అంతర్ధానమైన అభినయ శారద | Veteran Tollywood actress Jayanthi passed away | Sakshi
Sakshi News home page

అంతర్ధానమైన అభినయ శారద

Published Tue, Jul 27 2021 12:16 AM | Last Updated on Tue, Jul 27 2021 12:16 AM

Veteran Tollywood actress Jayanthi passed away - Sakshi

జయంతి

డ్యాన్సా.. తనేం చేస్తుంది? అంత మాట అంటారా? కమల కుమారికి ఎక్కడలేని పట్టుదల వచ్చింది. భవిష్యత్‌లో మంచి డ్యాన్సర్‌ అనిపించుకుంది. ఏంటీ.. భాష రానివాళ్లను పెట్టారెందుకు? జయంతిపై సావిత్రి ఆగ్రహం. జయంతికి పట్టుదల వచ్చింది. భవిష్యత్‌లో ‘నంబర్‌ వన్‌ హీరోయిన్‌’ అంటూ సావిత్రియే మెచ్చుకునే రేంజ్‌కి వెళ్లారు. ‘నీ వల్ల కాదు’ అంటే ‘నా వల్ల అవుతుంది’ అని చేసి చూపించడం కమల కుమారి అలియాస్‌ జయంతి అలవాటు. అందుకే... ‘అభినయ శారద’గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారు.

‘జెను గూడు (1963).. కథానాయికగా జయంతికి తొలి చిత్రం ఇది. అంటే.. తేనె తుట్టె అని అర్థం. నటిగా జయంతి కెరీర్‌ తీయగా సాగింది. జయంతి అనేది స్క్రీన్‌ నేమ్‌. అసలు పేరు కమల కుమారి. 1945 జనవరి 6న బళ్లారిలో పుట్టింది కమల. తండ్రి బాలసుబ్రహ్మణ్యం ఇంగ్లీష్‌ లెక్చరర్‌. ఇద్దరు తమ్ముళ్లు. మగపిల్లలను ఎలా పెంచారో కూతురినీ తల్లిదండ్రులు అలానే పెంచారు. కమల తీరు మగరాయుడిలానే ఉండేది. స్కూల్లో జరిగే కార్యక్రమాల్లో తప్పనిసరిగా డ్యాన్స్‌ చేసేది.

కూతురి డ్యాన్స్‌ చూసి, ‘క్లాసికల్‌ డ్యాన్సర్‌’ని చేస్తే బాగుంటుందని, మదరాసు తీసుకెళ్లారు కమల తల్లి సంతాన లక్ష్మి. సినిమాల్లో డ్యాన్సర్‌గా చేస్తూ, డ్యాన్స్‌ స్కూల్‌ నడుపుతున్న చంద్రకళ దగ్గర చేర్పించారు. అయితే కొత్తగా చేరిన కమల భవిష్యత్‌లో సినిమా తారగా రాణిస్తుందని, డ్యాన్స్‌ బాగా చేస్తుందని ఊహించక ‘తనేం డ్యా¯Œ ్స చేస్తుంది. కాలూ చేయీ ఊపితే డ్యాన్స్‌ అయిపోతుందా?’ అని డ్యాన్స్‌ స్కూల్లో సీనియర్లు ఏడిపించారు. పట్టుదలతో నేర్చుకుంది కమల. నటిగా భవిష్యత్‌లో జయంతి చేసిన డ్యాన్సులు అందర్నీ ఆకట్టుకున్నాయి.

తెరపైకి జయంతిగా...
కమల సినిమాల్లోకి రావాలనుకోలేదు. అనుకోకుండా జరిగిపోయింది. డ్యాన్స్‌ టీచర్‌కి షూటింగ్‌ ఉంటే ఆమెతో పాటు వెళ్లింది. అక్కడే ఉన్న కన్నడ దర్శకుడు వైఆర్‌ స్వామి ముగ్గురు కథానాయికలున్న సినిమా ప్లాన్‌ చేస్తున్నారు. పండరీ భాయ్, చంద్రకళను ఎంపిక చేశారు. మూడో హీరోయిన్‌ కోసం వెతుకుతున్న ఆయన కళ్లల్లో కమల పడింది. ముందు కమల తల్లి ఒప్పుకోకపోయినా, స్వామి ఒప్పించారు. అలా ‘జెను గూడు’ సినిమాకి నటిగా తొలిసారి మేకప్‌ వేసుకుంది కమల కుమారి. ‘నీ చుట్టూ జనం ఉన్నారని మర్చిపో. నేను చెప్పినట్లు చెయ్‌’ అన్నారు స్వామి. చేసేసింది. అందరూ చప్పట్లు కొట్టారు. అయితే స్క్రీన్‌ నేమ్‌ కమల కుమారి అంటే పెద్దగా ఉంటుందని ‘జయంతి’ అని నిర్ణయించారు. పేరు పెట్టిన ముహూర్తం మంచిది. పేరు బలం సెంటిమెంటూ వర్కవుట్‌ అయింది. సినిమా కూడా సూపర్‌ హిట్‌. జయంతి బిజీ కథానాయిక అయ్యారు.

చిన్న దేవకన్యగా...
నిజానికి కథానాయికగా ‘జెను గూడు’లో కనిపించకముందే తెలుగు, తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేసింది కమల. డ్యా¯Œ ్స నేర్చుకోవడానికి మదరాస్‌ వెళ్లినప్పుడు ఎన్టీఆర్‌ని చూడ్డానికి వెళ్లింది. అప్పుడాయన  ఒళ్లో కూర్చోబెట్టుకుని ‘నాతో యాక్ట్‌ చేస్తావా?’ అని అడిగారు. నిజంగానే ఎన్టీఆర్‌ సరసన నటించింది. ఎన్టీఆర్‌ ‘జగదేకవీరుని కథ’లో చిన్న దేవకన్యగా చేసింది కమల. అయితే దేవకన్య అంటే వయ్యారంగా నడవాలి. టామ్‌ బాయ్‌ కమల విసావిసా నడుచుకుంటూ వెళుతుంటే, ‘అబ్బాయిలా నడుస్తున్నారేంటి?’ అని ఎలా నడవాలో చూపించారు ఎన్టీఆర్‌. ‘ఆ తర్వాత నా నడక మారింది’ అని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయంతి అన్నారు.

‘దొంగ మొగుడు’లో..., ‘మిస్‌ లీలావతి’లో...

స్విమ్‌ సూట్‌లో...
వరుసగా ట్రెడిషనల్‌ క్యారెక్టర్స్‌ చేసుకుంటూ వచ్చిన జయంతి ‘మిస్‌ లీలావతి’ (1965)లో స్విమ్‌ సూట్‌ ధరించడం చర్చనీయాంశమైంది. అప్పటివరకూ లంగా, వోణీ, చీరలకే పరిమితమైన కన్నడ సినిమా ఆ తర్వాత స్కర్ట్స్‌–టీషర్ట్‌.. ఇలా ఆధునిక దుస్తులకు మారింది. ఆ సినిమాలో నటనకుగాను జయంతికి మంచి మార్కులు పడ్డాయి.

సొంత గొంతుతో...
ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాషలో తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకున్నారు జయంతి. కొత్త భాషలు నేర్చుకోవాలనే పట్టుదల జయంతికి కలగడానికి కారణం సావిత్రి. ఓ తమిళ సినిమాలో సావిత్రి కాంబినేష¯Œ లో చేస్తున్నప్పుడు జయంతి డైలాగ్‌ చెప్పడానికి తడబడ్డారు. ‘భాష రానివాళ్లను తీసుకొచ్చారేంటి’ అని సావిత్రి విసుక్కున్నారు. దాంతో మాస్టారుని పెట్టుకుని, తమిళం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఓ సినిమాలో ఆమెకు అత్తగా సావిత్రి నటించారు. ఆ షూట్‌లో సావిత్రిని ఆశీర్వదించమని జయంతి అడిగితే, ‘కన్నడంలో నంబర్‌ వన్‌ హీరోయి¯Œ వి. నా కాళ్ల మీద పడుతున్నావేంటి?’ అన్నారామె. ‘నేను ఇలా ఉన్నానంటే కారణం మీరే. భాష నేర్చుకునేలా చేశారు’ అన్న జయంతిని సావిత్రి ఆశీర్వదించారు. కన్నడ, తెలుగు, తమిళం తదితర భాషల్లో హీరోయిన్‌గా నటించిన జయంతి ‘పెదరాయుడు’, ‘వంశానికొక్కడు’, ‘ఘరానా బుల్లోడు’, ‘రాముడొచ్చాడు’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లోనూ మెప్పించారు.

రాజకీయాల్లోనూ...
1998 లోక్‌సభ ఎన్నికల్లో చిక్‌ బళ్ళాపూర్‌ నియోజకవర్గం నుండి పోటీ చేశారు కానీ జయంతికి విజయం దక్కలేదు. 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కోరటగీరె నియోజకవర్గం నుండి పోటీ చేసి, ఓటమి చెందారు.

నిద్రలోనే...
ఆదివారం బనశంకరిలోని తన నివాసంలో కన్నుమూశారు జయంతి. కొన్నాళ్లుగా ఆమె శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డారు. ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు. దక్షిణాదితో పాటు హిందీ, మరాఠీ భాషల్లో కలిపి దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ఈ అభినయ శారద భౌతికంగా అంతర్థానమైనప్పటికీ అద్భుత పాత్రల ద్వారా ప్రేక్షకుల గుండెల్లో మిగిలిపోతారు.

‘కొండవీటి సింహం’లో..., ‘పెదరాయుడు’లో...
జయంతి అంత్యక్రియలు నేడు (మంగళవారం) బెంగళూరులోని బనశంకరి స్మశానవాటికలో జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రవీంద్ర కళాక్షేత్రంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం అంత్యక్రియలను పూర్తి చేయనున్నట్లు జయంతి తనయుడు కృష్ణకుమార్‌ తెలిపారు. తెలుగు దర్శకుడు పేకేటి శివరాంతో జయంతి పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటగానే సాగింది. కొన్నాళ్లకే వారు విడిపోయారు. తనయుడు కృష్ణకుమార్‌కి సినిమాలంటే ఆసక్తి లేకపోవడంతో ఇటువైపుగా తీసుకురాలేదామె.

ఇందిరా గాంధీ చేతుల మీదుగా...
జయంతికి ‘గ్లామర్‌ దివా’ పేరు తెచ్చిన ‘మిస్‌ లీలావతి’ ఆమెకు ప్రెసిడెంట్‌ మెడల్‌ దక్కేలా చేసింది. ఆ సమయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ మెడల్‌ అందించి, ముద్దాడి.. జయంతికి గుడ్‌ లక్‌ చెప్పారు. కన్నడ ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఇచ్చిన ‘అభినయ శారదె’  (అభినయ శారద) బిరుదుతో పాటు మరెన్నో అవార్డులు అందుకున్నారు.

ఆ హెడ్‌లైన్స్‌తో జోడీ కట్‌
కన్నడ సూపర్‌ స్టార్‌ రాజ్‌కుమార్‌–జయంతి కలిసి   దాదాపు 45 సినిమాలు చేశారు. ఈ జంటకు ‘రాజా జోడీ’ అని పేరు. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రాల్లో ‘బహద్దూర్‌ గండూ’ది ప్రత్యేకమైన స్థానం. నువ్వా? నేనా అన్నట్టుగా నటించారు. ఆ సినిమా విడుదలయ్యాక ఇంగ్లీష్‌ మ్యాగజీ¯Œ ్స అన్నీ ‘జయంతి స్టీల్స్‌ ది షో’ అని రాశాయి. అంతే.. రాజ్‌కుమార్‌తో జయంతికి అదే చివరి సినిమా. ఆ హెడ్‌లై¯Œ ్స రాయకుంటే మరిన్ని సినిమాలు చేసేవాళ్లమేమో అని ఓ సందర్భంలో జయంతి అన్నారు. అయితే రాజ్‌కుమార్‌ ఉన్నంతవరకూ ఆయనతో స్నేహం అలానే ఉంది.

– డి.జి.భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement