అది నా జీవిత కథ అని వాళ్లు తెలివిగా ప్రచారం చేశారు...
ఆమెలో అందం లేదన్నారు. అభినయం చేత కాదన్నారు. కథానాయికగా కాదు కదా... కామెడీ పాత్రలకు కూడా పనికిరాదన్నారు... మరొకరైతే ఆ దెబ్బతో ఇంటిముఖం పట్టేవారేమో! కానీ, మొండిగా ఆమె ఆ విమర్శలన్నిటినీ తట్టుకొంది. తాడిపర్తి సరస్వతి... కాస్తా అభినయ వి‘శారద’గా మారింది. ఆ పరిణామం ఎలా జరిగింది? ముచ్చటగా మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా ‘ఊర్వశి’ పురస్కారం అందుకొన్న ఈ అభినేత్రి మలయాళ సినీ ప్రియులకు ‘చేచి’ ఎలా అయింది? తెలుగులోనే కాక, తమిళ, మలయాళాల్లోనూ ఇంటింటి పేరుగా ఎలా వెలిగింది? చిన్న వయసులోనే పెద్ద వయసు అమ్మ పాత్రలు ఎలా వేసింది? జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్న శారద ఆత్మకథ రాస్తానంటూనే, ఏ విషయంలో తటపటాయిస్తున్నారు? వచ్చే ఏడాదిలో సినీ జీవిత షష్టిపూర్తి చేసుకోనున్న శారద అంతరంగ ఆవిష్కరణ...
నమస్కారం శారద గారూ! ఎన్నాళ్లయ్యిందండీ మిమ్మల్ని చూసి...
శారద: సినిమాలు తగ్గించేశా. అందుకే కనబడటం తగ్గింది. ‘సుకుమారుడు’ తర్వాత తెలుగు సినిమా చేయలేదు. మనసుకు నచ్చిన పాత్రలే చేస్తున్నా.
మీరు సినిమా పరిశ్రమకొచ్చి వచ్చే ఏడాదికి 60 ఏళ్లు అవుతుందండీ...
శారద: అవునా..! అప్పుడే నేనొచ్చి 60 ఏళ్లు అవుతోందా? 1955లో ‘కన్యాశుల్కం’ కోసం తొలిసారిగా బాల నటిగా తెరపైకొచ్చా. తర్వాత చాలా గ్యాప్. 1961లో ‘ఇద్దరు మిత్రులు’తో మళ్లీ కెరీర్ మొదలైంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ అంతా గుర్తు చేసుకుంటుంటే మనసుకెంతో హాయిగా అనిపిస్తుంటుంది. ఇన్నేళ్లలో ఇంత దూరం ప్రయాణించానా అనిపిస్తుంది. జీవితంలో చాలా చూసేశా.
మీరు చూసినన్ని అప్ అండ్ డౌన్స్ ఇంకెవరూ చూడలేదనుకుంటాను?
శారద: ఇక్కడ అప్ అండ్ డౌన్స్ కామన్. ఎక్కువ తక్కువలుంటాయంతే. ఎక్కడ తెనాలి? ఎక్కడ మద్రాసు? సినిమాల్లోకొస్తానని కలలో కూడా అనుకోలేదు.
మరి ‘కన్యాశుల్కం’లో నటించే అవకాశం ఎలా వచ్చింది?
శారద: అప్పుడు నా వయసు తొమ్మిదో, పదో. మద్రాసులో జగ్గయ్యగారి పెద్దమ్మాయి, సీనియర్ నటి హేమలతమ్మగారి అమ్మాయి సుభద్ర, నేను - భరతనాట్యం నేర్చుకునేవాళ్లం. ఓ పాటలో సుభద్రతో యాక్ట్ చేయిద్దామనుకుని దర్శకుడు పి.పుల్లయ్యగారు అక్కడకొచ్చారు. నన్ను కూడా ఎంపిక చేశారు. ‘చేతాము రారే కల్యాణము’ అనే పిల్లల పాటలో పెళ్లికొడుకు తల్లి వేషం వేశా.
మీది తెనాలి కదా! అప్పుడు మద్రాసు ఎందుకొచ్చినట్టు?
శారద: మా నాన్నగారు వెంకటేశ్వర్లుది బంగారు నగల తయారీ వ్యాపారం. బర్మా వెళ్లాలనుకుని, కొన్నాళ్లు మద్రాసులో కాపురం పెట్టారు. రెండు మూడేళ్లు ఉండి, కుదరక తిరిగి తెనాలి వెళ్లిపోయాం. ఆ సమయంలోనే ‘కన్యాశుల్కం’లో నటించే అవకాశం వచ్చింది. నిజానికి, నా ఎనిమిదేళ్ల వయసులో ‘సంతానం’లో నటించే అవకాశం వచ్చింది.
అది ఎలా వచ్చిందో ఎవరి ద్వారా వచ్చిందో కూడా గుర్తు లేదు. తీరా లొకేషన్‌లోకి వెళ్లాక అక్కడి వాతావరణం కొత్తగా అనిపించి భోరుమని ఏడవసాగాను. దాంతో వాళ్లు ఈ పాప కెమెరా ముందు ఏం నటిస్తుందని సందేహపడి వెనక్కు పంపేశారు. ఆ సినిమా కోసమే లతా మంగేష్కర్‌గారు ‘నిదురపోరా తమ్ముడా’ పాట పాడారు. నేను అందులో నటించి ఉంటే ఆ పాట నా మీదే చిత్రీకరించేవారు. అలాంటి సువర్ణావకాశం కోల్పోయినందుకు ఇప్పటికీ దుఃఖమే నాకు.
అసలు మీరు ఈ కళారంగంలోకి ఎలా వచ్చారు?
శారద: చిన్నతనం నుంచి నాకు మా ఇంట్లోవాళ్లు భరత నాట్యం నేర్పించారు. అలా కొన్ని నాటకాల్లో నటించే అవకాశం వచ్చింది. ఓ రకంగా మా కుటుంబాల్లో ఇలాంటి వాటికి అంగీకరించరు. ఆడపిల్లలకు 14 ఏళ్లకే పెళ్లి చేసేస్తారు. కానీ నా ఆసక్తి, ప్రతిభ చూసి అమ్మ ధైర్యం చేసి పంపించింది. ఇది నచ్చక మాతో మూడేళ్ల పాటు ఎవరూ మాట్లాడలేదు. అయినా అన్నీ భరించాం.
ఇక నటన విషయానికొస్తే... ‘రక్త కన్నీరు’ నాటకం జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో నటుడు నాగభూషణంగారి పక్కన హీరోయిన్ వేషం. ఆ వయసులో చీర కట్టుకోవడం కూడా చేతనయ్యేది కాదు. అన్నీ అమ్మమ్మ దగ్గరుండి చూసుకునేది. వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చినట్టున్నాను. అప్పట్లో నాకు రాత్రి ఏడుగంటలకే నిద్రపోయే అలవాటు. కానీ నాటకం పూర్తయ్యేసరికి పన్నెండు గంటలయ్యేది. రోజూ నాటకం క్యాన్సిలైతే బావుండనుకునేదాన్ని.
ఆ వయసులో మీరు డేరింగ్‌గా ఉండేవారా?
శారద: మా నాన్నగారి అమ్మమ్మ జొన్నాదుల ఆదిలక్ష్మి చాలా డేరింగ్ అట. కళ్లు లేకపోయినా కుటుంబాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని 20 ఏళ్లు నడిపించిందట. ఆవిడది గంభీరమైన కంఠస్వరమట! అలాగే మా అమ్మమ్మ బండి కనకమ్మదీ ఫుల్ కమాండింగ్ నేచర్. మా మేనత్త పుట్టా సుశీలమ్మ కూడా అంతేనట. వాళ్ల డేరింగ్ నెస్, వాయిస్ నాకు సంక్రమించినట్టున్నాయి.
మీ అసలు పేరు తాడిపర్తి సరస్వతి కదా! శారదగా మార్చుకున్నారేం?
శారద: మా నాన్నగారి తొలి భార్య పేరు సరస్వతి. ఆమె చాలా చిన్న వయసులోనే చనిపోయారు. చాలా గొప్ప మనసట ఆవిడది. ఆమె పేరు నాకు పెట్టారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక అప్పటికే చాలామంది సరస్వతులు ఉండటంతో నాన్న గారే నా పేరు ‘శారద’ అని మార్చారు.
‘ఇద్దరు మిత్రులు’ లో అవకాశం ఎలా వచ్చింది?
శారద: దర్శక - నిర్మాత ఎల్వీ ప్రసాద్ గారు అప్పట్లో కొత్త ఆర్టిస్టులతో సినిమా చేద్దామనుకుని నన్ను ఎంపిక చేసి కొన్నాళ్లు శిక్షణ ఇప్పించారు. కానీ ఆ సినిమా చేయలేకపోయారు. ఇంతలో ‘ఇద్దరు మిత్రులు’లో ఏయన్నార్ చెల్లెలి వేషానికి ఆర్టిస్టుల్ని వెదుకుతుంటే, ఎల్వీ ప్రసాద్ గారు నన్ను రికమెండ్ చేశారు. ఆ సినిమా పెద్ద హిట్టయ్యి, నాకూ పేరు తెచ్చి పెట్టింది.
అయితే మొదట్లో మీకు కామెడీ వేషాలే ఎక్కువొచ్చినట్టున్నాయి?
శారద: అవును. పద్మనాభం గారితోనే 15 సినిమాలు చేశా. ఆ తర్వాత 3, 4 ఏళ్లు వేషాలే రాలేదు. ఈ అమ్మాయిలో అందం లేదన్నారు. నటన చేతకాదన్నారు. హీరోయిన్‌గా కాదు కదా, కామెడీ వేషాలక్కూడా పనికిరాదన్నారు. ముక్కు బాగా లేదని కామెంట్ చేశారు. నవ్వొచ్చేదేంటంటే - ఆ తర్వాత అదే ముక్కును పొగిడారు. ప్రొఫైల్‌లో శారద ముక్కు సూపర్ అన్నారు.
ఆ మూడేళ్ల గ్యాప్‌లో ఏం చేశారు?
శారద: ఏం చేయాలో తెలీని పరిస్థితి. ఇక మూటాముల్లె సర్దుకుని తెనాలి వెళ్లిపోదామనుకుంటున్న సమయంలో కుంచాకో అనే దర్శక-నిర్మాత నన్ను పిలిచి మలయాళంలో ‘ఇన పావుగళ్’ అనే సినిమా చేసే అవకాశమిచ్చారు. అప్పటి నాకు మలయాళం అస్సలు రాదు. అయినా ధైర్యం చేశా. ఇక ఆ తర్వాత అక్కడ వరుసగా సినిమాలు చేశా.
మలయాళీ చిత్ర పరిశ్రమ నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంది. ఎన్నెన్నో మంచిపాత్రలిచ్చి గౌరవించింది. నన్ను మలయాళీలు ప్రేమగా ‘చేచి’ అని పిలుస్తారు. ‘చేచి’ అంటే మలయాళంలో ‘అక్క’ అని అర్థం. ఇప్పటికీ అదే పిలుపు. నా తుదిశ్వాస వరకూ మలయాళీలను మర్చిపోకూడదు. అంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు వాళ్లు నాకు.
మరి మీకు మలయాళం మాట్లాడటం వచ్చిందా?
శారద: ప్రపంచంలో ఏ భాషైనా మాట్లాడొచ్చు కానీ మలయాళం ఉచ్చారణ చాలా కష్టం. అయినా నేర్చుకున్నా. అయితే, టి.ఆర్ ఓమన, ఫిలోమినా... ఇలా కొందరు నాకు డబ్బింగ్ చెప్పారు. ఒకటి, రెండు సినిమాలకు మాత్రం నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. అవి చాలా తక్కువ డైలాగులున్న సిని మాలు కావడంతో చెప్పా. ఎందుకంటే, భాష విషయంలో వాళ్ళకు చాలా పట్టింపు. మన వాళ్లకేమో భాష రాకపోవడం, వచ్చీరాని తెలుగు మాట్లాడటం ఫ్యాషన్.
సరేనండి... ఇంతకూ మలయాళం నుంచి మళ్లీ తెలుగులోకి ఎలా వచ్చారు?
శారద: మలయాళంలో విన్సెంట్‌గారు డెరైక్ట్ చేసిన ‘తులాభారం’ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేయాలని ‘జెమినీ’ వాసన్‌గారు హక్కులు తీసుకున్నారు. తెలుగు, తమిళం నేర్పి చేయించండని తన కొడుకు బాలుతో చెప్పారట వాసన్. తీరా ఇక్కడికొచ్చాక నేను తెలుగమ్మాయినే అని తెలిసి చాలా ఆశ్చర్యపోయారు.అలా తెలుగులో ‘మనుషులు మారాలి’తో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది.
ఈ సినిమా విషయంలో వాసన్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటా. వేరే తెలుగు నిర్మాత అయ్యుంటే నన్ను హీరోయిన్‌గా తీసుకుని ఉండేవారు కాదు. అప్పటికి తెలుగులో పాపులర్ ఎవరో వాళ్లను హీరోయిన్‌గా పెట్టుకునేవారు. వాసన్ గారు తీసిన ‘బాలనాగమ్మ’లో మా తెనాలికి చెందిన కాంచనమాల నటించారు. అప్పట్లో వారిద్దరి మధ్య ఏవో మనస్పర్థలొచ్చాయి. యాదృచ్ఛికం కాకపోతే తెనాలికి చెందిన కాంచనమాల ఆయన వల్ల ఇబ్బందులు పడితే, నేనేమో కొత్త జీవితం పొందా. ‘మనుషులు మారాలి’ తర్వాత తెలుగులో బిజీ అయ్యా.
ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా మీరే చేశారు కదా?
శారద: హీరోలు, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మారారు కానీ ఎక్కడ తీసినా నేను కామన్. హిందీలో ‘సమాజ్ కో బదల్ డాలో’గా జెమినీ వాళ్లే తీశారు. ఇలా ఒకే పాత్రను నాలుగు భాషల్లో చేసే అరుదైన అవకాశం దక్కింది. ఆ కథ, ఆ పాత్రకున్న ఘనత అలాంటిది. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం కోసం రాసిన డ్రామా అది. విన్సెంట్ గారు గొప్పగా తెరకెక్కించారు. ఆ పాత్ర చేసే సమయానికి నాకు 22 ఏళ్లు. అంత చిన్న వయసులో అంత పెద్ద వేషం. విన్సెంట్ గారు జాగ్రత్తగా చేయించారు. అప్పుడప్పుడూ వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి వస్తుంటా.
ఉత్తమ నటిగా మీ తొలి జాతీయ అవార్డు ఈ సినిమాకేగా వచ్చింది?
శారద: అవును. అప్పుడు ‘ఊర్వశి’ పురస్కారం అనేవారు. దాని విలువ మొదట్లో తెలియలేదు. తర్వాత ‘స్వయంవరం’ (మలయాళం), తెలుగులో ‘నిమజ్జనం’ చిత్రాలకు ‘ఊర్వశి’ పురస్కారం అందుకున్నాను.
‘నిమజ్జనం’ అవకాశం ఎలా వచ్చింది?
శారద: ఇది కూడా ఓ మలయాళ రచయిత కథ. బీఎస్ నారాయణగారు డెరైక్ట్ చేశారు. ఇప్పటి రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు నిర్మించారు. ఓ ఆర్ట్ ఫిలింలా చేయాలనుకున్నారు. నేను తప్ప అంతా కొత్త ఆర్టిస్టులే.
హీరోయిన్‌గా చేస్తూ కేరెక్టర్ ఆర్టిస్టుగా మారడం ఇబ్బందనిపించలేదా?
శారద: ఎందుకు ఇబ్బంది! నేను హీరోయిన్‌గా గ్లామర్ పాత్రలు చేసుంటే ఇబ్బందులొచ్చేవి. నేను చేసినవన్నీ సహజమైన పాత్రలు. ఇంటి ఇల్లాలి పాత్రలంటే మొదట నన్నే అడిగేవారు. అలా చిన్న వయసులోనే తల్లి వేషాలు వేశా. కేరెక్టర్ ఆర్టిస్టుగానూ మంచి వేషాలొచ్చాయి. ‘న్యాయం కావాలి’లో మొదటిసారిగా కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశా. లాయర్ పాత్ర. ఆ తర్వాత ‘చండశాసనుడు’తో బ్రేకొచ్చింది. అది నా కెరీర్‌లో మైలురాయి.
అప్పట్లో పోలీసు పాత్రలంటే మీకే ఇచ్చేవారు కదా...
శారద: మొదట ‘ప్రతిధ్వని’లో పోలీసాఫీసర్ వేషం వేశా. చాలామంది నిర్మాత రామానాయుడి గారి దగ్గర కామెంట్లు చేశారట. ఆడ పోలీస్ ఏంటన్నారట. పోలీస్ యూనిఫామ్‌లో నేనెలా ఉంటానా అని సందేహించాను. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
ఒక దశలో అత్త పాత్రలు కూడా ఎక్కువ చేశారుగా...
శారద: ‘అనసూయమ్మగారి అల్లుడు’లో అత్తగా నన్ను పెడదామనుకుంటే చాలామంది అనుమానం వ్యక్తం చేశారట. ‘ఎన్టీఆర్ గారు మాత్రం శారద పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతారు’ అని చెప్పారట. అదే జరిగింది. బాలకృష్ణ ఇప్పటికీ నేనెక్కడ కనపడ్డా ‘ఓయ్... అనసూయమ్మత్తో’ అని పిలుస్తారు. ‘నారీ నారీ నడుమ మురారి’లో కూడా నాది మంచి వేషం.
ఆర్టిస్టుగా మొత్తం ఎన్ని సినిమాలు చేసి ఉంటారు?
శారద: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ కలిపి 350కి పైగా సినిమాలు చేశాను. నేను చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు ఇంకెవరూ చేయలేదేమో కూడా. అంతా నా అదృష్టం. కన్నడంలో అనంత్‌నాగ్, విష్ణువర్ధన్‌లతో నటించా. ఓ సినిమాలో రజనీకాంత్‌కు ప్రేయసిగా చేశాను.
హిందీలో ఎన్ని సినిమాలు చేశారు?
శారద: అయిదారు చేశాను. సంజీవ్‌కుమార్, శతృఘ్నసిన్హాల పక్కన హీరోయిన్‌గా చేశా. దిలీప్‌కుమార్ పక్కన ఓ సినిమాలో నటించాను. అది మధ్యలోనే ఆగిపోయింది. అమితాబ్‌తో మొదలైన సినిమాది కూడా అదే పరిస్థితి. దర్శకుడు హృషీకేశ్ ముఖర్జీ ‘కోషిష్’లో నన్ను తీసుకున్నారు. అప్పుడు నేను మలయాళంలో బిజీ. అవి వదులుకుని వెళ్లలేను కదా.
ఇలా మీరు వదులుకున్న మంచి సినిమా ఇంకా ఉన్నాయా?
శారద: ‘అంకుర్ సినిమా నేనే చేయాలి. నా కోసం దర్శకుడు శ్యామ్ బెనగళ్ ఒక నెల ఎదురు చూశారు. నా నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి ఆయనకు కోపం వచ్చింది. ఓ కొత్తమ్మాయితో చేస్తానని చెప్పి వెళ్లిపోయారు. ఆ వేషం షబనా ఆజ్మీతో చేశారు. ఆ వేషం వేయలేదని బాధ లేదు కానీ నాకు, అనవసరంగా ఆయన మనసు బాధ పెట్టాననే ఫీలింగ్ ఉంది. అలాంటి పాత్రలు మలయాళంలో నేను చాలా చేశాను. అయినా నా వల్ల షబనా ఆజ్మీ అనే గొప్ప నటి బయటికొచ్చింది కదా!
ఇంతకీ మీరు హైదరాబాద్‌కు ఎందుకు షిఫ్ట్ కాలేదు?
శారద: చిన్నప్పటి నుంచీ మద్రాసు అలవాటైంది. ఇక్కడ హాయిగా ఉన్నా. అందుకే షిఫ్ట్ కాలేదు. ఇక్కడ నన్ను అందరూ తమ మనిషిగా చూస్తారు. ‘అమ్మా’ అని పిలుస్తారు. ఆ పిలుపే ఆనందాన్నీ, శక్తినీ ఇస్తుంటుంది.
టీవీ సీరియల్స్ ఏమైనా చేశారా?
శారద: ఏవీయమ్ వాళ్ల సీరియల్ చేశా. ఆ తర్వాత మళ్లీ చేయలేదు.
డెరైక్షన్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదా?
శారద: నన్నెవరూ అడగలేదు. నాకూ ఆ ఆలోచన రాలేదు. డెరైక్షన్ అనేది ప్రత్యేకమైన కళ. అది అందరికీ అబ్బదు. నా వరకూ నేను డెరైక్టర్స్‌కి కొన్ని సలహాలు ఇస్తుండేదాన్ని. తీసుకోకపోయినా పట్టించుకునేదాన్ని కాదు.
రాజకీయాలు, మీ రాజకీయ జీవితం, ఇప్పుడు దూరంగా ఉండడం...?
శారద: ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలను. కానీ చెప్పే ఆసక్తి లేదు.
మీ పర్సనల్ లైఫ్ గురించి?
శారద: అస్సలు మాట్లాడను. ఒక స్త్రీగా పుట్టాక ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. అందరి జీవితాల్లోనూ ఉంటాయి. నా జీవితంలో పౌర్ణమే ఎక్కువ చూశాను. అమావాస్య తక్కువ. చాలామందితో పోలిస్తే దేవుడు నాకు మంచి జీవితం ఇచ్చాడు. ఇంతకు మించిన సక్సెస్ ఏముంది?
వ్యక్తిగత జీవితంలోని ఒడుదొడుకులు కెరీర్‌పై ప్రభావం చూపలేదా?
శారద: నేను సున్నిత మనస్కురాలినే కానీ, చాలా మొండిదాన్ని, ధైర్యవంతురాలిని. నటనపై వ్యక్తిగత జీవిత ప్రభావం పడకుండా చూసుకున్నా. నాకు ఒక్కడే తమ్ముడు. వాళ్ల పిల్లలే నా కుటుంబం.
మీ ఆత్మకథ రాసుకునే ఉద్దేశం ఉందా?
శారద: త్వరలో రాయనున్నాను. అయితే వ్యక్తిగత జీవితంలోని అన్‌హ్యాపీనెస్ గురించి ప్రస్తావించాలా, లేదా అని ఆలోచిస్తున్నాను.
ఈ మధ్య తెలుగు సినిమాలు ఏమైనా చూశారా?
శారద: ‘ఉయ్యాల జంపాల’ చూశా. బాగా నచ్చింది. దర్శకుడికి ఫోన్ చేసి మాట్లాడా. హీరో గమ్మత్తుగా అనిపించాడు. హీరోయినూ బాగా చేసింది.
ఇప్పటి కథానాయికలను చూస్తుంటే ఏమనిపిస్తోంది?
శారద: చాలా బాధగా ఉంది. అసలు దుస్తులే అక్కర్లేదన్నట్టుగా ఉంటున్నారు. దుస్తులపై ఖర్చు దండగ అనుకుంటున్నారో, ఇలా ఉంటేనే డిమాండ్ అనుకుంటున్నారో! అలా చేస్తే పోనీ సినిమాలు ఆడుతున్నాయా అంటే అదీ లేదు. ఇదేదో నేను విమర్శనా దృష్టితో అనడం లేదు. బాధతో అంటున్నాను. వస్త్రధారణ అనే కాదు, సంభాషణలూ అలానే ఉన్నాయి.
మన ఇంట్లో మన పిల్లలు అలా మాట్లాడితే ఒప్పుకుంటామా? కాబోయే భర్తను కూడా వాడూ వీడూ అనడమేంటి? అసలు ఈ ధోరణే బాగాలేదు. ఒక్క హీరోయిన్ పాత్రలనే కాదు, హీరోల పాత్రలూ అలానే ఉన్నాయి. ఇప్పటి రోజుల్లో హీరో అంటే జులాయే అన్నట్టుగా చూపిస్తున్నారు.
హీరో పాత్రలన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఓ చిన్న ఆలోచనతో కూడా మంచి సినిమా తీయొచ్చు. అంతేకానీ అసభ్య పదజాలం, అర్ధనగ్న దృశ్యాల వల్ల ఏ సినిమా హిట్ కాదు. సంగీత సాహిత్యాలూ అలానే ఉన్నాయి. ఏ భాషో అర్థం కావడం లేదు. తెలుగు చాలా గొప్ప భాష. రకరకాల భాషలతో సంకరం చేసి దాన్ని నాశనం చేస్తున్నారు.
మీ జీవితం ఆధారంగా మలయాళంలో సినిమా వచ్చినట్టుంది?
శారద: అది నిజం కాదు. ఆ సినిమాలో నేనూ యాక్ట్ చేశా. అందులో నాది క్రైస్తవ పాత్ర. వాళ్లు చాలా తెలివిగా నా జీవితకథ అని ప్రచారం చేసుకున్నారు. కానీ జనం నమ్మలేదు. అందుకే ఆ చిత్రమూ పరాజయం పాలైంది.
ప్రస్తుతం మలయాళంలో చేస్తున్నారా?
శారద: లేదు. కావాలని విరామం తీసుకున్నా. అయినా యాక్ట్ చేయడానికి ఇంతకు ముందున్నంత ఉద్వేగమూ లేదు. ఒత్తిడి చేస్తే, అప్పుడు చేస్తాను.
ఒకప్పుడు తెగ శ్రమించారు. ఇప్పుడీ విశ్రాంత జీవితం ఏమనిపిస్తోంది?
శారద: ఎక్కడండీ విశ్రాంతి? ఇప్పటికీ ఏదో పనులతో బిజీనే.
ప్రస్తుత సమాజంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉందంటారు?
శారద: సినిమాలు చూసి కొందరు స్త్రీలు విచిత్రమైన వస్త్రధారణలకు దిగుతున్నారు. నిన్న ఒక పెళ్లికి వెళ్తే, ఒకావిడ విచిత్రమైన బ్లౌజ్ వేసుకొచ్చింది. అందరూ బాడీని చూస్తుంటే, గొప్పనుకుంటోంది. అందాన్ని గుట్టుగా దాచుకుంటేనే విలువ. ఎముకలన్నీ చూపించడం గ్లామర్ కాదుగా!
ఈ ఫీల్డ్‌లో పురుషాధిక్యత అధికం. ఇబ్బందులు, వివక్ష ఎదుర్కోలేదా?
శారద: లేదు. నాకంటూ ఓ ప్రాధాన్యం, ఓ గౌరవం ఉండేవి. నన్నందరూ బాగా చూసుకునేవారు. ఆ రకంగా నేను చాలా అదృష్టవంతురాలిని. నా కెరీర్ అంతా గౌరవప్రదంగానే సాగిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రముఖ హీరోలు, దర్శకులతో పనిచేశాను. తమిళంలో ఎమ్జీఆర్‌తో ‘నినైత్తదై ముడిప్పవన్’ అనే ఒకే ఒక్క సినిమా చేశాను.
అందులో ఆయన చెల్లెలి వేషం ధరించాను. ఆ ఆఫర్ వచ్చే సమయానికి నేను వేరే సినిమాల్లో బిజీ. కానీ ఎమ్జీఆర్ నా కోసం కొన్నాళ్లు ఆగారు. అంతకన్నా అదృష్టం ఏం కావాలి! ‘సచ్చా ఝూటా’ అనే హిందీ హిట్‌కు అది రీమేక్. ఇప్పటికీ తమిళనాడులో ఏ మతానికి చెందిన పెళ్లి జరిగినా ఆ సినిమాలోని పాట ప్లే చేస్తారు. మదర్స్ డే అంటే తెలుగు టీవీలో తప్పనిసరిగా ‘అమ్మ రాజీనామా’ వస్తుంది. మలయాళంలో అయితే ‘రాప్పగల్సినిమా వేస్తారు.
మమ్ముట్టి, నయనతార, నేను కలిసి నటించిన తొలి సినిమా అది. ఇక, కార్తిక మాసం వస్తే శోభన్‌బాబు, నేను, శ్రీదేవి నటించిన ‘కార్తీకదీపం’ వేస్తారు. ఇలా చాలా సందర్భాల్లో నా సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంటాయి. నాకన్నా డబ్బులు ఎక్కువ సంపాదించినవాళ్లుంటారు కానీ, నా అంత సంతృప్తి అరుదుగా మాత్రమే లభిస్తుంది.
మీ భవిష్యత్ ప్రణాళికలు?
శారద: అంధులకూ, అనాథలకూ సేవ చేయాలని ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ - మూడు ప్రాంతాల్లోనూ సేవా కార్యక్రమాలు చేయాలనుంది. కచ్చితంగా చేస్తా. దేవుడు ఎంతవరకూ సహకరిస్తాడో చూడాలి.
- పులగం చిన్నారాయణ