కొత్త ‘వాతావరణం’!
‘వాన రాకడ...ప్రాణం పోకడ ఎవరికీ తెలియదంటారు'. ఆ రెండింటి విషయం లోనూ శాస్త్ర విజ్ఞానం సాధించిన ప్రగతి తక్కువేమీ కాకపోయినా అవి ఇప్పటికీ పూర్తిగా మనిషికి పట్టుబడలేదన్నది నిజం. పోతుందనుకునే ప్రాణాన్ని నిలబెట్ట డానికీ, పునర్జన్మ ఇవ్వడానికీ అవసరమైన విధానాలను వైద్య రంగం అందుబాటు లోకి తీసుకురాగలిగిందిగానీ వాతావరణ పరిస్థితులపై సరైన అంచనా లివ్వడం శాస్త్రవేత్తలకు అన్నివేళలా సాధ్యం కావడంలేదు. అయితే ఇరవైయ్యేళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగు. నిరుడు అక్టోబర్‌లో హుదూద్ తుఫాను తీవ్రత గురించి అయినా... ఈమధ్యే చెన్నైలో కురిసిన భారీ వర్షాల విషయంలోనైనా వాతా వరణ శాఖ బాగానే చెప్పగలిగిందనాలి.
అలాగే ఈ ఏడాది ఎల్ నినో పర్యవ సానంగా వర్షాభావంతో దేశమంతా కరువు పరిస్థితులు ఏర్పడవచ్చునని ఆ శాఖ చెప్పిన మాట కూడా నిజమైంది. అయినా ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా రాగల 24 గంటల్లో, 48 గంటల్లో ఏమవుతుందో నిర్దిష్టంగా చెప్పగల గడం ఇంకా సాధ్యపడటంలేదు. ఈ నేపథ్యంలో వాతావరణ నివేదికల్లో వాడే పరిభాషను మార్చుకోవాలని... స్పష్టమైన అంచనాలివ్వాలని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) నిర్ణయించడం హర్షించదగిన విషయం.
గతంలో ఏడాదికో, ఏణ్ణర్ధానికో వచ్చే తుఫానులు పర్యావరణం దెబ్బతింటు న్నందువల్ల ఈ మధ్యకాలంలో తరచు పలకరిస్తున్నాయి. వచ్చినప్పుడల్లా కుండ పోత వర్షాలతో జనజీవనాన్ని అస్తవ్యస్థంగా మారుస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏ ప్రాంతానికైనా వెళ్లే ముందు అక్కడి వాతావరణ పరిస్థితుల్ని తెలుసు కోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ పనులకు ఎక్కడ ఆటంకం ఏర్పడుతుందోనన్న ఆదుర్దాయే అందుకు కారణం. వ్యక్తులకు సంబంధించి ఇలాంటి సమస్యలుంటే ప్రభుత్వాలది మరో సమస్య. నిర్దిష్ట ప్రాంతంలో వాయుగుండాలో, తుఫానులో, అకాల వర్షాలో సంభవిస్తాయని...వాటి తీవ్రత ఫలానా స్థాయిలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలిగినప్పుడు సర్వ వ్యవస్థలనూ సమాయత్తం చేయడానికి ప్రభుత్వాలకు వీలు ఏర్పడుతుంది.
ప్రజలను అప్రమత్తం చేయడానికీ, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికీ సావకాశం కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతానికిపైగా వర్షాధారం. జనా భాలో మూడింట రెండువంతుల మందికి జీవనాధారం వ్యవసాయం. అది సజా వుగా సాగాలంటే రుతుపవనాల్లో పడే వర్షాలే కీలకం. అందువల్ల వానలకు సంబం ధించిన అంచనాలు సరిగా ఉంటేనే ఏ ప్రాంతంలో ఏ పంటకు అనుకూల పరిస్థితు లుంటాయో, ఎలాంటి అననుకూలతలు ఏర్పడతాయో తెలుస్తుంది. అలా తెలుసు కోవడం రైతులకు చాలా అవసరం.
ఇన్ని విధాలుగా ఇంతమందికి ఉపయోగపడే వాతావరణ అంచనాలు స్పష్టంగా ఉండాలని కోరుకోవడం అత్యాశేమీ కాదు. అలాగని అదంత సులభం కూడా కాదు. ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైనది మన రుతుపవనాల తీరుతెన్నులను అంచనా వేయడమేనని శాస్త్రవేత్తలు అంటారు. పశ్చిమాఫ్రికా, ఆసియా-ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా రుతు పవనాల విషయంలో ఈ స్థాయి సంక్లిష్టత ఉండదని వారి వివరణ. మన రుతు పవనాలను ప్రభావితం చేసే స్వల్పకాల, దీర్ఘకాల అంశాలు అనేకానేకం ఉండట వల్లే సంక్లిష్టత తప్పడంలేదని చెబుతారు.
చంద్రుడిపైకి మనిషిని పంపడం, గ్రహాల మధ్య దూరాన్నీ, వాటి కక్ష్యలనూ నిర్దిష్టంగా చెప్పడం సాధ్యమవుతున్నప్పుడు...అందుకు అవసరమైన శాస్త్ర, సాంకే తిక ప్రగతి అందుబాటులోకొచ్చినప్పుడు ఫలానా సమయానికి వర్షం పడుతుం దనో, పడదనో ఎందుకు అంచనా వేయలేకపోతున్నారన్న సందేహం సామాన్యు లకు కలగడం సహజం. అసలు గాలులు వీచడానికైనా, వర్షాలు పడటానికైనా, తుఫానులు చెలరేగడానికైనా భూ ఉపరితలం వేడెక్కడమే కారణం. దాన్ని సరిగా గుర్తించగలిగిన, కొలవగలిగిన సాధనాలను అమల్లోకి తీసుకురావడం ద్వారా... వాటి ఆధారంగా సరైన లెక్కలు వేయగలిగే విధానాలను పాటించడం ద్వారా వాతా వరణం ఎలా ఉంటుందో చెప్పడం సాధ్యమవుతుంది.
వాతావరణంలోకి విడిచి పెట్టే బెలూన్‌లు గాలిలో ఉండే తేమనూ, ఉష్ణోగ్రతనూ చెప్పగలిగితే... అంతరి క్షంలో తిరుగాడే ఉపగ్రహాలు నేలపైన ఉండే పరిస్థితులకు సంబంధించిన డేటాను ఇవ్వగలుగుతున్నాయి. సెకనుకు కొన్ని లక్షల గణనలను చేయగలిగే సూపర్ కం ప్యూటర్లకు ఈ డేటానంతటినీ అందజేసి అవి ఇచ్చే ఫలితాల ఆధారంగా 20 శాతం అటూ ఇటూగా అంచనాలకు రాగలుగుతున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్న మాట.
అంచనాల వెనక ఎంత శాస్త్రీయత ఉన్నా అవి తప్పుల తడకని తేలితే వచ్చే విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. మన దేశంలో వాతావరణానికి సంబంధించి నంతవరకూ అనిశ్చితికీ, అయోమయానికీ తావిస్తున్న పదాలనూ, అంచనాలనూ మార్చాల్సిందేనని ఈమధ్యే నిర్ణయించారు. వర్షాలు పడే ‘అవకాశం ఉంది’... వడగాడ్పులు ‘వీయవచ్చు’లాంటి వాక్యాలు ఇకపై కనబడకూడదని వాతావరణ విభాగం సర్క్యులర్ జారీచేసింది. ఇక ‘అక్కడక్కడ’ వర్షాలు పడొచ్చుననిగానీ... ‘ఒకట్రెండుచోట్ల’ వర్షాలు పడతాయనిగానీ చెప్పడం చెల్లదు. ‘అక్కడక్కడ’ అంటే ఎక్కడో...ఆ ‘ఒకట్రెండు చోట్లూ’ ఏవో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే సాధారణ వర్షపాతం, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, వర్షపాతం లోటు వంటివి ఇప్పుడు కొత్త అర్థాల్ని ఇవ్వబోతున్నాయి. వడగాడ్పులు, చలి గాలులకు సంబంధించిన ప్రమాణాల్లోనూ మార్పులు చేశారు. ఈ మార్పులవల్ల పౌరులకు వాతావరణానికి సంబంధించి అందే అంచనాల్లో మరింత ఖచ్చితత్వం ఏర్పడు తుంది. వాస్తవ పరిస్థితులకు అవి మరింత దగ్గరగా ఉంటాయి. సాంకేతిక విజ్ఞానం పరిధి విస్తరిస్తున్నకొద్దీ దేన్నయినా మార్చుకోవాల్సిందే. వాతావరణ శాఖ అయినా అందుకు మినహాయింపు కాదు. దాన్ని గుర్తించినందుకు ఐఎండీకి అభినందనలు చెప్పాలి.