్పడ్డాయి. ప్రపంచ బ్యాంకు నిధులకోసం 25 రోడ్లు గుర్తించి, రూ.56 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదించారు. కానీ నేటికీ ఆ నిధులు విడుదల కాలేదు. నిధులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోవడంతో అంతా ఉసూరుమంటున్నారు. జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, విజయనగరం, నెల్లిమర్ల తదితర మండలాల్లో అయితే మరీ ఘోరంగా రహదారులు దెబ్బతిన్నాయి. వాటికి నిధులు మంజూరు చేస్తారని ఎదురు చూస్తున్నా.. అసలు వస్తాయో రాదోకూడా తెలీడంలేదు.
ఏ నిధులకూ నోచుకోక...
జిల్లాలోని పలు పంచాయతీ రహదారులు హుద్‌హుద్ ప్రభావంతో పాటు ఏటా కురిసే వర్షాలకు మరింత కోతకు గురవడం... రాళ్లు తేలిపోవడం జరుగుతోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశాం కదా ఏ క్షణాన్నైనా ఆ నిధులొస్తాయేమోనన్న ఆశతో ఉపాధి హామీ కానీ, మరే నిధుల గూర్చి కానీ పట్టించుకోవడం లేదు. దీంతో ఈ రహదారులకు అటు ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు కాక మరో బడ్జెట్‌లో ప్రతిపాదించక రెంటికీ చెడ్డ రేవడిలా మారాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్షణమే నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
అంతా సిద్ధం..నిధులొస్తే పనులు: కె.వేణుగోపాల్, పర్యవేక్షక ఇంజినీరు, పంచాయతీ రాజ్, విజయనగరం
జిల్లాలో హుద్‌హుద్ తుఫాన్‌కు పాడైన రహదారుల్లో కొన్నింటికి మరమ్మతులు చేశాం. ఇంకా 25 రహదారులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిధులు విడుదలయితే వెంటనే పనులు ప్రారంభిస్తాం.
Advertisement
Advertisement