DG Bhavani
-
ఇట్లు... రేవతి
శక్తి ఎక్కడో లేదు.. మనలోనే ఉంది.. తెలుసుకోవాలంతే... శాశ్వత ఆనందం.. అశాశ్వత ఆనందం... తేడా తెలుసుకోవాలంతే... ఎప్పుడు మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి?.. తెలుసుకోవాలంతే... పిల్లలను ఏ వయసు వరకూ గైడ్ చేయాలి.. ఆ విషయాన్ని తెలుసుకోవాలంతే... వెండితెరపై గుర్తుండిపోయే పాత్రల్లో అలరిస్తున్న రేవతి ‘ఇట్లు.. రేవతి’ అంటూ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చెప్పారు. ఆమె టైటిల్ రోల్లో ‘అంకురం’ ఫేమ్ ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించిన ‘ఇట్లు అమ్మ’ చిత్రం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా రేవతితో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ► కథలు ఎంచుకునే విషయంలో మీరు మొదటి నుంచి సెలెక్టివ్‌గా ఉంటారు. ‘ఇట్లు అమ్మ’ అంగీకరించడానికి కారణమేంటి? రేవతి: నటిగా 30 ఏళ్లు దాటిన తర్వాత మంచి పాత్రలు రావడం చాలా తక్కువ అవుతుంది. నిజానికి నేను బాగా కనెక్ట్ అయ్యే పాత్రలు చాలా తక్కువ వస్తున్నాయి. ‘ఇట్లు అమ్మ’ స్క్రిప్ట్ వినగానే కనెక్ట్ అయ్యాను. అందుకే వెంటనే చేయాలని నిర్ణయించుకున్నాను. సి.ఉమామహేశ్వరావు డైరెక్షన్లో నేను ‘అంకురం’ (1992) సినిమా చేశాను.. మంచి దర్శకుడు. ఆయన ‘ఇట్లు అమ్మ’ కథ’ చెప్పగానే ఎగ్జయిట్ అయ్యాను. ► ‘ఇట్లు అమ్మ’లో కొడుకుని వెతికే సింగిల్ మదర్ పాత్రలో కనిపించారు. సినిమాలో ‘సింగిల్ మదర్’ గెలుస్తుంది. కానీ జీవితంలో సింగిల్ మదర్ గెలిచే అవకాశం ప్రస్తుత సమాజం ఇస్తుందంటారా? సమాజమంటే మనమే కదా. ఓ మంచి సమాజాన్ని ఏర్పరచాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. ఇదే విషయాన్ని ‘ఇట్లు అమ్మ’లో చెప్పాం. ‘ఇట్లు అమ్మ’ ఒక అమ్మ, ఒక స్త్రీ కథ మాత్రమే కాదు. నిజానికి మనం, మన ఇల్లు, మన కుటుంబం, స్నేహితులు, మనమందరం అని మాత్రమే ఆలోచిస్తాం. దీన్ని దాటి చూడం. ఏం జరుగుతున్నా పెద్దగా పట్టించుకోం. ఏదైనా జరిగితే మాట్లాడుకుని వదిలేస్తాం తప్పితే మన వంతుగా ఏం చేయాలో ఆలోచించం. ‘ఇట్లు అమ్మ’ లో నేను చేసిన రోల్ కూడా ఇదే. బాల సరస్వతి (‘ఇట్లు అమ్మ’లో రేవతి చేసిన పాత్ర) సాధారణ గృహిణి. నా ఇల్లు, నా కుటుంబం అనుకుంటుందామె. కానీ తన జీవితంలో ఎదురయ్యే సందర్భాలు తనని, తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చాయి? తను ఎలా మారింది? అన్నది కథ. ఇంకా బాల సరస్వతి చాలా తెలివైనది. దైవభక్తి చాలా ఎక్కువ. నేనస్సలు కాదు. ► అంటే... మీరు దేవుణ్ణి నమ్మరా? నమ్మనని కాదు. బాల సరస్వతి నమ్మినంతగా నమ్మకం లేదు. అయితే ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని నమ్ముతాను. నా వెనక ఓ శక్తి ఉందని నమ్ముతాను. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కళ్లు మూసుకుని ప్రార్థన చేస్తాను. కానీ ప్రత్యేకంగా ఓ ప్రదేశానికి వెళ్లి పూజించడాన్ని నమ్మను. మా ఇంట్లో రోజువారి పనుల్లో దీపం వెలిగించడం కచ్చితంగా ఒకటి. దైవభక్తికి, ఆధ్యాత్మికతకు చాలా తేడా ఉంది. నేను ‘అహం బ్రహ్మాస్మి’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. శక్తంతా మనలోనే ఉందని గ్రహించాలి. మనం ఆ బలాన్ని ఉపయోగించుకోవాలి. ► మీ వెనక ఓ శక్తి ఉందన్నారు. ఆ శక్తి మీ జీవితాన్ని సాఫీగా సాగేలా చేస్తోందంటారా? మీకు సహాయపడిందంటారా? మన వెనక ఉండే శక్తి కేవలం గైడ్ మాత్రమే. అది మనకు మంచి జీవితం, మంచి కెరీర్ ఇవ్వదు. శక్తి ఉంది కదా అని సైలెంట్‌గా కూర్చోకూడదు. మన కష్టం, మన శ్రమ మాత్రమే ఇస్తాయి. వెనకాల ఉండే ఫోర్స్ గైడ్ చేస్తుంది. ఆ గైడెన్స్ ఉందని నా నమ్మకం. ఇంకా నా గైడింగ్ ఫోర్స్ అంటే నా కుటుంబమే. అమ్మ, నాన్న, సిస్టర్ నా వెనక ఉన్నారు... నన్ను నడిపించారు... నడిపిస్తుంటారు. అలానే నిర్ణయాల విషయంలో ఇది సరైనదా? కాదా, తప్పా? ఒప్పా అనేది మాత్రం నాకు తెలిసిపోతుంది. ► సమాజంలో మ్యారీడ్ ఉమన్ జీవితానికి ఉండే భరోసా సింగిల్ మదర్‌కి ఉంటుందంటారా? జీవితం ఎవ్వరికీ సాఫీగా ఉండదు. సమాజంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య... గొడవ ఉంటుంది. దాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం అనేది ముఖ్యం. ఎదుర్కొనే క్రమంలో మనం నేర్చకున్న విషయాలను పిల్లలకు చెప్పి, ఎలా ఎదుర్కొనేలా తయారు చేస్తాం అనేది ముఖ్యం. లైఫ్‌లో ఏదీ సులువు కాదు. ప్రతి దాని వెనక ఏదో ఒక కష్టం ఉంటుంది.. సమస్య ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఓ యుద్ధం చేస్తూనే ఉంటారు. ► మీ నాన్న ఆర్మీ ఆఫీసర్. ఆయన నేర్పిన ధైర్యమే మిమ్మల్ని ధైర్యంగా నడిపిస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా.. మా అమ్మానాన్న నన్ను, నా సిస్టర్ని చాలా బాగా పెంచారు. అసలు లింగ వివక్ష అనేది ఉంటుందని నాకు 30 ఏళ్లు వచ్చాకే తెలిసింది. అప్పటివరకూ అమ్మాయిని ఒకలా చూస్తారు, అబ్బాయిని ఒకలా చూస్తారనే విషయమే నాకు తెలియదు. ఆర్మీలో అందర్నీ ఒకేలా చూశారు. దాంతో మాకు అబ్బాయి వేరు... అమ్మాయి వేరు అనే ఫీలింగ్ కలగలేదు. ► కరోనా లాక్డౌన్.. ప్రపంచం ఎటు వెళుతుందో అర్థం కాని పరిస్థితి.. ఒక అనిశ్చితి ఉందనేది చాలామంది ఫీలింగ్. మీరేం చెబుతారు? నిజమే. ప్రస్తుతం మనందరం ఓ అయోమయ స్థితిలో ఉన్నాం. ఎటు వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితి. ఈ కోవిడ్, లాక్డౌన్ మనందరినీ ఏది ముఖ్యమో ఆలోచించేలా చేసింది. కేవలం మనం మాత్రమే కాదు.. మన చుట్టూ ఉన్నవి కూడా మనం పట్టించుకోవాలి. అప్పుడే మన పిల్లలకు ఓ మంచి సమాజాన్ని ఏర్పాటు చేయగలం. వాళ్లకు డబ్బు, ఇల్లు కాదు మంచి విద్య, మంచి సమాజాన్ని, సురక్షితమైన వాతావరణాన్నీ ఇవ్వాలి. మన పిల్లలకు మనమిచ్చే గొప్ప సంపద అదే. ► పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని, సమాజాన్ని ఇవ్వాలన్నారు. ప్రస్తుతం మన సమాజం అమ్మాయిలకు సురక్షితంగా ఉందంటారా? చాలా దారుణాలు జరుగుతున్నాయి. వీటికి కారణమేమంటారు? నాకు నిజంగా తెలియదు. కారణం ఇదీ అని విశ్లేషించగలిగి ఉంటే పరిష్కారం చెప్పేదాన్ని. ప్రస్తుతం అందరి అవసరాలు మారిపోయాయి. ఇప్పటివారి అవసరాలు మన ముందు తరాల వాళ్లకంటే మారిపోయాయి. మా అమ్మ వాళ్లు ఒకలా బతికారు. మేము ఒకలా. ఇప్పుడు మా పిల్లలు ఒకలా ఉన్నారు. ఆ అవసరాల కోసం మనం ఎంతలా తాపత్రయపడుతున్నాం? మనం ఎంత నైతిక భాధ్యతతో ఉంటున్నాం అనేది మారిపోయింది. ఇది తప్పు, ఇది ఒప్పు అనే ఫిలాసఫీ మారిపోయింది. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కే ఇది బాగా మారిపోయింది. కాకపోతే ఒకప్పటి విధానాల్లో కొన్నింటిని తిరిగి తీసుకురావాలి. అది ఎలా తీసుకురావాలో నిజంగా తెలియదు. అయితే మన పిల్లలతో మనం మాట్లాడాలి. నిజమైన సంతోషమేంటి? శాశ్వత ఆనందమేంటి? అశాశ్వతం ఏంటి? అనే విషయాలను వాళ్లకు వివరించాలి. ► మాకు ‘ప్రైవసీ’ కావాలని ఇప్పటి తరం అంటోంది. ఎక్కువ స్వాతంత్య్రం ఇచ్చినా ఇబ్బందే అంటారా? అసలు పిల్లల్ని ఏ వయసు వచ్చేవరకూ తల్లిదండ్రులు గైడ్ చేయాలి? 18ఏళ్ల వయసొచ్చే వరకే పిల్లల్ని మనం గైడ్ చేయాలి. ఆ తర్వాత వాళ్లను వాళ్లే గైడ్ చేసుకోవాలి. అలా వాళ్లను వాళ్లు గైడ్ చేసుకునే ధైర్యం, తెగువ అన్నీ మనమే ఇవ్వాలి. 20 ఏళ్ల తర్వాత కూడా పిల్లల్ని గైడ్ చేయడం అనేది నాన్సెన్స్ అంటాను నేను. వాళ్లు చిన్న చిన్న తప్పులు చేయాలి.. ఆ తప్పుల నుంచి నేర్చుకోవాలి. వాటిని సరిదిద్దుకోవడం తెలుసుకోవాలి. అలా చేయకూడదు అని ఆలోచించగలగాలి. అయితే 10–12 ఏళ్ల వయసులోనే ఈ ఫౌండేషన్ పడేలా చూసుకోవాలి. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు చాలా ప్రేమ, భద్రత ఇవ్వాలి. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే వాళ్లు మనతో నిర్మొహమాటంగా, నిర్భయంగా పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. 20 ఏళ్ల తర్వాత కూడా పిల్లల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పడం నాన్సెన్స్. ► ఓకే... మీ మాటలను బట్టి మీ అమ్మాయి మహీకి అన్నీ వివరంగా చెబుతారనిపిస్తోంది.. అవును. ప్రతి తల్లికీ బిడ్డల మీద ప్రేమ ఉన్నట్లుగానే నాకూ తనంటే చాలా ప్రేమ. ప్రేమతో పాటు సెక్యూర్డ్ ఫీలింగ్‌ని కలగజేస్తాను. మహీ తనంతట తాను నిలబడటానికి గైడ్ చేస్తూ ఉంటాను. తను ఇండిపెండెంట్ అమ్మాయి. ► మహీ ఏం చదువుతోంది? థర్డ్ గ్రేడ్‌లో ఉంది. ► ఏ ఇండస్ట్రీలో అయినా స్త్రీలకు ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఆ ఇబ్బందులను బయటకు చెబితే ‘తప్పు తనదేనేమో’ అనేవాళ్లు ఉంటారు. మరి.. మీరు మీకు ఎదురైన ఇబ్బందులు చెప్పుకోవడానికి భయపడిన సందర్భాలున్నాయా? అదృష్టవశాత్తు లేవు. మొదట్నుంచీ కూడా నాకు చాలా తక్కువ మాట్లాడటం అలవాటు. కానీ మాట్లాడే విషయాన్ని మాత్రం చాలా విజన్‌తో, అవగాహనతో మాట్లాడతాను. దాంతో అందరూ నా మాట వినేవారు. ఈ సందర్భంగా నేనొక విషయం చెబుతాను. ఎప్పుడు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? అనే విషయాన్ని కూడా మనం పిల్లలకు నేర్పించాలి. అది చాలా ముఖ్యం. ► మంచి విజన్‌తో, అవగాహనతో మాట్లాడితే అందరూ వింటారని అన్నారు. మీలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ప్రజలు మీ మాట వినే అవకాశం ఉంటుంది.. 1996 తర్వాత మళ్లీ మీరు రాజకీయాల్లోకి రాలేదేం? అలా ఆలోచించే 1996 ఎన్నికల్లో నిల్చున్నాను కూడా. కానీ ప్రస్తుతం ఆలోచించడం లేదు. ఎందుకంటే పాలిటిక్స్ అనేది 24/7 జాబ్. ప్రస్తుతం నాకు ఓ పాప ఉంది. తనని చక్కగా పెంచాలి. మంచి సిటిజన్‌గా మార్చాలి. ఈ బాధ్యత పూర్తయ్యాక రాజకీయాల గురించి ఆలోచిస్తానేమో ఇప్పుడే చెప్పలేను. ► మీరు హీరోయిన్గా చేసే సమయంలో కథలు చాలా బావుండేవి. ఇప్పుడు అలాంటి కథలు ఉన్నాయంటారా? కథలు ఉన్నాయి.. అయితే కథలు చెప్పే విధానంలో మార్పు వచ్చింది. కొన్ని మలయాళం, హిందీ సినిమాల్లో కథ చెప్పే విధానం అద్భుతంగా ఉంది. మంచి సినిమాలను మనందరం సపోర్ట్ చేయాలి. అప్పుడే మంచి సినిమాలు తీస్తారు. ► ఫైనల్లీ.. కొంత గ్యాప్ తర్వాత ‘ది లాప్ట్ హుర్రా’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు... ఆ సినిమా గురించి? చాలా సంవత్సరాల క్రితం చదివిన కథ ఇది. ఆ కథను మంచి స్క్రిప్ట్‌గా తయారు చేశాం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులను అయినా నవ్వుతూ ఎదుర్కొనే ఓ తల్లి కథ ఇది. ఈ కథకు కాజోల్ సరిపోతారని ఆమెను తీసుకున్నాం. ►ప్రస్తుత సోషల్ మీడియా జనరేషన్లో మంచి విషయంలోనూ చెడు చూడటం కామన్ అయింది... ఈ విషయం గురించి ఏం చెబుతారు? తరాలు మారుతుంటాయి. ఆ మార్పుతో మనం ముందుకు వెళ్లాలి. మంచి, చెడు అని చెప్పలేం. సోషల్ మీడియాలో విమర్శలు అంటున్నారు. అసలు ఆ విమర్శలను ఎందుకు పట్టించుకుంటున్నారు? వాటికి ఎందుకు అంత టైమ్ కేటాయిస్తున్నారు? నేను సోషల్ మీడియాని నాకు కావాల్సిన సమాచారాన్ని తీసుకోవడం వరకే ఉపయోగిస్తాను. ఏదైనా తెలుసుకోవడానికో, నేర్చుకోవడానికో, నాకు తెలిసింది పంచుకోవడానకో... అంతే. విమర్శలకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా అవే తగ్గిపోతాయి. అది నా నమ్మకం. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో ఉన్నాం అనుకుందాం. మన పని మనం చేసుకుంటే హాయిగా ఉంటుంది. ఎదురింట్లో వాళ్లకి ఫ్రిజ్ ఉందా? పక్కింట్లో వాళ్లకు ఎలాంటి చీర ఉంది? అనేవి పట్టించుకొని ప్రతీది ఆలోచిస్తేనే ప్రాబ్లమ్. మన గురించి మనం చూసుకుని, మన చుట్టూ ఉండేవాళ్ల విషయాలను విమర్శించకుండా ఉంటే ఏ గొడవా ఉండదు. – డి.జి. భవాని -
అంతర్ధానమైన అభినయ శారద
డ్యాన్సా.. తనేం చేస్తుంది? అంత మాట అంటారా? కమల కుమారికి ఎక్కడలేని పట్టుదల వచ్చింది. భవిష్యత్‌లో మంచి డ్యాన్సర్ అనిపించుకుంది. ఏంటీ.. భాష రానివాళ్లను పెట్టారెందుకు? జయంతిపై సావిత్రి ఆగ్రహం. జయంతికి పట్టుదల వచ్చింది. భవిష్యత్‌లో ‘నంబర్ వన్ హీరోయిన్’ అంటూ సావిత్రియే మెచ్చుకునే రేంజ్‌కి వెళ్లారు. ‘నీ వల్ల కాదు’ అంటే ‘నా వల్ల అవుతుంది’ అని చేసి చూపించడం కమల కుమారి అలియాస్ జయంతి అలవాటు. అందుకే... ‘అభినయ శారద’గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారు. ‘జెను గూడు (1963).. కథానాయికగా జయంతికి తొలి చిత్రం ఇది. అంటే.. తేనె తుట్టె అని అర్థం. నటిగా జయంతి కెరీర్ తీయగా సాగింది. జయంతి అనేది స్క్రీన్ నేమ్. అసలు పేరు కమల కుమారి. 1945 జనవరి 6న బళ్లారిలో పుట్టింది కమల. తండ్రి బాలసుబ్రహ్మణ్యం ఇంగ్లీష్ లెక్చరర్. ఇద్దరు తమ్ముళ్లు. మగపిల్లలను ఎలా పెంచారో కూతురినీ తల్లిదండ్రులు అలానే పెంచారు. కమల తీరు మగరాయుడిలానే ఉండేది. స్కూల్లో జరిగే కార్యక్రమాల్లో తప్పనిసరిగా డ్యాన్స్ చేసేది. కూతురి డ్యాన్స్ చూసి, ‘క్లాసికల్ డ్యాన్సర్’ని చేస్తే బాగుంటుందని, మదరాసు తీసుకెళ్లారు కమల తల్లి సంతాన లక్ష్మి. సినిమాల్లో డ్యాన్సర్‌గా చేస్తూ, డ్యాన్స్ స్కూల్ నడుపుతున్న చంద్రకళ దగ్గర చేర్పించారు. అయితే కొత్తగా చేరిన కమల భవిష్యత్‌లో సినిమా తారగా రాణిస్తుందని, డ్యాన్స్ బాగా చేస్తుందని ఊహించక ‘తనేం డ్యా¯Œ ్స చేస్తుంది. కాలూ చేయీ ఊపితే డ్యాన్స్ అయిపోతుందా?’ అని డ్యాన్స్ స్కూల్లో సీనియర్లు ఏడిపించారు. పట్టుదలతో నేర్చుకుంది కమల. నటిగా భవిష్యత్‌లో జయంతి చేసిన డ్యాన్సులు అందర్నీ ఆకట్టుకున్నాయి. తెరపైకి జయంతిగా... కమల సినిమాల్లోకి రావాలనుకోలేదు. అనుకోకుండా జరిగిపోయింది. డ్యాన్స్ టీచర్‌కి షూటింగ్ ఉంటే ఆమెతో పాటు వెళ్లింది. అక్కడే ఉన్న కన్నడ దర్శకుడు వైఆర్ స్వామి ముగ్గురు కథానాయికలున్న సినిమా ప్లాన్ చేస్తున్నారు. పండరీ భాయ్, చంద్రకళను ఎంపిక చేశారు. మూడో హీరోయిన్ కోసం వెతుకుతున్న ఆయన కళ్లల్లో కమల పడింది. ముందు కమల తల్లి ఒప్పుకోకపోయినా, స్వామి ఒప్పించారు. అలా ‘జెను గూడు’ సినిమాకి నటిగా తొలిసారి మేకప్ వేసుకుంది కమల కుమారి. ‘నీ చుట్టూ జనం ఉన్నారని మర్చిపో. నేను చెప్పినట్లు చెయ్’ అన్నారు స్వామి. చేసేసింది. అందరూ చప్పట్లు కొట్టారు. అయితే స్క్రీన్ నేమ్ కమల కుమారి అంటే పెద్దగా ఉంటుందని ‘జయంతి’ అని నిర్ణయించారు. పేరు పెట్టిన ముహూర్తం మంచిది. పేరు బలం సెంటిమెంటూ వర్కవుట్ అయింది. సినిమా కూడా సూపర్ హిట్. జయంతి బిజీ కథానాయిక అయ్యారు. చిన్న దేవకన్యగా... నిజానికి కథానాయికగా ‘జెను గూడు’లో కనిపించకముందే తెలుగు, తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేసింది కమల. డ్యా¯Œ ్స నేర్చుకోవడానికి మదరాస్ వెళ్లినప్పుడు ఎన్టీఆర్‌ని చూడ్డానికి వెళ్లింది. అప్పుడాయన ఒళ్లో కూర్చోబెట్టుకుని ‘నాతో యాక్ట్ చేస్తావా?’ అని అడిగారు. నిజంగానే ఎన్టీఆర్ సరసన నటించింది. ఎన్టీఆర్ ‘జగదేకవీరుని కథ’లో చిన్న దేవకన్యగా చేసింది కమల. అయితే దేవకన్య అంటే వయ్యారంగా నడవాలి. టామ్ బాయ్ కమల విసావిసా నడుచుకుంటూ వెళుతుంటే, ‘అబ్బాయిలా నడుస్తున్నారేంటి?’ అని ఎలా నడవాలో చూపించారు ఎన్టీఆర్. ‘ఆ తర్వాత నా నడక మారింది’ అని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయంతి అన్నారు. ‘దొంగ మొగుడు’లో..., ‘మిస్ లీలావతి’లో... స్విమ్ సూట్లో... వరుసగా ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చిన జయంతి ‘మిస్ లీలావతి’ (1965)లో స్విమ్ సూట్ ధరించడం చర్చనీయాంశమైంది. అప్పటివరకూ లంగా, వోణీ, చీరలకే పరిమితమైన కన్నడ సినిమా ఆ తర్వాత స్కర్ట్స్–టీషర్ట్.. ఇలా ఆధునిక దుస్తులకు మారింది. ఆ సినిమాలో నటనకుగాను జయంతికి మంచి మార్కులు పడ్డాయి. సొంత గొంతుతో... ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాషలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు జయంతి. కొత్త భాషలు నేర్చుకోవాలనే పట్టుదల జయంతికి కలగడానికి కారణం సావిత్రి. ఓ తమిళ సినిమాలో సావిత్రి కాంబినేష¯Œ లో చేస్తున్నప్పుడు జయంతి డైలాగ్ చెప్పడానికి తడబడ్డారు. ‘భాష రానివాళ్లను తీసుకొచ్చారేంటి’ అని సావిత్రి విసుక్కున్నారు. దాంతో మాస్టారుని పెట్టుకుని, తమిళం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఓ సినిమాలో ఆమెకు అత్తగా సావిత్రి నటించారు. ఆ షూట్లో సావిత్రిని ఆశీర్వదించమని జయంతి అడిగితే, ‘కన్నడంలో నంబర్ వన్ హీరోయి¯Œ వి. నా కాళ్ల మీద పడుతున్నావేంటి?’ అన్నారామె. ‘నేను ఇలా ఉన్నానంటే కారణం మీరే. భాష నేర్చుకునేలా చేశారు’ అన్న జయంతిని సావిత్రి ఆశీర్వదించారు. కన్నడ, తెలుగు, తమిళం తదితర భాషల్లో హీరోయిన్గా నటించిన జయంతి ‘పెదరాయుడు’, ‘వంశానికొక్కడు’, ‘ఘరానా బుల్లోడు’, ‘రాముడొచ్చాడు’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లోనూ మెప్పించారు. రాజకీయాల్లోనూ... 1998 లోక్‌సభ ఎన్నికల్లో చిక్ బళ్ళాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు కానీ జయంతికి విజయం దక్కలేదు. 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కోరటగీరె నియోజకవర్గం నుండి పోటీ చేసి, ఓటమి చెందారు. నిద్రలోనే... ఆదివారం బనశంకరిలోని తన నివాసంలో కన్నుమూశారు జయంతి. కొన్నాళ్లుగా ఆమె శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డారు. ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు. దక్షిణాదితో పాటు హిందీ, మరాఠీ భాషల్లో కలిపి దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ఈ అభినయ శారద భౌతికంగా అంతర్థానమైనప్పటికీ అద్భుత పాత్రల ద్వారా ప్రేక్షకుల గుండెల్లో మిగిలిపోతారు. ‘కొండవీటి సింహం’లో..., ‘పెదరాయుడు’లో... జయంతి అంత్యక్రియలు నేడు (మంగళవారం) బెంగళూరులోని బనశంకరి స్మశానవాటికలో జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రవీంద్ర కళాక్షేత్రంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం అంత్యక్రియలను పూర్తి చేయనున్నట్లు జయంతి తనయుడు కృష్ణకుమార్ తెలిపారు. తెలుగు దర్శకుడు పేకేటి శివరాంతో జయంతి పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటగానే సాగింది. కొన్నాళ్లకే వారు విడిపోయారు. తనయుడు కృష్ణకుమార్‌కి సినిమాలంటే ఆసక్తి లేకపోవడంతో ఇటువైపుగా తీసుకురాలేదామె. ఇందిరా గాంధీ చేతుల మీదుగా... జయంతికి ‘గ్లామర్ దివా’ పేరు తెచ్చిన ‘మిస్ లీలావతి’ ఆమెకు ప్రెసిడెంట్ మెడల్ దక్కేలా చేసింది. ఆ సమయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ మెడల్ అందించి, ముద్దాడి.. జయంతికి గుడ్ లక్ చెప్పారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇచ్చిన ‘అభినయ శారదె’ (అభినయ శారద) బిరుదుతో పాటు మరెన్నో అవార్డులు అందుకున్నారు. ఆ హెడ్‌లైన్స్‌తో జోడీ కట్ కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్–జయంతి కలిసి దాదాపు 45 సినిమాలు చేశారు. ఈ జంటకు ‘రాజా జోడీ’ అని పేరు. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రాల్లో ‘బహద్దూర్ గండూ’ది ప్రత్యేకమైన స్థానం. నువ్వా? నేనా అన్నట్టుగా నటించారు. ఆ సినిమా విడుదలయ్యాక ఇంగ్లీష్ మ్యాగజీ¯Œ ్స అన్నీ ‘జయంతి స్టీల్స్ ది షో’ అని రాశాయి. అంతే.. రాజ్‌కుమార్‌తో జయంతికి అదే చివరి సినిమా. ఆ హెడ్లై¯Œ ్స రాయకుంటే మరిన్ని సినిమాలు చేసేవాళ్లమేమో అని ఓ సందర్భంలో జయంతి అన్నారు. అయితే రాజ్‌కుమార్ ఉన్నంతవరకూ ఆయనతో స్నేహం అలానే ఉంది. – డి.జి.భవాని -
చివరి చూపు అయినా దక్కాలి కదా!
వలస కార్మికులు ఇళ్లు చేరడానికి సహాయపడుతున్నాడు. ఆకలి బాధ తీరుస్తున్నాడు. ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్ చేయిస్తున్నాడు. ఊపిరి (ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సరఫరా) పోస్తున్నాడు. మనిషిని బతికించడానికి చేతనైంత చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో సాయంతో ముందుకు వచ్చాడు.. మనిషి చనిపోతే.. వేరే ఊర్లో ఉండే అయినవాళ్లు వచ్చేలోపు భౌతికకాయాన్ని భద్రపరిచే వీలు లేక అంత్యక్రియలు చేస్తుంటే.. భద్రపరచడానికి ఫ్రీజర్ బాక్సులు ఇవ్వాలనుకున్నాడు. రీల్ లైఫ్‌లో సోనూ సూద్ విలన్. రియల్ లైఫ్‌లో హీరో. ఇవన్నీ చేయడానికి సోనూ వెనక ఉన్నది ఎవరు? ఏ పొలిటికల్ పార్టీ ఉంది? ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సోనూ సూద్ పలు విషయాలు చెప్పారు. ► మనిషి తన ఇల్లు చేరుకోవడానికి, ప్రాణాపాయంలో ఉంటే బతికి బయటపడటానికి మీకు చేతనైన సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మనిషి కన్నుమూశాక కుటుంబ సభ్యులకు ‘చివరి చూపు’ దక్కాలనే ప్రయత్నం మొదలుపెట్టారు.. ఈ కొత్త సహాయం గురించి? సోనూ సూద్: నేను చిన్న టౌన్ (పంజాబ్‌లోని మోగా) నుంచి వచ్చాను. నగరాలతో పోల్చితే పట్టణాల్లో, గ్రామాల్లో సౌకర్యాలు తక్కువగా ఉంటాయని తెలిసినవాడిని. ముఖ్యంగా ఈ లాక్డౌన్ టైమ్‌లో ఒకచోటు నుంచి ఇంకో చోటుకి వెళ్లడం ఎంత ఇబ్బందో తెలిసిందే. గ్రామాల్లో ఉన్నవాళ్లు చనిపోతే సిటీలో ఉంటున్న వాళ్ల దగ్గర బంధువులు వెళ్లడానికి ఆలస్యం అవుతోంది. ఈలోపు భౌతికకాయన్ని భద్రపరిచే సౌకర్యం లేకుండా అల్లాడుతున్నారు. అయినవాళ్లు రాకముందే అంత్యక్రియలు జరిపించేస్తున్నారు. ‘చివరి చూపు’ అయినా దక్కాలి కదా! అది కూడా దక్కకపోతే ఆ బాధ జీవితాంతం ఉండిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది మాకు ఈ విషయం గురించి ఫోన్ చేసి చెప్పారు. అందుకే ‘డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్’లను పంపాలనుకున్నాం. అడిగినవాళ్లకు అడిగినట్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నాం. ► దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అందజేయాలనే ఆలోచన గురించి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువమంది కరోనా బాధితులు ఆక్సిజన్ దొరక్క కన్నుమూస్తున్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కోసం దేశవ్యాప్తంగా మాకు మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే ప్యాన్ ఇండియా ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ గురించి ఆలోచించాం. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను తగ్గించి కోవిడ్ బాధితులకు సహాయం చేయడానికి దాదాపు 20కి పైగా ఆక్సిజన్ ప్లాంట్స్‌ను ఆరంభించనున్నాం. ► గొప్ప నాయకుడు భగత్ సింగ్ పుట్టిన ప్రాంతానికి చెందిన మీరు హిందీలో తొలి చిత్రం ‘షాహిద్–ఇ–అజామ్’లో భగత్ సింగ్ పాత్ర చేశారు. ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల దృష్ట్యా మిమ్మల్ని చాలామంది భగత్ సింగ్‌తో పోల్చడంపై మీ ఫీలింగ్? నన్ను గొప్ప గొప్ప వ్యక్తులతో పోలుస్తున్నారు. దాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. అలాగే ప్రజల నమ్మకం నా బాధ్యతను ఇంకా పెంచుతోంది. నా సాయం కోరుకున్నవారు ఏ మారుమూల ప్రాంతాన ఉన్నా వారిని చేరుకోవాలనే నా సంకల్పాన్ని మరింత బలపరిచింది. ► సహాయ కార్యక్రమాలు చేయడానికి మా అమ్మానాన్న స్ఫూర్తి అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఏ విధంగా వారిని చూసి స్ఫూర్తి పొందారో ఉదాహరణ చెబుతారా? నా చిన్నతనం నుంచే మా అమ్మనాన్నల ద్వారా ఇతరులకు సాయం చేయడాన్ని నేర్చుకున్నాను. ఇతరులకు సహాయపడటానికి ఇద్దరూ ఎప్పుడూ ముందుండేవారు. అలా నా కళ్ల ముందే నాకో మంచి ఉదాహరణ ఉంది. నాలోనే కాదు.. నా భార్య, నా కొడుకులో కూడా పరోపకార గుణం ఉంది. ప్రతి ఒక్కరం మన సామర్థ్యం మేరకు ఇతరులకు సాయం చేయాల్సిన సమయం ఇది. ఈ కరోనా టైమ్‌లో ‘గివింగ్ బ్యాక్ టు సొసైటీ’ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ► ఇతరులకు సహాయపడాలంటే గొప్ప మనసు మాత్రమే కాదు.. ఆర్థిక బలం కూడా ఉండాలి. మీకు ఎక్కడ్నుంచి ఆర్థిక బలం వస్తోంది? తోటివారికి సాయపడాలంటే మనం సంపన్నులమై ఉండాల్సిన అవసరం లేదు. కాస్త మంచి మనసు ఉంటే చాలు. మనం చేస్తున్న హెల్ప్‌ను చూసి ఎవరైనా స్ఫూర్తి పొంది, సహాయం చేస్తే అది మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఎవరికి సాయం చేయాలో తెలియక? ఎలా చేయాలో తెలియక కొందరు మా ‘సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్’కు డబ్బు అందజేస్తున్నారు. చూపు లేని ఓ అమ్మాయి తన ఐదు నెలల పెన్షన్ 15000 రూపాయలు, రైల్వేస్‌కు చెందిన మరో హ్యాండీకాప్డ్ పర్సన్ 60 వేల రూపాయలను మా ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. దీన్నిబట్టి మన చుట్టూ ఎంతమంది మంచివాళ్లు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ► మీ సాయం పొందినవాళ్లల్లో కొందరు వాళ్ల పిల్లలకు మీ పేరు పెట్టుకున్నారు.. ‘ఐయామ్ నాట్ ఎ మెస్సయ్య’ (మహాపురుషుడు, దేవుడు, దేవ దూత వంటి అర్థాలు) అని మీరు పుస్తకం రాసినా మీకు కొందరు గుడి కట్టారు. ఎలా ఉంది? నా తల్లిదండ్రులు భౌతికంగా లేరు. వాళ్లు ఎక్కడ ఉన్నా ఇదంతా చూసి, ఆనందపడతారు. నాక్కూడా జీవితంలో ఏదో సాధించాననే ఫీలింగ్ కలిగింది. కానీ ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఇక నా పుస్తకం ‘ఐయామ్ నాట్ ఎ మెస్సయ్య’ విషయానికి వస్తే.. అవును.. నేనేం దేవుణ్ని కాదు. ఐయామ్ ఎ కామన్‌మ్యాన్. ఓ సామాన్య వ్యక్తిగా ప్రజలతో నేను కనెక్ట్ అయ్యాను. ► ఇలా విరివిగా సేవా కార్యక్రమాలు చేసేవాళ్లు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడానికే ఇలా చేస్తారని కొందరు భావిస్తారు. మరి.. మీకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? నిజమే... నేను రాజకీయాల్లోకి రావడం కోసమే ఇవన్నీ చేస్తున్నానని కొందరు ఊహించుకుంటున్నారు. ఇంకొందరు నేను రాజకీయాల్లోకి వస్తే ఇంకా మంచి చేయగలనని చెబుతున్నారు. కానీ మంచి పనులు చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను. కానీ భవిష్యత్‌లో ఎవరు ఏం అవుతారో? ఏం జరుగుతుందో అంచనా వేయలేం. చూద్దాం.. రాబోయే రోజుల్లో నా జీవితం ఏ దారిలో వెళుతుందో! ► మీ ఈ సేవల వెనక ఓ రాజకీయ పార్టీ ఉందనే అభిప్రాయం చాలామందిలో ఉంది.. మీ సేవా కార్యక్రమాలు చూస్తున్న ప్రజలు మీరు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటే.. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు సేవ చేయాలనే గుణం ఉంటే వెనక ఎవరైనా ఉంటారా? వస్తారా? అనే ఆలోచన రాదు. సహాయం చేయడం మొదలుపెట్టేస్తాం. మనం కామన్ మ్యాన్‌గా ఉన్నప్పుడే ఎంతో చేయగలుగుతున్నాం.. అదే రాజకీయాల్లో ఉంటే ఇంకా చేయొచ్చు. కానీ నేను పాలిటిక్స్ గురించి ఇప్పుడేమీ ఆలోచించడంలేదు. అలాగని నాకు రాజకీయాల మీద వ్యతిరేక భావన లేదు. ప్రజలు కోరుకున్నట్లు జరుగుతుందేమో భవిష్యత్ చెబుతుంది. ► అరుంధతి, సీత వంటి సినిమాల్లో ఓ విలన్‌గా హీరోయిన్లను చాలా ఇబ్బందులపాలు చేశారు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు మిమ్మల్ని సోదరుడిలా భావిస్తున్నారు... నా సోదరీ మణులకు థ్యాంక్స్. ఆ చిత్రాల్లో ఆ పాత్ర లను నాకు ఆ సినిమాల దర్శకులు ఇచ్చారు. కానీ రియల్ లైఫ్‌లో దేవుడు నాకో పవర్ఫుల్ స్క్రిప్ట్ రాశా డు. ఆ పాత్రలో జీవిస్తున్నాను. దేవుడి ఇచ్చిన ‘మోస్ట్ బ్లెస్డ్ రోల్’ ఇది అని భా విస్తున్నా. ► బెడ్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఫ్రీజర్ బాక్సుల పంపిణీ.. వలస కార్మికులను ఊళ్లకు పంపించడం.. ఇన్ని చేయడం సులభం కాదు.. మాకు మంచి నెట్వర్క్ ఉంది. మా టీమ్‌లో కొందరికి ట్రైనింగ్ ఇచ్చాం. మరికొందరు నా గైడ్ లైన్స్‌ను ఫాలో అవుతారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి వెంటనే సహాయం అందజేయడంలో వీరి పాత్ర చాలా కీలకం. వారికి ధన్యవాదాలు. అలాగే ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు దేశంలోని ప్రజలందరూ ఒక తాటిపైకి రావాలన్నదే మా ఆశయం. సమష్టిగా పోరాడే సమ యం త్వరలో రావాలని కోరుకుంటున్నా. ► మీ బయోపిక్ తీయడానికి కొందరు ఉత్సాహంగా ఉన్నారు. మీకిష్టమేనా? బయోపిక్ గురించి నాతో సంప్రదింపులు జరిపారు. ప్రజలు నా బయోపిక్‌ను చూడాలనుకుంటున్నారని వారు చెబుతున్నారు. కానీ ప్రస్తుతానికి అదేం లేదు. కొన్నేళ్ల తర్వాత ప్రజలు నా గురించి ఏం అనుకుంటారో చూడాలి. ► ఇటీవల మీకు కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉండేది? పాజిటివ్ వచ్చిన విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో ఫోన్ ద్వారా చాలామందికి సహాయం చేశాను. సహాయం కావాల్సిన వారు నా ఫోన్‌కు సందేశాలు పంపిస్తూనే ఉన్నారు. వారికి సహాయం చేయాలనే పట్టుదల నాలో తగ్గలేదు. కరోనా వచ్చినప్పుడు కూడా ఇరవైగంటలకు పైగా నేను ఫోన్‌తో కనెక్ట్ అయి, మా టీమ్‌తో టచ్‌లో ఉన్నాను. నా ఫోన్‌కి ప్రతిరోజూ దాదాపు 40 వేల మేసేజ్‌లు వస్తుంటాయి. కానీ ప్రతి ఒక్కరికీ మేం సహాయం చేయలేకపోవచ్చు. అయితే ఎవరికి ముందుగా అవసరం ఉందో వారిని గుర్తించి, ముందు వారిని కాంటాక్ట్ అవుతాం. మా సహాయం పొందిన చాలామంది తామంతట తామే ఫోన్ చేసి పక్కవారికి సాయం చేస్తాం అంటున్నారు. అలాగే కొందరు చేశారు కూడా. చాలా మంది వలస కూలీలకు మేం సహాయం చేశాం. వారిలో చాలామంది మాకు టచ్‌లో ఉన్నారు. అవసరమైనప్పుడు మేం వారికి ఫోన్ చేసి ‘మీరు సహాయం పొందారు. ఇప్పుడు మీరు చేయాల్సిన సమయం వచ్చింది’ అని చెప్పినప్పుడు పాజటివ్‌గా స్పందించారు... స్పందిస్తున్నారు. ఈ మంచి కార్యక్రమాల్లో మా టీమ్ మాత్రమే కాదు.. ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, వార్డ్ బాయ్స్, హాస్పిటల్ యాజమాన్యాలు.. ఇలా అందరికీ భాగం ఉంది. – డి.జి. భవాని -
మా పేరెంట్స్‌కి నేనిచ్చిన బహుమతి అది!
అమ్మ అంటే అనురాగం... అమ్మ అంటే ఆలంబన... అమ్మ అంటే ఆత్మస్థయిర్యం... అమ్మ అంటే కొండంత అండ... నిస్వార్థమైన ప్రేమకు చిరునామా – అమ్మ. ‘మాతృదినోత్సవం’ సందర్భంగా తన తల్లి వనితా శిరోద్కర్ గురించి నటి, మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ చెబుతూ, ‘అమ్మ అంటే ధైర్యం’ అన్నారు. ఇంకా తన తల్లి, పిల్లల గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ► మీ అమ్మగారి గురించి? నమ్రత: అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళ మా అమ్మ. ఈరోజు నేను, నా సోదరి (శిల్పా శిరోద్కర్) స్ట్రాంగ్ ఉమెన్‌గా ఉండగలుగుతున్నామంటే మా అమ్మ పెంపకం వల్లే! మా అమ్మ జీవన విధానం నాకు గొప్ప ఇన్స్పిరేషన్. అమ్మ జాబ్ చేసేవారు. ఇంటినీ, ఉద్యోగాన్నీ ఆవిడ బ్యాలెన్స్ చేసుకున్న తీరు అద్భుతం. మేం ‘నెగ్లెక్టెడ్ చిల్డ్రన్’ అనే ఫీలింగ్ మాకెప్పుడూ కలగలేదు. అమ్మలేని లోటును నేనెప్పటికీ ఫీలవుతుంటాను. అయితే ఆవిడలోని చాలా విషయాలను నా సిస్టర్ శిల్పలో చూస్తున్నాను. ► అమ్మ నుంచి ఏం నేర్చుకున్నారు? ఇతరుల పట్ల దయగా ఉండడం... మానవత్వం. అన్ని సమయాల్లో ధైర్యంగా ఉండడం, సవాళ్లను ఎదుర్కోవడం వంటివన్నీ ఆమె నుంచి నేర్చుకున్నాను. అవి నా పిల్లలకు నేర్పుతున్నాను. మా అమ్మ తన పిల్లలకు ‘బెస్ట్ మామ్’గా నిలిచారు. మా అమ్మలా నేను నా పిల్లలకు బెస్ట్ మామ్‌గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ► అమ్మతో గడిపిన ఆనంద క్షణాలు? మా అమ్మగారి చివరి రోజుల్లో నాతో ఎక్కువగా గడిపారు. అవి నాకు ముఖ్యమైన రోజులు. ఆ మూడు నెలలు అమ్మకు ఏమేం చేయాలో అన్నీ చేశాను. అమ్మ చుట్టూ తిరుగుతూ ఆవిడను చూసుకున్న ఆ మూడు నెలలు నాకు స్పెషల్‌గా గుర్తుండిపోతాయి. ► సమస్యలను అధిగమించడానికి మీ అమ్మగారు ఎలా హెల్ప్ చేసేవారు? అమ్మకు ఒక మంచి లక్షణం ఉండేది. ఏదైనా సమస్య గురించి చెప్పినప్పుడు ఓపికగా వినేవారు. ‘వినడం’ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేవారు. సమస్య మొత్తం విన్నాక అప్పుడు పరిష్కార మార్గం చెప్పేవారు. సమస్య అనే కాదు.. ఏ విషయాన్నయినా పూర్తిగా వినాలనే లక్షణం అమ్మ నుంచి నాకు అలవాటయింది. ► అమ్మ చేసిన వంటల్లో నచ్చినవి? పెప్పర్ చికెన్, అలాగే వైట్ సాస్ చికెన్ కూడా అద్భుతంగా వండేవారు. ► ‘ఆడపిల్లలు’ అంటూ... మీ అమ్మగారు పదే పదే జాగ్రత్తలు చెప్పేవారా? జాగ్రత్తలు చెప్పేవారు కానీ పదే పదే చెప్పేవారు కాదు. ఒక తల్లిగా తను చెప్పదలచుకున్నవి చెప్పేవారు. కానీ ఏదైనా మా అంతట మేం తెలుసుకోవాలనేవారు. అలాగే ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించుకోమనేవారు. ఎలా ఉంటే ఆ దారి బాగుంటుందో మాత్రం చెప్పేవారు. అలా చేయడం వల్ల మాకంటూ సొంత వ్యక్తిత్వం ఏర్పడింది. పిల్లల చెయ్యి పట్టుకుని నడిపించాలి. కానీ వాళ్ల జీవితం మొత్తం పట్టుకునే నడిపించాలనుకుంటే సొంత వ్యక్తిత్వం ఏర్పడదని నమ్మిన వ్యక్తి మా అమ్మ. ► మీకు ఆంక్షలు ఏమైనా పెట్టేవారా? కొన్ని రూల్స్ పెట్టేవారు. అయితే నేను వాటిని ఆంక్షలు అనను. ఏ తల్లయినా పిల్లలకు కొన్ని నియమాలు పెట్టడం చాలా అవసరం. అవి వాళ్ల భవిషత్తుకు మంచి పునాది అవుతాయి. ► మీరు మీ పిల్లలతో ఎలా ఉంటారు? పిల్లల కోసం పూర్తిగా టైమ్ కేటాయిస్తాను. పిల్లలకు మంచీ చెడు చెబుతుంటాను. గుడ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్‌కి తేడా చెబుతాను. వీలైనంత నిరాడంబరంగా ఉండమని చెబుతాను. దాదాపు ఏ పిల్లలూ అదే పనిగా చదువుకోవడానికి ఇష్టపడరు. అందుకే చదివించేటప్పుడు కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాను. చదువుతో పాటు పిల్లలకు ఆటలు కూడా ముఖ్యం. గౌతమ్‌కు స్విమ్మింగ్, సితారకు డ్యాన్స్ వంటి క్లాసులు ఉన్నాయి. వాటిని ఇద్దరూ ఎంజాయ్ చేస్తారు. ► కరోనా లాక్డౌన్లో పెద్దలు, పిల్లలు బయటికి వెళ్లే వీలు లేదు. ముఖ్యంగా పిల్లల అల్లరిని ఎలా మ్యానేజ్ చేస్తున్నారు? ఇద్దరూ గొడవపడుతుంటారా? మా ఇద్దరు పిల్లలు బంగారాలనే చెప్పాలి. వాళ్లను మ్యానేజ్ చేయడం నాకెప్పుడూ ఛాలెంజింగ్‌గా అనిపించలేదు. అందుకని మిగతా రోజులకి, లాక్‌డౌన్‌కి నాకు తేడా తెలియడంలేదు. ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే గొడవపడడం కామన్. వీళ్లిద్దరిదీ ఇల్లు పీకి పందిరేసేంత అల్లరి కాదు కాబట్టి మ్యానేజ్ చేసేయడమే (నవ్వుతూ). ► ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలను ఏ విధంగా చూసుకోవాలి? పిల్లలతో ఉన్నప్పుడు కచ్చితంగా మాస్కు ధరించాలి. అలాగే మాస్కు ధరించడంవల్ల ఉండే ఉపయోగాలను పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. ‘ఈ టైమ్‌లో కొంచెం ఎక్కువ శుభ్రంగా ఎందుకు ఉండాలి? భౌతిక దూరం ఎందుకు పాటించాలి?’ అనే విషయాలను పిల్లలకు వివరించాలి. అలాగే ఈ సమయంలో స్వచ్ఛమైన గాలి చాలా అవసరం. శుభ్రమైన శ్వాస ప్రాముఖ్యాన్ని చెప్పాలి. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం పిల్లలకు ఇవ్వాలి. నీళ్లు ఎక్కువగా తాగాలని చెప్పాలి. మా అమ్మ ఎప్పుడూ కరెక్టే! ► మీ అమ్మగారు మీకిచ్చిన ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ... చెప్పిన విషయాల గురించి కానీ షేర్ చేసుకుంటారా? ఓ సందర్భలో మా అమ్మ నాకు ‘శ్రీసాయి సచ్చరిత్ర’ పుస్తకాన్ని ఇచ్చారు. ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపించినప్పుడు, సవాళ్లు ఎదురైనప్పుడు ఆ పుస్తకాన్ని ఏకాగ్రతగా చదవమని చెప్పారు. మంచి చేయడంతో పాటు సవాళ్లను అధిగమించి ముందుకు సాగడానికి ఉపయోగపడుతుందని అన్నారు. నేను ఏడు రోజుల పారాయణం పూర్తి చేశాను. మా అమ్మ ఎప్పుడూ కరెక్టే. సచ్చరిత్ర చదువుతున్నప్పుడే నాకు ఓ బలం, నమ్మకం ఏర్పడ్డాయి. ఇతరుల నుంచి ఏదీ ఆశించకుండా అభిమానించడం, జీవితాన్ని స్పష్టంగా చూడడం కూడా అలవాటైంది. మా పేరెంట్స్‌కి నేనిచ్చిన బహుమతి అది! ► మీ అమ్మగారు ‘మిస్ ఇండియా’ పోటీల్లో పాల్గొనాలనుకున్నారట. కానీ మీరు ‘మిస్ ఇండియా’ అయ్యారు... ‘మిస్ ఇండియా’ కాంటెస్ట్‌లో అమ్మ పాల్గొనలేకపోవడానికి కారణం అప్పటికే ఆమెకు పెళ్లి కావడమే! నన్ను మిస్ ఇండియాగా చూడాలన్నది ఆమె కల. అది నెరవేర్చగలిగాను. నేను సాధించిన ‘మిస్ ఇండియా’ కిరీటం నా పేరెంట్స్‌కి నేనిచ్చిన బహుమతి. వాళ్ల కోసం ఏదో సాధించానన్న తృప్తి నాకెప్పటికీ ఉంటుంది. నితిన్, వనిత దంపతులు మా మమ్మీ చాలా కూల్ – సితార మహేశ్‌బాబు–నమ్రతల ముద్దుల కుమార్తె సితార తన తల్లి గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పిన విశేషాలు... ► మీ అమ్మగారు వెరీ స్ట్రిక్టా? మా అమ్మ చాలా గారాబం చేస్తుంది. వెరీ కూల్. వెరీ స్వీట్. అయితే స్ట్రిక్ట్‌గా ఉండాల్సినప్పుడు మాత్రం ఉంటుంది. మేం తప్పు చేస్తున్నాం అనిపించగానే మందలిస్తుంది. కరెక్ట్ ఏంటో చెబుతుంది. ► నువ్వు అలిగినప్పుడు మీ అమ్మ ఏం చేస్తారు? ఫన్నీ స్టోరీలు చెప్పి నవ్విస్తారు. ► నీతో ఎప్పుడూ ఏం చెబుతుంటారు? ‘ముందు చదువుకో... తర్వాతే ఆటలు’ అంటారు. ► మరి.. స్టడీస్ విషయంలో హెల్ప్ చేస్తారా? ఓ.. అన్ని సబ్జెక్టులకీ హెల్ప్ చేస్తారు. అలాగే ఆర్ట్ వర్క్‌కి కూడా! నాకేది ఇష్టమో అవన్నీ చేస్తారు. ► నీతో ఆటలు ఆడుకుంటారా? మేం ఇన్డోర్ గేమ్స్ ఆడతాం. మేము ఇంట్లో పెంచుతున్న మా పెట్స్ నోబు, ప్లూటోతో బాగా ఆడుకుంటాం. ► మీ అమ్మ ఫేవరెట్ ఫుడ్? అమ్మకు అన్నీ ఇష్టమే. హెల్త్ కోసం మంచివే తినాలంటారు. ఆర్గానిక్ ఫుడ్‌ని ఇష్టపడతారు. ► మదర్స్ డే సందర్భంగా అమ్మకు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు నచ్చినవి చేయడానికి ఎంకరేజ్ చేసే ‘బెస్ట్ మామ్’ మా అమ్మ. నా బెస్ట్ మామ్‌కి థ్యాంక్స్ చెబుతున్నాను. – డి.జి. భవాని -
Hari Teja: కరోనాతో పోరాడుతూ... బిడ్డను కన్నాను!
మరో వారం పది రోజుల్లో డెలివరీ... బిడ్డ పుట్టగానే ఎలా ఉందో చూడాలనే ఆరాటం.. తాకాలనే అనురాగం... బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకోవాలన్న ఆనందం. ఇలా... ఎన్నో ఆశలతో హరితేజ డెలివరీ కోసం ఎదురు చూశారు. సరిగ్గా డెలివరీ టైమ్‌కి వారం పది రోజుల ముందు కరోనా పాజిటివ్. నెగటివ్ ఆలోచనలు దగ్గరకు రాకూడని పరిస్థితి. రుచి తెలియకపోయినా తినాల్సిన పరిస్థితి. బిడ్డ బాగుండాలంటే తల్లి ప్రశాంతంగా ఉండాలి. మరి.. యాంకర్, ‘బిగ్ బాస్’ ఫేమ్, నటి హరితేజ ఈ కరోనా కష్టకాలాన్ని ఎలా అధిగమించారు? ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ► మీకు మాత్రమే కాదు.. ఇంటిల్లిపాదికీ కరోనా వచ్చిందని విన్నాం... హరితేజ: అవును. నాతో పాటు మా అమ్మానాన్న ఉన్నారు. నాకు డెలివరీ టైమ్ దగ్గరపడటంతో మా అత్తగారు బెంగళూరు నుంచి వచ్చారు. ఒక్క మావారికి తప్ప ఇంట్లో అందరికీ కరోనా పాజిటివ్. అమ్మానాన్న, అత్తయ్య వేరే ఇంట్లో క్వారంటైన్లో ఉండిపోయారు. నాతో పాటు మావారు ఉన్నారు. ► ఇంట్లో ముందు ఎవరికి వచ్చింది? మా అమ్మానాన్నకు! వాళ్లకి వచ్చిన రెండు మూడు రోజులకు నాకు వచ్చింది. నాకు ముందు జ్వరం వచ్చింది.. కొంచెం నీరసంగా అనిపించింది. రెండు రోజులకు రుచి, వాసన పోయాయి. అప్పుడే నాకు పాజిటివ్ అని ఫిక్పయిపోయాను. కానీ ఇంట్లోవాళ్లు అలాంటిదేం ఉండదని వాదించారు. టెస్ట్ చేయించుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి ‘నెగటివ్ వస్తే బాగుంటుంది’ అని పదే పదే దేవుణ్ణి తలుచుకున్నాను.. అయితే దురదృష్టం పాజిటివ్ అని వచ్చింది. ఆల్రెడీ నాకు తొమ్మిది నెలల నిండాయి. పొట్ట బరువు ఎక్కింది. మావారికి నెగటివ్ వచ్చింది. అయినా నన్ను అంటిపెట్టుకునే ఉన్నారు.. ఆయనకు ఎక్కడ కరోనా సోకుతుందోనని నా భయం. ► ఇంట్లో ఒకరికి కరోనా వచ్చినా పనివాళ్లను రమ్మనలేం. మీకు సహాయంగా మీవారు తప్ప ఇంట్లే వేరే ఆడవాళ్లు లేరు. ఇంటిపనులు ఎలా మేనేజ్ చేశారు? అంతా మావారే చేశారు. ఆయనకు వంట వచ్చు. ఆ మాటకొస్తే ఆయనకు రానిదంటూ లేదు. ఒక్క ఈ పరిస్థితుల్లోనే కాదు.. మిగతా రోజుల్లో కూడా నేను షూటింగ్స్ కోసం అవుట్డోర్ వెళ్లినప్పుడు ఆయనే ఇంటిని మ్యానేజ్ చేస్తారు. అందుకని ఇబ్బందిపడలేదు. ► నార్మల్వాళ్లే కరోనా సోకిందంటే భయపడుతున్నారు. మీరేమో వట్టి మనిషి కాదు. ‘పాజిటివ్’ అని రాగానే మీ మానసిక స్థితి ఏంటి? అప్పటివరకూ డెలివరీ టైమ్‌లో నొప్పి బాగా ఉంటుందేమో? డెలివరీ ఎలా జరుగుతుందో? అనే ఆలోచనలు ఉండేవి. కానీ అవన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. కరోనా అని తెలిశాక రాత్రీపగలూ ఒకటే టెన్షన్. ఏ టైమ్‌లో ఏం జరుగుతుందో? ఏం వినాల్సి వస్తుందో? అని భయం. బేబీ బాగుంటే చాలు అనేది మాత్రమే మనసులో ఉండేది. ► బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు అమ్మ వీలైనంత ప్రశాంతంగా ఉండాలి.. టెన్షన్ తగ్గించుకోవడానికి ఏం చేశారు? కరెక్టే... ఎక్కువ టెన్షన్ పడితే నాకు బీపీ పెరిగితే బిడ్డకు మంచిది కాదు. అందుకే నేను కొంచెం బ్యాలెన్డ్స్గానే ఉండేదాన్ని. కరోనా అని తెలిసి నా చుట్టూ ఉన్నవాళ్లు ఏడ్చినా, విపరీతంగా బాధపడినా నాకు మాత్రం ఏడ్చే పరిస్థితి కూడా లేదు. ‘మన కడుపులో ఇంకొకరు మన మీద ఆధారపడి ఉన్నారు’ అనే ఫీలింగ్ ఏడ్వనివ్వలేదు. ‘ఈ టైమ్‌లో మీరు టెన్షన్ పడితే బీపీ పెరిగిపోతుంది. వీలైనంత కూల్‌గా ఉండండి’ అని డాక్టర్లు కూడా చెప్పారు.. ఇక నా కళ్లముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ‘ధైర్యంగా ఉండడం’. నాకు నేనుగా ధైర్యం తెచ్చుకున్నాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ నేను ప్రశాంతంగా ఉండగలిగానంటే కారణం నేను చేసిన యోగా.. ధ్యానం. తెల్లవారుజాము నాలుగు గంటలకల్లా నిద్రలేచి, మా మేడ మీద ‘ప్రాణాయామం’ చేసేదాన్ని. దానివల్ల శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది అనిపించలేదు. ధాన్యం వల్ల ప్రశాంతంగా ఉండగలిగాను. ► కరోనా అంటే రుచి, వాసన తెలియదు. రుచి తెలియకపోతే ఆహారం తీసుకోలేం. తినాల్సిన నిర్బంధ పరిస్థితి మీది.. అదో బాధ అండీ.. బేబీ కోసం కచ్చితంగా తినాల్సిందే. ఏమీ తినబుద్ధయ్యేది కాదు. కరోనా సోకిన తర్వాత మావాళ్లు తినలేకపోయారు. నాక్కూడా అన్నం చూస్తే ఏదోలా ఉండేది. కానీ కడుపులో బేబీ ఉంది కాబట్టి, బలవంతంగా తిన్నాను. ఏం చేసినా బేబీ కోసమే. కొత్త టెన్షన్‌ని పక్కన పెట్టడం, బాధని వెనక్కి నెట్టడం నుంచి తినాలనిపించకపోయినా తినడం వరకూ ఏం చేసినా బేబీ క్షేమం కోసం చేశాను. ► గర్భవతిగా ఉన్నప్పుడు ఏ మందులు పడితే అవి వాడకూడదు. మరి.. కరోనాకి డాక్టర్లు ఇచ్చే మందులు వాడలేని స్థితిలో ఉన్న మీరు.. వేరే ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? అవునండీ... మందులు వాడలేదు. అందుకు బదులుగా ప్రతిరోజూ ఉదయం వేపాకులు నమిలేదాన్ని. తులసి ఆకులు తినేదాన్ని. అల్లం, మిరియాలతో కషా యం చేసుకుని తాగేదాన్ని. రోజుకి నాలుగుసార్లు ఆవిరి పట్టేదాన్ని. యోగా, ధ్యానం వంటివి కూడా హెల్ప్ అయ్యాయి. నెగటివ్ తెచ్చుకోవాలనే తపనతో జాగ్రత్తలు తీసుకున్నాను. ► జనరల్‌గా మనకున్న సౌకర్యాలను బట్టి డెలివరీ జరిగే ఆసుపత్రిని సెలక్ట్ చేసుకుంటాం. మీరలా ఎంపిక చేసుకునే ఉంటారు. ఫైనల్‌గా కోవిడ్ ఆçసుపత్రిలోనే డెలివరీ అన్నప్పుడు కంగారుపడ్డారా? తొమ్మిది నెలలు ప్రతి నెలా చెకప్‌కి ఒకే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. మంచి ఆసుపత్రి సెలక్ట్ చేసుకుని, డెలివరీకి ప్రిపేర్ అయ్యాను. కానీ అది ‘నాన్ కోవిడ్ హాస్పిటల్’. అక్కడ కుదరదన్నారు. వేరే డాక్టర్ని సూచించారు. తొమ్మిది నెలల నా ఆరోగ్య స్థితి ఆ డాక్టర్‌కి తెలిసినంతగా కొత్త డాక్టర్‌కి తెలుస్తుందా? అని టెన్షన్ పడ్డాను. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు కొంత రిలీఫ్ ఇస్తాడంటారు. అలా నేను వెళ్లిన డాక్టర్ నాకు చాలా ధైర్యం చెప్పారు. ‘ఏం ఫర్వాలేదు.. కూల్‌గా ఉండండి’ అన్నారు. ట్రీట్మెంట్ బాగా జరిగింది. నాకు డాక్టర్లందరూ దేవుళ్లలా కనిపించారు. అంతా సజావుగా జరిగేలా చేశారు. ► నార్మల్ డెలివరీ కాకుండా ‘సిజేరియన్’ చేయించుకోవాల్సి రావడం గురించి... నార్మల్ డెలివరీ అవ్వాలన్నదే నా ఆశ. అందుకే యోగా చేసుకుంటూ, డ్యాన్స్ కూడా చేసేదాన్ని. కింద కూర్చుని, పైకి లేవడం... ఇలా చాలా యాక్టివ్‌గా ఉన్నాను. విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ చాలా ప్రశాంతంగా ఉన్నాను. వేరే ఆరోగ్య సమస్యలేవీ లేవు. నార్మల్ డెలివరీయే అని డాక్టర్ కూడా అన్నారు. కోవిడ్ హాస్పిటల్ కాబట్టి అందరూ కరోనా పేషెంట్లే! డాక్టర్లంతా ‘పీపీఈ’ డ్రెస్సులతో ఫుల్లీ కవర్డ్! ఆ వాతావరణం కొంచెం డిస్టర్బింగ్గానే అనిపించింది. ఆందోళన పడకూడదన్నా పడతాం. ఇక కరోనా సోకడంతో నార్మల్ డెలివరీ మంచిది కాదన్నారు. ఓ ఆరేడు గంటలు నొప్పులు పడటంవల్ల బిడ్డకు మంచిది కాదని, సిజేరియన్ చేయాల్సిందేనని అన్నారు. ప్లస్ నొప్పులు తట్టుకునే శక్తి ఉంటుందా? అనే సందేహం కూడా డాక్టర్లకి ఉంది. అందుకే వీలైనంత త్వరగా బేబీని బయటకు తీయాలన్నారు. ఆపరేషన్ థియేటర్‌కి వెళ్లేటప్పుడు ‘డెలివరీ ఎలా జరిగినా.. ఏ డాక్టర్ చేసినా.. నా బిడ్డ క్షేమంగా ఉంటే చాలు’ అని కోరుకున్నాను. ► బిడ్డ పుట్టగానే చూశారా... తాకారా? ఒక బాధాకరమైన విషయం ఏంటంటే... వెంటనే చూడలేదు. ఇక తాకే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? బిడ్డను బయటకు తీయగానే వేరే గదిలో ఉంచారు. వీడియో కాల్స్‌లో చూపించారు. లక్కీగా మా పాపకు నెగటివ్ వచ్చింది. ► మీకెప్పుడు నెగటివ్ వచ్చింది.. పాపను ఎప్పుడు తాకారు? మరి... బిడ్డకు ఆహారం ఎలా? పాలు ఇవ్వమన్నారు. బేబీకి నా ఉమ్ము టచ్ కాకూడదన్నారు. పాలు పట్టినంతసేపూ దగ్గకుండా, తుమ్మకుండా ఉండాలి. పాప పాలు తాగున్నంతసేపూ ముఖం ఒకవైపుకి తిప్పుకునేదాన్ని. ఆ పది నిమిషాలూ భయం భయంగానే ఉండేది. చేతులకు గ్లౌజులు వేసుకుని ఎత్తుకునేదాన్ని. పాప పుట్టిన 11 రోజులకు నాకు నెగటివ్ వచ్చింది. అప్పుడు గ్లౌజులు అవీ తీసేసి, పాపను తాకితే భలే అనిపించింది. గట్టిగా హత్తుకున్నాను. ► పాపకు పేరు పెట్టారా? లేదు. ఈ కరోనా టైమ్‌లో నామకరణం వేడుక అంటే సాధ్యం అయ్యేది కాదు. అందుకే ఓ రెండు నెలలు ఆగుదాం అనుకున్నాం. ► ఇప్పుడంతా రిలీఫ్.. ఈ ఆనందాన్ని షేర్ చేసుకుంటారా? దేవుడి దయవల్ల పెద్ద గండం నుంచి బయటపడ్డట్లయింది. నాకు ఈ ఆనందం ఈజీగా దక్కలేదు. నార్మల్‌గా నొప్పులు పడి కన్న అమ్మకు చాలా స్పెషల్‌గా ఉంటుంది. సిజేరియన్ అయినా సరే ఆనందంగానే ఉంటుంది. నేను కరోనాతో ఫైట్ చేస్తూ, బిడ్డను కన్నాను. కాబట్టి నాకు డబుల్ స్పెషల్... డబుల్ హ్యాపీనెస్. ధైర్యం కూడా డబుల్ అయింది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. వేరే ఏ టెన్షన్స్ మనసులో లేవు. నా పాపతో చక్కగా గడుపుతున్నాను. ► తొమ్మిది నెలల ప్రాసెస్‌లో డెలివరీ గురించి భయపడ్డారా? మనకు ఆకలి వేసినప్పుడు రెస్టారెంట్‌కి వెళ్లి అది తిందాం.. ఇది తిందాం అనుకుంటాం. అవి దొరక్కపోతే ఆకలి తీర్చుకోవడానికి ఏది దొరికితే అది తింటాం. అప్పటివరకూ నచ్చినది తినాలనే కోరిక ఫిల్టర్ అయిపోయి, ‘ఏమీ వద్దు భగవంతుడా... ఆకలి తీరితే చాలు’ అనుకుంటాం. నా పరిస్థితి కూడా అలానే అయింది. ‘ఏమీ వద్దు. నా బిడ్డ బాగుంటే చాలు. ఆరోగ్యంగా ఉంటే చాలు’. అదొక్క ఆలోచన తప్ప వేరే ఏదీ లేదు. డెలివరీ టైమ్‌లో నాకేదైనా కష్టంగా ఉంటుందేమో అని అప్పటివరకూ ఉన్న ఆలోచనలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. ► మీరు ప్రెగ్నెంట్ కాబట్టి ఎక్స్ట్రా కేర్ తీసుకుని ఉంటారు. మరి.. ఎవరి ద్వారా కరోనా వచ్చిందంటారు? మనకేం కాదులే అనే ధైర్యం ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఆ ధైర్యం ఎక్కువే. పైగా ఇంట్లో అందరికీ రోగనిరోధక శక్తి బాగానే ఉంటుంది. పనివాళ్లు, పాల ప్యాకెట్లు, డెలివరీ బాయ్స్.. ఇలా అందరూ వస్తారు. ఎక్కడినుంచి, ఎవరి ద్వారా అని ఇప్పుడు ఆలోచించడం అనవసరం. నాకు రావాలని రాసిపెట్టి ఉంది.. వచ్చింది. నా కూతురు కడుపులోనే ఫైట్ చేసి, బయటకు రావాలని ఉంది కాబట్టి ఇలా జరిగిందనుకుంటున్నాను. ఆ సంగతలా ఉంచితే.. ‘మనకేం అవుతుందిలే’ అని ఎవరూ తేలికగా తీసుకోకూడదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. మేం నేర్చుకున్న పాఠం ఇది. ఇప్పటివరకూ ఎన్నో కష్టాలు తట్టుకుని నిలబడ్డాను కానీ ఇది వేరే కష్టం. మన భుజం తట్టే మనిషి పక్కన ఉండలేని పరిస్థితి. మనం మనోధైర్యంతో ఉండగలిగితే ఏ కష్టాన్నయినా ఎదుర్కోగలుగుతాం అని నేర్చుకున్నాను. ఇదే అందరికీ చెబుతాను. కష్టం వచ్చినప్పుడు కంగారుపడతాం. అది సహజం. అయితే దాన్ని ధైర్యంగా అధిగమించి, నిలబడాలి. నా జీవితంలో ఇదొక మైలురాయి అనాలి. ముఖ్యంగా మనల్ని నమ్ముకుని మన లోపల ఒకరున్నారనే జాగ్రత్త ప్రెగ్నెంట్ ఉమన్‌కి ఉండాలి. ఇంట్లో అందరూ తనని జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. నాకు కరోనా గురించి అవగాహన లేదు కాబట్టి, విపరీతంగా భయపడ్డాను. కానీ అంత భయపడక్కర్లేదు. డాక్టర్లు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏది ఏమైనా బిడ్డను కనేవరకూ కరోనా రాకపోయినా వచ్చినట్లే ఉంటే.. కష్టాలు రాకుండా ఉంటాయి. ప్రశాంతంగా డెలివరీకి వెళ్లొచ్చు. మరో విషయం ఏంటంటే... తల్లికి వచ్చినంత మాత్రాన బిడ్డకు కరోనా సోకుతుందని లేదు. ఎక్కడో ఒకరిద్దరికి తప్ప ఎక్కువ శాతం బిడ్డలకు సోకడం లేదు. అయినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలి. – డి.జి. భవాని -
కండక్టర్ టు కథానాయకుడు ఒరు నల్ల ప్రయాణం
‘‘బాబాయ్... జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. కష్టపడందే ఏదీ రాదు. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు.’’ ‘నరసింహా’ సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ రజనీ జీవితానికి అద్దం పడుతుంది. అనుకున్నది సాధించడానికి రజనీ చాలా కష్టపడ్డారు. సాధించినదాన్ని నిలుపుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. కష్టం... రజనీ... వేరు వేరు కాదు. అలవాటైపోయిన కష్టం రజనీకి ఎంతో ఇష్టమైపోయింది. సాదాసీదా కండక్టర్ నుంచి సూపర్‌స్టార్ వరకు... రజనీది ఒక మంచి ప్రయాణం. ఎన్నో అవార్డులూ, రివార్డులు... ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం. ఇదు ఒరు నల్ల ప్రయాణం! అంటే.. ఇది ఒక మంచి ప్రయాణం!! అమ్మానాన్న.. అక్క.. ఇద్దరు అన్నయ్యలు.. చిన్నప్పుడు రజనీకాంత్ జీవితం వీళ్ల చుట్టూనే. అమ్మానాన్న పెట్టిన పేరు శివాజీరావ్ గైక్వాడ్. మైసూరులో మరాఠీ కుటుంబంలో పుట్టాడు శివాజీ. తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్. శివాజీకి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడే తల్లి చనిపోయారు. అలాగే ఒక అన్నయ్య కూడా తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ఇక నాన్న, అన్నయ్య సత్యనారాయణలే శివాజీ లోకం. శివాజీ చురుకైనవాడు. ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, క్రికెట్ అంటే ఇష్టం. ఈ మూడేనా? యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఆ ఇష్టం పెరిగిపోవడానికి ఒక కారణం ‘రామకృష్ణ మఠం’. స్కూల్ అయిపోగానే అన్నయ్యతో కలిసి శివాజీ ఆ మఠానికి వెళ్లేవాడు. వేద మంత్రాలు నేర్చుకున్నాడు. బోలెడన్ని సేవలు చేసేవాడు. భవిష్యత్తులో రజనీ దారి ఆధ్యాత్మిక దారి అని రాసిపెట్టి ఉందనడానికి ఇదొక నిదర్శనం. అలాగే భవిష్యత్తులో నటుడు కావడానికి ఓ దారి రామకృష్ణ మఠం. అక్కడ ఏడాదికోసారి డ్రామాలు వేసేవారు. వాటిలో శివాజీ ఉత్సాహంగా పాల్గొనేవాడు. మెల్లిగా నటన మీద ఆసక్తి పెరిగిపోయింది. మఠంలోనే కాకుండా విడిగా స్టేజ్ నాటకాల్లో నటించడం మొదలుపెట్టాడు. చదువు బ్యాక్ సీట్ తీసుకుంది... నటన ఫ్రంట్ సీట్కొచ్చేసింది. మనసును పూర్తిగా నటన ఆక్రమించేసింది. కాలేజీకి వెళ్లి, బుద్ధిగా చదువుకుందామంటే మనసు కుదురుగా ఉండనివ్వలేదు. ఆలోచనలన్నీ నటనవైపే! ఇక లాభం లేదనుకుని, తెలిసినవాళ్ల ద్వారా శివాజీని కండక్టర్‌గా చేర్పించారు సత్యనారాయణ. బస్సు టికెట్లు తెంచుతున్నప్పటికీ సినిమా టికెట్ల మీదే ధ్యాస. టికెట్లు కొనాలని కాదు... తన సినిమా టికెట్ అందరూ కొనాలని! ఇలాంటి కలల్లో ఉన్న శివాజీని ‘నీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి.. సినిమాల్లోకి వెళ్లొచ్చుగా’ అన్నారు స్నేహితులు. రెండంటే రెండేళ్లు కండక్టర్‌గా చేసి, కలను నెరవేర్చుకోవడానికి మైసూర్ టు మద్రాస్ ప్రయాణం అయ్యాడు శివాజీ. మద్రాసులో ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. ఈ ప్రయాణానికి సహాయపడిన ఎవరినీ శివాజీ మరచిపోలేదు. ‘‘నేను కండక్టర్‌గా పనిచేసే రోజుల్లోనే నాలో నటుడున్నాడని గుర్తించిన ఆ బస్సు డ్రైవర్, నాకు అండగా నిలిచిన నా స్నేహితుడు రాజ బహుదూర్, నన్ను నటుణ్ణి చేయడానికి ఎన్నో త్యాగాలు చేసిన మా అన్నయ్య సత్యనారాయణ... వీళ్లందరికీ నా కృతజ్ఞతలు’’ అన్నారు రజనీకాంత్‌గా మారిన శివాజీ. దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటన వచ్చిన తర్వాత రజనీ విడుదల చేసిన ప్రకటనలో ఈ ముగ్గురి ప్రస్తావన ఉంది. ఈ ముగ్గురేనా? ఊహూ.. ఈ సందర్భంగా రజనీ చాలామందిని గుర్తు చేసుకున్నారు. ‘రజనీకాంత్’ అని నామకరణం చేసి, ‘అపూర్వ రాగంగళ్’ (1975) చిత్రం ద్వారా నటుణ్ణి చేసిన దర్శకుడు కె. బాలచందర్ పేరుని, హీరో నుంచి సూపర్ స్టార్‌గా ఎదగడానికి అవకాశం ఇచ్చిన ఇతర దర్శక–నిర్మాతలు, టెక్నీషియన్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, చివరకు తన స్నేహితుడు కమలహాసన్ – ఇలా అందరికీ కృతజ్ఞతలు తెలిపి, తనను ఇంతటివాడిని చేసిన ప్రజాదేవుళ్లు, అభిమానులు... అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే.. నేను శివాజీని..! సినిమా హీరో అంటే తెల్లగా ఉండాలా? అక్కర్లేదు.. నల్లగా ఉన్నా ‘నల్ల (మంచి) కథానాయకుడు’ అవగలుగుతారు. అందుకు మంచి ఉదాహరణ రజనీకాంత్. ఇంతకీ తనలో ఏం నచ్చి బాలచందర్ నటుణ్ణి చేయాలనుకున్నారంటే... నడకలో వేగం, కళ్లల్లో తీక్షణత, స్టయిల్ చూసి! నిజానికి బాలచందర్ కళ్లల్లో శివాజీ పడినప్పుడు అతను వేరే నటుణ్ణి అనుకరించే పని మీద ఉన్నాడు. ఎవరా నటుడంటే ప్రముఖ నటుడు శివాజీ గణేశన్. ‘అబ్బాయ్! నువ్వెందుకు శివాజీలా నటిస్తున్నావ్’ అని బాలచందర్ అడిగితే, ‘ఎందుకంటే నేను కూడా శివాజీనే కదా’ అని తడుముకోకుండా బదులిచ్చాడు శివాజీ. ‘చురుకైనవాడివే’ అన్నారు బాలచందర్. ‘అపూర్వ రాగంగళ్’లో రజనీకి ఆయన ఇచ్చినది చిన్న పాత్రే అయినా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కన్నడంలో రజనీ నటించిన ‘కథా సంగమ’ విడుదలైంది. అదే ఏడాది (1976) తెలుగుకి పరిచయం అయ్యారు రజనీ. తమిళంలో తాను తెరకెక్కించిన ‘అవళ్ ఒరు తొడర్ కదై’ సినిమాను తెలుగులో ‘అంతులేని కథ’గా రీమేక్ చేస్తూ, కీలక పాత్రకు రజనీని తీసుకున్నారు బాలచందర్. అందులో తాగుబోతు అన్నయ్యగా రజనీ అద్భుతంగా నటించారు. నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అయినప్పటికీ నటనకు పాజిటివ్ రివ్యూ వచ్చింది. రజనీలోని పూర్తి స్టయిల్ని చూపించిన చిత్రం ‘మూండ్రు ముడిచ్చు’ (1976). ఈ సినిమాలో రజనీ స్టయిల్‌గా సిగరెట్ ఎగరేసి, పట్టుకోవడం అందరికీ నచ్చేసింది. ‘ఏం స్టయిల్..’ అంటూ అభిమానులు చప్పట్లు కొట్టారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ఆకట్టుకుంటూ, దూసుకెళుతున్న రజనీకి వెనక్కి తిరిగి చూసుకునే పనిలేకుండాపోయింది. 1978లో చేసిన ‘భైరవి’ ద్వారా హీరోగా మారారు. ఒక్క 1977లోనే ఆయనవి దాదాపు 15 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో తెలుగులో లీడ్ యాక్టర్‌గా చేసిన తొలి సినిమా ‘చిలకమ్మ చెప్పింది’ ఒకటి. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం... ఇలా దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్న రజనీకాంత్ హిందీలో చేసిన తొలి చిత్రం ‘అంధా కానూన్’ (1983). ఇందులో అమితాబ్ అతిథి పాత్ర చేశారు. అది సూపర్ డూపర్ హిట్. పదేళ్లల్లో వంద సినిమాలు 1975 నుంచి 1985 వరకూ రజనీ 100 సినిమాల్లో నటించారు. వందో సినిమాగా ‘శ్రీరాఘవేంద్ర’ (1985) చేశారు. నిజజీవితంలో రజనీకాంత్ రాఘవేంద్ర స్వామి భక్తుడు. ఇందులో రాఘవేంద్ర స్వామిగా నటించారు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా అప్పటివరకూ మాస్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చిన రజనీ... దేవుడి పాత్రలో ఒదిగిపోయిన వైనం భేష్ అనిపించుకుంది. మళ్లీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన రజనీ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘దళపతి’ (’91) ఒకటి. ఆ తర్వాత రజనీ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన చిత్రం సురేష్ కృష్ణ ‘బాషా’ (1995). సాదాసీదా జీవితం గడిపే ఆటో డ్రైవర్ బాషా నిజానికి డాన్ అనే కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు కథావస్తువుగా ఉపయోగపడింది. ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’ అని ఆ సినిమాలో రజనీ చెప్పిన డైలాగ్, ఆయన స్టయిల్‌కు తగ్గట్లు ‘స్టయిలు స్టయిలులే..’ పాట – మొత్తంగా సినిమా అంతా చాలా బాగుంటుంది. ఆ తర్వాత చేసిన ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘నరసింహా’.. వంటివన్నీ హిట్ బాటలో వెళ్లాయి. ‘లకలకలక...’ అంటూ ‘చంద్రముఖి’లో చేసిన సందడిని సూపర్ అన్నారు ఫ్యాన్స్. ‘నాన్నా.. పందులే గుంపు గా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది’ అని ‘శివాజీ’లో చెప్పిన డైలాగ్, అదే సినిమాలో ఆయన తెల్లబడడానికి చేసే ప్రయత్నాలు, విలన్ని ఎదుర్కొనే సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘రోబో’ది ఓ డిఫరెంట్ రూట్. కొంచెం వయసు మీద పడ్డ ‘కబాలీ’గా, ‘కాలా’గా రజనీ మెరిశారు. ప్రస్తుతం ‘అన్నాత్తే’లో నటిస్తున్నారు. సినిమాలకు తమ అభిమాన హీరో ఫుల్స్టాప్ పెడితే? ఈ భయం ఫ్యాన్స్కెప్పుడూ ఉంటుంది. రజనీకాంత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే తట్టుకోగలరా? ఊహూ... రజనీకి ఇప్పట్లో ఆ ఆలోచన లేదు. రజనీ ‘నల్ల’ (మంచి) నటుడు. వివాదాలు లేని ‘నల్ల’ మనిషి. ‘కబాలీ’లో రజనీ... ‘మంచిది’ అని తనదైన స్టయిల్లో డైలాగ్ చెబుతారు. కండక్టర్ టు కథానాయకుడు... రజనీది ఒక మంచి ప్రయాణం. మంచిది. ఇప్పుడు... రజనీ ‘దాదా’. మరీ మంచిది. ఆయన భవిష్యత్తులో మరెన్నో విజయాలు చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరీ మరీ మంచిది. తమిళ... అమితాబ్ రజనీకాంత్‌కి అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం. ప్లాన్ చేసింది కాదు కానీ అమితాబ్ నటించిన పలు హిందీ చిత్రాల తమిళ రీమేక్స్‌లో నటించారు రజనీ. హిందీలో అమితాబ్ చేసిన ‘అమర్ –అక్బర్ –ఆంథోనీ’ తమిళ రీమేక్ ‘శంకర్ –సలీమ్ –సైమన్’లో రజనీ నటించారు. అలాగే ‘మజ్బూర్’ (నాన్ వాళవైప్పేన్), ‘డాన్’ (బిల్లా), ‘త్రిశూల్’ (మిస్టర్ భారత్), ‘దీవార్’ (తీ) వంటి రీమేక్స్‌లోనూ చేశారు. చూపులు కలిసిన శుభవేళ 1981 ఫిబ్రవరి 26న లతను పెళ్లాడారు రజనీకాంత్. చెన్నైలోని ప్రసిద్ధ యతిరాజ్ కాలేజీ స్టూడెంట్ లత. క్యాలేజీ మ్యాగజైన్‌కి సంబంధించిన ఇంటర్వ్యూ కోసం రజనీని కలిశారు లత. ఆ ఇంటర్వ్యూ కలిపింది ఇద్దర్నీ అనాలి. పెద్దల సమక్షంలో తిరుపతిలో లత మెడలో మూడు ముడులు వేశారు రజనీ. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఐశ్వర్య, సౌందర్య. ధనుష్, శ్రుతీహాసన్‌తో తెరకెక్కించిన ‘3’ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు ఐశ్వర్య. తండ్రితో ‘కొచ్చాడయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) సినిమా తెరకెక్కించారు సౌందర్య. తమిళ హీరో ధనుష్‌తో ఐశ్వర్య పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమారులు. అశ్విన్‌కుమార్‌తో సౌందర్య వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అశ్విన్ నుంచి సౌందర్య విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత వ్యాపారవేత్త విశాగన్ వనంగాముడిని పెళ్లాడారామె. ఎదిగినా... ఒదిగే! సినిమాల్లో ఆర్భాటంగా కనిపించే రజనీ నిజజీవితంలో మాత్రం సింపుల్ లైఫ్‌ని ఇష్టపడతారు. చిన్నప్పుడు రామకృష్ణ మఠంలో సేవలు చేసిన రజనీ కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. హిమాలయాలకు వెళతారు. ధ్యానంలో మునిగిపోతారు. ఒక గుడికి రజనీ సాధారణ బట్టల్లో చాలా సాదాసీదాగా వెళ్లారు. దర్శనం అయ్యాక ఒక పిల్లర్ దగ్గర కూర్చుని ఉన్న ఆయనను బిచ్చ గాడు అనుకున్న ఒకావిడ పది రూపాయలు ఇచ్చింది. ఆ తర్వాత గుర్తుపట్టి రజనీని క్షమించమని కోరింది. ‘‘ఇదంతా ఆ దేవుడి లీల. ‘నువ్వు సూపర్స్టార్వి కాదు... ఇది శాశ్వతం కాదు’ అని చెప్పడానికే దేవుడు ఇలా చేస్తుంటాడు’’ అని ఆమెతో రజనీకాంత్ అన్నారు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగే ఉండాలనే విషయానికి రజనీకాంత్ ఓ ప్రతీక. 51వ దాదాసాహెబ్ పురస్కారాన్ని 2019వ సంవత్సరానికి గాను ఐదుగురు సభ్యులు గల జ్యూరీ రజనీకాంత్‌కు సిఫారసు చేయగా కేంద్రం ఆమోదించినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ వెల్లడించారు. ‘‘ఆశాభోంస్లే, మోహన్ లాల్, విశ్వజిత్ ఛటర్జీ, శంకర్ మహదేవన్, సుభాష్ ఘయ్‌లతో కూడిన జ్యూరీ ఈ పురస్కారం ఎంపికలో ఏకగ్రీవంగా రజనీ పేరును ప్రతిపాదించింది. కేంద్రం ఆమోదించింది. రజనీ 50 ఏళ్లుగా సినీరంగంలో బాద్షాగా నిలిచారు. వచ్చే మే 3న జాతీయ చలనచిత్ర అవార్డు ల ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. అనేక తరాల ఆదరణకు పాత్రుడైన, చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమయ్యే కృషి చేసిన, వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన, సమ్మోహితులను చేసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రజనీకాంత్. ‘తలైవా’కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించడం అంతులేని ఆనందాన్ని అందించే విషయం. – ప్రధాని నరేంద్ర మోదీ 40ఏళ్లుగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలకు జీవం పోసిన రజనీకాంత్‌కు ఈ పురస్కారం ద్వారా తగిన గుర్తింపు లభించింది. – ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సినీరంగానికి రజనీకాంత్ చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించింది. కర్నాటకలో జన్మించిన మరాఠా వ్యక్తి.. స్టైలిష్ తమిళ్ సూపర్ స్టార్‌గా ఎదిగిన శివాజీరావు గైక్వాడ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజం, ప్రతిభతో వెండితెరపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు. – ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నటుడిగా దశాబ్దాలపాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయం. – తెలంగాణ సీఎం కేసీఆర్ నా మిత్రుడు రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. ఇలాంటి పురస్కారాలు మరెన్నో రజనీకాంత్‌కు రావాలి. – మోహన్‌బాబు రజనీకాంత్‌గారిని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా శుభాకాంక్షలు. ఆయనకు మంచి గుర్తింపు లభించింది. – మోహన్‌లాల్ నా స్నేహితుడు రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డుకు రజనీకాంత్ నిజంగా అర్హత కలిగినవాడు. ఫిల్మ్ ఇండస్ట్రీకి రజనీ చాలా కంట్రిబ్యూట్ చేశారు. నీకు (రజనీ) నా హృదయపూర్వక శుభాకాంక్షలు. – చిరంజీవి -డి.జి. భవాని -
నేను, భవ్య ఓపెన్‌గా మాట్లాడుకున్నాం: మెహరీన్
‘హనీ ఈజ్ ది బెస్ట్’... ‘ఎఫ్ 2’లో మెహరీన్ తన గురించి ఇలా చెప్పుకుంటారు ఇప్పుడు... ‘భవ్య ఈజ్ బెస్ట్’ అంటున్నారు ఎవరీ భవ్య అంటే మెహరీన్ కాబోయే భర్త మార్చి 12న భవ్య – మెహరీన్‌ల నిశ్చితార్థం జరిగింది. పెళ్లెప్పుడు? అంటే... డేట్ ఫిక్స్ కాలేదు. కూల్ కూల్‌గా ‘వింటర్ వెడ్డింగ్’ చేసుకోవాలనుకుంటున్నారు. కాబోయే భర్త గురించి, పెళ్లి విశేషాలను ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మెహరీన్ చెప్పారు. ► జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు.. అవును. ఈ ఫేజ్ చాలా అందంగా, అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ దేవుడి ఆశీర్వాదాలు నాకు పూర్తిగా ఉన్నాయనిపిస్తోంది. ► హీరోయిన్గా ఆఫర్లు ఉన్నప్పుడు పెళ్లి వాయిదా వేసుకుంటారు చాలామంది. కానీ మీరు అలా అనుకోలేదా? హీరోయిన్గా వచ్చేటప్పుడే మా అమ్మానాన్నతో కెరీర్‌ని, పర్సనల్ లైఫ్‌ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటానని చెప్పాను. 25 లేకపోతే 26 ఏళ్లకే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానన్నాను. దీన్నే మనసులో పెట్టుకుంటూ, సినిమాలు ఒప్పుకున్నాను. కెరీర్లో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఫర్వాలేదు.. అనుకున్న ఏజ్‌కి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ప్రతి విషయానికీ రైట్ టైమ్ అనేది ఉంటుందని నా ఫీలింగ్. అప్పుడే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాం.∙ ► మీది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అనుకోవచ్చా? కాదు. ఇది పూర్తిగా అరేంజ్డ్ మ్యారేజే. మా రెండు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా భవ్యా బిష్ణోయ్ కుటుంబంతో మాకు పరిచయం ఏర్పడింది. మా అమ్మగారికి భవ్య నచ్చారు. నాకు తన ప్రొఫైల్‌ని, తనకు నా ప్రొఫైల్‌ని పెద్దవాళ్లు చూపించారు. ఆ తర్వాత మా ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకోమన్నారు. అప్పుడు లాక్డౌన్ కావడంతో వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఫోన్లో మాట్లాడుకున్నాం. మెసేజ్‌లు పంపించుకున్నాం. ఫేస్‌టైమ్‌లో మాట్లాడుకునేవాళ్లం. ► ఎవరైనా ముందు కలిసి మాట్లాడుకుని, తర్వాత ‘ఐ లవ్ యు’ చెప్పుకుంటారు. మీరేమో ముందు మాట్లాడుకుని తర్వాత కలిశారన్నమాట... (నవ్వుతూ...) కలిసి మాట్లాడుకుంటేనే కాదు... ఒక్కోసారి ఇలా మాట్లాడుకున్నా ఒకర్నొకరు తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ మా మధ్య అండర్స్టాండింగ్ కుదరడానికి లాక్డౌన్ చాలా హెల్ప్ అయ్యిందనుకుంటున్నాను. మేం మాట్లాడుకోవడం మొదలుపెట్టిన ఆరు రోజులకే నన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు భవ్య. ఎందుకంటే నేను, భవ్య ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. ► నిశ్చితార్థం వేడుకలో ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా కనిపించారు. మీ ఇద్దరి అభిప్రాయాలు కూడా మ్యాచ్ అయ్యాయా? థ్యాంక్యూ సో మచ్. ఆహారపు అలవాట్ల నుంచి చాలా విషయాల్లో మా ఇష్టాలు, అనిష్టాలు కలిశాయి. మా ఇద్దరి కామన్ ఇంట్రస్ట్స్ కూడా దాదాపు ఒకటే. ► ‘ఎఫ్ 2’లో ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అని మీ గురించి మీరు చెబుతుంటారు. భవ్యలో బెస్ట్ క్వాలిటీస్? చాలా తెలివిగలవాడు. డౌన్ టు ఎర్త్. మర్యాదస్థుడు కూడా! స్కూల్లో టాపర్. చదువులోనే కాదు క్రీడల్లోనూ బెస్ట్. ఢిల్లీలో శ్రీరామ్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ‘ఎల్ఎస్ఇ’ (లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్)కి వెళ్లారు. మాస్టర్స్ చేయడానికి లండన్ ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్లారు. అకడెమిక్ రికార్డ్ మీద జీ–మ్యాట్ (గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్) రాయకుండానే హార్వర్డ్ కూడా వెళ్లారు. చాలా ట్యాలెంటెడ్. ► ఓకే... కట్నం విషయానికి వద్దాం. మీ రెండు కుటుంబాల మధ్య ఆ టాపిక్ ఏమైనా వచ్చిందా? కట్నం అనేది మన సమాజ ప్రతిçష్ఠకు మచ్చ అని నేను అనుకుంటాను. నా కుటుంబ సభ్యులు కూడా కట్నం ఇవ్వాలనుకోరు. మా అత్తగారింట్లో కూడా అంతే! వాళ్ళు కట్నం తీసుకోవాలనుకునే మనుషులు కాదు. చాలా హుందా అయిన కుటుంబం. మంచి మనసున్నవాళ్లు. ► అత్తగారింట్లో ఎలా ఒదిగిపోవాలో మీ అమ్మగారి దగ్గర సలహాలేమైనా తీసుకున్నారా? మా పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు చాలా కూల్. అలాగని సంప్రదాయాల విషయంలో లైట్‌గా ఉండరు. అన్నీ పాటించాల్సిందే! మా ఇంట్లో చిన్నప్పటి నుంచీ పెద్దవాళ్లను ఎలా గౌరవించాలో నేర్పారు. కుటుంబ విలువల గురించి చెబుతూ పెంచారు. కుటుంబ మూలాలకు భంగం రాకుండా ఎలా నడుచుకోవాలో నేర్పించారు. అందుకని ఇప్పుడు ఇంకో కుటుంబంలోకి వెళుతున్నప్పటికీ అక్కడెలా ఉండాలో ప్రత్యేకంగా అడిగి తెలుసుకోలేదు. ► సో.. అత్తింట్లో ఎలా ఒదిగిపోవాలనే టెన్షన్ లేనట్లే... నా జీవితం చాలా బ్లెస్డ్. ఆ దేవుడు నాకు మంచి తల్లితండ్రులను ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో కుటుంబంలోనూ మంచి తల్లితండ్రులనే ఇచ్చాడు. అందుకే నాకు పెద్దగా టెన్షన్ లేదు. ► ఇంతకీ మీ పెళ్లి తేదీ చెప్పనేలేదు? (నవ్వేస్తూ...) తేదీ ఇంకా అనుకోలేదు. ‘వింటర్ వెడ్డింగ్’ అనుకున్నాం. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాం. ► మరి, సంగీత్, మెహందీ గురించి? వీలైనంతగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. వేడుకలన్నీ మా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొత్తగా ప్లాన్ చేస్తున్నాం. ► పెళ్ళయ్యాక... సినిమాల్లో కొనసాగుతారా? ఫ్యామిలీ లైఫ్‌నూ, ప్రొఫెషనల్ లైఫ్‌నూ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. ► పెళ్లయ్యాక ఎక్కడ ఉంటారు? ముంబయ్‌లో నాకు ఇల్లు ఉంది. భవ్య ఢిల్లీలో ఉంటారు. సో... ఢిల్లీలోనే ఉంటాను. ► భవ్య తన లవ్‌ని ఎలా ప్రపోజ్ చేశారు? గత నెల భవ్య (ఫిబ్రవరి 16) బర్త్‌డేకి అండమాన్ వెళ్లాం. స్క్యూబా డైవింగ్ చేస్తున్నప్పుడు ‘విల్ యు మ్యారీ మీ’ (నన్ను పెళ్లి చేసుకుంటావా) అని అడిగారు. ఇలా ప్రపోజ్ చేస్తారని ఊహించలేదు. నీళ్లల్లో మోకాళ్ల మీద కూర్చుని అలా అడుగుతుంటే ముచ్చటేసింది. స్పెషల్‌గా, మ్యాజికల్‌గా అనిపించింది. భవ్య లవింగ్ అండ్ కేరింగ్. మంచి ఫ్యామిలీ మ్యాన్. అందగాడు, తెలివితేటలున్నవాడు. కాబోయే భర్తలో ఒక అమ్మాయి ఆశించే లక్షణాలున్న వ్యక్తి. ఆ పరంగా నేను చాలా లక్కీ. భవ్యను వద్దనుకోవడానికి నాకు కారణాలేమీ కనిపించలేదు. మెహరీన్‌కి భవ్య ప్రపోజ్ చేసిన వేళ ► పెళ్లి వేడుకల్లో కట్టుకునే చీరలు, పెట్టుకునే నగల గురించి? మా అమ్మమ్మ, మా అమ్మగారి ట్రెడిషనల్ జ్యుయెలరీ పెట్టుకోబోతున్నాను. ఇంకా ఇప్పటి ట్రెండ్‌కి తగ్గ నగలు కూడా కొనుక్కుంటాను. మా అమ్మ పెళ్లిలో కట్టుకున్న బట్టలను, పెట్టుకున్న నగలను నా పెళ్లికి వాడాలనుకుంటున్నాను. ► మీ సంప్రదాయం ప్రకారం పెళ్లికి ఎన్ని గంటలు పడుతుంది? నేను సిక్కుల కుటుంబానికి చెందిన అమ్మాయిని. అందుకని గురుద్వారాలో పంజాబీ సంప్రదాయం ప్రకారం మా పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాతి రోజు సాయంత్రం హిందూ వెడ్డింగ్ ఉంటుంది. ఏదో ఒక్క ట్రెడిషన్నే ఫాలో అయి, పెళ్లి చేసుకోవాలని మేం అనుకోలేదు. రెంటికీ విలువ ఇవ్వాలి. – డి.జి. భవాని -
త్యాగం నాది కాదు.. నా కుటుంబానిది!
భక్తికి పాట... ఆనందానికి పాట... బాధను దిగమింగుకోవడానికి పాట... చిత్ర జీవితం మొత్తం పాటలే. ఇంట్లో జరిగే వేడుకలకు వెళ్లే తీరిక లేదు. పాట వేదికే ఆమెకు వేడుక! ఆమె పాటలు ప్రేక్షకులకు ఓ వేడుక!! కృష్ణన్‌నాయర్ శాంతకుమారి చిత్రను ‘పద్మభూషణ్’ వరించినవేళ పాటకు వేడుక!!! పాట రూపంలో అందరి ఇళ్లల్లోకి వచ్చిన చిత్రతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ... ► పద్మభూషణ్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నా అన్ని విషయాలకూ నా కన్నా ఎక్కువగా ఆనందపడేది ఆయనే (భర్త విజయ్ శంకర్). మేం ఇద్దరం చాలా సింపుల్. ‘షో ఆఫ్’ అనేది తెలియదు. ఆయన ‘కంగ్రాట్స్’ అన్నారు. స్నేహితులు, బంధువులు శుభాకాంక్షలు తెలిపారు. అంతే. సెలబ్రేషన్స్ లాంటివి ఏమీ చేసుకోలేదు. ► ఇంత పేరు, డబ్బు వచ్చాక కూడా అలానే సింపుల్‌గా ఉన్నారు. ఎవరు ఇన్స్పిరేషన్? మాది రిచ్ ఫ్యామిలీ కాదు. మా నాన్నగారు హెడ్మాస్టర్, అమ్మ హెడ్ మిస్ట్రెస్. ఇద్దరూ సింపుల్‌గా ఉంటారు. కట్టుబాట్ల మధ్య మమ్మల్ని (అక్క, తమ్ముడు) పెంచారు. ఎక్కువగా వెజిటెరియనే తినేవాళ్లం. ఎప్పుడో ఒకసారి నాన్‌వెజ్. అంతే. ఆడంబరమైన జీవితం కాదు. అమ్మానాన్న చెప్పిన విలువలనే ఇప్పటికీ పాటిస్తున్నాను. మారాలనుకున్నా మారలేను (నవ్వుతూ). ► మీకు సంగీతం పట్ల ఆసక్తి ఎలా మొదలైంది? మా నాన్నగారు రేడియాలో పాడేవారు. నాన్నగారి పెద్దక్కయ్య వీణ వాయించేవారు. మాకు హాలిడేస్ అంటే మేనత్త ఇంటికి వెళ్లేవాళ్లం. ఆవిడ చాలామందికి మ్యూజిక్ నేర్పించేవారు. ఇంట్లో అందరికీ సంగీతం అంటే ఇష్టం ఉండటం వల్లనే చిన్నప్పుడే నాకూ ఆసక్తి ఏర్పడి ఉంటుంది. మా మేనత్త దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్‌కి సంబంధించిన బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాను. మా అమ్మకు వీణ తెలుసు. మా ఇంట్లో సాయంత్రం కాగానే దేవుడికి దీపం పెట్టేటప్పుడు అక్క, తమ్ముడు, నేను పాడాలి. ఏ కారణంతోనూ పాడటం మాత్రం మానకూడదు. తమ్ముడు మృదంగం వాయించేవాడు. నేను, అక్క పాడేవాళ్లం. రోజూ పూజకి, మ్యూజిక్ ప్రాక్టీస్‌కి గంటకు పైనే కేటాయించేవాళ్లం. ఆ తర్వాతే హోమ్‌వర్క్. ► మీ ఇష్టదైవం కృష్ణుడని... అవును. కృష్ణుడికి నేను పరమ భక్తురాల్ని. ఎక్కువగా ‘కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్..’ పాడుతుంటా. ► కృష్ణుడి గురించి మీ జీవితంలో జరిగిన ప్రత్యేకమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య జరిగినదే చెబుతాను. నాకు ‘పద్మభూషణ్’ ప్రకటించే రోజు ఉదయం ప్రముఖ మలయాళ డైరెక్టర్ సేతు గురువాయూర్ టెంపుల్‌కి వెళ్లారు. గుడిలోంచి వీడియో కాల్ చేసి, ‘నీ ఇష్టదైవం కృష్ణుడు’ అంటూ విగ్రహాన్ని చూపించారు. కోవిడ్ వల్ల ఈ మధ్య గురువాయూర్ వెళ్లలేదు. కృష్ణుణ్ణి అలా చూస్తూ ఉండిపోయా. ఆ సాయంత్రం పద్మభూషణ్ ప్రకటించారు. ► తెలుగులో మీరు పాడిన ఫస్ట్ పాట ‘పాడలేను పల్లవైనా’ (‘సింధు భైరవి’ చిత్రం). ఆ తర్వాత ఎన్నో పల్లవులు, చరణాలు పాడారు. ఆ పాట పాడినప్పుడు అర్థం తెలుసా? అప్పుడు నాకు తెలుగు తెలియదు. మలయాళం, తమిళం కొంచెం దగ్గరగా ఉంటాయి. కన్నడ, తెలుగు నాకు విదేశీ భాషల్లాంటివే. కాలేజీలో త్యాగరాజ కీర్తనలవీ నేర్చుకునేటప్పుడు అర్థం తెలియకుండా పాడాను. ఇప్పుడు భాష అర్థం అయ్యాక ‘అయ్యయ్యో.. అప్పుడు ఈ పదాన్ని తప్పుగా పలికానే’ అనుకుంటాను. బాలు (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం) సార్ చాలా హెల్ప్ చేశారు. పదాలు తప్పుగా పలికినప్పుడు ఆయన అక్కడికక్కడే సరిదిద్దేవారు. అలాగే కీరవాణి, కోటి, మణిశర్మ వంటి సంగీతదర్శకులు ఎవరి ట్రాక్‌ని వారితో విడిగా పాడించకుండా, బాలు సార్, నా కాంబినేషన్లోనే అన్ని పాటల రికార్డింగ్నీ ప్లాన్ చేసేవారు. దాదాపు పది, పదిహేనేళ్లు అలా ఆయనతో కలిసే పాడాను. ► నలభై రెండేళ్లుగా పాడుతున్నారు. వాయిస్‌ని కాపాడుకోవడానికి చాలా శ్రద్ధ తీసుకుంటారా? ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. నేను చేసేవి వేరేవాళ్లకు నప్పకపోవచ్చు. ఉదాహరణకు బాలూగారు ఐస్‌క్రీములు అవీ తినేవారు. రికార్డింగ్ అప్పుడు నేను ఫ్లాస్క్‌లో వేడినీళ్లు తీసుకెళతాను. కానీ సార్ బాటిల్లో చల్లని నీళ్లే ఉండేవి. ఆయనకు అది సరిపడింది. నేను ఫ్లయిట్లో, కారులో వెళ్లేటప్పుడు చెవులకు దూది పెట్టుకుంటాను. చల్లగాలి తగలకూడదని ముక్కు కూడా కవర్ చేసుకుంటాను. ‘ఇంత అతి జాగ్రత్త ఎందుకు? వర్షంలో కూడా తడవాలి. అన్నింటికీ అలవాటుపడాలి. లేకపోతే త్వరగా ఇమ్యూనిటీ పోతుంది’ అని బాలూ సార్ అనేవారు. నిజానికి నాకిలా జాగ్రత్త అలవాటైంది (కేజే ఏసు) దాసన్న వల్లే! కారులో వెళ్లేటప్పుడు తలకి గట్టిగా గుడ్డ కట్టుకుంటారాయన. చెవులు కవర్ చేసుకుంటారు. ఆయనతో ఎక్కువగా ట్రావెల్ చేశాను కాబట్టి నాకు అలవాటైంది. దానికి భిన్నంగా వెళదామంటే ఏమైనా అవుతుందని భయం. పైగా, నాకు పరిశుభ్రత పిచ్చి. ► ఓసీడీ కాదు కదా? అలాంటిదే (నవ్వుతూ). నేను ఉండే పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉండాలని కోరుకుంటాను. రికార్డింగ్‌కి, కచ్చేరీలకు వెళ్లినప్పుడు అందరం ఒకే మైక్ వాడతాం. అది నాకు ఇబ్బందిగా ఉంటుంది. అప్పటివరకూ ఆ మైక్ దగ్గరగా నిలబడి ఎవరో ఒకరు పాడి ఉంటారు కదా! ఆ ఫీలింగ్ రాగానే ఏదోలా ఉంటుంది. ఇప్పుడు కరోనా అని అందరూ బ్యాగుల్లో శానిటైజర్లు పెట్టుకుంటున్నారు. కానీ కొన్నేళ్లుగా నా బ్యాగులో శానిటైజర్ పెట్టుకుంటున్నాను. నేను పాడే ముందు మైక్‌ని శుభ్రంగా శానిటైజర్‌తో తుడిచి, ఆ తర్వాతే పాడతా. హైదరాబాద్‌లో ఒక షోలో ఎవరికో మైక్ కావాల్సి వస్తే, నా దగ్గరున్నది అడిగారు. ‘క్లీన్ చేశాను.. ఎలా ఇవ్వాలా?’ అని ఆలోచిస్తుంటే ‘ఆవిడ ఇవ్వదుగాక ఇవ్వదు. ఇప్పుడే మైక్‌కి స్నానం చేయించింది’ అని బాలూ సార్ సరదాగా అన్నారు. నాతో పాటు మా అమ్మాయిని కూడా తీసుకెళ్లేదాన్ని. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లయిట్ దగ్గరకు బస్సులో తీసుకెళతారు. ఆ బస్సు కడ్డీలు పట్టుకుంటుందని, ఎస్కలేటర్ అవీ ఎక్కేటప్పుడు పట్టుకుంటుందని తన కోసం సెపరేట్‌గా శానిటైజర్ పెట్టుకునేదాన్ని. ► చివరిగా బాలూగారిని ఎప్పుడు కలిశారు? ఆయన ఆస్పత్రిలో చేరాక మాట్లాడారా? 2019 డిసెంబర్లో మలేసియాలో ఒక కాన్సర్ట్ చేశాం. చివరిగా ఆయన్ను నేను కలిసింది అదే. ఆ తర్వాత కరోనా టైమ్‌లో బాలూగారు ఇంట్లో ఖాళీగా లేని విషయం మీ అందరికీ తెలిసిందే. కరోనా నేపథ్యంలో పాటలవీ చేశారు. కరోనాకు సంబంధించి తెలుగులో ఉన్న ఒక పాటను ‘కొంచెం మలయాళంలో ట్రాన్స్‌లేట్ చేసి పెడతావా’ అని ఫోన్ చేశారు. ‘చేసి పెడతావా కాదు.. నాకిది చేసి పెట్టు అని అడగాలి మీరు’ అని, చేసిచ్చాను. అలాగే కోవిడ్ టైమ్‌లో ఆయన మ్యూజిక్‌లో మా ఇంట్లో ఉండి నేను కూడా ఒక పాట రికార్డ్ చేసి, పంపాను. ఆ తర్వాత బర్త్‌డే సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పినవాళ్లందరికీ సార్ మెసేజ్ పెట్టాలనుకున్నారు. తెలుగులో ఆయన మాట్లాడిన మాటలను మలయాళంలో ట్రాన్స్‌లేట్ చేసి, వాయిస్ పెట్టమంటే, చేసిచ్చాను. అదే చివరిగా నేను ఆయనతో మాట్లాడింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫేస్బుక్లో కరోనా పాజిటివ్ అని బాలూ సార్ పెట్టిన వీడియో చూసి, ‘ఎలా ఉన్నారు?’ అని మెసేజ్ పెట్టాను. ‘ఏం ఫరవాలేదు... మైల్డ్‌గా ఉంది’ అని మెసేజ్ పెట్టారు. యాక్చువల్‌గా బాలూ సార్ వెళ్లిన ప్రోగ్రామ్‌కు నన్నూ రమ్మన్నారు. అయితే ఈ కరోనా టైమ్‌లో జర్నీ వద్దని మా ఆయన అనడంతో నేను వెళ్లలేదు. ‘యువర్ డెసిషన్ వజ్ రైట్’ అని సార్ మెసేజ్ పెట్టారు. ఇక ఆ తర్వాత ఆయనతో మాట్లాడలేదు. ఇలా జరుగుతుందని నేనస్సలు ఊహించలేదు. ఇప్పటికీ ఏదో ఒక ఊళ్లో సుఖంగా పాటలు పాడుతూ ఉన్నారనే భావిస్తూ ఉంటాను. ► మీ ప్రయాణం మొత్తం ఇల్లు, రికార్డింగ్ స్టూడియో చుట్టూనే తిరుగుతోంది. ఏదైనా త్యాగం చేసిన ఫీలింగ్? పశ్చాత్తాపం ఏమైనా? పశ్చాత్తాపం ఏమీ లేదు కానీ ఫ్యామిలీలో జరిగే ముఖ్యమైన వేడుకలకు వెళ్లడానికి కుదిరేది కాదు. ఇంట్లోవాళ్లకు, బంధువులకు బాధ అనిపించడం సహజం. నాకూ బాధగానే ఉండేది. అయితే పోను పోను నా బిజీ అందరికీ అర్థం అయింది. నాకు నచ్చిన వృత్తి ఇది. అందుకని ఈ బిజీని ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి కెరీర్ ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతగా ఉంటాను. లైఫ్‌లో చిన్న, పెద్ద కష్టాలుంటాయి. వీటిని దాటేలా చేసింది ఈ సంగీతమే. ఇక త్యాగం గురించి చెప్పాలంటే.. త్యాగం నాది కాదు. నా కుటుంబానిది. నేను ఒంటరిగా ఎక్కడికీ వెళ్లను. మా నాన్నగారు ఓరల్ కేన్సర్‌తో చనిపోయారు. కేన్సర్‌తో బాధపడుతున్న సమయంలోనూ నొప్పి బయటకు కనపడనివ్వకుండా, మందులు వేసుకుని నాకు తోడుగా రికార్డింగ్ స్టూడియోకి వచ్చారు. ఆయనది త్యాగం. నా జీవిత భాగస్వామి నేనే వండి పెట్టాలని, వడ్డించాలని ఎదురుచూడలేదు. ఒక దశ తర్వాత నా కెరీర్ కోసం తన కెరీర్‌ని మానుకున్నారు. త్యాగం ఆయనది. నా కూతురి (కీ.శే. నందన)తో నేనెక్కువ టైమ్ గడపడానికి కుదిరేది కాదు. రికార్డింగ్ ముగించుకుని ఇంటికి లేట్‌గా వెళ్లినప్పుడు నాన్నతో నిద్రపోయేది. నందనని మా అక్క కూడా చూసుకునేది. అమ్మని మిస్సయిన నా కూతురిది కూడా త్యాగమే. అందరూ త్యాగం చేయడంవల్లే నేను ఇంత ఎదగగలిగాను. ► మీరు వచ్చేనాటికే సుశీల, జానకిగార్లు ఉన్నారు. ఏదైనా అభద్రతాభావం ఉండేదా? సింగర్ అవ్వాలన్నది నా లక్ష్యం కాదు. మ్యూజిక్ నేర్చుకుని ఏదైనా స్కూల్లోనో, కాలేజీలోనో మ్యూజిక్ టీచర్ అవ్వాలని ఉండేది. సినిమాలకు అవకాశం రావడంతో వచ్చాను. ఒక్కోటిగా వరుసగా అవకాశాలు రావడంవల్ల గాయనిగా స్థిరపడ్డా. అప్పటికి నేను ఎంఏ ఫస్ట్ ఇయర్. ఎక్కడికీ ఒంటరిగా వెళ్లింది లేదు. అమ్మానాన్న జాబ్ చేస్తున్నారు. నాన్న అనారోగ్యం బారినపడిన తర్వాత ఇంట్లో ఒకొక్కరుగా వంతులు వేసుకుని నాతో పాటు వచ్చేవారు. నా సంపాదనంతా మా ఫ్లయిట్ టికెట్లకే సరిపోయేది. డబ్బు మీద కూడా నాకంత ధ్యాస లేదు. ‘అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఇచ్చింది కాదనకూడదు’ అని నాన్న ఎంకరేజ్ చేశారు. ► పెళ్లయ్యాక మీకు తోడుగా మీ భర్త వస్తున్నారు.. మీ పెళ్లి విశేషాలు చెప్పండి? మాది ఎరేంజ్డ్ మ్యారేజ్. ఆయన ఇద్దరు చెల్లెళ్లు బాగా డ్యాన్స్ చేస్తారు. ఒక చెల్లెలు, నేను స్కూల్మేట్లం. తను డ్యాన్స్ చేస్తే నేను పాడేదాన్ని. వాళ్లింటికి కూడా వెళ్లింది లేదు. అయితే రెండు కుటుంబాలకు పరిచయం ఉంది. పెద్దవాళ్లే మాట్లాడి మా పెళ్లి చేశారు. నా హజ్బెండ్ ఆర్ట్ లవర్. మా అత్తగారు వీణ బాగా వాయిస్తారు. ► ఇంత సింపుల్‌గా ఉంటారు, ఇంత బాగా పాడతారు కాబట్టి ‘చిత్ర మనింటి అమ్మాయి’ అని ఇతర భాషలవాళ్లతోనూ అనిపించుకున్నారు... థ్యాంక్యూ. యాక్చువల్లీ ఈ మాట నాతో చాలామంది అన్నారు. నాకూ ‘మీ అందరి ఇంటి అమ్మాయి’ అనిపించుకోవడమే ఇష్టం. నన్ను ప్రత్యేకంగా చూడటం నాకిష్టం ఉండదు. ► మీ ఏకైక కుమార్తె నందనను జాగ్రత్తగా చూసుకున్నారు. దురదృష్టవశాత్తూ తను దూరమైంది. ఆ బాధను అధిగమించడానికి సంగీతం హెల్ప్ అయిందా? వేరే బాధను అధిగమించవచ్చు కానీ ఈ బాధను అధిగమించలేకపోయాను. అది లోలోపల అలా ఉండిపోయింది. అంతే. అయితే సంగీతం ఒక ఊరటనిస్తుంది. నా పరిస్థితుల్లో ఇంకో అమ్మాయి ఒకవేళ వేరే వృత్తిలో ఉండి ఉంటే తేరుకుని నిలబడగలిగేది కాదేమో! నాకు ఇష్టం ఉన్నా, లేకపోయినా మిగతావాళ్ల కోసం నేను బతికి తీరాలి. ఎందరో త్యాగం చేస్తే నేనీ స్థాయికి వచ్చాను. ఆ దుర్ఘటన జరిగాక నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఒక ఐదు నెలలు వేరే ప్రపంచంలో ఉన్నట్లుగా అయిపోయాను. ఇక మ్యూజిక్ వద్దనుకున్నాను. ఆ టైమ్‌లో నాకు వేరేవాళ్ల జీవితంలో జరిగిన విషయాలను చెప్పి, మా వాళ్లు కౌన్సిలింగ్ చేశారు. నేను ఒంటరిగా వెళ్లను అనే కారణంతో నా కోసం నా కుటుంబ సభ్యులందరూ త్యాగం చేశారు. మా ఆయన్నే తీసుకోండి... ఆయనది చక్కని కెరీర్. అయితే నాకు తోడుగా రావాల్సి వచ్చినందువల్ల తన కెరీర్‌ని త్యాగం చేశారు. కానీ షాక్‌లో ఉన్న నాకు ఇవేం పట్టలేదు. ‘నిన్ను నమ్మి రికార్డింగ్ స్టూడియోలో స్టాఫ్ ఉన్నారు. వాళ్ల కోసం పాటలు పాడాలి’ అంటూ మావాళ్లు నాకు ఎన్నో రకాలుగా చెప్పారు. మా అక్క, మరదలు మా ఇంట్లోనే ఐదారు నెలలు ఉన్నారు. నన్ను రికార్డింగ్ స్టూడియోకి దగ్గరుండి తీసుకెళ్లి, నేను కొద్దిగా తేరుకున్నాకే వాళ్లందరూ వాళ్ల వాళ్ల ఇళ్లకి వెళ్లారు. నా చుట్టూ ఇంతమంది ఉండేలా చేసినందుకు, అలాగే నా మానసిక వేదనకు కొంత ఉపశమనం కలిగించే వృత్తిలో నన్ను ఉంచినందుకు నా ఆరాధ్య దైవం కృష్ణుడికి కృతజ్ఞతలు. బాలూ గారు రాగానే... భయపడిపోయా! కమల్‌హాసన్ సార్ ‘పున్నగై మన్నన్’ (తెలుగులో ‘డ్యాన్స్ మాస్టర్’) అనే తమిళ సినిమాలో ‘కాలకాలమాగ వాళుమ్ కాదలుక్కు’ అనే పాట బాలూ సార్‌తో నేను పాడిన మొదటి పాట. అప్పటికి ఆడియో క్యాసెట్ల మీద బాలూ సార్ ఫొటోలవీ చూశాను. పాటలు విన్నాను. అయితే ఆ సినిమా సంగీత దర్శకుడు ఇళయరాజా సార్ రికార్డింగ్‌కి పిలిచినప్పుడు నేను బాలూ సార్‌తోనే పాడబోతున్నానని తెలియదు. నేను రికార్డింగ్ స్టూడియోలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఆయన వచ్చారు. చాలా భయపడిపోయాను. నాకు అప్పుడు తమిళం కూడా రాదు. అయితే బాలూ సార్ ఎంత గ్రేట్ అంటే.. తనకే అన్నీ వచ్చని, తను సీనియర్ అనీ వేరేవాళ్లను తక్కువ చేయరు. దాస్ (కేజే ఏసుదాస్) అన్నతో నాకు పరిచయం ఉంది. ఆయనతో ఎన్నో కచేరీలు చేశాను. కానీ బాలూ గారితో పరిచయం లేకపోవడంతో టెన్షన్ పడ్డాను. మిగతా అందరితో ఆయన ఫ్రెండ్లీగా మూవ్ అయిన విధానం చూడగానే నా టెన్షన్ మొత్తం పోయింది. నాతో చాలా కూల్‌గా మాట్లాడారు. మర్యాద పెరిగిపోయింది. తప్పులు పాడినా సరిదిద్దుతారనే నమ్మకం ఏర్పడింది. ఎస్పీబీతో... జానకమ్మ వచ్చి... ‘ఏం నవ్వలేదు’ అన్నారు! నేను బిడియస్తురాలిని. కొన్ని పాటల్లో నవ్వాల్సి వస్తుంది కదా. ఆ పాటలను స్టేజీ మీద పాడుతున్నప్పుడు నవ్వు వచ్చే చోట ఆపేసేదాన్ని. అలా ఒక వేదిక మీద పాడుతున్నప్పుడు నవ్వలేదు. ఆ తర్వాత బ్యాక్ స్టేజీకి వెళ్లినప్పుడు (గాయని) జానకమ్మ ‘అదేంటీ.. అక్కడ నవ్వాలి కదా.. ఎందుకు నవ్వలేదు’ అంటే, ‘అమ్మా.. నవ్వాలంటే నాకు సిగ్గనిపించింది’ అంటే ఆమె ఒక సలహా ఇచ్చారు. ‘నీకు అంతగా బిడియంగా ఉంటే నీ ముందూ వెనకాల ఎవరూ లేరనుకో. నువ్వూ, మైక్ మాత్రమే ఉన్నట్లుగా భావించుకో’ అన్నారు. అప్పటి నుంచి అలాగే చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికీ కొంచెం సిగ్గుపడతాను కానీ ముందు ఉన్నంత కాదు. ఇళయరాజా సార్ కంపోజిషన్‌లో ‘వనజ – గిరిజ’లో ‘ఒత్తయిలే నిన్నదెన్న ఎన్ మన్న వనే’ అనే పాట, ‘సతీ లీలావతి’లో ‘మారుగో మారుగో మారూగయీ’ పాటలు పాడినప్పుడు ‘ఇవి నీ టైప్ పాటలు కాదు. నేనిక్కడుంటే నువ్వు పాడవు’ అని వెళ్లిపోయారు. ‘మారుగో..’లో కోవై సరళలా డైలాగ్ చెప్పాలి. ఆ పాటలో ఆవిడ ఉంటారు. ఆ వాయిస్‌ని మ్యాచ్ చేయాలని చెప్పి రాజా సార్ వెళ్లిపోయారు. ఆ పాటలు బాగా పాడాను. జానకమ్మతో... – డి.జి. భవాని -
సాక్షి జర్నలిస్టులకు అవార్డులు
ఇండీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గతేడాది హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు సినిమా జర్నలిజమ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కొందరు పాత్రికేయులకు బుధవారం హైదరాబాద్‌లో అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పత్రిక సినిమా పేజ్ ఇన్చార్జ్ డి.జి. భవాని, ‘సాక్షి’ టీవీ ఫిల్మ్ కరస్పాండెంట్ నాగేశ్వరరావు, ‘సాక్షి’ టీవీ డిప్యూటీ బ్యూరో చీఫ్ జోయల్‌లను ఇండీవుడ్ సంస్థ నిర్వాహకులు అవార్డులతో సత్కరించారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, దర్శకుడు ఎన్. శంకర్, ‘ఇండీవుడ్’ సోహన్ రాయ్, టీఎఫ్‌సీసీ చైర్మన్ మురళీమోహన్ రావు చేతుల మీదుగా ‘సాక్షి’ ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు. ‘‘ఈ ఏడాది ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’ డిసెంబర్ 1 నుంచి 4 వరకూ హైదరాబాద్‌లో జరుగుతుంది’’ అని సోహన్ రాయ్ తెలిపారు. -
స్త్రీలక్ష్మి
కడుపు నిండా కష్టాల కాయలే.. అందుకే పండలేదు! అక్కాచెల్లెళ్ల బాధ్యతలు... తమ్ముళ్ల జీవితాలు నిలబెట్టాలనుకోవడంతోనే... సగం జీవితం జారిపోయింది. కుటుంబాన్ని పోషించడానికి మాత్రమే... పాత్రల్ని పోషించాల్సి వచ్చింది! శ్రీలక్ష్మి జీవితంలోని కష్టం తెలుసుకుంటే... కడుపుబ్బా నవ్వించే ఆమెలో కడలిని మించిన స్త్రీలక్ష్మి ఉందనిపించింది. నవ్వు వెనక ఇంత తడి ఉంటుందని మీరూ తెలుసుకోండి... తెలుగు చిత్రసీమలో సూర్యకాంతం, ఛాయదేవి తర్వాతి తరంలో రమాప్రభ, ఆ తర్వాత శ్రీలక్ష్మి... మీ తర్వాత ఆ స్థాయిలో ఏలిన తెలుగు లేడీ కమెడియన్లు కనిపించరేం? శ్రీలక్ష్మి: రమాప్రభగారి తర్వాత నేనంటే హ్యాపీగా ఉంది. నేనూ, ఆవిడా కలసి చాలా సినిమాల్లో నటించాం. ఓసారి రమాప్రభగారు ‘నా తర్వాత నువ్వేనే’ అన్నారు. అప్పట్లో నాకు మంచి క్యారెక్టర్లు దక్కాయి. అందుకే మంచి పేరు తెచ్చుకోగలిగాను. అది నా అదృష్టం. మా తర్వాత లేడీ కమెడియన్లు అంతగా ఎందుకు ఏలలేకపోయారంటే... ఇప్పుడంతా టీ డికాషన్ టైపు. ఫస్ట్ టైమ్ టీ పెట్టినప్పుడు డికాషన్ చిక్కగా ఉంటుంది. మళ్లీ మళ్లీ ఫిల్టర్ చేస్తే చిక్కదనం తగ్గుతుంది. ఇండస్ట్రీలో ఎక్కువమంది ఆర్టిస్టులు వచ్చే కొద్దీ, చిక్కదనం తగ్గింది. మనం ఏమీ చేయలేం. ఈ తరంలో లేడీ కమెడియన్లు ఎవరున్నారో కూడా నాకు తెలీదు. కోవై సరళగారు వచ్చారు. కానీ, ఆవిడ తమిళ ఆర్టిస్టు కాబట్టి తెలుగు ఆర్టిస్టుగా చూడకూడదు. జంధ్యాలగారి సినిమాల్లో మీరు అద్భుతం. మీ కాంబినేషన్ గురించి ఏం చెబుతారు? మా కాంబినేషన్ గురించి నేను కలలో కూడా ఊహించలేదు. పది సినిమాల్లో హీరోయిన్గా నటించాను. ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. ‘రెండు జళ్ల సీత’లో మా తమ్ముడు రాజేశ్ ఓ హీరో. అందులో ఓ కామెడీ క్యారెక్టర్ ఇస్తే, సరేనని చేశా. దాన్ని ప్రేక్షకులందరూ రిసీవ్ చేసుకున్నారు. క్యారెక్టర్ పెద్ద హిట్టు. దాంతో వరుసగా కామెడీ క్యారెక్టర్లు వచ్చాయి. అప్పుడు జంధ్యాలగారి సినిమాలే ఓ ఐదారు చేశాను. విశ్వనాథ్‌గారు, రాఘవేంద్రరావుగారు, దాసరిగారు, కోదండరామిరెడ్డిగారు, ఈవీవీగారు, రేలంగి నరసింహారావుగారు, ఎస్వీ కృష్ణారెడ్డిగారు.. ఇలా అగ్ర దర్శకులందరి సినిమాలూ చేయడంతో నాకు పెద్ద పేరొచ్చింది. అయితే చేతి నిండా సంపాదన అన్న మాట. ‘బ్లాక్ మనీ’ ఉంటే ఇప్పుడు ఇబ్బందులు తప్పవు..! (నవ్వుతూ..) ఎంత బిజీగా ఉన్నా మోదీ పరిపాలనలా ఉండేది. ఐదు, పది వేలకు మించి పారితోషికం ఇచ్చేవాళ్లు కాదు. దాంతో నో బ్లాక్, ఓన్లీ వైట్. ఇప్పుడు మోదీ గారు పెద్ద నోటు రద్దు చేసి, నాకు మా పాత రోజులను గుర్తు చేశారు. హీరోయిన్గా ఎన్ని సినిమాలు చేశారు? తెలుగులో దేవదాస్ కనకాల గారి దర్శకత్వంలోని ‘పుణ్యభూమి కళ్లు తెరిచింది’, తమిళంలో ‘స్పరిశం’, ‘జో డిపురా’, మలయాళంలో ఓ మూడు సినిమాల్లోనూ హీరోయిన్గా చేశా. కానీ, అవేవీ పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ‘నేను హీరోయిన్’ అని మీరు ఫిక్స్ అయినా, ప్రేక్షకులు మాత్రం ‘కమెడియన్’ అని ఫిక్స్ చేశారు. అప్పుడెలా ఫీలయ్యారు? కమెడియన్‌గా ఫిక్స్ చేశారు కాబట్టే ఆ హీరోయిన్ మీ ముందు కూర్చొని మాట్లాడుతోంది. కామెడీ క్వీన్‌గా ఏలుతున్న టైమ్‌లో ‘అయ్యో.. హీరోయిన్ ఫీచర్స్ అన్నీ ఉండి, మీరు హీరోయిన్ అవ్వలేదు’ అని ఎవరైనా అన్నా పట్టించుకునేదాన్ని కాదు. ఒకవేళ వాళ్లు మనస్ఫూర్తిగా ఆ మాట అన్నా, ‘హీరోయిన్గా నన్నెవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదో మాట్లాడి నేను ఫీలయ్యేలా చేసి, నాకు ఏవేవో గుర్తు చేసి ఉన్నది చెడగొట్టడానికి మాట్లాడుతున్నారు’ అని మనసులో అనుకునేదాన్ని. నేను ఫీలైంది ఏంటంటే... 30 ఏళ్లకు పైగా అందర్నీ నవ్విస్తూ, నేనూ నవ్వుతున్నాను. హీరోయిన్గా చేసి ఉంటే తాత్కాలిక ఆనందం, అదృష్టం దక్కి ఉండేవేమో. ఐదేళ్లు లేదా పదేళ్లలో కనుమరుగయ్యేదాన్ని. ఇప్పటివరకూ ఉండేదాన్ని కాదు. ఆడియన్స్ నన్ను కమెడియన్‌గా ఆదరించడం నాకు ప్లస్ అయింది. సుత్తివేలు, సుత్తి వీరభద్ర రావుతో మీ కాంబినేషన్ బాగుంటుంది. ఆ కాంబి నేషన్ పోయాక అవకాశాలు తగ్గాయా? ఏం తగ్గలేదు. సుత్తివేలు, వీరభద్రరావు, నేను - అదో టైమ్. తర్వాత నూతన ప్రసాద్, బాబూ మోహన్, బ్రహ్మానందం, నేను - అదో టైమ్. ఏ కాంబినేషన్ క్రేజ్ దానిదే. రెండు తరాల కమెడియన్లతో నటించా. మూడు పదుల కెరీర్ తర్వాత ఇప్పుడూ బిజీగా ఉండాలనుకుంటున్నారా? అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. రెండోసారి, మూడోసారి వచ్చినా అంతకు ముందు ఉన్నంత అదృష్టం రాదు. మళ్లీ అంతే బిజీ కావడం అనేది జరగదు. ఆ టైమ్‌లో శ్రీలక్ష్మి బెస్ట్ కమెడియన్‌గా అందరి మనసుల్లో చోటు దక్కించుకుందనేది పెద్ద విషయం. నేను చచ్చేంత వరకూ ఆ పేరు ఉంటుంది. కోట్లు కోట్లు కూడగట్టుకోలేకపోయినా అభిమానుల నుంచి బోల్డంత ప్రేమ దక్కించుకున్నాను. అది చాలు. మీ నాన్నగారు అమరనాథ్ ఆర్టిస్టు కదా! (మధ్యలోనే అందుకుంటూ...) ఆయన హీరో. సుమారు ఓ వంద సినిమాలు చేశారు. ‘అమర సందేశం’, ‘దక్షయజ్ఞం’, ‘వదినగారి గాజులు’, ‘చెరపకురా చెడేవు’ వంటి మంచి మంచి సినిమాలు చేశారు. మీ నాన్నగారు పోయాక ఆర్థిక ఇబ్బందుల వల్ల మీరు సినిమాల్లోకి వచ్చారట. వంద సినిమాల హీరో కూతురికి కష్టాలా? నాన్నగారు బాగా సంపాదించారు. మేం ఎండలో వెళితే కందిపోతామని ఆయన టెన్షన్ పడేవారు. చాలా బాగా పెంచారు. నిర్మాతగా ‘మగవారి మాయలు’, ‘అమరజ్యోతి’ వంటివి తీసి నష్టపోయారు. మేం పెరిగే టైమ్‌కి (1965లో) ఆయన రిటైర య్యారు. 1980 ఫిబ్రవరిలో మరణించారు. నేను మార్చిలో పరిశ్రమకు వచ్చాను. నాన్నగారు చనిపోయిన ఓ నెలలో ముఖానికి మేకప్ వేసుకోవలసిన పరిస్థితి. అప్పుడు చిత్ర పరిశ్రమపై ఆసక్తీ, ఇటు రావాలనే ధ్యాస కూడా లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాను. ఒకవేళ చిత్రసీమకు రాకపోయుంటే ఏం చేసేవారు?z చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, హౌస్‌వైఫ్‌గా ఉండేదాన్ని. మరి... ఆ ఫ్యామిలీ లైఫ్ మిస్ అయ్యాననే ఫీలింగ్ ఉందా? ఉందనుకోండి. ఫ్యామిలీ లైఫ్ లేకుండా లేదు, అదీ ఉంది. కానీ, సినీ ఫీల్డ్‌లోని మహిళల ఫ్యామిలీ లైఫ్ వేరు. భర్త ఉద్యోగం చేస్తుంటే, కేవలం హౌస్ వైఫ్‌గా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం... ఆ లైఫ్ వేరు కదా! నాన్నగారు పోయిన తర్వాత, ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకుని నా దారిన నేను వెళ్లాలనుకోలేదు. ఆయన బాధ్యతలను భుజాన వేసుకున్నాను. ఒకవేళ నా స్వార్థం చూసుకుంటే... ఈ రోజు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సెటిల్ అయ్యేవారు కాదు. వాళ్లందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. వాళ్లను చూసి నేను హ్యాపీ. మీరెంత మంది? మా అమ్మగారికి చాలామంది సంతానం. అందులో ఎనిమిది మంది మాత్రమే బతికాం. నాన్నగారు పోయే నాటికి అందరం చిన్న పిల్లలమే. అక్క తర్వాత నేను. ఆ తర్వాత తమ్ముళ్లూ, చెల్లెళ్లు. అందరూ పెళ్లి చేసుకుని ఓ స్టేజికి వచ్చేవరకూ నా బాధ్యతలు నెరవేర్చా. ఓ అక్కగా మీరు నిలబడ్డారని మీ తోడబుట్టినవాళ్లకు అభిమానం ఉంటుందా? ఉండనవసరం లేదు. ఆ ప్రేమాభిమానాలు ఆవగింజంత ఉన్నా ఫరవాలేదు. నేను ఏం అనుకుంటున్నానంటే... నేను డ్యూటీ కింద చేశా. నా డ్యూటీ పూర్తైది. ఎవరో ఏదో చేస్తారనో, అభిమానంగా చూస్తారనో, అభినందిస్తారనో చేయలేదు. నాన్నగారు మరణించడంతో భగవంతుడు నాకో డ్యూటీ వేశాడనుకున్నాను. అది నిర్వర్తించాను. ఇప్పుడు ఎవరి జీవితాలను వాళ్లు చూసుకుంటున్నారు. నాకు బాధ్యతలు ఏమీ లేవు. ప్రతిఫలం ఏమీ ఆశించకుండా మీరు చేసినప్పుడు, అవతలి వ్యక్తులు మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలని కోరుకోవడం తప్పు కాదేమో? ప్రేమగా చూసుకోమని నేను చెప్పకూడదు కదా! నాకు మాత్రం మావాళ్లంటే చాలా ప్రేమ. ఒకవేళ వాళ్లు ఛీ అన్నా... ఛా అన్నా.. నాకు ప్రేమ ఉంటుంది. వాళ్లకు ఉండాలనే రూల్ లేదు. ఇప్పుడు ఎవరి కుటుంబం వాళ్లది. ఎవరికీ టైమ్ లేదు. ‘నేను నీకు చేశాను కాబట్టి.. ఈరోజు నువ్వు నాకు చేయాలి’ అని రూల్స్ మాట్లాడటం కరెక్ట్ కాదు. మీ చెల్లెళ్లు, తమ్ముళ్లకు పెళ్లవుతున్నప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఎవరూ అడగలేదా? అడిగారు. పెళ్లి సంబంధాలు చాలానే వచ్చాయి. నా ఫ్యామిలీ ముఖ్యమనుకుని వాటిని తిరస్కరించాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ పెళ్లి చేసుకోమనలేదా? వాళ్లు ఎలా అంటారండీ! వాళ్లకూ అనే వయసు లేదు. ‘నువ్వు ఏం అనుకుంటే అది చెయ్’ అని మా అమ్మగారు అన్నారు. ఆ టైమ్‌లో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని, నటిగా కంటిన్యూ అయిపోవాలనుకున్నా. ఇప్పుడైతే.. సినీ ఫీల్డ్‌లోకి ప్యాషన్‌తో వస్తున్నారు. వచ్చీ రావడంతోనే సంపాదించుకుంటున్నారు. బాగా సెటిల్ అవుతున్నారు. పాత తరం ఆర్టిస్టుల్లో నా లాంటి చాలామంది రంగు వేసుకున్నది మా కుటుంబాల కోసమే. అలాంటి పరిస్థితి వచ్చినందుకు మేం ఫీలయ్యేవాళ్లం కాదు. మీ ఫ్యామిలీ బాధ్యతలన్నీ నెరవేర్చి ఇంత ప్రశాంతంగా ఉండడానికి ఎంత టైమ్ పట్టింది? నేను ఫీల్డ్‌లోకి వచ్చి 35 ఏళ్లు అవుతోంది. నా వరకూ నేను చేసుకోవడం, నన్ను నేను పట్టించుకోవడం గత పదీ పదిహేనేళ్లుగానే. ఇప్పుడు కాస్త ప్రశాంతమైన జీవితం గడుపుతున్నా. కెరీర్ స్టార్టింగ్‌లో మా వాళ్ల ఫ్యామిలీలు సెటిల్ కావాలని కష్టపడ్డా. లైఫ్‌లో మంచి వయసులో సరదాగా ఎంజాయ్ చేయాల్సింది పోయి.. బాధ్యతలను ఈదారన్న మాట! అవునండీ. ఉదయం షూటింగ్‌కి వెళితే.. రాత్రి వచ్చి ఎలా నిద్రపోయేదాన్నో కూడా తెలిసేది కాదు. కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు షూటింగ్ ఉంటుందా? అని ఎదురు చూసేదాన్ని. అక్కడికెళితే ఓ రిలాక్సేషన్. ఇంటికొస్తే ఏడుపొక్కటే తక్కువ. అలాగని కంటిన్యూస్‌గా పని చేసినా ఒత్తిడి అనిపించేది. ఎవరైనా రోగం రాకూడదని కోరుకుంటారు. నాకు ఏదైనా చిన్న రోగం వస్తే బాగుంటుందని బాగా బిజీగా పని చేసేటప్పుడు అనుకునేదాన్ని. మళ్లీ పెద్ద సమస్యలు రాకూడదనుకునేదాన్ని. అసలు షూటింగ్‌కే వెళ్లలేకపోతే ఇబ్బంది కదా. ఓ నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే రెస్ట్ దొరుకుతుంది. ఆ మాత్రం చిన్న రోగం చాలనుకునేదాన్ని. ఎప్పుడైనా దేవుడి మీద కోపం వచ్చిందా? నాకెందుకు ఇన్ని కష్టాలు, బాధ్యతలు అనుకున్నారా? (నవ్వుతూ...) ఎప్పుడూ దేవుణ్ణి తిడుతూనే ఉంటా! ఆయనతో నా సంభాషణ జరుగుతుంటుంది. నేను సాయిబాబాను నమ్ముతా. ఎవరూ నాకు తోడు లేరు. ఆయనే తోడు. ముందు రాఘవేంద్రస్వామిని నమ్మేదాన్ని. ఆయనను పూజించాలంటే చాలా నిష్ఠగా ఉండాలి. ఇప్పుడు ఓపిక నశించేసరికి, ఆయనను మెయిన్టైన్ చేయడం కష్టమైంది (నవ్వు). అందుకే గోడ మీద నుంచి ఆయనను దింపి, బాబాను ఎక్కించా. మీ లైఫ్ తెలుసుకున్నాక ‘ఆన్‌స్క్రీన్‌పై హీరోయిన్గా రిజక్ట్ అయినా, రియల్ లైఫ్‌లో మీరు హీరోయినే’ అనిపిస్తోంది.. (గట్టిగా నవ్వుతూ...) థ్యాంక్స్ అండీ. కష్టమైనా.. సుఖమైనా.. దేన్నైనా దేవుడి ఇచ్చిన బహుమతిగా తీసుకోవాలి. మనం తీసుకునేదాన్ని బట్టి మన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఆధారపడి ఉంటాయి. కష్టాన్నీ, ప్రతిఫలాన్నీ రెండిటినీ దేవుడు ఇస్తాడు. మనం కష్టాన్నే చెప్పుకోకూడదు. కష్టపడ్డాను కాబట్టే ప్రేక్షకుల అభిమానం, ఇంత పేరు సంపాదించుకున్నాను. జస్ట్ హౌస్‌వైఫ్‌గా ఉండి ఉంటే నేనెవరో ఎవరికీ తెలిసేది కాదు. మైనస్ ఉన్నా ప్లస్సూ ఉంది. జీవితంలో ఒకటి సాధించామనే క్రెడిట్ ఆటోమేటిక్‌గా బలం ఇస్తుంది. ఇంతమందిని నవ్వించారు. మీ లైఫ్‌లో బాగా బాధపడిన ఒక సందర్భం? చాలా సందర్భాలున్నాయి. నాన్నగారు మరణించడం అనేది పెద్ద బాధ. పిల్లలకు కష్టమనేది తెలీకుండా పెంచారు. ఆయనో పెద్ద మర్రిచెట్టు. ఆ నీడలో మేము హ్యాపీగా బతికేవాళ్లం. దేవుడు ఆ చెట్టును ఏనాడూ కూల్చడనే ధైర్యం. ఆ చెట్టు కూలిపోయిన టైమ్‌లో జీవితం అంటే ఏంటో ఏమీ తెలీదు. ఆయన లేకపోయే సరికి ప్రపంచ జ్ఞానం వచ్చింది. ఆయన ఇంత కష్టపడి మమ్మల్ని బతికించాడా? అని అప్పుడు తెలిసింది. మేం డిగ్రీలు చదవలేదు, మాకు ఉద్యోగాలు రావు. నాన్నగారి శవం ముందుంది. మా నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనేది తెలీదు. ఆ సమయంలో చాలా బాధపడ్డా. ఆ టైమ్‌లో బంధువులు హ్యాండ్ ఇచ్చేశారా? అది సహజం కదా. ఇప్పుడు మాత్రం ఎవరెవరో బీరకాయ పీచు సంబంధాలతో ఫోనులు చేస్తారు. ‘నేను మీ నాన్నగారి వైపు బంధువునమ్మా’ అంటారు. మొన్న ఓ ఫోన్ వచ్చింది. ఏదో రిలేషన్ అని చెప్పారు. ‘మాకెవరూ లేరమ్మా. మేం కష్టపడినప్పుడు ఎవరూ హెల్ప్ చేయలేదు. ఎవరూ నాకు లేరు. మళ్లీ ఫోన్ చేయకు’ అని పెట్టేశా. ఫైనల్లీ... వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది? మంచి పేరు సంపాదించుకున్నాను. దాన్ని నిలబెట్టుకుని హ్యాపీగా ఉండాలి. అవకాశాలు రాకపోతే ఆడియన్స్, ఇండస్ట్రీ మరచిపోయారేమో అనే బాధ ఉంటుంది. ‘కెరీర్ అయిపోయింది’ అని నిరుత్సాహంతో జీవితం వెళ్లబుచ్చకూడదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఎప్పుడు పిలుస్తుందో తెలియదు. అందుకే ఎప్పుడు పిలిచినా రావడానికి ప్రిపేర్డ్‌గా ఉండాలి. లోపల ఎన్ని భూకంపాలు ఉన్నా ఏమీ లేనట్లే కనిపించాలి. ఎవర్‌గ్రీన్‌గా ఉండాలి. ఇన్నేళ్ల కెరీర్లో నేను తెలుసుకున్నది ఇదే. లవ్ మ్యారేజ్ చేసుకున్నారా?.. ఎరేంజ్డా.. మీ భర్త గురించి? లవ్ మ్యారేజే చేసుకున్నాను. నేనెక్కువగా పర్సనల్ విషయాలు మాట్లాడనండి. అలా కాదు మేడమ్.. ఆయన ఆరడుగుల అందగాడా? మీ రంగుకి దీటైనవాడా? కొన్ని విషయాలు షేర్ చేసుకోండి? ఆరడుగుల హీరో అని అనను. ఒంటి రంగుకి నేను ప్రాధాన్యం ఇవ్వను. మనసు రంగు మంచిది. చాలా మంచి ఆయన. బిజినెస్ చేస్తుంటారు. మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయనే ఆశతోనే సినిమాలు చేయాలనుకుంటున్నా. భగవంతుడు ఇచ్చిన ఇల్లు ఉంది. ఉండటానికి, తినడానికి లోటు లేదు. కష్టాల్లో ఉండి యాక్ట్ చేయాలనుకోవడంలేదు. ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఒకప్పుడు బిజీ బిజీగా సినిమాలు చేశాను. ఇప్పుడు ఖాళీగా ఉండటం అంటే కష్టమే. హైదరాబాద్‌లో ఉంటే ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నట్లు ఉంటుందని మా ఆయనతో అంటే... వెళ్లమన్నారు. కష్టంగా అనిపిస్తే మాత్రం వద్దన్నారు. బాగా మెరిసిపోతున్నారు. ఏం తింటారేంటి? కమెడియన్స్‌కి ఓ అడ్వాంటేజ్ ఏంటంటే.. హీరోయిన్స్‌లా ఫిజిక్ మెయిన్టైన్ చేయాల్సిన అవసరం లేదు కదా! మెరుపుకి కారణం ఏమీ లేదండి. మేకప్ కూడా వేసుకోలేదు. ‘ఆనంద భైరవి’, ‘రెండు జళ్ల సీత’ టైమ్‌లో కూడా మేకప్ వేసుకునేదాన్ని కాదు. కాకపోతే ఆ రోజుల్లో తిండి తినేదాన్ని కాదు. దాదాపు పదేళ్లు సరిగ్గా తినలేదు. మా ఇంట్లోవాళ్లు చక్కగా బిర్యానీ తింటుంటే, నేను గోధుమ గంజి తాగేదాన్ని. ఓ యాపిల్ పండుతో సరిపెట్టుకునేదాన్ని. ఎంత కమెడియన్ అయినా మోటుగా కనిపించడకూడదు కదా! అందుకని కొంచెం మెయిన్టైన్ చేశాను. ఓ పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు తిన్నాను. మొహం మొత్తే రేంజ్లో తిన్నానంటే చూసుకోండి. దేవుడు ఏదో రూపంలో శాటిస్ఫై చేస్తాడనుకుంటా. ఆ పదేళ్లు తిండి పరంగా తృప్తిపరిచాడు. మా ఆయన అయితే ‘ఏంటి ఇలా తింటున్నావ్’ అనేవారు. ‘ఒకప్పుడు నేనెంత శాక్రిఫైస్ చేసానో తెలుసా’ అనేదాన్ని. మీ ఏజ్ ఎంత మేడమ్? మా ఆయన 50 దాటితే 50 ప్లస్.. 40 దాటితే 40 ప్లస్ అని చెప్పమన్నారు. సో.. ఫిఫ్టీ ప్లస్‌లో ఉన్నాను. - డి.జి. భవాని -
వాళ్లకు భయపడొద్దు... - రాశీ ఖన్నా
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో రాశీఖన్నా తెలుగువారిని ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘జిల్’ సినిమాలో గోపీచంద్ పక్కన మార్కులు కొట్టేసింది. ఇప్పుడు రామ్‌తో ‘శివమ్’లోనూ, రవితేజతో ‘బెంగాల్ టైగర్’లోనూ నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ సినిమాలో కూడా కనిపించనుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న రాశీఖన్నాతో ‘సాక్షి’ చిట్‌చాట్... ♦ ఫస్ట్ ఓ జనరల్ క్వశ్చన్. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుని విద్యార్థులు చనిపోతున్నారు. ఈ సంఘటనల గురించి మీరు విన్నారా? రిషితేశ్వరి గురించి విన్నాను. టీవీ చానల్స్‌లో న్యూస్ చూశాను. చాలా బాధ అనిపించింది. ర్యాగింగ్ అనే పేరు ఎత్తడానికి వీల్లేనంతగా కఠినమైన నిబంధనలు విధించాల్సిన బాధ్యత కళాశాలలదే. అలాగే, ఫ్రెషర్స్ భయపడకూడదు. యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి. ప్రతి కళాశాలలోనూ ఓ ఫోరమ్ ఉంటుంది. ఆ ఫోరమ్‌కి కంప్లయింట్ చేయాలి. ♦ ఆత్మహత్యే సమస్యకు పరిష్కారం అంటారా? కానే కాదు. అది పిరికితనం. మనం లేకపోతే మనవాళ్లు ఏమైపోతారు? అని ఆలోచించాలి. ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చేసి మన దారి మనం చూసుకోవడం సరి కాదు. జీవితం ఎంతో విలువైనది. ♦ అత్యాచారం చేసేసి, ఆ తర్వాత అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయే అబ్బాయిలను ఊరికే వదలొచ్చా? ఇదే విషయమై సుప్రీం కోర్టు ‘పెళ్లి చేసుకున్నా.. దోషి శిక్ష అనుభవించాల్సిందే’ అని తీర్పు ఇచ్చింది.. మీరేమంటారు? ఈ తీర్పుని పూర్తిగా ఆమోదిస్తున్నాను. ‘ఎ రేపిస్ట్ ఈజ్ ఎ రేపిస్ట్’. అత్యాచారం చేసినవాణ్ణిచ్చి పెళ్లి చేస్తే అంతకన్నా ఘోరమైన పరిష్కారం మరోటి ఉండదు. ఆ అమ్మాయిని కూపంలోకి నెట్టినట్లే. ♦ సినిమాల విషయానికొస్తే... దాదాపు హీరోయిన్లే హీరోల చుట్టూ తిరుగుతారు. సో.. అమ్మాయిలను తక్కువ చేస్తున్నారేమో అంటే మీరు ఒప్పుకుంటారా? ఆడవాళ్లు ఆర్ట్లాంటి వాళ్లు. వాళ్ల అందాన్ని ఆవిష్కరించడం తప్పు కాదు. కానీ అభ్యంతరకరంగా చూపించడం తప్పు. అలాగే ప్రతి సినిమాలోనూ అమ్మాయిలు హీరోల చుట్టూ తిరుగుతారంటే నేనొప్పుకోను. పరిస్థితుల్లో మార్పొస్తోంది. సో.. కథానాయికలను గ్లామర్ డాల్స్‌లా మాత్రమే చూసే పరిస్థితి పోతుంది. ♦ పదే పదే ఓ అబ్బాయి వెంటపడితే కనికరించి ఐ లవ్ యూ చెప్పాలనిపించిన సందర్భాలేమైనా ఉన్నాయా? (నవ్వుతూ) లక్కీగా అలా ఇబ్బందిపడిపోయే సందర్భాలేవీ రాలేదు. ♦ ఇవాళ కథానాయికలు ముప్పై ఏళ్ల తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ మారుతున్నారు లేకపోతే అవకాశాల్లేకుండా మిగిలిపోతున్నారు. కథానాయికల కెరీర్‌కి లాంగ్విటీ తక్కువనే విషయంపై మీ అభిప్రాయం? ఒక్కసారి గ్లామర్ డాల్ ఇమేజ్ నుంచి బయటపడి పూర్తిగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తే అప్పుడు హీరోల్లా హీరోయిన్స్ కెరీర్‌కి కూడా లాంగ్విటీ ఉంటుంది. కథల్లో మార్పు రావాలి. అప్పుడు మొత్తం ఫిలిం కమ్యూనిటీలో మంచి మార్పొస్తుంది. ఆల్రెడీ బాలీవుడ్లో ఈ మార్పు మొదలైంది. ఇక్కడ కూడా ఆ మార్పు వస్తుందనే నమ్మకం ఉంది. ♦ మీరు ఎవరి ముందు తలవంచాలనుకుంటారు.. అమ్మ, నాన్న, గురువు, దైవం...? నన్ను ఇన్‌స్పయిర్ చేసే వ్యక్తుల ముందు నేను తలవంచడానికి వెనకాడను. అలాగే ఎవరి దగ్గరైనా మంచి విషయాలు నేర్చుకునే వీలు ఉంటే వాళ్లకు తల వంచుతాను. నాకన్నా చిన్నవాళ్లయినా సరే బెండ్ కావడానికి రెడీ అవుతాను. ♦ ఇప్పుడు మీరు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాబట్టి కోట్లు సంపాదించే అవకాశం ఉంది. మరి.. పేదవాళ్లను చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? విధి నిర్ణయం మేరకు అందరూ పుడతారు. హార్డ్ వర్క్‌తో దాన్ని మార్చుకోవచ్చు. స్వతహాగా నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా హార్డ్‌వర్కే నన్నీ స్థాయికి తీసుకొచ్చింది. పేదవాళ్లని చూసినప్పుడు జాలి కలుగుతుంది. ధనవంతులందరూ తమ సంపాదనలో ఐదు శాతం డొనేట్ చేస్తే చాలు.. పేదరికం అనే మాట వినపడదు... మెల్ల్ల మెల్ల్లగా పేదవాళ్లు కనపడరు. ♦ మరి.. మీ సంగతేంటి? సామాజిక సేవ చేస్తుంటారా? తప్పకుండా. కానీ, దాని గురించి చెప్పను. ఎందుకంటే, మనం కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదని మా అమ్మ అంటుంది. ♦ అది సరే.. తెలుగు భాష తెలియకుండా ఎలా మ్యానేజ్ చేస్తున్నారు? నాకు తెలుగు తెలియదని ఎందుకు అనుకుంటున్నారు? భాష తెలియకుండా నటించడం ఈజీ కాదు. అందుకే నా మొదటి సినిమా అప్పుడే నేర్చుకున్నాను. తెలుగు మాట్లాడతాను కానీ, బోల్డన్ని తప్పులొస్తాయి. కాకపోతే బాగా అర్థమవుతుంది. అందుకని, కష్టంగా లేదు. ♦ హిందీలో మీ ఫేవరెట్ హీరో? రణ్‌బీర్ కపూర్.. ♦ తెలుగు ఏ దర్శకుడితో సినిమా చేయాలని ఉంది? రాజమౌళి. ♦ మీరు చేయబోయే పాత్రలు... త్వరలో మీరు నన్ను పోలీసాఫీసర్‌గా చూడబోతున్నారు. ఓ చిత్రంలో ఆ పాత్ర చేస్తున్నా. నాకెప్పుడూ నాన్-గ్లామరస్ రోల్స్ అంటే ఇష్టం. ఒకవేళ గ్లామరస్ రోల్ అయితే అందులో విషయం ఉండాలి. నేను చేసే గ్లామరస్ రోల్స్‌లో విషయం ఉంటుంది. నా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ప్రేక్షకుల ప్రేమాభి మానాలు కూడా నా సక్సెస్‌కి కారణం. - డి.జి. భవాని -
దాన్ని లవ్వంటారా? ఏమో..!
ఇంటర్వ్యూ తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలచిందంటారు. అలా, రాశీఖన్నా కాపీ రైటర్ కావాలనుకుంటే దేవుడు ఆమెను హీరోయిన్ చేశాడు. ఒక్కసారి ట్రై చేస్తే ఏం పోతుంది? అనుకుని ‘మద్రాస్ కెఫే’తో కథానాయిక అయ్యారు రాశీఖన్నా. హిందీ నుంచి తెలుగుకి వచ్చి, ఇక్కడ ‘మోస్ట్‌వాంటెడ్ హీరోయిన్స్’లో ఒకరయ్యారు. ఇక, రాశీఖన్నాతో మాట్లాడదాం... ♦ మీ గురించి తెలుసుకోవాలని ఉంది? నేను పుట్టి, పెరిగింది, చదువుకున్నది ఢిల్లీలో. బాగా చదివేదాన్ని. స్కూల్లో నేనే టాపర్‌ని. ♦ టాపర్స్‌కే లేడీ శ్రీరామ్ కాలేజీలో అడ్మిషన్ వస్తుందట కదా? అవును. ఢిల్లీలో ఆ కాలేజ్ చాలా ఫేమస్. మంచి పర్సంటేజ్ వస్తేనే అడ్మిషన్ ఇస్తారు. నేను ఇంగ్లిష్ ఆనర్స్ చేశాను. అడ్వర్టయిజింగ్ ఫీల్డ్‌లో కాపీ రైటర్‌గా చేయాలన్నది నా కోరిక. ఓ మోడలింగ్ ఏజెన్సీవాళ్లు అడిగితే, మోడల్‌గా చేశాను. అట్నుంచి సినిమాల్లోకి వచ్చాను. హిందీ చిత్రం ‘ముంబయ్ కేఫ్’తో కథానాయికగా పరిచయమయ్యాను. ♦ మీ కాలేజీలో ఈవ్ టీజింగ్లాంటివేమైనా? అది గాళ్స్ కాలేజ్. అందుకని అలాంటివేవీ ఎదుర్కోలేదు. ♦ పోనీ.. సీనియర్స్ ఎవరైనా మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా. ర్యాగింగ్‌పై మీ అభిప్రాయం? నన్నెవరూ అల్లరిపెట్టలేదు. ర్యాగింగ్ అనేది మహా ఘోరమైన విషయం. దాన్ని నిషేధించాలి. ♦ కాపీ రైటర్ కావాలని యాక్టర్ అయ్యారు. ఎలా అనిపిస్తోంది? రెండూ క్రియేటివ్ ఫీల్డ్సే. నేను హీరోయిన్ కావాలనుకోలేదు. కానీ, దేవుడు డిసైడ్ చేశాడు. ఇప్పుడు నటన అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడిపోయింది. ♦ తెలుగు పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరవుతారని ఊహించారా? కష్టపడి పని చేస్తే, చేసే పని మీద గౌరవం ఉంటే, నిజాయతీగా వ్యవహరిస్తే విజయం వరిస్తుందని నా నమ్మకం. ♦ మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ అప్పుడు కొంచెం బొద్దుగా ఉండేవారు. ఆ తర్వాత సన్నబడటానికి కారణం? నేను బొద్దుగా ఉన్నప్పుడూ, ఇప్పుడు సన్నబడ్డాక కూడా ఇష్టపడుతున్నారు. ‘జిల్’ సినిమాలో చేసిన సావిత్రి పాత్రకు కొంచెం సన్నబడితే బాగుంటుంది... అనిపించింది. అందుకే తగ్గాను. కొంతమంది తగ్గొద్దన్నారు. అయినా... తగ్గడం అంటే అంత సులువు కాదు. వెయిట్ ట్రైనింగ్, యోగా, వాకింగ్, డ్యాన్స్ ఇలా ఎన్నో చేసి తగ్గాను. ♦ ఓకే, ఓసారి సమాజం గురించి మాట్లాడుకుందాం... ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? గుండె పగిలినంత పనవుతుంది. ఆడ, మగ అనే విషయాన్ని పక్కనపెడితే సాటి మనిషిని ఇంతలా ఎలా గాయపరచ గలుగుతున్నారు? అని ఆవేశపడి పోతుంటాను. ♦ ముఖ్యంగా మీ హోమ్‌టౌన్‌లో జరిగిన నిర్భయ సంఘటన ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. ఆ తర్వాత ఢిల్లీలో అత్యాచారాలు ఇంకా పెరిగిపోయాయ్? నిర్భయ సంఘటనకు నేను చాలా ఏడ్చాను. అసలు వాళ్లు మనుషులేనా? అనిపించింది. నా హోమ్ టౌన్ అనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆడవాళ్లపై లైంగిక దాడులు జరుగు తున్నాయి. అయితే, కొన్ని బయటకు రావడం లేదంతే. ♦ మహిళలకు ఢిల్లీ సేఫ్ అనొచ్చా? సేఫ్ ప్లేస్ అనేది ఎక్కడా లేదు. ఆడవాళ్లపట్ల మగవాళ్లకి గౌరవం ఉన్నప్పుడు, ఆడవాళ్లను ఓ వస్తువుగా చూడటం మానేసినప్పుడు ఏ ప్లేస్ అయినా సేఫే. ♦ ఒకవేళ మీరు జడ్జ్ అయితే అత్యాచారం చేసే మగవాళ్లకు ఎలాంటి శిక్ష విధిస్తారు? ఏ సామర్థ్యంతో ఇలాంటి నేరాలు చేస్తున్నారో అది లేకుండా చేయాలని తీర్పు ఇస్తా. ♦ నేరాలు ఆగాలంటే ఏం చేయాలి? కఠినంగా శిక్షించడంతో పాటు నేరగాళ్ల ఆలోచనా ధోరణిని మార్చాలి (ఆవేశంగా). ♦ కొంచెం కూల్‌గా మాట్లాడుకుందాం. మీ తొలి ప్రేమ గురించి? ఎనిమిదేళ్ల వయసులో నా క్లాస్మేట్ని ఇష్టపడ్డాను. దాన్ని లవ్వంటారో ఏమో! నాకు తెలియదు. ఆ తర్వాత ఎవర్నీ ఇష్టపడలేదు. ♦ ప్రేమను విశ్లేషించగలుగుతారా? అది అనుభవించాలి తప్ప మాటల్లో చెప్పలేం. ♦ మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? ఎరేంజ్డ్ మ్యారేజా? నచ్చిన అబ్బాయి దొరికితే ప్రేమించి, పెళ్లి చేసుకుంటా. లేకపోతే ఇంట్లోవాళ్లు చూసిన అబ్బాయిని పెళ్లాడతా. ♦ దేశ, విదేశాల్లో మీకు నచ్చిన ప్రదేశం? మన దేశంలో రిషికేష్, ఊటీ. విదేశాల్లో స్పెయిన్. ♦ ఫైనల్‌గా మీ జీవితాశయం ఏంటి? ప్రేమను పంచడం... - డి.జి. భవాని కవర్ ఫొటో: శివ మల్లాల -
స్నేహ అంతరంగావిష్కరణ
ఇంటర్వ్యూ స్నేహకి ఇప్పుడు రెండు గుండెలు. తనదో గుండె, తన కడుపులోని బిడ్డది మరోగుండె. మరో రెండు నెలల్లో ఆ ఇంట్లో ‘కువా కువా..’ శబ్దం వినిపించనుంది. ఇటీవలే సీమంతం జరుపుకున్న స్నేహ... అంతరంగావిష్కరణ ఈ ‘ఫన్డే’ స్పెషల్. ♦ అమ్మ కాబోతున్నానని తెలిసిన క్షణంలో ఏమనిపించింది? జీవితంలో ఇదో ప్రత్యేకమైన దశ. ‘మీరు అమ్మ కాబోతున్నారు’ అని డాక్టర్ నోటి నుంచి వినగానే ఒళ్లంతా పులకరించింది. జీవితంలో ఎన్నో ఆనందకరమైన సంఘటనలున్నాయి. కానీ, ఈ ఆనందం చాలా ప్రత్యేకం. ♦ ఆనందమేనా? భయం కూడానా? భయం కాదు కానీ, ఒక్కసారిగా బాధ్యత పెరిగిపోయినట్లుగా అనిపించింది. జీవితంలో అన్ని బాధ్యతల్లోకెల్లా బిడ్డని కనడం, పెంచడం పెద్ద బాధ్యత. ♦ కొంతమందిని వేవిళ్లు (వాంతులు) తెగ ఇబ్బందిపెట్టేస్తాయ్... మీకలాంటివి? అదృష్టం కొద్దీ అలాంటివేవీ లేవు. కాకపోతే, అప్పుడప్పుడు నీరసంగా అనిపిస్తోంది. అదేం పెద్ద విషయం కాదు. ♦ మొదటిసారి స్కానింగ్‌లో...? మూడో నెలలో తీసినప్పుడు నామమాత్రంగా ఓ రూపం కనిపించింది. ఆ మాత్రానికే సంతోషం పట్టలేకపోయా. ఆనందంతో ఏడుపొచ్చేసింది. ♦ బిడ్డ గుండె చప్పుడు విన్నారా? అది సో స్వీట్. ‘నీకు పుట్టబోయే బిడ్డ హార్ట్ బీట్ వింటావా’ అని డాక్టర్ అడిగినప్పుడు చాలా ఎగ్జయిట్ అయిపోయాను. లబ్ డబ్ అని శబ్దం వినగానే, నా హార్ట్ బీట్ పెరిగినంత పనైంది. అదంతా ఆనందంతోనే. ♦ నెలలు నిండే కొద్దీ...? చిన్న చిన్న కాళ్లు, చేతులు చూసి, ‘జీవితం ఎంత మాయ. ఒక మనిషిలో ఇంకో మనిషి పెరగడమా’ అనుకున్నా. అప్పటికప్పుడు ఆ కాళ్లను ముద్దాడాలని మనసు తపించిపోయింది. ♦ గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా? అక్క, వదినలను దగ్గరగా చూశాను. గర్భం ధరించినప్పట్నుంచీ, బిడ్డ పుట్టే వరకూ ఎలాంటి జాగ్రత్తలు పాటించారో, బిడ్డ పుట్టాక ఎలా పెంచారో చూశాను. ♦ బాబు కావాలనుకుంటున్నారా? పాపా? నాకూ, మా ఆయనకు (హీరో ప్రసన్న) ఎవరైనా ఓకే. ఫస్ట్ బేబీ అప్పుడు ఎవరైనా ఫర్వాలేదనుకుంటాం. మొదటిసారి బాబు పుడితే, రెండో సారి పాపను కోరుకుంటాం. అయినా మన చేతుల్లో ఏముంటుంది? ♦ ‘శ్రీరామదాసు’లో అమ్మ పాత్ర చేసే నాటికే మీరు అమ్మ అయ్యుంటే ఇంకా బాగా నటించేదాన్ని-అనుకున్నారా? లేదు, ఎందుకంటే, అప్పటికే ‘అమ్మా’ అనే పిలుపుకి నేను అలవాటు పడిపోయా. ♦ అదెలా? మా అక్క కొడుకు నన్ను ‘అమ్మా’ అని పిలుస్తాడు. బయటవాళ్లు చూస్తే, వాడు నా కొడుకే అనుకుంటారు. ♦ అత్తవారింట్లో... మా అత్తగారింటికి రాబోతున్న మొదటి గ్రాండ్ చైల్డ్ కావడంతో అంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో చాలామందికి ఏవేవో తినాలపిస్తుందట. నాకు మాత్రం ఏమీ తినాలనిపించడం లేదు. మా అత్తగారైతే నేనేం కావాలంటే అది చేసి పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ♦ మరి... మీ భర్త గురించి? ఆయనైతే మరీనూ. కాలు కిందపెడితే కందిపోతానేమో అనే టైప్‌లో చూసుకుంటున్నారు. ఇలా ఇంట్లో అందరూ ప్రత్యేకంగా చూడటం భలే ఉంటుంది. అందుకే, ఈ దశ జీవితాంతం గుర్తుండిపోతుంది. ♦ పసిపిల్లలకు స్నానం... అదీ...? మా అక్క పిల్లాడికి నేనే స్నానం చేయించేదాన్ని. శుభ్రంగా స్నానం చేయించి, కాసేపు ఎండ సోకేలా బిడ్డను కాళ్ల మీద పడుకోబెట్టుకుని, ఒంటి నిండా పౌడరు వేసి, మురిసిపోయేదాన్ని. ఇప్పుడు ఎవరి సహాయమూ లేకుండా నా బిడ్డను నేనే పెంచగలుగుతాను. ♦ మీరు ప్రెగ్నెంట్ అని వినగానే అభిమానులు పటాసులు కాల్చి పండగ చేసుకున్న విషయం తెలుసా? అవునవును. ఆ ఫొటోలు మా ట్విట్టర్‌కి కూడా పంపించారు. కుప్పలు తెప్పలుగా శుభాకాంక్షల గ్రీటింగ్ కార్డ్స్ అందాయి. ‘స్నేహా సిస్టర్.. మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ జాగ్రత్తలు చెప్పారు. ఆ అభిమానానికి కదిలిపోయాను. ♦ మళ్లీ సినిమాలు చేస్తారా? అసలు కెరీర్ గురించి ఏమీ ఆలోచించడంలేదు. ఇది ఎంజాయ్ చేసే దశ. దీన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. ♦ ఓకేనండీ.. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నాం... చాలా చాలా థ్యాంక్సండీ. - డి.జి. భవాని -
రకుల్ ఫిట్ సింగ్
మై ఫిట్నెస్ మంత్ర డోంట్ టార్చర్ యువర్ బాడీ బై స్టార్వింగ్... టార్చర్ యువర్ బాడీ బై వర్కింగ్ అవుట్ రైట్. ఇంత మేకప్ పూసుకొని ఓ జత టైట్ దుస్తులేసుకొని హీరోతో రెండు స్టెప్పులు... హీరో వాళ్లమ్మతో రెండు డైలాగులు... విలన్‌తో మూడు కసుర్లు... ఇదీ సగటు హీరోయిన్ పాత్ర. కొంచెం బొద్దుగా ఉన్నా లైటింగ్‌తో మేనేజ్ చేసేయొచ్చు. అదీ కుదరకపోతే కెమెరా యాంగిల్‌తో మేనేజ్ చేసేయొచ్చు. కాని - రకుల్‌ప్రీత్‌సింగ్‌కి మాత్రం ఏ సబ్ జాన్తానై... ఐయామ్ ఫిట్ ఫర్ ద స్క్రీన్... ఫిటర్ ఫర్ లైఫ్ అంటుంది రకుల్ ఫిట్సింగ్! ఏం తినాలి, ఏం తినకూడదు... ఏం చేయాలి, ఏం చేయకూడదు ఫిట్సింగ్ మాటల్లో... ♦ ఫిట్నెస్ గురించి మీకెప్పుడు అవగాహన ఏర్పడింది? మా నాన్నగారు ఆర్మీలో ఉంటారు. అందుకని ఫిట్నెస్కి ప్రాధాన్యం ఇస్తారు. నా చిన్నప్పుడు ఆయనతో కలిసి కొన్ని వ్యాయామాలు చేసేదాన్ని. నాన్న జాగింగ్‌కి వెళ్లినప్పుడు నేనూ వెళ్లేదాన్ని. ఆ విధంగా చిన్నప్పుడే నాకు ఫిట్నెస్ మీద అవగాహన ఏర్పడింది. మోడల్‌గా చేయడం మొదలుపెట్టాక, కథానాయిక అయిన తర్వాత ఫిట్నెస్ మీద చాలా ఆసక్తి పెరిగింది. మోడల్‌గా మారిన తర్వాతే జిమ్ చేయడం మొదలుపెట్టాను. నన్ను ‘ఫిట్నెస్ సైకో’ అనొచ్చు. ♦ జిమ్ వల్ల ఉపయోగం ఏంటి? జిమ్ సెంటర్లో చెమటలు కారిపోయేలా వర్కవుట్లు చేసినప్పుడు శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ చెమట రూపంలో బయటికొచ్చేస్తాయి. అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. జిమ్ వల్ల బరువు తగ్గుతాం. అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది. అందుకే నాకు జిమ్ అంటే చాలా ఇష్టం. దానికి బానిస అయిపోయాను. ఒక్కరోజు జిమ్ చేయకపోయినా చిరాకుగా ఉంటుంది. ముఖ్యంగా జిమ్‌లో భాగంగా చేసే కొన్ని వర్కవుట్స్ తర్వాత కొంచెం నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి నాకు చాలా ఇష్టం. ♦ జీరో సైజ్ మీద ఎప్పుడైనా దృష్టి పెట్టారా? నా ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు. ఇంత ఎత్తున్నవాళ్లు జీరో సైజ్‌కి బాగుండరని నా ఫీలింగ్. నేను జీరో సైజ్ చేస్తే, తెర మీద కడ్డీలా కనిపిస్తాను. అందుకే దాని జోలికి వెళ్లను. ♦ రోజుకి ఎన్నిసార్లు ఆహారం తీసుకుంటారు? చాలా తక్కువ మోతాదులో రోజుకి ఐదారు సార్లు తింటాను. అలా కొంచెం కొంచెం తినడమే మంచిది. ఒకేసారి కంచాలు కంచాలు తింటే... సునాయాసంగా బరువు పెరిగిపోతాం. ♦ రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతారు? ఆరు గంటలు నిద్రపోతాను. అది కూడా చాలా గాఢమైన నిద్ర అన్నమాట. ఒకవేళ అంతకన్నా ఎక్కువగా నిద్రపోతే బద్ధకంగా అనిపిస్తుంది. నైట్ షూట్లో పాల్గొని తెల్లవారుజాము మూడు గంటలకు నిద్రపోయినా ఉదయం తొమ్మిది గంటలకల్లా నిద్ర లేచేస్తాను. ♦ మామూలుగా మీరు అల్పాహారం తీసుకునే సమయం? షూటింగ్ ఉన్నా లేకపోయినా ఉదయం నిద్రలేచిన అరగంటకు ఏదో ఒకటి తింటాను. అప్పటికి ఆకలికి నకనకలాడిపోతుంటా (నవ్వుతూ). ♦ వెజిటెబుల్ సలాడ్స్ తింటారా? ఆ పొరపాటు అస్సలు చేయను. ఒకప్పుడు తినేదాన్ని. ఆ తర్వాత మానేశాను. ♦ అదేంటి.. సలాడ్స్ మంచిది అంటారు కదా? అందరూ అవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. కానీ, పచ్చి కూరగాయలు తినడంవల్ల శరీరం బలహీనం అవుతుంది. ఎందుకంటే, అవి అరగడానికి చాలా సమయం పడుతుంది. దాంతో ఆకలి తెలియదు. ఆ కారణంగా ఒక పూట సరిగ్గా తినం. అసలు తినకుండా కూడా ఉండే అవకాశం లేకపోలేదు. దాంతో గ్యాస్ ఫార్మ్ అవుతుంది. బరువు పెరుగుతాం. ♦ బియ్యంలో కార్బో హైడ్రేట్స్ ఎక్కువ అనీ, అవి తినకూడదని అంటుంటారు..? కార్బో హైడ్రేట్స్ తీసుకోవడం వృథా అని కొంతమంది అంటారు. కానీ, మనం తీసుకునే ప్రోటీన్ ఫుడ్ అరగాలంటే కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి. అందుకే నేను ప్రోటీన్స్, కార్బో హైడ్రేట్స్ రెండూ ఉండేలా చూసుకుంటాను. ♦ రోజుకి ఎంతసేపు వర్కవుట్స్ చేస్తారు? దాదాపు గంటన్నర. రకరకాల వర్కవుట్స్ చేస్తాను. కిక్ బాక్సింగ్ కూడా చేస్తుంటాను. వర్కవుట్ చేసిన తర్వాత ఆకలి అనిపిస్తే ఎగ్ వైట్స్ తింటాను. ♦ వర్కవుట్స్ వల్ల మాత్రమే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు తగ్గుతుందా? మనం తీసుకునే ఆహారంలో ఉన్న కొవ్వుని కరిగించేందుకు శరీరానికి శక్తి కావాలి. ఆ శక్తి కోసం మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి. అప్పుడు వర్కవుట్ చేస్తే ఉపయోగం ఉంటుంది. అంతే తప్ప బరువు తగ్గాలని ఆహారం తీసుకోకుండా వర్కవుట్స్ చేస్తే, బలహీనంగా తయారవుతాం. ♦ వారం పొడవునా ఆహార నియమాలు పాటిస్తారా? ఆదివారం మాత్రం నియమాలు లేవు. ఆ ఒక్కరోజు మాత్రమే స్పైసీ ఫుడ్ తింటాను. బిర్యానీ, ఐస్‌క్రీమ్ అన్నీ లాగించేస్తాను. స్పైసీ ఫుడ్ రోజూ తినకూడదు. దానివల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. అసిడిటీ ఏర్పడుతుంది. మళ్లీ దాన్ని చల్లార్చడానికి ఐస్‌క్రీములూ, గట్రా తింటాం. అది హాని చేస్తుంది. ♦ షూటింగ్స్ కోసం ఊళ్లు తిరుగుతుంటారు కాబట్టి, ఓ ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోవడానికి ఎలా కుదురుతుంది? నేనెక్కడికెళ్లినా ఓ పెద్ద లగేజ్ ఉంటుంది. ఓ స్టవ్, కుక్కర్ తప్పనిసరిగా ఉంటాయి. నాక్కావల్సినవన్నీ నా కుక్‌తో చేయించుకుని తింటాను. స్టీమ్డ్ ఫిష్ ఒక్కటే బయట తెప్పించుకుంటాను. మరీ కుదరకపోతే బయటి ఫుడ్ తింటాను. అది కూడా ఆయిల్ ఫుడ్, స్పైసీవి ఆర్డర్ చేయను. - డి.జి. భవాని బ్రేక్‌ఫాస్ట్ ♦ స్కిమ్డ్ మిల్క్‌తో ఓట్స్ లేదంటే ముస్లి తీసుకుంటాను. అలాగే, త్రీ ఎగ్ వైట్స్‌తో చేసిన ఆమ్లెట్ తింటాను. ♦ బ్రేక్‌ఫాస్ట్ ఏడు గంటలకు చేశాననుకోండి మూడు గంటల తర్వాత ఏదైనా ఫ్రూట్స్ తీసుకుంటాను. కానీ, అరటిపండు మాత్రం వారానికి రెండు సార్లే తింటాను. ♦ పదింటికి పండ్లు తిన్న తర్వాత మళ్లీ ఆకలి అనిపిస్తే పన్నెండు గంటలకు డ్రై ఫ్రూట్స్ తింటాను. లంచ్ ♦ సరిగ్గా ఒంటి గంటకు లంచ్ తీసుకుంటా. ‘కిన్వా’ అనే బియ్యం ఉంటుంది. దాంతో వండిన అన్నం, పప్పు, స్టీమ్డ్ చికెన్ లేక ఫిష్ తింటాను. దాదాపు రోజూ ఇదే మెనూ. ఈవినింగ్ స్నాక్స్ ♦ లంచ్ తర్వాత రెండు గంటలకు కొన్ని ఫ్రూట్స్ తింటాను. ఒక్కోసారి స్ట్రాబెర్రీస్‌ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి, పెరుగులో వేసి, ఫ్రిజ్‌లో పెడతాను.. దాదాపు నాలుగు గంటల సమయంలో స్నాక్స్‌లా ఇవి తింటాను. ఆరు గంటల ప్రాంతంలో వేరే పండ్లు ఏమైనా తింటా. డిన్నర్ ♦ నిద్రపోయే మూడు, నాలుగు గంటలకు ముందే డిన్నర్ తీసుకుంటాను. ♦ గ్రిల్డ్ ఫిష్, ఒకటీ లేదీ రెండు రోటీలు, పాలక్, పప్పు.. ఇవన్నీ తీసుకుంటాను. ఒకవేళ ఇవేవీ దొరకని పరిస్థితిలో ఒక ఆమ్లెట్ తయారు చేయించి, రోటీలో రోల్ చేసి అది తింటాను. ఆమ్లెట్‌ను ఆకు కూర, పుట్టగొడుగులు కలిపి తయారు చేయిస్తాను. ఇది చాలా హెల్దీగా ఉంటుంది. నాకు ప్రత్యేకంగా కుక్స్ ఉన్నారు. షూటింగ్ లొకేషన్లో నాతో పాటే ఉంటారు. వాళ్లు తయారు చేసి, ఇస్తారు. -
అమ్మాయిలూ, అబ్బాయిలూ ఫెండ్షిప్ చేయరా?
కౌర్ కౌర్ మే కహానీ. హిందీలో కౌర్ అంటే ముద్ద. చార్మి కౌర్ మనకు తినిపించే ప్రతి సినిమా ముద్దలో ఒక విషయం ఉంటుంది. బెరుకు ఉండదు... ఆమె నడిపే బుల్లెట్‌కి బ్రేక్ ఉండదు. గుండెలో ఉన్న మాటకి స్పీడ్‌బ్రేకర్ ఉండదు. అడగడమే తరువాయి గన్‌షాట్‌లా సమాధానం వచ్చేస్తుంది. ‘జ్యోతిలక్ష్మీ’ ఆడియో రిలీజ్‌కి ముందు సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూ.... ఎక్స్క్లూజివ్లీ మీకోసం... ♦ లైఫ్ ఎలా ఉందండీ? మీ పేరుకు తగ్గట్టుగా చార్మింగ్‌గా ఉందా? చార్మి: అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే కొత్త కొత్తగా ఉంది. చేతి నిండా పని. ప్రొడ్యూసర్ రోల్ అంటే మాటలా మరి! సినిమా నిర్మాణం, నిర్మాణానంతర కార్యక్రమాలు... ఇలా ప్రతిదీ దగ్గరుండి చూసుకోవాలి కదా! ♦ మరి, నిర్మాతగా కష్టమనిపించడం లేదా? కాస్త కష్టమే. కథానాయికగా చేసిన ఈ పదమూడేళ్లూ చాలా సుఖంగా బతికేశానని ఇప్పుడనిపిస్తోంది. చెప్పిన టైమ్‌కి షూటింగ్‌కి రావడం, యాక్ట్ చేయడంతో బాధ్యత అయిపోయేది. ఇప్పుడలా కాదు. బోల్డంత స్ట్రెస్. కానీ, ఇది కూడా కిక్కిస్తోంది. ఎంజాయ్ చేస్తున్నా. ♦ అసలు ‘జ్యోతిలక్ష్మీ’ చేయాలని ఎందుకనుకున్నారు? ఓ నాలుగైదేళ్లుగా నేను, పూరి (పూరి జగన్నాథ్) గారు ఈ సినిమా గురించి అనుకుంటున్నాం. ‘ప్రతిదీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి’ అని నిర్మాణం బాధ్యత మొత్తం నా మీదే పెట్టేశారు పూరిగారు. నాలాంటి కొత్త నిర్మాతను నమ్మి, బాధ్యత మొత్తం ఇచ్చేయడం చిన్న విషయం కాదు. ♦ పూరి మిమ్మల్ని అంతలా ఎందుకు నమ్మారు? (నవ్వుతూ...) నా టైమ్ బాగుండి నమ్మారు. ఈ సినిమా ఆరంభించినప్పట్నుంచీ పూర్తయ్యేవరకూ, నన్ను ఏ విషయంలోనూ ఆయన ప్రశ్నించలేదు. ‘నువ్వు బాగా చేస్తావని నాకు తెలుసు’ అనేవారు. ♦ ఇప్పటివరకు పూరి జగన్నాథ్ ఎంతోమంది హీరోయిన్స్‌తో సినిమాలు చేశారు. ఆయన దర్శకత్వంలో ఒకే ఒక్క సినిమా (హిందీ చిత్రం ‘బుడ్డా హోగా తేరా బాప్’) చేసిన మీతో అంత అనుబంధం ఎలా కుదిరింది? కొన్ని కొన్ని అలా కుదిరిపోతాయ్. వాటికి కారణాలు చెప్పలేం. కానీ, పూరీగారితో ఈ అనుబంధం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంత పెద్ద దర్శకుడో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలున్నాయి. చిరంజీవిగారు, మహేశ్‌బాబు.. ఇలా వరుసగా స్టార్స్‌తో సినిమాలున్నాయి. అసలు భవిష్యత్తులో ఆయనకు నేను గుర్తుంటానో లేదో కూడా చెప్పలేం. అలాంటిది నాకు ఇప్పుడు డేట్స్ ఇచ్చారంటే నా మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ♦ అంతగా నమ్మిన పూరి.. నిర్మాతగా మీ పనితీరు చూసి ఏమన్నారు? ఏడు నెలల నుంచి ఈ సినిమాతో ట్రావెల్ అవుతున్నా. స్టోరీ సిట్టింగ్స్ నుంచి ఎడిటింగ్ వరకూ అన్ని విషయాల్లోనూ లీనమయ్యా. ‘పూరీ గారు, సి.కల్యాణ్‌గారు చాలా బాగా చేస్తున్నావ్’ అని అభినందించారు. ♦ జ్యోతిలక్ష్మీ పాత్ర కోసం బాగా సన్నబడినట్లున్నారు. ఆల్మోస్ట్ ఫుడ్ త్యాగం చేసేశారా ఏంటి? పది నుంచి పదకొండు కిలోలు తగ్గాను. కానీ, త్యాగాలేవీ చేయలేదు. నచ్చినవన్నీ తిన్నా. కాకపోతే మితంగా తిన్నా. ప్రతిరోజూ వర్కవుట్స్ చేశా. అలా బరువు తగ్గడానికి నాకు నాలుగు నెలలు పట్టింది. ♦ ‘ప్రేమ ఒక మైకం’లో వేశ్యగా చేసిన మీరు, ఈ చిత్రంలో కూడా ఆ పాత్రే చేశారేం? అయితే ఏంటండీ? ఒక సినిమాలో లవర్‌గా నటించాక మరో సినిమాలో కూడా ఆ పాత్ర చేస్తాం కదా! అలాగే, భార్య పాత్ర, తల్లి పాత్రలు రిపీట్ అవుతూనే ఉంటాయి. కానీ, వేశ్య పాత్రను మాత్రం రిపీట్ చేస్తే, ‘ఎందుకు మళ్లీ చేశారు?’ అనడుగుతారు. కథ, పాత్ర కుదిరినప్పుడు చేస్తే తప్పేంటి? అయితే, ఆ సినిమాలోని పాత్రకూ, ఈ సినిమాలోని పాత్రకూ అస్సలు పోలికే ఉండదు. ♦ వేశ్య పాత్ర చేయనున్నానని చెప్పినప్పుడు మీ అమ్మగారు ఎలా రియాక్ట్ అయ్యారు? మా అమ్మగారిది చాలా బ్రాడ్ మైండ్. ప్రొఫెషన్‌కి న్యాయం చేసే దిశలో నేనెలాంటి పాత్రలు చేసినా కాదనరు. నేను తీసుకునే నిర్ణయాల మీద ఆమెకు చాలా నమ్మకం ఉంది. ఒకవేళ నా నిర్ణయం ఎప్పుడైనా తప్పయ్యిందనుకోండి... మళ్లీ ఆ తప్పు చేయనని కూడా నమ్ముతుంది. ♦ ఈ మధ్య వరుసగా సినిమాలు చేయకుండా వెనకబడిపో తున్నారేం? నా కెరీర్ నా ఇష్టం. ఏదో రేస్‌లో ఉండాలి కాబట్టి, వరుసగా సినిమాలు చేయాలనుకోను. అసలు నేను రేస్‌లోనే ఉండదల్చుకోలేదు. మనసుకు నచ్చిన సినిమాలొస్తే చేస్తా.. లేకపోతే లేదు. ఈ మధ్యకాలంలో చాలా కథలు విన్నాను. ఏదీ నచ్చలేదు. ‘జ్యోతిలక్ష్మీ’ నచ్చింది కాబట్టి చేశా. ♦ ఇటీవల ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితమవుతున్నారు. విజయశాంతికి రీప్లేస్‌మెంటా? విజయశాంతిగారిని ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఇక, ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ అంటారా? నేను కావాలని సెలెక్ట్ చేయడం లేదు. వస్తున్నాయి కాబట్టి, చేస్తున్నాను. ఆ మాటకొస్తే, నా లైఫ్‌లో నేనేదీ ప్లాన్ చేయను. ఏది బెస్ట్ అనిపిస్తే, అది చేసుకుంటూ వెళ్లిపోతా. ♦ మీ లైఫ్‌లో పూరి జగన్నాథ్, కృష్ణవంశీ లాంటి దర్శకులు చాలా స్పెషలేమో అనిపిస్తోంది. ఆడ, మగ స్నేహాన్ని అంగీకరించేంతగా మన సమాజం ఇంకా ఎదగలేదు. అసలు వాళ్లతో మీ అనుబంధాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఓ కాల్ సెంటర్‌ని తీసుకుందాం. అక్కడ పని చేసే అమ్మాయిలూ, అబ్బాయిలూ స్నేహంగా ఉండరా? సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. అక్కడి అమ్మాయిలూ, అబ్బాయిలూ ఫ్రెండ్షిప్ చేయరా? అలాగే మా సినిమా రంగం కూడా! ఆడ, మగ స్నేహం గురించి సొసైటీ ఏమనుకుంటుందో నాకు తెలియదు కానీ, నా వరకు నాకు అందులో తప్పు లేదు. పూరీగారు, కృష్ణవంశీగారు నాకు మంచి స్నేహితుల్లాంటివాళ్లు. ♦ దేవిశ్రీప్రసాద్‌తో కూడా మీరు చాలా స్నేహంగా ఉంటారు కదా? దేవి నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ల అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు కూడా నాతో క్లోజ్‌గా ఉంటారు. దేవి మంచి హ్యూమన్ బీయింగ్. నా లైఫ్‌లో వచ్చిన అప్స్ అండ్ డౌన్స్ అన్నీ దేవికి తెలుసు. నేను డౌన్లో ఉన్నప్పుడు తను సపోర్ట్‌గా నిలిచాడు. అది జీవితాంతం గుర్తుంటుంది. ♦ మీరు ఎవరితోనైనా లవ్‌లో...? అవును. ‘జ్యోతిలక్ష్మీ’తో లవ్‌లో ఉన్నాను. ప్రస్తుతం నేను ఏడ్చినా, నవ్వినా.. అంతా ‘జ్యోతిలక్ష్మీ’కి సంబంధించే! ♦ ఈ మధ్య మీ అన్నయ్య పెళ్లి చాలా ఘనంగా చేశారు. మరి మీ పెళ్లి గురించి ఆలోచించడం లేదా? లేదు. అసలు పెళ్లి చేసుకునే మూడ్‌లోనే లేను. ఈ ఏడాది కాదు కదా... మరో రెండేళ్ల వరకూ దాని గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. ♦ మీరు కొంచెం రెబల్గానే ఉంటారనిపిస్తోంది? (నవ్వుతూ...) ఆ రోజు మూడ్ ఎలా ఉంటే అలా! సందర్భాన్ని బట్టి రియాక్ట్ అవుతుంటాను. అయితే ఒక్క విషయం స్పష్టంగా చెబుతా. నేను సున్నిత మనస్కురాల్ని మాత్రం కాదు. రెబల్ అవ్వాల్సిన చోట తప్పకుండా అవుతా. ♦ నిర్మాతగా కొనసాగుతారా? స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తారా? నిర్మాతగా కొనసాగాలనే ఉంది. చూద్దాం. కానీ, స్టార్ హీరోలతో సినిమా చేయాలంటే... డేట్స్ అంత ఈజీగా దొరుకుతాయా? ♦ చార్మి అడిగితే ఇవ్వరా? డేట్స్ ఖాళీ లేకపోతే ఎవరడిగినా ఇవ్వరు. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా సెట్ అయినంత సులువుగా అన్నీ సెట్ అవుతాయా? ఒకవేళ సెట్ అయితే హ్యాపీనే! ♦ మీరు నిర్మించే చిత్రాల్లో మీరే నటిస్తారా? బయటి హీరోయిన్లతో చేస్తారా? తప్పకుండా వేరేవాళ్లతో చేస్తా! ♦ మీలాంటి తారలు నిర్మాతలుగా కూడా కొనసాగితే, ‘ఆడవాళ్లు ఏమైనా చేయగలరు’ అని నిరూపించినట్లవుతుంది! (మధ్యలోనే అందుకుంటూ...) అవునండీ. నాక్కూడా ఆ ఫీలింగ్ ఉంది. ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదు. అందుకే, సాధ్యమైనంతవరకూ నేను నిర్మాతగా కంటిన్యూ అవుతా. ♦ చిరంజీవి 150వ సినిమాలో మీరు నటిస్తారనే టాక్ వినిపిస్తోందే!? వినపడనివ్వండి. మంచిదే కదా! ♦ ఇంతకీ ఆ సినిమాలో మీరు ఉన్నారా? లేరా? అది చెప్పను. టాక్ వినిపిస్తోంది కదా.. వింటూ ఉండండి (నవ్వుతూ). ♦ ఈ మధ్య హిందీలో సూపర్ హిట్ అయిన ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ వంటి చిత్రాలు చూశారా? వాటిని తెలుగులో రీమేక్ చేస్తే నటిస్తారా? ఆ సినిమాలు చూశాను. కంగనా యాక్టింగ్ సూపర్బ్. ఒకవేళ ఆ చిత్రాల తెలుగు రీమేక్‌కు అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. ♦ ఫైనల్‌గా మీ అందం వెనుక సీక్రెట్ చెబుతారా? ఏమీ లేదండీ... హ్యాపీగా ఉంటా. మనసులో ఒకలా బయటికి ఇంకోలా ఉండను. ఓపెన్ మైండెడ్గానే ఉంటా. ఆరోగ్యానికి మంచివనిపించేవన్నీ తింటా. చక్కగా వ్యాయామాలు చేస్తా. - డి.జి. భవాని -
హిట్ అయితే హీరో ఫట్ అయితే మేమా?
ఇంటర్వ్యూ తెలుగు తెరపై తాప్సీ కనిపించి, రెండేళ్లయ్యింది. అనువాద చిత్రాల ద్వారా కనిపిస్తున్నారే కానీ, తెలుగులో స్ట్రయిట్ చిత్రాలు చేయడంలేదు. ఎందుకని? తెలుగు పరిశ్రమపై తాప్సీ అలిగారా? ఆమెనే అడిగి తెలుసుకుందాం... మీరు చాలా మారిపోయారండీ? అదేంటి అంత మాట అనేశారు! నేనెప్పటిలా ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నాను కదా! అలా అని కాదు. అప్పట్లో మీ మాటల్లో ఇంత దూకుడు కనిపించేది కాదు. ఇప్పుడు ఏమడిగినా టకీమని సమాధానాలొచ్చేస్తున్నాయ్? ఓహ్ అదా..? కాన్ఫిడెన్స్, ఎక్స్పీరియన్స్.. ఈ రెండూ ఉన్నవాళ్లు ఇలానే మాట్లాడతారు. ఒకప్పుడు నాకీ రెండూ నిల్. ఇప్పుడు ఫుల్. అందుకే ఇలా! ఫ్రెండ్లీగా ఉన్నా... తెలుగు పరిశ్రమపై కోపంగా ఉన్నారేమో అనిపిస్తోంది? వరుసగా తమిళ్, హిందీ సినిమాలు చేస్తున్నానని అలా అనుకుంటున్నారేమో? అలా ఏమీ లేదు. నన్ను కథానాయికను చేసిందే తెలుగు పరిశ్రమ. నేనెక్కువ సినిమాలు చేసింది కూడా ఇక్కడే. ఈ పరిశ్రమపై కోపం పెంచుకుంటే అంతకంటే అన్యాయం ఉండదు. కానీ, ఏదో విషయంలో మీరు ‘హర్ట్’ అయ్యారేమో అనిపిస్తోంది? నిజమే. రెండేళ్ల క్రితం వరకూ తెలుగు పరిశ్రమలో నా గురించి ఏమనేవారో తెలుసా? ‘తాప్సీ అన్‌లక్కీ. తను చేసే సినిమాలేవీ హిట్టవ్వవు’ అని. ఇప్పుడా ట్యాగ్ మారిందా? మారింది. ఏ వెబ్సైట్ అయితే ‘అన్‌లక్కీ’ అని నా మీద ముద్ర వేసిందో, అదే వెబ్సైట్ ‘తాప్సీ లక్కీ’ అని రాసింది. అంత సడెన్‌గా నేను ఎలా లక్కీ అయ్యానో నాకే అర్థం కాలేదు. హిందీలో ‘బేబీ’ హిట్ అయ్యింది. తమిళంలో నేనిప్పటివరకూ చేసినవన్నీ విజయవంతమైన సినిమాలే. అందుకే ‘లక్కీ’ అంటున్నట్టున్నారు. ‘అన్ లక్కీ’ అంటుంటే ఏమనిపించేది? ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అయ్యేది కాదు. ఎందుకంటే తమిళ, హిందీ రంగాల్లో నాపై ఈ ముద్ర లేదు. అక్కడ లక్కీ అనిపించుకున్న నేను ఇక్కడ అన్‌లక్కీ ఎలా అవుతాను? ఆ మాట విన్నప్పుడల్లా అభద్రతాభావం ఆవరించేది. పైగా ఒక సినిమాలో నేను ఏ పది, పదిహేను సీన్సో చేసి ఉంటాను. అలాంటప్పుడు చిత్ర అపజయానికి నేనెలా కారణమవుతాను? కానీ, నన్నే టార్గెట్ చేశారు. అందుకే తెలుగుఫీల్డ్కి దూరమయ్యారా? నా మాతృభాష హిందీ తర్వాత నేను నేర్చుకున్న భాష తెలుగే. ఇక్కడ నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. తెలుగంటే నాకెంత ప్రేమో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. నేనిక్కడి వాళ్లని ఒక్కటే కోరుకుంటున్నా. ‘నన్ను అభిమానించండి. గ్లామరస్ రోల్స్ చేయగలను. నటనకు అవకాశం ఉన్న పాత్రలూ చేయగలనని నిరూపించుకున్నాను. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి మంచి అవకాశాలివ్వండి. మరి... హిందీ రంగం సంగతేంటి? అక్కడ మెయిన్ హీరోయినా? సెకండ్ హీరోయినా? అని చూడరు. పాత్రని మాత్రమే పట్టించుకుంటారు. ‘బేబీ’లో నా పాత్ర నిడివి 20 నిముషాలే. కానీ ఆ పాత్ర నాకు తెచ్చిపెట్టిన ప్రశంసలెన్నో. మీడియా నన్ను ఎంతగానో అభినందిస్తూ రాసింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కొంచెం బొద్దుగా ఉండేవారు. ఇప్పుడు భలే సన్నబడ్డారే? అప్పట్లో కెమెరా గురించి అవగాహన ఉండేది కాదు. బరువు గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆ తర్వాత తెరపై చక్కగా కనిపించాలంటే ఎంత బరువు ఉండాలో తెలిసింది. దాంతో కొంచెం తగ్గాను. తెలుగు మీడియాలో అలా రాయలేదా? చాలా మటుకు రాయరు. రివ్యూ రాసేటప్పుడు హీరో, విలన్, కమెడియన్ గురించి విపులంగా రాస్తారు. హీరోయిన్లకు మాత్రం అలా రాయరు. ‘తాప్సీ గుడ్’ అని మొక్కుబడిగా ఓ ముక్క రాస్తారు. సో... తెలుగు మీడియాపై కోపం ఉందన్నమాట? కోపం కాదు బాధ. రాత్రికి రాత్రి నన్ను ‘స్టార్’ని చేసింది తెలుగు మీడియానే. కానీ తర్వాత వాళ్లే కింద పడేశారు. ఏదైపా మంచి పాత్ర చేసినప్పుడు రెండు మంచి మాటలు రాస్తే తృప్తిగా ఉంటుంది కదా! ‘బేబీ’ తర్వాత మీ దృష్టి ఉత్తరాది చిత్రాలపైనే ఉంటోందా? తెలుగు దర్శక, నిర్మాతలను మంచి ఆఫర్ ఇవ్వమనండి. ఇక్కడా ఉంటాను. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. సౌత్‌ని వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. ఇక్కడి చిత్రాలు వదులుకునే ప్రసక్తే లేదు. తెలుగు పరిశ్రమ, మీడియా సంగతి సరే. అభిమానుల సంగతి? వాళ్లు లేకపోతే నేను లేను. ఏదైనా షూటింగ్ కోసం, ఫంక్షన్ కోసం వచ్చినప్పుడు చక్కగా పలకరిస్తుంటారు. అభిమానం రుచి ఎలా ఉంటుందో నాకు తొలిసారి చూపించింది తెలుగు ప్రేక్షకులే. వాళ్లెప్పటికీ నాకు ప్రత్యేకం. - డి.జి.భవాని -
జాడీ నం.1
కర్షకుడి చద్దిమూటలో కార్మికుడి లంచ్ డబ్బాలో ఆఫీసర్‌గారి క్యారియర్‌లో అమ్మాయి స్కూల్ టిఫిన్ బాక్స్‌లో స్టీల్ కంచంలో, పింగాణి ప్లేట్లో దర్శనమిచ్చే ఆవకాయ... చందమామ లాంటి అన్నంలో ఉదయిస్తున్న సూరీడులా ఉంటుంది! ఆకలిని బజ్జోపెట్టే అమ్మలా క్రాంతిని మేల్కొలిపే నాన్నలా అవ్వాతాతల వారసత్వంలా చల్లగా, నిప్పులా, నిజాయితీగా అనిపిస్తుంది. నిలవ ఉంచుకోవచ్చు. నిమిషంలో పంచేయవచ్చు. రామ్,ఎడిటర్, ఫీచర్స్ ఆవకాయ్... తెలుగువారికి ఎలా ప్రత్యేకమో, హీరోయిన్లలో స్వాతి అంత ప్రత్యేకం. మిరపకాయలు చిటా పటామన్నట్టు, మాటలు పేల్చడంలో స్వాతి దిట్ట. అష్టాచెమ్మా, అనంతపురం, స్వామి రారా, కార్తికేయ... ఆమె నటించిన కమ్మని సినిమాలు. తెలుగు టాలెంట్ తమిళ, మలయాళ భాషల్లో స్వాతి వల్లే తెలుస్తోంది. అక్కడ కూడా తను పాపులర్ హీరోయిన్. ఈ ఆవకాయ సీజన్లో ‘సాక్షి’ కోసం స్వాతి కలిపిన మాటలివి... సమ్మర్ ఎలా ఉంది? నీ పని చెప్తా అన్నట్టు ఉంది. ఎండలు విజృంభిస్తున్నాయ్. ఇంకో నెలరోజులు అవస్థ తప్పదు. అయినా ఎండల్ని తిట్టుకోవాల్సిన పని లేదు. మల్లెల్ని, కొత్త ఆవకాయల్ని తీసుకొచ్చే సీజన్ కదా! ఆవకాయ్ ఇష్టమేనా? ఓ... ఏడాది పొడవునా తినమన్నా తినేస్తాను. పచ్చడి తయారు చేసేటప్పుడు దగ్గరుండి చూస్తుంటారా? వైజాగ్‌లో మా అమ్మమ్మ, నాన్నమ్మ ఇద్దరూ తయారు చేసేవాళ్లు. ఆవకాయ్ తయారు చేయడం అనేది మాకో చిన్న సైజ్ పండగలా అనిపించేది. మామిడికాయలు కొనడం, వాటిని కడగడం, తుడిచి ముక్కలు కొట్టి, మొత్తం పచ్చడి తయారయ్యేవరకూ నేను, మా అన్నయ్య దగ్గరుండి చూసేవాళ్లం. నానమ్మ కత్తిపీట మీద కూర్చుని ముక్కలు కోసేది. అన్నయ్య ఒక్కో మామిడికాయ కత్తి కింద పెడితే ఆవిడ కోసేది. ఓసారి ఎటో చూస్తూ, ముక్కకి బదులు అన్నయ్య వేలి మీద కత్తి వేసింది. వేలి నుంచి బాగా రక్తం కారడం, అన్నయ్యేమో ఇల్లు పీకి పందిరేసినంత పని చేస్తూ, గట్టిగా ఏడవడం, తనని ఓదార్చడం... బాగా గుర్తు. అప్పుడు అందరూ అన్నయ్యను బాగా గారం చేశారు. దాంతో ‘సచ్చినోడా’ అని ఉక్రోషంగా తిట్టుకున్నా (నవ్వుతూ). పచ్చడి పాళ్లు మీకు తెలుసా? అంత తెలియదు కానీ, ఏయే దినుసులు కావాలో తెలుసు. నాకైతే ముక్క మాత్రమే కాదు.. పచ్చడిలో వేసే మెంతులు, వెల్లుల్లిపాయ కూడా ఇష్టమే. మా అమ్మా, నాన్న, నేనూ భోజనం చేస్తున్నప్పుడు మెంతులూ, వెల్లుల్లిపాయలూ ఏరి నా ప్లేట్లో వేస్తారు. ఎప్పుడైనా హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకుని, టీవీ చూస్తూ తింటుంటాను. అప్పుడు బిర్యానీ రుచిగా లేకపోతే, ఓ ఆవకాయ ముక్క పెట్టుకుని తినేస్తాను. మామిడికాయల వల్ల మొహం మీద గడ్డలు వస్తాయనీ, పచ్చళ్లు శరీర బరువుని పెంచుతాయంటారు కదా? నాకలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. బరువు గురించి కూడా అస్సలు ఆలోచించను. కమ్మని ఆవకాయ్ తినని జీవితం ఎందుకండీ? షూటింగ్స్ కోసం దేశ, విదేశాలు తిరుగుతుంటారు కదా.. ఎక్కడికెళ్లినా ఆవకాయ్ దొరుకుతుందా? మన తెలుగువాళ్ల గొప్పదనం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా తమతో పాటు ఆవకాయ ఉంచుకుంటారు. చెన్నయ్‌లో షూటింగ్ అనుకోండి, అక్కడ వడ్డించే పచ్చళ్లల్లో మన ఆవకాయ్ ఉంటుంది. విదేశాల్లోని సూపర్ మార్కెట్స్‌లో, తెలుగు హోటల్స్‌లో కూడా దొరుకుతుంది. అవునూ.. మీ ఇంట్లో పచ్చడి జాడీలున్నాయా? ఉన్నాయి. అప్పట్లో అమ్మమ్మ, నాన్నమ్మ పచ్చడిని జాడీలో పెట్టి, జాడీ మూతకు తెల్లటి గుడ్డ కట్టి, భద్రపరిచేవారు. అది చూడ్డానికే ఎంతో బాగుండేది. - డి.జి. భవాని చరిత్ర అడగొదు ఆదియందు అక్షరమే తప్ప ఆవకాయ లేకపోవచ్చు. వేదము వలె ఆవకాయ సత్య సనాతనమైనది కాకపోవచ్చు. అయినా, ఆవకాయ కూడా వేదం వలెనే అపౌరుషేయం. శాకాహార, మాంసాహార పదార్థాలను ఎక్కువకాలం నిల్వ చేసేందుకు ఊరవేసే ప్రక్రియ దాదాపు నాలుగువేల ఏళ్ల కిందటే మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రాచ్య, అప్రాచ్య దేశాలలో కూరగాయ ముక్కలను, మాంసం ముక్కలను ఉప్పునీటిలో లేదా వెనిగర్‌లో ఊరవేసేవారు. అంతకంటే పెద్దగా కష్టపడేవారు కాదు, కొత్తగా ఆలోచించేవారు కాదు. అవన్నీ ఆదిమ పద్ధతుల్లో తయారయ్యే ఊరగాయలు! దే ఆర్ వెరీ ప్రిమిటివ్ పికిల్స్! వాటి తయారీ పద్ధతిలో నేటికీ పెద్దగా మెరుగుదల లేదు. ఆవకాయ రుచి ఎరుగని అమాయకులు పాపం వాటితోనే నెట్టుకొచ్చేస్తున్నారు. ఆవకాయ ఆవిర్భావాన్ని గురించి మనకు ఇదమిత్థమైన పౌరాణిక, ఐతిహాసిక ఆధారాలేవీ లభించడం లేదు. నానా రుచులను నోరారా వర్ణించిన కవిసార్వభౌముడు శ్రీనాథుడి కావ్యాలలో సైతం ఆవకాయ ప్రస్తావన లేదు. అంటే, ఆవకాయ నిస్సందేహంగా శ్రీనాథుడి తర్వాతి కాలం నాటి ఆవిష్కరణే. ఆవకాయ పెట్టడానికి మామిడికాయలు, ఆవాలు, మిరపకాయలు, ఉప్పు, నూనె కావాలి. మామిడి, ఆవాలు, ఉప్పు, నూనె వాడుక మన దేశంలో క్రీస్తుపూర్వం నుంచే ఉండేది. ఆవకాయ ఘాటులో, ఎర్రని రంగులో కీలక పాత్ర పోషించే మిరపకాయలు మాత్రం క్రీస్తుశకం 15-16 శతాబ్దాల మధ్యకాలంలో విదేశీ వర్తకుల ద్వారా మన దేశానికి వచ్చాయి. కొలంబస్ రాక తర్వాత.. అంటే 1492 తర్వాత మిరపకాయలు ఇక్కడకు చేరాయి. పోర్చుగీసు, డచ్ వర్తకుల ప్రోత్సాహంతో మిరపకాయల సాగు నెమ్మదిగా విస్తరించింది. వారి ప్రాబల్యంతోనే తెలుగువారు ఎగుమతుల కోసం తయారుచేసే మామిడి ఊరగాయకు మిరపపొడిని జోడించడం మొదలుపెట్టారు. మన తెలుగువారికి ఆమాత్రం ప్రోత్సాహం దొరకాలే గానీ, ఇక ఆగుతారా..? మనవాళ్లవి అసలే క్రియేటివ్ బ్రెయిన్స్! ప్రయోగాల మీద ప్రయోగాలు సాగించి, సాగించి, చివరకు ఆవకాయ ఫార్ములాను సాధించారు. మిరపపొడి ధాటికి మనకంటూ ఓ ఫైర్‌బ్రాండ్ నిల్వపచ్చడి తయారైంది. రుచి అమోఘం మాత్రమే కాదు, రంగు కూడా అత్యంత ఆకర్షణీయం.. కంచంలో వేడివేడి అన్నం వడ్డించుకుని, కొత్తావకాయ కలుపుకుంటేనా..! ఆ దృశ్యాన్ని చూస్తేనే చాలు, కంచంలో మర్డర్ జరిగినట్లుంటుంది.. ఇదీ మన తెలుగోళ్ల కలాపోసన! ఆవకాయ ఫార్ములా కనిపెట్టాక, ఒకే రకమైన మూసపద్ధతిలోనే మనవాళ్లు ఆగిపోలేదు. సామవేద పారంగతులైన విద్వద్వరేణ్యులు చిన్న చిన్న స్వరభేదాలతో అద్భుత, అమోఘ, అపురూప రాగాలను సృష్టించిన రీతిలోనే, చిన్న చిన్న రుచిభేదాలతో చవులూరించే రకరకాల ఆవకాయలను సృష్టించారు. ఆవకాయ సృష్టికర్త ఎవరో, పేరేమిటో చరిత్రకెక్కలేదు. ఆవకాయను ఆత్మగౌరవ చిహ్నంగా మార్చుకున్న ఆంధ్రులు.. ఆవకాయ సృష్టికర్తకు ఆజన్మాంతం రుణగ్రస్తులై ఉంటారు. అయితే, ప్రాతఃస్మరణీయుడై, పూజలందుకోవలసిన ఆవకాయ సృష్టికర్తను విస్మరించినందుకు మాత్రం మన తెలుగువాళ్లను చరిత్ర క్షమించదు! - పన్యాల జగన్నాథదాసు తెలంగాణ ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., మెంతులు - 100 గ్రా., నూనె - 2 కిలోలు, ఆవాలు - 50 గ్రా, జీలకర్ర - 50 గ్రా, కరివేపాకు - 1 కట్ట తయారీ: మెంతుల్ని నూనె లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓ బేసిన్లో మామిడి ముక్కలు, కారం, ఉప్పు, ఆవపిండి వేసి బాగా కలపాలి. మొత్తం నూనెను వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. వేగిన తర్వాత దించేసి చల్లార్చుకోవాలి. వేడి లేదని నిర్ధారించుకున్నాక ముక్కల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. తర్వాత పచ్చడిని జాడీలో వేసి, మూడు రోజుల పాటు ఊరనివ్వాలి. బెల్లం ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, బెల్లం - 1 కిలో, నూనె - తగినంత తయారీ: బెల్లాన్ని తురుముకోవాలి. మామిడి ముక్కల్లో కారం, ఉప్పు, ఆవపిండి, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ముక్కలు తడిసేలా కొద్దిగా నూనె కూడా వేసి కలపాలి. తర్వాత ఈ ముక్కల్ని ఎండలో పెట్టాలి. రెండు రోజుల్లో ముక్కలకు పట్టిన బెల్లం పాకంలాగా తయారవుతుంది. అప్పుడు ముక్కల్ని జాడీలో వేసి, మునిగేవరకూ నూనె వేసి మూత పెట్టెయ్యాలి. మగ్గిన తర్వాత తీసుకోవాలి. కొందరు తాలింపు కూడా వేసుకుంటారు. నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే మామూలుగా కూడా బాగుంటుంది. ఆంధ్ర ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., మెంతులు - 100 గ్రా., నూనె - తగినంత తయారీ: ఓ బేసిన్లో మామిడి ముక్కలు, కారం, ఉప్పు, ఆవపిండి వేసి బాగా కలపాలి. జాడీ తీసుకుని... కాసిని మామిడి ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కాసిన్ని మెంతులు... ఇలా పొరలుగా వేసుకోవాలి. చివరగా ముక్కలు మునిగేవరకూ నూనె వేసి మూత పెట్టెయ్యాలి. మూడు రోజుల తర్వాత మూత తీసి, ఒకసారి కలిపి మళ్లీ మూత పెట్టెయ్యాలి. రెండు మూడు రోజుల్లో ఆవకాయ రెడీ అయిపోతుంది. నువ్వు ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, నువ్వులు - అరకిలో, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, అల్లం వెల్లుల్లి ముద్ద - అరకప్పు, ఆవపిండి - 100 గ్రా., జీలకర్ర పొడి - 50 గ్రా., మెంతి పొడి - 2 చెంచాలు, ఇంగువ - చిటికెడు, పసుపు - 2 చెంచాలు, ఆవాలు - 3 చెంచాలు, జీలకర్ర - 3 చెంచాలు తయారీ: నువ్వులను దోరగా వేయించి, మెత్తగా పొడి చేసుకోవాలి. ఓ గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు, ఆవపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కొద్దిగా నూనె వేడి చేసి... జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి. చల్లారిన తర్వాత కలిపి పెట్టుకున్న పొడుల మిశ్రమంలో వేయాలి. తర్వాత వీటన్నిటినీ మామిడి ముక్కల్లో వేసి బాగా కలపాలి. కొన్ని నువ్వుల్ని దోరగా వేయించి వాటిని కూడా కలిపి, తర్వాత జాడీలో వేసి నిండుగా నూనె వేయాలి. ఆత్రేయపురం రండి... ఆత్రేయపురం పూతరేకులు ఎంత ఫేమస్సో, పచ్చళ్లూ అంతే ఫేమస్. మా ఊళ్లో చాలా కుటుంబాలు పచ్చళ్ల వ్యాపారం మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. దాదాపు మూడు వేల కుటుంబాలు రుణాలు తెచ్చుకుని మరీ పచ్చళ్లు తయారు చేస్తున్నాం. యేటా దాదాపు వంద కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి ఇక్కడ. సీజన్‌కి తగ్గట్టుగా పచ్చళ్లు చేసినా, వేసవిలో పని మరింత ఎక్కువ ఉంటుంది. మేం తయారు చేసిన పచ్చళ్లు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. - పెన్నాడ గాంధీ, పచ్చళ్ల వ్యాపారస్తుడు, ఆత్రేయపురం జబ్బ బలం... కాయ ఖతం పదిహేనేళ్లుగా ముక్కలు కొట్టే పని చేస్తున్నాను. యేటా మే నెల నుంచి జూన్ మొదటి వారం వరకూ చేతి నిండా పని ఉంటుంది. చాలామంది వచ్చి మామిడి కాయలు కట్ చేయించుకుని వెళ్తుంటారు. కాయకి మూడు నుంచి ఐదు రూపాయల వరకూ తీసుకుంటాను. మరీ అంత తీసుకుంటే ఎలా అని కొందరు అంటుంటారు. కానీ ఏం చేస్తాం? ముక్కలు కొట్టడం అంత తేలికైన పనేమీ కాదు. చాలా బలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ మాత్రం తీసుకోకపోతే గిట్టుబాటు కాదు కదా! - అబ్దుల్, మెహదీపట్నం రైతుబజార్ గుంటూరుతో గేమ్స్ వద్దు ఆవకాయ అనగానే అందరికీ గుర్తొచ్చేది గుంటూరే. పల్నాడు ప్రాంతంలో పండే మిరపతో పెట్టే ఆవకాయ రుచి మరి దేనికీ రాదన్నది అందరూ అనేమాట. ఇక్కడ ఏ యేటికా ఏడు వ్యాపారం పెరుగుతూ ఉండటానికి కారణం ఆ నమ్మకమే. ఆ నమ్మకాన్ని పాడు చేయకూడదని పూర్వం నుంచి పెద్దవాళ్లు పాటించిన విధానాలనే మేము ఇప్పటికీ పాటిస్తున్నాం. రెడీమేడ్ పొడులు వాడం. మేమే ఇళ్లలో పొడులు తయారు చేసుకుంటాం. నాణ్యమైన నువ్వుల నూనె వాడుతున్నాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇప్పటికీ మా పచ్చళ్లకు ఆదరణ తగ్గలేదు. మా జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. - పొదిలే రమాదేవి, అతిథిగృహ ఫుడ్స్, గుంటూరు జాడీ... మామిడీ... మేలైన జోడీ... తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పచ్చళ్ల వ్యాపారం పెద్ద స్థాయిలో జరుగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకునే రాజమండ్రి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జాడీలు తయారు చేసే ఫ్యాక్టరీలు చాలా ఏర్పడ్డాయి. వీటి నుంచి వేల సంఖ్యలో జాడీలు రవాణా అయ్యేవి. అయితే ప్లాస్టిక్ డబ్బాల వాడకం పెరిగాక జాడీలు కొనేవాళ్లు తగ్గారు. దాంతో 42 యూనిట్లలో కేవలం మూడు మాత్రమే మిగిలాయి. పచ్చడి నిల్వ ఉండటానికి, ఆరోగ్యానికి హాని జరక్కుండా ఉండటానికి జాడీలే మంచివని ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోవడం లేదు. - గొర్రిపాటి అప్పల్రాజు, తూ.గో. జిల్లా సెరామిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గోంగూర ఆవకాయ కావలసినవి: గోంగూర - 20 కట్టలు, నూనె - 1 కిలో, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., ఆవపిండి - 1 కప్పు, ఉప్పు - 1 కప్పు, కారం - 1 కప్పు, ఆవాలు - 4 చెంచాలు, మెంతిపిండి - 2 చెంచాలు తయారీ: గోంగూర ఆకుల్ని కాడల్నుంచి వేరు చేసి శుభ్రంగా కడగాలి. తర్వాత తడి పోయేలా నీడలో ఆరబెట్టాలి. ఆపైన నూనెలో వేయించి తీయాలి. ఆవాలు, వెల్లుల్ని రెబ్బల్ని కూడా నూనెలో వేయించి తీయాలి. ఓ గిన్నెలో గోంగూర, కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి వేసి బాగా కలపాలి. తర్వాత ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలిపి జాడీలో వేయాలి. చివరగా నూనె పోసి మూత పెట్టాలి. కావాలంటే తాలింపులో వేరుశెనగలు, జీలకర్ర, ఇంగువ వంటివి కూడా వాడుకోవచ్చు. ఉసిరి ఆవకాయ కావలసినవి: ఉసిరికాయలు - 2 కిలోలు, నూనె - 2 కిలోలు, కారం - అరకిలో, ఆవపిండి - అరకిలో, ఉప్పు - అరకిలో, మెంతులు - 50 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా. తయారీ: మెంతుల్ని నూనె లేకుండా వేయించి పక్కన పెట్టాలి. ఉసిరికాయల్ని కడిగి, గాట్లు పెట్టి, తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. తర్వాత వీటిని నూనెలో వేయించి తీయాలి. వీటిలో ఉప్పు, కారం, ఆవపిండి వేసి బాగా కలపాలి. తర్వాత మెంతులు, వెల్లుల్లి కూడా కలిపి జాడీలో వేయాలి. ముక్కలు మునిగేదాకా నూనె పోసి మూత పెట్టాలి. మునగావకాయ కావలసినవి: మునక్కాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, చింతపండు గుజ్జు - 1 కప్పు, ఇంగువ - చిటికెడు, మెంతిపిండి - 4 చెంచాలు, జీలకర్ర పొడి - 2 చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు - 50 గ్రా., నూనె - తగినంత, కరివేపాకు - 4 రెమ్మలు, ఆవాలు - 2 చెంచాలు, జీలకర్ర - 2 చెంచాలు తయారీ: మునక్కాయ ముక్కల్ని కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటిని నూనెలో వేయించుకోవాలి. చల్లారిన తర్వాత కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ఆవపిండి వేసి కలిపి జాడీలో పెట్టెయ్యాలి. ముక్కలు మునిగేవరకూ నూనె పోసి మూత పెట్టాలి. రెండు రోజుల తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువతో పోపు పెట్టి పచ్చడిలో కలపాలి. మళ్లీ మూత పెట్టేసి రెండు రోజులు ఊరనిస్తే ఆవకాయ రెడీ. కాలీఫ్లవర్ ఆవకాయ కావలసినవి: కాలీఫ్లవర్ ముక్కలు - 4 కప్పులు, నూనె - 2 కప్పులు, వెల్లుల్లి రెబ్బలు - అరకప్పు, కారం - 1 కప్పు, ఉప్పు - 1 కప్పు, ఆవపిండి - 1 కప్పు, పసుపు - 2 చెంచాలు తయారీ: కాలీఫ్లవర్స్ ముక్కల్ని వేడి నీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచి తీస్తే పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత ఈ ముక్కల్ని ఎండలో ఆరబెట్టాలి. ఆపైన నూనెలో దోరగా వేయించి తీసేయాలి. ఈ ముక్కల్లో ఉప్పు, ఆవపిండి, కారం, పసుపు వేసి బాగా కలపాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి, జాడీలో పెట్టి, నూనె పోసి మూత పెట్టెయ్యాలి. ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు. నిమ్మ ఆవకాయ కావలసినవి: నిమ్మకాయలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఆవపిండి - 50 గ్రా., మెంతిపిండి - 6 చెంచాలు, ఉప్పు - అరకిలో, నూనె - సరిపడా, ఆవాలు - 4 చెంచాలు, ఎండు మిరపకాయలు - 15, కరివేపాకు - 1 కట్ట, వెల్లుల్లి రెబ్బలు - 1 కప్పు తయారీ: నిమ్మకాయల్ని నాలుగు బద్దలుగా నిలువుగా కోసుకోవాలి. జాడీలో ఓ పొర నిమ్మకాయ ముక్కలు, ఓ పొర ఉప్పు... ఇలా పొరలు పొరలుగా వేసుకుని మూత పెట్టేయాలి. మూడు రోజుల తర్వాత ముక్కల్ని తీసి ఎండలో పెట్టాలి. నిమ్మరసం ఊరి జాడీలో పడుతుంది. దాన్ని కూడా ఎండలో పెట్టాలి. ఎండ తగ్గాక తీసి రెండిటినీ జాడీలో వేసి మూత పెట్టాలి. మూడు రోజుల పాటు ఇలానే చేయాలి. తర్వాత ముక్కల్ని ఓ బేసిన్లో వేసుకుని.. ఆవపిండి, మెంతిపిండి, కారం కలిపి మళ్లీ జాడీలో పెట్టి, నిండా నూనె వేయాలి. మూడు రోజుల తర్వాత తీసి... ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు నూనెలో వేయించి, ఆ తాలింపును నిమ్మకాయ మిశ్రమంలో కలపాలి. కాకర ఆవకాయ కావలసినవి: కాకరకాయ ముక్కలు - 2 కిలోలు, ఉప్పు - అరకిలో, చింతపండు - పావుకిలో, కారం - అరకిలో, ఆవపిండి - 4 చెంచాలు, నూనె - తగినంత, ఆవాలు - 4 చెంచాలు, జీలకర్ర - 4 చెంచాలు, కరివేపాకు - 2 రెమ్మలు తయారీ: కాకరకాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి, ముక్కలుగా కోసుకోవాలి. చింతపండులో నీళ్లుపోసి స్టౌమీద పెట్టాలి. మెత్తగా ఉడికాక దించేసి చల్లారబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి, కాకరకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. తర్వాత ఈ ముక్కల్లో చింతపండు గుజ్జు, కారం, ఆవపిండి, ఉప్పు వేసి కలిపి జాడీలో పెట్టి నూనె పోయాలి. రెండు రోజుల తర్వాత... జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో తాలింపు పెట్టి, ఆ తాలింపును పచ్చడిలో వేసి కలపాలి. పెసర ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, పెసర పిండి - అరకిలో (రెడీమేడ్ కంటే పెసల్ని కాస్త వేయించుకుని, పిండి పట్టించి వాడుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది), వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., మెంతులు - 100 గ్రా. తయారీ: మెంతుల్ని నూనె లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓ బేసిన్లో మామిడి ముక్కలు, కారం, ఉప్పు,పెసరపిండి వేసి బాగా కలపాలి. జాడీ తీసుకుని... కొన్ని ఆవకాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కాసిన్ని మెంతులు... ఇలా పొరలుగా వేసుకోవాలి. చివరగా ముక్కలు మునిగేవరకూ నూనె వేసి మూత పెట్టెయ్యాలి. మూడు రోజుల తర్వాత మూత తీసి, ఒకసారి కలిపి మళ్లీ మూత పెట్టెయ్యాలి. రెండు మూడు రోజుల్లో ఆవకాయ రెడీ అయిపోతుంది. టొమాటో ఆవకాయ కావలసినవి: టొమాటోలు - 2 కిలోలు, ఉప్పు - అరకిలో, కారం - అరకిలో, ఆవపిండి - 50 గ్రా., వెల్లుల్లి రెబ్బలు - 50 గ్రా., నూనె - సరిపడా, చింతపండు - పావుకప్పు, కరివేపాకు - 1 కట్ట, ఆవాలు - 6 చెంచాలు, ఎండుమిర్చి - 15 తయారీ: టొమాటోలను ముక్కలుగా కోసుకోవాలి. వీటికి ఉప్పు చేర్చి జాడీలో పెట్టాలి. మూడో రోజు తీసి ఎండలో పెట్టాలి. జాడీలోకి ఊరిన టొమాటో రసాన్ని కూడా ఎండలో పెట్టాలి. మళ్లీ సాయంత్రం రెండిటినీ కలిపి జాడీలో పెట్టేయాలి. మూడు రోజులు అలా ఎండబెట్టిన తర్వాత... టొమాటో ముక్కలు, రసం, చింతపండు కలిపి మిక్సీ పట్టాలి. మరీ పేస్ట్‌లా అవ్వకుండా కొంచెం ముక్కలుగా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమానికి ఆవపిండి, ఉప్పు, కారం బాగా పట్టించి జాడీలో పెట్టి, మునిగేవరకూ నూనె పోయాలి. రెండు రోజుల తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలను నూనెలో వేయించి పచ్చడిలో కలపాలి. అల్లం ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, అల్లం - 200 గ్రా., వెల్లుల్లి రెబ్బలు - 200 గ్రా., మెంతులు - 25 గ్రా., జీలకర్ర - 25 గ్రా., ఎండుమిర్చి - 10, ఆవాలు - 2 చెంచాలు, నూనె - తగినంత తయారీ: అల్లం, వెల్లుల్లి రెబ్బల్ని శుభ్రం చేసి... నీళ్లు కలపకుండా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. మెంతులు, జీలకర్రను వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడితో పాటు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద మామిడి ముక్కల్లో వేసి కలపాలి. తగినంత నూనె వేసి కలిపి జాడీలో పెట్టాలి. మూడు రోజుల తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు పెట్టి, దాన్ని పచ్చడిలో కలపాలి. డాక్టర్ ఆవకాయ! పచ్చిమామిడిలో విటమిన్ ‘బి’తో పాటు విటమిన్ ‘సి’ కూడా ఎక్కువ. ఈ రెండు విటమిన్ల కారణంగా మామిడికాయ పచ్చడితో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో ఈ రెండు విటమిన్లు తోడ్పడతాయి. ⇒ ఆవపిండిలో మినరల్స్ ఎక్కువ. పైగా క్యాన్సర్‌తో పోరాడే శక్తి ఉంటుంది. అలాగే మెంతిపిండిలో ప్రోటీను, విటమిన్ సి, నియాసిన్, పొటాషియమ్, ఐరన్ ఉంటాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కీలక పోషకాలు, మైక్రోన్యూట్రియెంట్స్ లభ్యమవుతాయి. ⇒ ⇒ ⇒మామిడిలోని పీచుతో పాటు, మెంతిలోని పీచు కలిసి శరీరానికి అవసరమైన ఫైబర్‌ని సమకూరుస్తాయి. ఇక మెంతుల్లో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉండటం వల్ల గుండెజబ్బుల ఆస్కారం తగ్గుతుంది. ⇒ఆవకాయలో ఉపయోగించే వెల్లుల్లిలో యాంటీక్యాన్సర్ గుణాలు ఉండటం వల్ల ఇది క్యాన్సర్‌ను నిరోధించడంతో పాటు, కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ⇒ నువ్వుల నూనెలో మెగ్నీషియమ్ పుష్కలంగా ఉంటుంది. దానిలో రక్తపోటును తగ్గించే గుణాలతో పాటు, డయాబెటిస్‌నూ నివారించే గుణాలున్నాయి. ఈ రెండు గుణాలూ కలగలసి ఉండటం వల్ల గుండెజబ్బులూ తగ్గుతాయి. కాబట్టి ఆవకాయలో నువ్వుల నూనెను ఉపయోగించడం ఎంతైనా ఉత్తమం. ⇒ కొందరు ఆవకాయలో పల్లీల నూనె (వేరుశెనగనూనె)ను వాడతారు. పల్లీ నూనె మంచిదే. దీనివల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఎందుకంటే 100 గ్రాముల నూనెలో 884 క్యాలరీల శక్తి ఉంటుంది. పల్లీ నూనెలోని ఒమెగా - 6 ఫ్యాటీ ఆసిడ్స్ శరీరానికి మంచి పోషకాలు ఇస్తాయి.పైగా ఇందులోని యాంటీఆక్సిడెంట్లు వయసు తగ్గినట్లు కనిపించడానికి సాయం చేస్తాయి. అలాగే ఎన్నో క్యాన్సర్లను, ఆల్జైమర్స్ వంటి కొన్ని వ్యాధులను సమర్థంగా నివారించేందుకు పోరాడతాయి. (ఆవకాయలో నువ్వుల నూనె లేదా పల్లీల నూనె ఉపయోగించడం వ్యక్తిగత అభిరుచిమీద ఆధారపడి ఉంటుంది. పల్లీల నూనెతో రుచి ఎక్కువ. నువ్వుల నూనెలో పోషకాలు ఎక్కువ). మితిమీరితే అనర్థమే... పోషకగుణాలు ఉన్నప్పటికీ కొత్త ఆవకాయతో అనర్థాలూ ఉన్నాయి. పచ్చడి చెడిపోకుండా ఉండేందుకు ఉప్పును ఎక్కువగా వేసి ప్రిజర్వేటివ్‌లా ఉపయోగిస్తారు. దాని వల్లబీపీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఇక పచ్చడిలో కారంపాళ్లు అధికంగా ఉండటం వల్ల కడుపులో ఏవైనా పుండ్లు, అల్సర్లు ఉంటే అవి మరింతగా మంట పుట్టించవచ్చు నూనెలో ఉండే కొవ్వు పదార్థాలు ఆలస్యంగా జీర్ణమయ్యే గుణాలను కలిగి ఉంటాయి. దాంతో కొందరిలో పచ్చడి తిన్నప్పుడు జీఈఆర్డీ (గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్) లక్షణాలు కనిపిస్తూ, ఛాతిలో మంట (హార్ట్‌బర్న్) అనిపిస్తుంటుంది. కాబట్టి పచ్చడి వేసుకునే సమయంలో నూనెను తక్కువగానే వేసుకోవాలి. పైగా నూనెలోని కొవ్వులు గుండెకు అంత మేలు కూడా కాదు. - సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్టు పికిల్ ప్రికాషన్స్ ⇒పచ్చడి పెట్టేముందు కాయల ముచికలు కోసేసి, ఒకట్రెండు గంటల పాటు నీటిలో వేసి ఉంచాలి. దానివల్ల సొన అంతా కారిపోతుంది. తర్వాత కాయల్ని శుభ్రంగా కడిగి, తుడిచి, తడి ఆరాక కోసుకోవాలి. ⇒వాడే పాత్రలు, గరిటెలు, నిల్వ చేసే జాడీలు అన్నీ శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి. ⇒పచ్చడి జాడీలో వేసిన తర్వాత గుడ్డ చుడతారు. ఆ గుడ్డ కచ్చితంగా శుభ్రమైనదై ఉండాలి. ⇒ స్టీలు, రాగి, ప్లాస్టిక్ డబ్బాల్లో పచ్చడిని భద్రపర్చకూడదు. ⇒ఒకవేళ చేతితో కలుపుతుంటే చేతికి తడి లేకుండా చూసుకోవాలి. గరిటెతో కలపాలి అనుకుంటే చెక్క గరిటెతో కలపడం మంచిది. అలాగే పచ్చడి జాడీలోంచి తీసుకున్న ప్రతిసారీ తడి గానీ, చల్లని గాలి గానీ తగలకుండా జాగ్రత్తపడాలి. ⇒పచ్చడి జాడీలో వేశాక ఊరేలోపు అప్పుడప్పుడూ చెక్ చేసుకోవాలి. నూనె సరిపోకపోతే వెంటనే నూనె వేసుకోవాలి. లేకపోతే బూజు వచ్చేస్తుంది. ⇒పచ్చడికి ఏ నూనె పడితే ఆ నూనె వాడకూడదు. మంచి వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది. ⇒ వీలైనంత వరకూ రెడీమేడ్ పిండి కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న ఆవపిండి, మెంతిపిండి వాడితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పదార్థాల్లో శార్దూలం సీ. మామిళ్లముక్కపై మమకారమున్ జల్లి అందింపంగా జిహ్వ ఆవకాయ ఎండకాలమునందు ఎండిపోయిన గుండెకు అభినందనము దెల్పు నావకాయ కూరలే లేనిచో కోమలి వేయుచో అనురాగమున్ జూపు నావకాయ చీకుచున్నను గాని పీకుచున్నను గాని ఆనందమే ఇచ్చు నావకాయ ఆపదల నాదుకొను కూర ఆవకాయ అతివ నడుమైన జాడీయె ఆవకాయ ఆంధ్రమాత సింధూరమ్మె ఆవకాయ ఆంధ్రదేశమ్మె తానొక్క ఆవకాయ - మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు ముక్క మహత్తరి మామిడి, ఆవాలు, మిరపకాయలు అని ఆవకాయలో మూడు ద్రవ్యాలుంటాయి. వాటిలో ఆవాలతో సర్షప హోమం, మిర్చితో ప్రత్యంగిరా హోమం, మామిడి ముక్కలు, కారంతో భగళాముఖి హోమం చేస్తారు. చూతవృక్షం అంటే మామిడి చెట్టు దైవవృక్షం. అంచేతనే సంప్రదాయ కుటుంబాలలో ఆవకాయను మడిగా పెడతారు. దానిని మడిగా కొయ్యజాడీలలో పెట్టి అటకెక్కిస్తారు. కావలసినప్పుడల్లా మడిగానే తీసుకుని వాడుకుంటారు. ఇక మాగాయ పచ్చడి గురించి పోతన భాగవతంలో పద్యాలు కూడా ఉన్నాయి. దానిని శ్రీకృష్ణుడికి నివేదన ద్రవ్యంగా వాడతారు. కొన్ని గిరిజన కుటుంబాలలో ఇప్పటికీ కూడా తమ దేవతకు పెరుగన్నంలో ఆవకాయ వేసి నివేదన చేస్తుంటారు. అంటే ఆవకాయ ఇప్పటిది కాదు.. ఎప్పటినుంచో ఉందన్నమాటేగా! - డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు, పౌరాణిక పండితులు ఎర్రగా నవ్వండి భర్త: ఇవాళ ఏం వండావ్..? భార్య: ఆవకాయ.. మీకిష్టమే కదా! సేల్స్‌మేన్: ‘స్వచ్ఛభారత్’ సబ్బు తీసుకుంటారా..? కస్టమర్: దీని స్పెషాలిటీ ఏంటి..? సేల్స్‌మేన్: ఆవకాయ మరకల్ని కూడా ఇట్టే వదిలిస్తుంది. పనిమనిషి: అమ్మా! కంచాలన్నీ శుభ్రంగా కడిగేసినట్లున్నారు.. నేనేం కడగాలి..? ఆండాళు: కొత్తావకాయ వడ్డించా..! అందరూ శుభ్రంగా నాకేశారు. వాటినింకా కడగలేదు.. డోసుబాబుని నెలాఖర్లో మందుపార్టీకి ఆహ్వానించాడు గ్లాసుబాబు డోసుబాబు: మందులోకి మంచింగ్ ఏంట్రా..? గ్లాసుబాబు: ఓన్లీ ఆవకాయ్.. మన్దసలే బడ్జెట్ పార్టీ కదా.. మటన్ ఆవకాయ కావలసినవి: మటన్ - 2 కిలోలు, కారం - కిలోన్నర, ఆవపిండి - 10 చెంచాలు, జీలకర్ర పొడి - 10 చెంచాలు, మెంతిపిండి - 10 చెంచాలు, ఆమ్చూర్ పౌడర్ - 10 చెంచాలు, పసుపు - 2 చెంచాలు, ఉప్పు - 1 కిలో, నూనె - తగినంత తాలింపు కోసం: ఎండుమిర్చి - 10, వెల్లుల్లి రెబ్బలు - పావుకిలో, కరివేపాకు - 4 రెమ్మలు, జీలకర్ర - 2 చెంచాలు, ఆవాలు - 2 చెంచాలు తయారీ: మటన్‌ను ముక్కలుగా కోసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి ఉడికించి కాసేపు ఎండబెట్టాలి. తర్వాత వాటిని నూనెలో వేయించాలి. చల్లారాక మెంతిపిండి, ఆవపిండి, కారం, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ వేసి బాగా కలపాలి. కొద్దిగా నూనె వేడిచేసి... కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతో తాలింపు పెట్టాలి. ఈ తాలింపును మటన్ ముక్కల్లో వేసి కలిపి, మూత బిగుతుగా ఉండే జాడీలో వేయాలి. పచ్చడి అంతా మునిగేవరకూ నూనె పోసి మూత పెట్టెయ్యాలి. మూడు నాలుగు రోజులు ఊరిన తర్వాత తింటే బాగుంటుంది. ఫిష్ ఆవకాయ కావలసినవి: చేపముక్కలు - 2 కిలోలు, కారం - 1 కిలో, అల్లం తురుము - పావుకప్పు, వెల్లుల్లి తురుము - పావుకప్పు, నల్ల మిరియాల పొడి - 4 చెంచాలు, వెనిగర్ - 5 చెంచాలు, పసుపు - 2 చెంచాలు, ఉప్పు - అరకిలో, నూనె - తగినంత తయారీ: చేపముక్కలకు పసుపు, మిరియాల పొడి, ఉప్పు కలిపి అరగంట పాటు ఉంచాలి. తర్వాత ఈ ముక్కల్ని నూనెలో ఎరుపు రంగు వచ్చేవరకూ వేయించాలి. తర్వాత మరో గిన్నె స్టౌ మీద పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక అల్లం తురుము, వెల్లుల్లి తురుము వేసి వేయించాలి. వీటిని చేపముక్కల్లో వేసి కలపాలి. కారం, వెనిగర్ కూడా వేసి కలిపి జాడీలో వేయాలి. ముక్కలు మునిగేవరకూ నూనె పోసి మూత బిగించాలి. ఒకట్రెండు రోజులు ఊరనిస్తే పచ్చడి రెడీ అవుతుంది. కావాలంటే ముల్లు తీసేసి, మెత్తని భాగాన్ని ముక్కలుగా చేసుకుని కూడా పచ్చడి పెట్టుకోవచ్చు. చికెన్ ఆవకాయ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ - 2 కిలోలు, కారం - కిలోన్నర, ఆవపిండి - 10 చెంచాలు, జీలకర్ర పొడి - 10 చెంచాలు, మెంతిపిండి - 10 చెంచాలు, ఆమ్చూర్ పౌడర్ - 10 చెంచాలు, పసుపు - 2 చెంచాలు, ఉప్పు - 1 కిలో, నూనె - తగినంత తాలింపు కోసం: ఎండుమిర్చి - 10, వెల్లుల్లి రెబ్బలు - పావుకిలో, కరివేపాకు - 4 రెమ్మలు, జీలకర్ర - 2 చెంచాలు, ఆవాలు - 2 చెంచాలు తయారీ: చికెన్‌ను ముక్కలుగా కోసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఓ రోజంతా ఎండబెట్టాలి. తర్వాతి రోజు ఈ ముక్కల్లో మెంతిపిండి, ఆవపిండి, కారం, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ వేసి బాగా కలపాలి. కొద్దిగా నూనె వేడిచేసి... కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతో తాలింపు పెట్టాలి. ఈ తాలింపును మటన్ ముక్కల్లో వేసి కలిపి, మూత బిగుతుగా ఉండే జాడీలో వేయాలి. పచ్చడి అంతా మునిగేవరకూ నూనె పోసి మూత పెట్టెయ్యాలి. మూడు నాలుగు రోజులు ఊరిన తర్వాత తింటే బాగుంటుంది. రొయ్యల ఆవకాయ కావలసినవి: రొయ్యలు - 2 కిలోలు, నూనె - 2 కిలోలు, కారం - 1 కిలో, ఉప్పు - ముప్పావు కిలో, లవంగాల పొడి - 4 చెంచాలు, వెల్లుల్లి పేస్ట్ - 4 చెంచాలు, నిమ్మకాయలు - 5 తయారీ: రొయ్యల్ని శుభ్రం చేసి, ఐదు నిమిషాల పాటు వేడి నీటిలో వేసి ఉంచాలి. తర్వాత నీళ్లు తీసేసి, ఆరబెట్టాలి. తడి పోయిన తర్వాత నూనెలో వేయించుకోవాలి. తర్వాత వీటిలో లవంగాల పొడి, కారం, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి నిమ్మరసం పిండాలి. తర్వాత పచ్చడిని జాడీలో వేసి, నూనె పోసి మూత పెట్టెయ్యాలి. నాలుగు రోజులు ఊరిన తర్వాత తీసుకుని తినవచ్చు. జ్ఞాపకం అప్పు చేసైనా ఆవకాయ పెట్టాల్సిందే! ఇప్పుడంటే ఏ కాయ పడితే ఆ కాయతో ఏదో ఆవకాయ పెట్టామని పించుకుంటున్నాం కానీ, మా తాతయ్య హయాంలో మాత్రం ఆవకాయ పెట్టడమంటే ఓ వైభోగమే. వేసవి వచ్చీ రాగానే తాతయ్య ఆవకాయ, మాగాయ ఎట్లా పెట్టించాలా అని హడావుడి పడేవారు. మాది పెద్ద కుటుంబం కావడాన కనీసం వంద కాయలకు తక్కువ కాకుండా ఆవకాయ, అంతకు ఓ పాతిక ముప్పై కాయల పెచైర్ల మాగాయా పెట్టేవాళ్లు. ముందు సన్న ఆవాలు తెప్పించి, వాటిని చెరిగి, ఎండబెట్టి, ఆవపిండి కొట్టించేవారు. బళ్లారి మిరపకాయలు కొనుక్కొచ్చి, తొడిమలు తీయించి ఎండబెట్టి, కారం కొట్టించేవారు. ఉప్పూ, పప్పునూనే ముందే సిద్ధంగా ఉండేవి. ఆనక తోటకు వెళ్లి, కాయలు కోయించి, గోతాల్లో తెచ్చి, మా మామ్మ ముందు పోసేవారు. ఆమె, అమ్మ, పిన్నులు, నాన్నగారి మేనత్తలు... అందరూ కలిసి తలా ఓ కత్తిపీట ముందేసుకుని కాయలన్నింటికీ ముచికలు తీసి, నీళ్లతొట్లో వేసేవారు. సొన అంతా పోయాక, వాటిని తీసి, బట్టతో శుభ్రంగా తుడిచిపెట్టేవాళ్లు. మా నాన్న, బాబాయిలు ముక్కలు కొట్టేవారు. అంతసేపూ ‘టెంక చెదిరిపోతోంది, ముక్క నలిగిపోతోంది, కొంచెం పెద్ద ముక్కలు కొట్టండర్రా ... అలాగని మరీ పెద్దగా కాదు... వేళ్లు జాగర్త...’’ అంటూ తెగ హడావుడి పెట్టేవారు తాతయ్య. రాసులుగా తరిగిపోసిన మామిడికాయ ముక్కలు, ఉప్పు, ఆవపిండి, కారం, నూనె.. అన్నింటినీ పెద్ద పెద్ద బేసిన్లలో పోసి, చేత్తోనే కలిపేసేది మామ్మ. మా ప్రభాతత్త రుచులు చూడటంలో స్పెషలిస్టు. తనకి నచ్చితే... అందరికీ నచ్చి తీరేది! పచ్చడి కలిపిన బేసిన్లోనే మరో నాలుగ్గరిటెల ఆవకాయ వేసి, వేడి వేడి అన్నం అందులో దిమ్మరించి, ఆపైన ఆరారగా నెయ్యి వేసి, మా అందరికీ కలిపి ముద్దలు పెట్టేది మామ్మ. అప్పుడే కలిపిన ఆవఘాటుకి, కారానికి ముక్కుల్లోనుంచి, ఆ రుచికి కళ్లల్లోంచి నీళ్లు కారేవి అందరికీ. ఆ తర్వాత పచ్చడిని జాగ్రత్తగా చిన్న, పెద్ద జాడీల్లో వేసి, వాటి మూతికి వాసెన కట్టి పెట్టేది మామ్మ. ఓ రెండు మూణ్ణెల్లపాటు ఇంటికి బంధువులెవరొచ్చినా... ‘‘కొత్తావకాయ రుచి చూపించి కానీ పంపేవారు కాదు. బాగా బతికినప్పుడు వంద, రెండువందల కాయలకు తక్కువ కాకుండా పచ్చడి పెట్టించిన తాతయ్య, చితికి పోయిన తర్వాత కూడా పచ్చళ్ల విషయంలో రాజీ పడలేదు. అప్పు చేసైనా సరే, ఆవకాయ పెట్టించి అందరికీ రుచి చూపించేవారు. అందుకే పచ్చళ్ల సీజన్ వచ్చిందంటే మామ్మా తాతయ్యా కళ్ల ముందు మెదులుతూనే ఉంటారు. - బాచి మాగాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 1 కిలో, కారం - పావు కిలో, ఉప్పు - పావుకిలో, మెంతిపిండి - 4 చెంచాలు, ఆవపిండి - 4 చెంచాలు, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 10, పసుపు - చిటికెడు, ఆవాలు - 4 చెంచాలు, జీలకర్ర - 2 చెంచాలు తయారీ: మామిడికాయలు చెక్కు తీసి, సన్నగా తరగాలి. వీటిలో ఉప్పు కలిపి రెండు రోజులు ఉంచాలి. ఈలోపు రసం బాగా ఊరుతుంది. రెండు రోజుల తర్వాత రసంలోంచి ముక్కలు వేరు చేసి ఎండబెట్టాలి. రసాన్ని కూడా కాసేపు ఎండలో ఉంచి తర్వాత ఆవపిండి, మెంతిపిండి, కారం వేసి కలపాలి. తర్వాత ఇందులో ముక్కలు కూడా వేసి కలపాలి. చివరగా నూనె వేడిచేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువతో తాలింపు వేసి పచ్చడిలో కలపాలి. వెంటనే కాకుండా ఒకట్రెండు రోజుల తర్వాత తింటే బాగుంటుంది. -
హ్యాపీనెస్ తమన్నా
ఇంటర్వ్యూ హిందీలో తమన్నా అంటే కోరిక అని అర్థం. మన తమన్నాకి హ్యాపీగా ఉండాలనేదే కోరిక. హ్యాపీనెస్... శాడ్‌నెస్... ఈ రెండింటికీ కాంపిటీషన్ పెడితే గెలుపు ‘శాడ్‌నెస్’దే.ఎందుకంటే - గెలిచిన క్షణాలు కొద్దిసేపే. బాధ... చాలాకాలం వెంటాడుతూనే ఉంటుంది. అయితే, హ్యాపీనెస్ వేల్యూ హ్యాపీనెస్దే. అందుకే తన ఓటు ఎప్పుడూ హ్యాపీనెస్కే అంటున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. తమన్నాకు ‘సాక్షి’ ఫోన్ చేస్తే, హ్యాపీగా ఆమె చెప్పిన ముచ్చట్లు... హలో తమన్నా.. హౌ ఆర్ యు? చాలా బాగున్నానండీ. ఒకవైపు సినిమాలు... మరోవైపు ‘వైట్ అండ్ గోల్డ్’ జ్యువెలరీ బిజినెస్‌తో బిజీగా ఉన్నట్లున్నారు? అవును. ఫుల్ బిజీ. క్షణం తీరిక లేక లేదు. అయినా హ్యాపీ. ఈ ఫోన్ చేసింది ఎందుకో తెలుసా? హ్యాపీనెస్ గురించి మాట్లాడుకోవడానికి. హ్యాపీనెస్ గురించి ఏం చెబుతారు? జీవితంలో ప్రతి ఒక్కరికీ కావాల్సిన అంశం ఇది. ఎవరి జీవితంలో ఇది సంపూర్ణంగా ఉంటుందో వాళ్లు అదృష్టవంతులు. మరి.. మీ సంగతేంటి? నేనూ అదృష్టవంతురాల్నే. ఆల్మోస్ట్ హ్యాపీగా ఉంటాను. ఎప్పుడైనా కొంచెం మూడాఫ్ అయినా ఏదో ఒక హ్యాపీ మూమెంట్‌ని గుర్తుకు తెచ్చుకుని మామూలు మూడ్‌లోకి వచ్చేస్తా. అలా అని నేను విపరీతంగా ఆనందపడిపోను, విపరీతంగా బాధపడను. బ్యాలెన్డ్స్‌గా ఉంటా. అదే ఆరోగ్యానికి మంచిది. మీ జీవితంలో ఇప్పటివరకూ మీరు బాగా ఆనందపడిన క్షణాల గురించి? ఈ మధ్య సొంతంగా ‘వైట్ అండ్ గోల్డ్’ జ్యువెలరీ బిజినెస్ ఆరంభించినప్పుడు చాలా ఆనందపడ్డా. ఏదైనా మంచి వ్యాపారం చేయాలనేది నా చిన్నప్పటి కల. ఆ కల నెరవేర్చుకోగలిగా. మా అమ్మా, నాన్న, అన్నయ్య సహకారంతో ఈ వ్యాపారం మొదలుపెట్టా. నగల వ్యాపారమే చేయాలని ఎందుకనుకున్నారు? ఈ వ్యాపారానికి ట్రెండ్‌తో సంబంధం లేదు. పైగా డిజైనర్ జ్యువెలరీకి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఫ్యాషన్ ప్రపంచంలో వస్తున్న మార్పుల గురించి నాకు అవగాహన ఉంది. ఇది కూడా ‘క్రియేటివ్ వరల్డే’. మళ్లీ హ్యాపీనెస్ గురించి మాట్లాడుకుందాం... వ్యక్తిగతంగా మర్చిపోలేని ఆనందాల గురించి? మా అన్నయ్య, నేను చిన్నప్పుడు ముంబయ్‌లో రాత్రిపూట ‘చాట్’ తినేవాళ్లం. పోటీ పడి పానీపూరీలు లాగించేవాళ్లం. ఎగ్ బుర్జీలు, పావ్ బాజీలు.. ఇలా ఏది పడితే అది తినేసేవాళ్లం. ఐస్‌క్రీములు తిన్న రాత్రులు ఎన్నో. ‘స్ట్రీట్ ఫుడ్’ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కాదు.. ఇప్పుడు కూడా నేనూ, అన్నయ్య రాత్రిపూట ముంబయ్‌లో హల్ చల్ చేస్తుంటాం. లోలోపల బాధపడుతూ పైకి ఆనందం నటించిన సందర్భాలున్నాయా? ఓ సంఘటన ఉంది. ఆ మధ్య మా అమ్మమ్మ చనిపోయారు. ఆ సమయానికి నేనో అవార్డు ఫంక్షన్లో డాన్స్ చేయాలి. ముందే అంగీకరించడం వల్ల రద్దు చేసుకోలేకపోయాను. స్టేజి మీద నవ్వుతూ డాన్స్ చేశాను. ఫంక్షన్ ముగిసేవరకూ పెదాలపై చిరునవ్వు చెరగనివ్వలేదు. సెలబ్రిటీస్ అంటే ఎప్పుడూ హ్యాపీగా ఉన్నట్లే కనిపించాలి. ఒకవేళ ‘అదో రకం’గా కనిపిస్తే ఏదేదో కల్పించేస్తారు కదా? అది వంద శాతం కరెక్ట్. పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు చిరునవ్వు చెరగనివ్వకూడదు. అసహనం అనిపించినా బయటపెట్టకూడదు. ఒకవేళ సహనం కోల్పోయి బయటపెట్టామనుకోండి... అప్పుడు ‘తమన్నా సరిగ్గా బిహేవ్ చేయదు’ అని ముద్ర వేసేస్తారు. మా ‘సహనమే మాకు శ్రీరామ రక్ష’ అని భావిస్తాను. డబ్బుంటే ఆనందం దానంతట అదే వస్తుందంటారు.. నిజమా? అది వాళ్ల వాళ్ల మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. డబ్బు లేకపోతే జీవితం లేదు కాబట్టి, తప్పనిసరిగా డబ్బు కావాల్సిందే. కానీ సౌకర్యవం తంగా జీవించేంత ఉంటే చాలు. అత్యాశకు పోతే అనర్థాలొస్తాయి. డబ్బుంటే ఓ భద్రతాభావం ఉంటుందని నా ఫీలింగ్. దేవుడు అందర్నీ ఐశ్వర్యవంతుల్నిచేయడు కాబట్టి, ఉన్నదాంతో తృప్తి పడితే మంచిది. ఎవరైనా మీ దగ్గర ఆనందం నటిస్తే పసిగట్టగలుగుతారా? నా సన్నిహితులు నటిస్తే పసిగట్టేస్తా. ఎందుకంటే, వాళ్ల మనస్తత్వాల మీద నాకు కొంతవరకూ ఐడియా ఉంటుంది కదా. బయటివాళ్లయితే కష్టమే. ఫైనల్‌గా హ్యాపీనెస్ గురించి మీ విశ్లేషణ? ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు. మనం ఆరోగ్యంగా ఉండటానికి కారణమయ్యే వాటిలో ‘హ్యాపీనెస్’ కూడా ఒకటి. అందుకే... వీలైనంత ఆనందంగా ఉండటానికి ట్రై చేయాలి. అందరూ మీలా హ్యాపీగా ఉంటే, ‘గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ సర్వే’లో మన దేశమే ముందుండేదేమో? అవును నిజమే (నవ్వుతూ). - డి.జి. భవాని కవర్ ఫొటో: శివమల్లాల -
అందుకనే ఆయనతో పెళ్లికి ఒప్పుకున్నా!
మీనా నవ్వితే... పూసింది పూసింది పున్నాగ! మీనా మాట్లాడితే... రేపల్లె మళ్లీ మురళి విన్నది! మీనా కవ్విస్తే... ఎన్నెన్నో అందాలు.. ఏవేవో రాగాలు! మీనా కెరీర్లో ఎన్ని హిట్టు పాటలున్నాయో... ఎన్ని హిట్టు సినిమాలున్నాయో... నిజంగా మీనా కెరీర్... ఓ సుందరకాండ! బాలనటిగా మొదలుపెట్టి... దక్షిణాదిలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన మీనా పెళ్లి తర్వాత సినిమా కెరీర్‌కు కామా పెట్టారు. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. చాలా రోజుల తర్వాత ‘దృశ్యం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇక వరుసగా సినిమాలు చేస్తానంటున్న మీనా చెప్పిన సంసారం ముచ్చట్లు, కెరీర్ కబుర్లు... పెళ్లయిన తర్వాత సినిమాలు చేయడం చాలా తగ్గించేశారు... ఎందుకని? మీనా: దాదాపు మూడు, నాలుగేళ్లు మాత్రమే సినిమాలు చేయలేదు. ఆ నాలుగేళ్లూ మావారే నాకు మంచి కంపెనీ. రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. ఏది నచ్చితే అది చేసేంత తీరిక. నిజం చెప్పాలంటే నేను జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది పెళ్లి తర్వాతే. అప్పటివరకు పరిగెత్తి పరిగెత్తి సినిమాలు చేశాను. దాంతో పెళ్లి తర్వాత రిలీఫ్‌గా అనిపించింది. మీ శ్రీవారి గురించి చెబుతారా? మీనా: మావారి పేరు విద్యాసాగర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా ఇద్దరి మనస్తత్వాలూ ఒకటే. నాకు సరదాగా ఉండటం ఇష్టం. ఆయనకు కూడా అంతే. అయితే నాకన్నా నాలెడ్జబుల్ పర్సన్. నాకు తెలియని ఎన్నో విషయాలను ఆసక్తిగా చెబుతుంటారు. ఆయన దగ్గర నాకు నచ్చిన విషయాల్లో అదొకటి. మీది ప్రేమ వివాహమా? మీనా: అదేం కాదు కానీ, ఇద్దరికీ ముందే పరిచయం ఉంది. ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశాం. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. అయితే, పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ సమయంలో మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మా అమ్మే ఆయన ప్రస్తావన తీసుకొచ్చింది. ఆయ నను వద్దనుకోవడానికి కారణాలేవీ కనిపించలేదు. అందుకని ఒప్పుకున్నా. పెళ్లి తర్వాత మీ జీవితంలో ఏమైనా మార్పులొచ్చాయా? మీనా: మార్పంటే.. నాకు నేనుగా కొన్ని నిబంధనలు పెట్టుకున్నాను. ఒక దశ తర్వాత మన ప్రాధాన్యతలేంటో మనకు తెలిసిపోతాయ్. అలాగే, సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నా. బయటకు నేను పెద్ద స్టార్‌ను కావచ్చు. ఇంట్లో మాత్రం సాదాసీదా అమ్మాయినే. భార్యగా, తల్లిగా మిగతా ఆడవాళ్లు తమ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తారో నేనూ అంతే. పదిహేను, ఇరవయ్యేళ్లు బిజీగా సినిమాలు చేశారు కదా.. ఒక్కసారిగా ‘జాబ్ లెస్’ గా ఉండడం బాధగా అనిపించలేదా? మీనా: మొదట్లో అంత తీరిక బాగానే ఉన్నా, ఆ తర్వాత మాత్రం ఏదో ఒక వ్యాపకం లేకుండా ఉండలేం అనిపించింది. నా భర్త, పాపకు తగిన సమయం కేటాయిస్తూనే, అడపా దడపా సినిమాలు చేయాలనుకున్నాను. భార్య, తల్లి... బాధ్యతలు ఎలా అనిపిస్తున్నాయి? మీనా: చెప్పాలంటే పెళ్లయిన తర్వాత బాధ్యతలు పెరిగాయి. జీవితం గురించి బోల్డన్ని విషయాలు తెలిశాయి. ఇక, అమ్మ అయిన తర్వాత అయితే జీవితం ఇంకా అద్భుతంగా ఉంది. మా పాప పేరు నైనిక. పాపకు మూడేళ్లు వచ్చేశాయి. మాటలు రాకముందు తనెందుకు ఏడుస్తుందో తెలియక సతమతమయ్యేదాన్ని. ఇప్పుడు ఫరవాలేదు. ఇవన్నీ చూశాక, నన్ను పెంచడానికి మా అమ్మ ఎంత కష్టపడి ఉంటుందో అనిపించింది. ‘నేను కరెక్ట్‌గానే పెంచుతున్నానా’ అని అమ్మను చీటికీ మాటికీ అడుగుతుంటాను. పాపకు ఏం తినిపించాలి? ఎలాంటి దుస్తులు వేయాలి.. ఇలా అన్ని విషయాల్లోనూ నాకు టెన్షనే. షూటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడు మీ అమ్మాయిని మిస్ అయిన ఫీలింగ్ కలగదా.. మిమ్మల్ని సినిమాల్లో చూసి తనెలా స్పందిస్తుంది? మీనా: నాతో పాటు షూటింగ్స్‌కు తీసుకెళ్లిపోతుంటాను. ఒకవేళ ఇంట్లో వదిలి వెళితే నాకు మనశ్శాంతిగా ఉండదు. టీవీలో నా సినిమాలొస్తే ‘అమ్మా... నువ్వే’ అని గుర్తుపడుతోంది. నేను విడిగా బయటికెళ్లినప్పుడు అందరూ గుర్తుపట్టి, ‘హాయ్ మీనాగారు’ అని పలకరిస్తారు. అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ, నా సొంత కూతురే నన్ను గుర్తుపడితే ఇక ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంత. మీ అమ్మా, నాన్నకు మీరొక్కరే కూతురు.. మీకు కూడా అంతేనా? మీనా: (నవ్వుతూ) ఏమోనండి.. ఆ విషయం గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు . మీ మాతృభాష తమిళమనీ, కాదు తెలుగు అనీ చాలామంది అంటారు? అసలు మీ మాతృభాష ఏంటి? మీనా: మా అమ్మగారు మలయాళీ. నాన్న గారు తెలుగువారు. నేను పుట్టి, పెరిగింది చెన్నయ్‌లోనే. ఇంట్లో ఎక్కువగా తమిళమే మాట్లాడతాం. మీ కెరీర్ విషయంలో మీ అమ్మా, నాన్న సపోర్ట్ చాలా ఉంది కదా? మీనా: నాకు అన్ని విధాల అండ మా అమ్మే. ఏది ఒప్పో.. ఏది తప్పో వివరించి చెప్పేది. నాన్న సపోర్ట్ లేకపోతే అసలు నా కెరీర్ సాఫీగా సాగేది కాదు. మీ అమ్మా, నాన్నకు మీరొక్కరే అమ్మాయి కాబట్టి, చాలా గారాబంగా పెంచారా? మీనా: ఎక్కడ స్ట్రిక్ట్‌గా ఉండాలో అక్కడ ఉంటారు. మిగతా సమయాల్లో మామూలుగా ఉంటారు. మరి.. మీ మీరెలాంటి మదర్? మీనా: మా అమ్మా, నాన్న నన్ను పెంచినట్లుగానే మా అమ్మాయిని నేను పెంచాలనుకుంటున్నా. అన్ని విషయాలూ నేర్పించి, మంచి గైడ్‌గా ఉండాలన్నది నా కోరిక. మా అమ్మా నాన్న తప్పొప్పులు చెప్పి, ‘నీకేది మంచి అనిపిస్తే అది చెయ్యి’ అనేవారు. మా అమ్మాయి విషయంలో నేనూ అదే చేస్తా. మీ సినిమాల విషయంలో మీ భర్త జోక్యం ఎంతవరకూ ఉంటుంది? మీనా: ఆయన జోక్యం అసలు ఉండదు. ఎందుకంటే, నాకో పది అవకాశాలొస్తే నేనే రెండు, మూడు మినహా ఒప్పుకోవడం లేదు. పాత్రల ఎంపిక పరంగా నేనంత జాగ్రత్తపడుతున్న విషయం ఆయనకు తెలుసు. అందుకే, ఆయన ఇన్వాల్వ్ కారు. ఓకే... ఇటీవల విడుదలైన ‘దృశ్యం’ విషయానికొద్దాం... మలయాళంలో మీరే చేసిన పాత్రను మళ్ళీ తెలుగులో చేసినప్పుడు ఎలా అనిపించింది? మీనా: మలయాళ సినిమా అంతా అయ్యాక చూసినప్పుడు ‘ఇది బాగుంది కానీ, ఇంకా బెటర్‌గా చేసుండొచ్చు’ అనుకున్నా. ఇప్పుడు మళ్లీ తెలుగులో అదే పాత్ర చేస్తూ, ఆ బెటర్మెంట్ ఉండేలా చూసుకున్నాను. గతంలో వెంకటేశ్‌తో ‘చంటి’, ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. చాలా విరామం తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేయడం పట్ల మీ ఫీలింగ్? మీనా: వెంకీగారితో మళ్లీ యాక్ట్ చేయడం ఆనందం అనిపించింది. షూటింగ్ అంతా కూల్‌గా సాగింది. అయితే గతంలో నేనాయనతో సినిమాలు చేసినప్పుడు పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. అప్పట్లో నేను మితభాషిని. ఇప్పుడు చాలా మారాను. మితభాషిని అన్నారు... ఎందుకని? మీనా: మద్రాసులోనే పెరిగినందువల్ల తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడితే.. ఎవరి మనసైనా నొచ్చుకుంటుందేమో... అపార్థం చేసుకుంటారేమోనని భయం. కొంచెం అమాయకంగా కూడా ఉండేదాన్ని.. అభద్రతాభావం ఉండేది. అందుకని నా పనేంటో నేనేంటో అన్నట్లుగా ఉండేదాన్ని. కలుపుగోలుగా ఉంటే, అడ్వాంటేజ్ తీసుకుంటారేమోనని భయం. దాంతో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. దానివల్ల ‘మీనాకు తలబిరుసుతనం’ అన్నవాళ్లు ఉన్నారు. వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి పరిస్థితిని అయినా అధిగమించగలననే ధైర్యం ఏర్పడింది. ఆ తర్వాత కొంచెం మాట్లాడడం మొదలుపెట్టాను. చిన్నప్పటి నుంచీ ఈ రంగంలో ఉన్నారు. ఏదైనా పశ్చాత్తాపపడాల్సిన సంఘటనలున్నాయా? మీనా: వ్యక్తిగతంగా ఏమీ లేవు. కానీ, డేట్స్ అడ్జస్ట్ చేయలేక కొన్ని మంచి సినిమాలు వదులుకున్నాను. అది మాత్రం ఎప్పటికీ బాధగా ఉంటుంది. నేను వదులుకున్న సినిమాల్లో ‘నరసింహ’లో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర ఒకటి. ఆ సినిమా అప్పుడు రజనీకాంత్ సార్ ఫోన్ చేసి, ‘నువ్వు చేస్తున్నావ్.. కంగ్రాట్స్’ అన్నారు. మా అమ్మకు ఆ పాత్ర అంత సంతృప్తిగా అనిపించలేదు. డేట్సూ లేవు. కారణాలేవైనా ఓ మంచి పాత్ర వదులుకున్నా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నన్ను శివాజీ గణేశన్గారే పరిచయం చేశారు. ‘నరసింహ’లో ఆయన నటించిన విషయం తెలిసిందే. ఒకవైపు శివాజీ సార్, మరోవైపు రజనీ సార్ నటించిన సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతుంటా. అలాగే, కృష్ణవంశీ కంటిన్యూస్‌గా రెండు నెలలు డేట్స్ అడగడంతో ‘నిన్నే పెళ్లాడతా’ మిస్సయ్యా. అప్పుడు నాలుగు భాషల్లో సినిమాలు చేయడం వల్ల ఒక సినిమాకు వరుసగా 20 రోజులు డేట్స్ ఇవ్వడమే గగనంగా ఉండేది. అలాంటిది 2 నెలలా అని ఆలోచనలోపడ్డాను. కరెక్ట్‌గా ప్లాన్ చేసి చెప్పమని కృష్ణవంశీని అడిగితే ‘కరెక్ట్‌గా ప్లాన్ చేసే చెబుతున్నా.. రెండు నెలలు కావాల్సిందే’ అన్నారు. దాంతో వదులుకోక తప్పలేదు. రజనీకాంత్‌తో బాలనటిగా చేసి, ఆయన పక్కనే హీరోయిన్గా చేశారు కదా.. ఎలా అనిపించింది? మీనా: రజనీ సార్‌తో తమిళంలో ‘అన్బుళ్ల రజనీకాంత్’ సినిమా చేసినప్పుడు ఆయన నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేసేవారు. నాకు బాగా నిద్ర వచ్చినప్పుడు, జో కొట్టేవారు కూడా. ఇక, నేను హీరోయిన్గా చేయడం మొదలుపెట్టిన తర్వాత దర్శకుడు ఆర్.వి. ఉదయ్‌కుమార్ ఒక కథ చెప్పి, రజనీగారి పక్కన యాక్ట్ చేయాలన్నారు. జోక్ చేస్తున్నారేమో అనుకున్నా. కానీ, ఆయన సీరియస్‌గానే చెబుతున్నారని తెలుసుకుని, ‘అసలు రజనీ సార్ నాతో చేస్తారా’ అన్నాను. కానీ, రజనీ సార్ కూడా చేస్తానన్నారట. వాస్తవానికి ఉదయ్‌కుమార్‌గారు ఆ సినిమాకు అడిగినప్పుడు, నేను తెలుగులో ఫుల్ బిజీ. పైగా, ఉదయ్‌కుమార్‌గారు అడిగిన డేట్స్ కమల్ హాసన్‌గారి సినిమాకిచ్చాను. అందుకని, ‘ఇది జరగదులే’ అనుకున్నాను. ఓ రోజు ఏవీయం శరవణన్‌గారు ఫోన్ చేసి, ‘ఈ సినిమా చేయాలి’ అన్నారు. ఎలాగోలా డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చాను. అదే ‘ముత్తు’ సినిమా. మొదటిరోజు షూటింగ్ అప్పుడు రజనీ సార్‌తో ‘ఏం మాట్లాడాలి.. ఎలా మెలగాలి’ అని సతమతమయ్యాను. సూపర్‌స్టార్ పక్కన చేస్తున్నామన్న థ్రిల్ ఓ వైపు.. భయం మరోవైపు.. ఇలా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేదాన్ని. కొన్నిరోజుల తర్వాత అడ్జస్ట్ అయ్యాను. శివాజీ గణేశన్‌తో బాలనటిగా చేశారు కదా.. ఆ అనుభవాలు గుర్తున్నాయా? మీనా: తమిళ సినిమా ‘నెంజంగళ్’ అది. శివాజీ సార్ చుట్టూ, నా చుట్టూనే ఆ సినిమా తిరుగుతుంది. అప్పుడు నా వయసు మూడున్నరేళ్లు ఉంటుందేమో. అసలు సినిమా అంటే ఏంటో తెలియదు. డైలాగ్స్ నేర్పించేవారు.. చెప్పేసేదాన్ని. ఈ షూటింగ్ అప్పుడు నాకు బాగా గుర్తున్న విషయం ఒకటి చెబుతాను. లంచ్ టైమ్‌లో శివాజీ సార్ గదికి వెళ్లిపోయేదాన్ని. ఎందుకంటే, ఆయనకు ఇంటి నుంచి చికెన్ 65 లాంటి వెరైటీలు వచ్చేవి. వాటి కోసం వెళ్లిపోయేదాన్ని. మా అమ్మేమో ‘రోజూ వెళితే బాగుండదు’ అని మందలించేది. దాంతో ఎప్పుడైనా ఒక రోజు వెళ్లకపోతే... శివాజీ సారే ‘ఏంటీ ఇవ్వాళ్ల రాలేదు.. రారా.. కలిసి భోంచేద్దాం’ అని పక్కన కూర్చోబెట్టుకుని, నేను తినేవరకూ ఊరుకునేవారు కాదు. చిన్నప్పుడే సినిమాల్లోకి రావడం వల్ల చదువుకునే తీరిక చిక్కి ఉండేది కాదేమో? మీనా: ప్రైవేట్‌గా ఎం.ఏ హిస్టరీ చేశాను. అమ్మా, నాన్నకు చదువంటే ఇష్టం. వాళ్ల కోరిక తీర్చడం కోసమే చదువుకున్నాను. కానీ, సినిమాలు చేస్తూ, చదవడం అంత సులువు కాదు. ‘కర్తవ్యం’లో చిన్న పాత్ర చేశారు కదా.. వెంటనే హీరోయిన్ ఎలా అయ్యారు? మీనా: ఈతరం ఫిలింస్ పోకూరి బాబురావుగారు ఏదో సినిమాకి హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. నేను వెళితే స్క్రీన్ టెస్ట్ చేసి, తీసుకున్నారు. అలా హీరోయిన్గా తెలుగులో ‘నవయుగం’ నా తొలి సినిమా. మీ కెరీర్లో కీలకంగా నిలిచిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ జ్ఞాపకాలు...? మీనా: ముందు ఆ సినిమా చేయకూడదనుకున్నా. ఎందుకంటే అంతకుముందు చేసిన ‘నవయుగం’ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన ‘ప్రజల మనిషి’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో ఇక చదువుకుందామనుకున్నాను. అమ్మా, నాన్న కూడా అదే మంచిదనుకున్నారు. అప్పుడు హరిగారని ఓ అసిస్టెంట్ డెరైక్టర్ వచ్చి, క్రాంతికుమార్‌గారు ఓ సినిమా చేయాలనుకుంటున్నారని, నన్ను తీసుకోవాలనుకుంటున్నారని చెప్పారు. మాకు ఇంట్రస్ట్ లేదని అమ్మ చెప్పింది. ‘ఈ ఒక్క సినిమా ట్రై చేయండి. చాలా మంచి కేరెక్టర్. ఓ తాత, మనవరాలి కాంబినేషన్లో జరిగే కథ. మీకు క్రాంతికుమార్‌గారి గురించి తెలియడం లేదు. చాలా గొప్ప డెరైక్టర్’ అన్నారు. సరేనని వెళ్లాం. కొద్దిగా మేకప్ వేసి, ఆ తర్వాత మేకప్ లేకుండా ఫొటోషూట్ చేసి, ఓకే అన్నారు. ‘అయ్యో.. ఓకే అయ్యిందా’ అనుకున్నా. కట్ చేస్తే ఆ సినిమా బాగా ఆడడం, నేను 200 చిత్రాల దాకా చేయడం జరిగిపోయాయి. ఆ సినిమా సమయంలో అక్కినేని నాగేశ్వరరావుగారు సలహాలిచ్చేవారా? మీనా: ‘మనం ఎవరి కోసమైనా వెయిట్ చేయొచ్చు.. మన కోసం ఎవరూ వెయిట్ చేయకూడదు’ అని ఏయన్నార్ గారు చెప్పారు. ఆయన నాకిచ్చిన మొదటి సలహా అది. ఆ సినిమా విడుదలైన తర్వాత... ‘లొకేషన్లో నువ్వు యాక్ట్ చేసినప్పుడు అంతగా అనిపించలేదు. కానీ, సినిమాలో చూస్తే చాలా బాగానే యాక్ట్ చేశావ్ అనిపించింది’ అని మెచ్చుకున్నారు. చివరిసారిగా నాగేశ్వరరావు గారిని ఎప్పుడు కలిశారు? మీనా: చెన్నైలో గత ఏడాది జరిగిన వందేళ్ల భారతీయ సినిమా పండగకు అన్ని భాషలకు చెందిన వాళ్లూ వచ్చారు. చెన్నైలోనే ఏయన్నార్‌గారి పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ వేడుకలో నేనూ పాల్గొన్నా. ఆయనను చూడడం అదే చివరిసారి. ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘మనం’ ఇటీవల చూసినప్పుడు, కొద్దిగా ఎమోషనల్ అయ్యాను. కథానాయికల కెరీర్ తక్కువ కాలం ఉంటుంది కదా. ఆ స్టార్ హోదా నుంచి పక్కకు రావాల్సొచ్చినప్పుడు చాలామంది ఎంతో బాధపడతారు. మరి మీరెలా? మీనా: కథానాయికల కెరీర్ చాలా తక్కువ కాలమని నాకు తెలుసు. అయినప్పటికీ నేను పది, పదిహేనేళ్లు చేయగలిగాను. ఉన్నంతవరకూ మంచి సినిమాలు చేయగలిగాను. మొత్తం నాలుగు భాషల్లోనూ 200కి పైగా సినిమాలు చేశాను. ఇక, ఇంతకన్నా ఏం కావాలి? దక్షిణాది భాషల్లో స్టార్ హీరోలందరి సరసన చేశారు కదా.. అప్పట్లో ఎలా అనిపించింది? మీనా: అసలా ఫేమ్‌ను గ్రహించే తీరిక ఉండేది కాదు. ఇంత పెద్ద స్టార్స్‌తో చేస్తున్నాం, ఇన్ని మంచి పాత్రలు చేస్తున్నాం అని ఎప్పుడూ ఆలోచించలేదు. వరుసగా సినిమాలు చేయడం, చేయబోయే సినిమాల కథలు వినడంతోనే సరిపోయేది. పెళ్లయిన తర్వాతే నా కెరీర్ వైభవం గురించి ఆలోచించే తీరిక చిక్కింది. అది కూడా ఎక్కడైనా బయటికెళ్లినప్పుడు ‘సినిమాలు ఎందుకు మానేశారు? మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం’ అని అందరూ అంటున్నప్పుడు, ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, చేసిన సినిమాలను గుర్తు చేసుకుంటుంటాను. మీనాకు తలబిరుసుతనం అనే వ్యాఖ్యలు విని, బాధపడేవారా? మీనా: మొదట్లో నాకు తెలియలేదు. ఆ తర్వాత తర్వాత తెలిసింది. ‘మన గురించి ఎందుకలా అనుకుంటున్నారు’ అని ఆలోచించేదాన్ని. ఆ తర్వాత తేలికగా తీసుకునేదాన్ని. మనమేంటో మనకూ, మన కుటుంబానికీ తెలుసు. బయటివాళ్లకు తెలియకపోతే ఏంటిలే అనుకునేదాన్ని. కానీ, నాతో ఫ్రెండ్స్ అయిన తర్వాత ‘మీరింత స్వీట్ పర్సనా? చాలా బాగా మాట్లాడుతున్నారే. కానీ, మీ గురించి మేం వేరేలా అనుకున్నాం’ అనేవారు. పోనీలే.. ఇప్పుడైనా తెలుసుకున్నారు కదా అనేదాన్ని. ఒకప్పుడు స్లిమ్‌గా ఉండేవారు... ఇప్పుడలా ఉండాలనుకోవడం లేదా? మీనా: పాప పుట్టిన తర్వాత బరువు పెరిగాను. మావారైతే నా బరువు గురించి ఆటపట్టిస్తుంటారు. మా పాప అన్నప్రాసన గుళ్లో చేస్తే, ఆ ఫొటోలు బయటికొచ్చాయి. అప్పుడు నేనింకా లావుగా ఉండేదాన్ని. పాప పుట్టిన తర్వాత నా గురించి నేను ఆలోచించడం మానేశాను. ఇప్పుడు మా నైనికకు మూడేళ్లు వచ్చేశాయ్. మాటలు వచ్చేశాయ్ కాబట్టి, తనకేం కావాలో చెబుతోంది. అందుకని టెన్షన్ తగ్గింది. ఇక, ఇప్పుడు నా గురించి కూడా ఆలోచించడం మొదలుపెడతా. - డి.జి. భవాని -
అప్పుడు ఆ మేడ మెట్లే నాకు నీడ అయ్యాయి!
బిహైండ్ ది రీల్ ఏచూరి చలపతిరావు చెన్నైలోని కోడంబాకం... ఫుల్ బిజీ ఏరియా. కార్లు.. బస్సులు... ఆటోలు. ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ ఓ 74ఏళ్ల ముసలాయన.. సారీ.. యువకుడు సైకిల్ మీద సవారీ చేస్తూ కనిపిస్తే కచ్చితంగా ఆయన ఏచూరి చలపతిరావే. ఏచూరి గురించి ఏం చెప్పాలి? స్టార్ జర్నలిస్ట్ అనాలా! సీనియర్ ఆర్టిస్టు అని చెప్పాలా! 62ఏళ్ల హిస్టరీ ఆయనది.. తెలుగు సినిమా చరిత్ర టకీటకీమని చెప్పేయగలరు. దాదాపు వెయ్యి సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ, ఏం లాభం? నో బ్యాంక్ బ్యాలెన్స్... నో ఫ్లాట్. పాతకాలం సైకిలే ఆయనకు మిగిలిన ఆస్తి. ఉంటున్నది రెండు గదుల అద్దె ఇల్లు. అద్దె నాలుగువేలు, కరెంటు బిల్లు వెయ్యిరూపాయలు. 97ఏళ్ల తల్లి... 73ఏళ్ల భార్యతో ఆ ఇంట్లోనే ఏచూరి రోజులు నెట్టుకొస్తున్నారు... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ‘అమ్మ క్యాంటీన్’ ఆయన పాలిట అక్షయపాత్ర. రూపాయికి ప్లేటు ఇడ్లీ... ఐదు రూపాయలకు పొంగల్. పెరుగన్నం... సాంబారన్నం ఖరీదు కూడా ఐదు రూపాయలే. ఇంట్లో ఆడవాళ్లకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆహారానికి అమ్మ క్యాంటీనే ఆసరా. మరి... నెలసరి ఖర్చులకు ఏచూరి ఏం చేస్తారు?.. ఎవరి దగ్గరా చెయ్యి చాచరు.. ఎవరికీ తలవొంచరు. ‘‘ఆ పరిస్థితే వస్తే చావడానికైనా రెడీ. ఆత్మాభిమానాన్ని వదులుకోను’’ అన్నారు ఏచూరి. ఆరోగ్యం బాగాలేకపోతే తేజ ఆసుపత్రి అధినేతలు డా. నండూరి విజయసారధి, డా. సరోజిని వైద్యం చేస్తారని ఏచూరి చెప్పారు. పాత్రికేయుల్లో ఇంటూరి వెంకటేశ్వరరావు తన గురువని, కంపెల్ల రవిచందర్ మిత్రుడని, బీఏ రాజు, జయ చేసిన సహాయం మర్చిపోలేనిదని ఏచూరి చెప్పారు. నాటి తరం నటుల్లో ఏచూరికి తెలియనివాళ్లు లేరు. ఎన్టీఆర్, ఎస్వీఆర్‌ల అభిమానం పొందిన వ్యక్తి. శోభన్‌బాబుతో ఒకే కంచం, ఒకే మంచం తరహా స్నేహం... కృష్ణ, కృష్ణంరాజు... ఇలా ఎంతోమంది ఏచూరిని ఇష్టపడతారు. దాసరి నారాయణరావు, మోహన్‌బాబు, కె. బాపయ్య, శారద, గీతాంజలి, ఎమ్మెస్ రాజు వంటివారు పంపించే డబ్బే జీవనాధారం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, సాయిబాబా ట్రస్ట్ నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. అసలు ఏచూరి జీవిత విశేషాలేంటి? విలేకరి నుంచి నటుడిగా ఎందుకు మారారు? ఆ విషయాలు తెలుసుకుందాం... 1940 నవంబర్ 13న కోనసీమలోని మాగాం గ్రామంలో పుట్టారు ఏచూరి. ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకున్నారు. రాజబాబు, మాడా ఈయన క్లాస్‌మెట్స్. ఏచూరికి సినిమాలంటే పిచ్చి ప్రేమ. వచ్చిన ప్రతి సినిమా చూసి, వాటి గురించి కథనాలు రాయడం... విమర్శనాత్మక కథనాలు బోల్డన్ని. అన్నిటికీ అభినందనలే. ఇక, సొంత ఊళ్లో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులపాలు కాక తప్పదని, పన్నెండేళ్ల వయసులోనే మద్రాసు వెళ్లారు. అప్పటికే ఏచూరి రాసిన కథనాలకు మంచి గుర్తింపు రావడంతో విలేకరిగా అవకాశం వచ్చింది. అయితే మద్రాసులో ఎక్కడ ఉండాలి?... ‘‘అప్పటిమోడర్న్ థియేటర్ మెట్లే కొండంత నీడ అయ్యాయి’’ అన్నారు ఏచూరి. చాలీచాలని జీతం.. కడుపునిండా భోంచేసిన రోజులు చాలా తక్కువ. కానీ, ప్రశంసలకు కొరత లేదు. ‘భేష్.. ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా రాస్తున్నావు’ అని అభినందించినవారూ ఉన్నారు. ఆగ్రహించినవాళ్లూ లేకపోలేదు. ఒకసారి ఏదో కథనం రాస్తే... ఎన్టీఆర్, ఏయన్నార్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తే, శోభన్‌బాబు, కృష్ణ అభిమానులు ఏచూరిని వెనకేసుకొచ్చారు. కళాకారులకు అభిమానులుంటారు కానీ, ఓ విలేకరి అభిమానులను సంపాదించుకోవడం గ్రేటే... ఓ రోజు.. ‘ఏరా ఇలా విలేకరిగా కొనసాగితే ఇక ఎప్పటికీ సంపాదించలేవు.. ఆర్టిస్ట్‌గా ట్రై చేయి’ అని ఎస్వీఆర్ సలహా ఇచ్చారు. అది ఏచూరికి నచ్చింది. అంతే.. ఒకవైపు రచన, మరోవైపు నటనతో ఫుల్ బిజీ అయ్యారు. తెలుగులో తొలి సినిమా ‘కనకదుర్గ పూజా మహిమ’. కమలాకర కామేశ్వరరావు, విఠలాచర్య, దాసరి నారాయణరావు, ముత్యాల సుబ్బయ్య, పోకూరి బాబూరావు తదితరులు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు. కన్నడంలో ‘మహా కబీరు’ అనే చిత్రంలో యాచకుడిగా చేశారు. ఆ పాత్రలో నిజమైన యాచకుడేమో అనుకునేలా ఒదిగిపోయారు ‘‘అది సినిమా కోసం వేసిన వేషం. నిజజీవితంలో దుర్భరమైన పరిస్థితులు చవి చూసినా, ఎవరి దగ్గరా చెయ్యి చాపలేదు’’ అన్నారు ఏచూరి. ఆ మధ్య విడుదలైన ‘సుడిగాడు’ వరకూ ఆయన చేసిన సినిమాలు దాదాపు వెయ్యి. ‘‘అన్ని సినిమాలు చేసినా సహాయ నటుణ్ణి కాబట్టి పారితోషికం తక్కువ. అందుకే, ఏమీ సంపాదించుకోలేకపోయా’’ అన్నారు ఏచూరి. ఓసారి కృష్ణ అయితే.. ‘‘నాతో పాటు ఉందువుగానీ.. నా వ్యవహారాలన్నీ చూసుకుందువుగానీ వచ్చెయ్’’ అన్నారట. ‘‘అదే చేసి ఉంటే ఈపాటికి ఓ మేడ, పడవలాంటి కారు ఉండేవేమో.. అంతా జాతకం’’ అన్నారు ఏచూరి. అన్నట్లు.. ఏచూరి జాతకం కూడా చెబుతారు. 20ఏళ్ల క్రితమే ఆంధ్ర రాష్ట్రం విడిపోతుందని, వైజాగ్‌లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేస్తే మంచిదని చెప్పారు. నక్షత్రం చెబితే చాలు.. మన జీవితం చెప్పేస్తారు. అందరి జాతకం చెప్పే ఏచూరి.. ఇటీవల తన జాతకాన్ని తిరగేశారు. షాక్‌లాంటి నిజం తెలిసింది. ‘‘వచ్చే ఏడాదిన్నర, రెండేళ్లల్లో మా ఇంట్లో ఏదో అశుభం జరగనుంది. అది మరణానికి సంబంధించినది’’ అని చెప్పారు ఏచూరి. బహుశా ఆయన తల్లికి 97ఏళ్లు కాబట్టి.. ఆవిడకే ఏదైనా... అని ఊహించుకోవచ్చు. కానీ.. అది కాదు.. ‘‘నా జీవితం మరో ఏడాదిన్నర, రెండేళ్లలోపు ముగుస్తుంది’’ అని సింపుల్‌గా చెప్పారు. ఇప్పటివరకు ఏచూరి చెప్పిన జాతకాలన్నీ దాదాపు నిజమయ్యాయట. ఈసారి నిజం కాకపోతే ఎంత బావుంటుందో కదా! - డి.జి. భవాని