Super Hero Sonu Sood Exclusive Interview With Sakshi | చివరి చూపు అయినా దక్కాలి కదా! - Sakshi
Sakshi News home page

చివరి చూపు అయినా దక్కాలి కదా!

Published Tue, Jun 1 2021 12:17 AM | Last Updated on Tue, Jun 1 2021 4:37 PM

Sakshi Special Interview With Actor Sonu Sood

వలస కార్మికులు ఇళ్లు చేరడానికి సహాయపడుతున్నాడు. ఆకలి బాధ తీరుస్తున్నాడు. ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్‌ చేయిస్తున్నాడు. ఊపిరి (ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల సరఫరా) పోస్తున్నాడు. మనిషిని బతికించడానికి చేతనైంత చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో సాయంతో ముందుకు వచ్చాడు.. మనిషి చనిపోతే.. వేరే ఊర్లో ఉండే అయినవాళ్లు వచ్చేలోపు భౌతికకాయాన్ని భద్రపరిచే వీలు లేక అంత్యక్రియలు చేస్తుంటే.. భద్రపరచడానికి ఫ్రీజర్‌ బాక్సులు ఇవ్వాలనుకున్నాడు. రీల్‌ లైఫ్‌లో సోనూ సూద్‌ విలన్‌. రియల్‌ లైఫ్‌లో హీరో. ఇవన్నీ చేయడానికి సోనూ వెనక ఉన్నది ఎవరు? ఏ పొలిటికల్‌ పార్టీ ఉంది? ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో సోనూ సూద్‌ పలు విషయాలు చెప్పారు.

► మనిషి తన ఇల్లు చేరుకోవడానికి, ప్రాణాపాయంలో ఉంటే బతికి బయటపడటానికి మీకు చేతనైన సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మనిషి కన్నుమూశాక కుటుంబ సభ్యులకు ‘చివరి చూపు’ దక్కాలనే ప్రయత్నం మొదలుపెట్టారు.. ఈ కొత్త సహాయం గురించి?
సోనూ సూద్‌: నేను చిన్న టౌన్‌ (పంజాబ్‌లోని మోగా) నుంచి వచ్చాను. నగరాలతో పోల్చితే పట్టణాల్లో, గ్రామాల్లో సౌకర్యాలు తక్కువగా ఉంటాయని తెలిసినవాడిని. ముఖ్యంగా ఈ లాక్‌డౌన్‌ టైమ్‌లో ఒకచోటు నుంచి ఇంకో చోటుకి వెళ్లడం ఎంత ఇబ్బందో తెలిసిందే. గ్రామాల్లో ఉన్నవాళ్లు చనిపోతే సిటీలో ఉంటున్న వాళ్ల దగ్గర బంధువులు వెళ్లడానికి ఆలస్యం అవుతోంది. ఈలోపు భౌతికకాయన్ని భద్రపరిచే సౌకర్యం లేకుండా అల్లాడుతున్నారు. అయినవాళ్లు రాకముందే అంత్యక్రియలు జరిపించేస్తున్నారు. ‘చివరి చూపు’ అయినా దక్కాలి కదా! అది కూడా దక్కకపోతే ఆ బాధ జీవితాంతం ఉండిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది మాకు ఈ విషయం గురించి ఫోన్‌ చేసి చెప్పారు. అందుకే ‘డెడ్‌ బాడీ ఫ్రీజర్‌ బాక్స్‌’లను పంపాలనుకున్నాం. అడిగినవాళ్లకు అడిగినట్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నాం.

► దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ అందజేయాలనే ఆలోచన గురించి?
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువమంది కరోనా బాధితులు ఆక్సిజన్‌ దొరక్క కన్నుమూస్తున్నారు. ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్స్‌ కోసం దేశవ్యాప్తంగా మాకు మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే ప్యాన్‌ ఇండియా ఆక్సిజన్‌ సిలిండర్ల పంపిణీ గురించి ఆలోచించాం. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరతను తగ్గించి కోవిడ్‌ బాధితులకు సహాయం చేయడానికి దాదాపు 20కి పైగా ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను ఆరంభించనున్నాం.

► గొప్ప నాయకుడు భగత్‌ సింగ్‌ పుట్టిన ప్రాంతానికి చెందిన మీరు హిందీలో తొలి చిత్రం ‘షాహిద్‌–ఇ–అజామ్‌’లో భగత్‌ సింగ్‌ పాత్ర చేశారు. ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల దృష్ట్యా మిమ్మల్ని చాలామంది భగత్‌ సింగ్‌తో పోల్చడంపై మీ ఫీలింగ్‌?
నన్ను గొప్ప గొప్ప వ్యక్తులతో పోలుస్తున్నారు. దాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. అలాగే ప్రజల నమ్మకం నా బాధ్యతను ఇంకా పెంచుతోంది. నా సాయం కోరుకున్నవారు ఏ మారుమూల ప్రాంతాన ఉన్నా వారిని చేరుకోవాలనే నా సంకల్పాన్ని మరింత బలపరిచింది.

► సహాయ కార్యక్రమాలు చేయడానికి మా అమ్మానాన్న స్ఫూర్తి అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఏ విధంగా వారిని చూసి స్ఫూర్తి పొందారో ఉదాహరణ చెబుతారా?
నా చిన్నతనం నుంచే మా అమ్మనాన్నల ద్వారా ఇతరులకు సాయం చేయడాన్ని నేర్చుకున్నాను. ఇతరులకు సహాయపడటానికి ఇద్దరూ ఎప్పుడూ ముందుండేవారు. అలా నా కళ్ల ముందే నాకో మంచి ఉదాహరణ ఉంది. నాలోనే కాదు.. నా భార్య, నా కొడుకులో కూడా పరోపకార  గుణం ఉంది. ప్రతి ఒక్కరం మన సామర్థ్యం మేరకు ఇతరులకు సాయం చేయాల్సిన సమయం ఇది. ఈ కరోనా టైమ్‌లో ‘గివింగ్‌ బ్యాక్‌ టు సొసైటీ’ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి.

► ఇతరులకు సహాయపడాలంటే గొప్ప మనసు మాత్రమే కాదు.. ఆర్థిక బలం కూడా ఉండాలి. మీకు ఎక్కడ్నుంచి ఆర్థిక బలం వస్తోంది?
తోటివారికి సాయపడాలంటే మనం సంపన్నులమై ఉండాల్సిన అవసరం లేదు. కాస్త మంచి మనసు ఉంటే చాలు. మనం చేస్తున్న హెల్ప్‌ను చూసి ఎవరైనా స్ఫూర్తి పొంది, సహాయం చేస్తే అది మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఎవరికి సాయం చేయాలో తెలియక? ఎలా చేయాలో తెలియక కొందరు మా ‘సోనూ సూద్‌ చారిటీ ఫౌండేషన్‌’కు డబ్బు అందజేస్తున్నారు. చూపు లేని ఓ అమ్మాయి తన ఐదు నెలల పెన్షన్‌ 15000 రూపాయలు, రైల్వేస్‌కు చెందిన మరో హ్యాండీకాప్డ్‌ పర్సన్‌ 60 వేల రూపాయలను మా ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. దీన్నిబట్టి మన చుట్టూ ఎంతమంది మంచివాళ్లు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

► మీ సాయం పొందినవాళ్లల్లో కొందరు వాళ్ల పిల్లలకు మీ పేరు పెట్టుకున్నారు.. ‘ఐయామ్‌ నాట్‌ ఎ మెస్సయ్య’ (మహాపురుషుడు, దేవుడు, దేవ దూత వంటి అర్థాలు) అని మీరు పుస్తకం రాసినా మీకు కొందరు గుడి కట్టారు. ఎలా ఉంది?
నా తల్లిదండ్రులు భౌతికంగా లేరు. వాళ్లు ఎక్కడ ఉన్నా ఇదంతా చూసి, ఆనందపడతారు. నాక్కూడా జీవితంలో ఏదో సాధించాననే ఫీలింగ్‌ కలిగింది. కానీ ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఇక నా పుస్తకం ‘ఐయామ్‌ నాట్‌ ఎ మెస్సయ్య’ విషయానికి వస్తే.. అవును.. నేనేం దేవుణ్ని కాదు. ఐయామ్‌ ఎ కామన్‌మ్యాన్‌. ఓ సామాన్య వ్యక్తిగా ప్రజలతో నేను కనెక్ట్‌ అయ్యాను.

► ఇలా విరివిగా సేవా కార్యక్రమాలు చేసేవాళ్లు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడానికే ఇలా చేస్తారని కొందరు భావిస్తారు. మరి.. మీకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా?
నిజమే... నేను రాజకీయాల్లోకి రావడం కోసమే ఇవన్నీ చేస్తున్నానని కొందరు ఊహించుకుంటున్నారు. ఇంకొందరు నేను రాజకీయాల్లోకి వస్తే ఇంకా మంచి చేయగలనని చెబుతున్నారు. కానీ మంచి పనులు చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను. కానీ భవిష్యత్‌లో ఎవరు ఏం అవుతారో? ఏం జరుగుతుందో అంచనా వేయలేం. చూద్దాం.. రాబోయే రోజుల్లో నా జీవితం ఏ దారిలో వెళుతుందో!

► మీ ఈ సేవల వెనక ఓ రాజకీయ పార్టీ ఉందనే అభిప్రాయం చాలామందిలో ఉంది.. మీ సేవా కార్యక్రమాలు చూస్తున్న ప్రజలు మీరు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటే..
ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు సేవ చేయాలనే గుణం ఉంటే వెనక ఎవరైనా ఉంటారా? వస్తారా? అనే ఆలోచన రాదు. సహాయం చేయడం మొదలుపెట్టేస్తాం. మనం కామన్‌ మ్యాన్‌గా ఉన్నప్పుడే ఎంతో చేయగలుగుతున్నాం.. అదే రాజకీయాల్లో ఉంటే ఇంకా చేయొచ్చు. కానీ నేను పాలిటిక్స్‌ గురించి ఇప్పుడేమీ ఆలోచించడంలేదు. అలాగని నాకు రాజకీయాల మీద వ్యతిరేక భావన లేదు. ప్రజలు కోరుకున్నట్లు జరుగుతుందేమో భవిష్యత్‌ చెబుతుంది.

► అరుంధతి, సీత వంటి సినిమాల్లో ఓ విలన్‌గా హీరోయిన్లను చాలా ఇబ్బందులపాలు చేశారు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు మిమ్మల్ని సోదరుడిలా భావిస్తున్నారు...
నా సోదరీ మణులకు థ్యాంక్స్‌. ఆ చిత్రాల్లో ఆ పాత్ర లను నాకు ఆ సినిమాల దర్శకులు ఇచ్చారు. కానీ రియల్‌ లైఫ్‌లో దేవుడు నాకో పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ రాశా డు. ఆ పాత్రలో జీవిస్తున్నాను. దేవుడి ఇచ్చిన ‘మోస్ట్‌ బ్లెస్డ్‌ రోల్‌’ ఇది అని భా విస్తున్నా.

► బెడ్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ.. వలస కార్మికులను ఊళ్లకు పంపించడం.. ఇన్ని చేయడం సులభం కాదు..
మాకు మంచి నెట్‌వర్క్‌ ఉంది. మా టీమ్‌లో కొందరికి ట్రైనింగ్‌ ఇచ్చాం. మరికొందరు నా గైడ్‌ లైన్స్‌ను ఫాలో అవుతారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి వెంటనే సహాయం అందజేయడంలో వీరి పాత్ర చాలా కీలకం. వారికి  ధన్యవాదాలు. అలాగే ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు దేశంలోని ప్రజలందరూ ఒక తాటిపైకి రావాలన్నదే మా ఆశయం. సమష్టిగా పోరాడే సమ యం త్వరలో రావాలని కోరుకుంటున్నా.

► మీ బయోపిక్‌ తీయడానికి కొందరు ఉత్సాహంగా ఉన్నారు. మీకిష్టమేనా?
బయోపిక్‌ గురించి నాతో సంప్రదింపులు జరిపారు. ప్రజలు నా బయోపిక్‌ను చూడాలనుకుంటున్నారని వారు చెబుతున్నారు. కానీ ప్రస్తుతానికి అదేం లేదు. కొన్నేళ్ల తర్వాత ప్రజలు నా గురించి ఏం అనుకుంటారో చూడాలి.

► ఇటీవల మీకు కరోనా పాజిటివ్‌ వచ్చినప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉండేది?
పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో ఫోన్‌ ద్వారా చాలామందికి సహాయం చేశాను. సహాయం కావాల్సిన వారు నా ఫోన్‌కు సందేశాలు పంపిస్తూనే ఉన్నారు. వారికి సహాయం చేయాలనే పట్టుదల నాలో తగ్గలేదు. కరోనా వచ్చినప్పుడు కూడా ఇరవైగంటలకు పైగా నేను ఫోన్‌తో కనెక్ట్‌ అయి, మా టీమ్‌తో టచ్‌లో ఉన్నాను. నా ఫోన్‌కి ప్రతిరోజూ దాదాపు 40 వేల మేసేజ్‌లు వస్తుంటాయి. కానీ ప్రతి ఒక్కరికీ మేం సహాయం చేయలేకపోవచ్చు. అయితే ఎవరికి ముందుగా అవసరం ఉందో వారిని గుర్తించి, ముందు వారిని కాంటాక్ట్‌ అవుతాం. మా సహాయం పొందిన చాలామంది తామంతట తామే ఫోన్‌ చేసి పక్కవారికి సాయం చేస్తాం అంటున్నారు. అలాగే కొందరు చేశారు కూడా. చాలా మంది వలస కూలీలకు మేం సహాయం చేశాం. వారిలో చాలామంది మాకు టచ్‌లో ఉన్నారు. అవసరమైనప్పుడు మేం వారికి ఫోన్‌ చేసి ‘మీరు సహాయం పొందారు. ఇప్పుడు మీరు చేయాల్సిన సమయం వచ్చింది’ అని చెప్పినప్పుడు పాజటివ్‌గా స్పందించారు... స్పందిస్తున్నారు. ఈ మంచి కార్యక్రమాల్లో మా టీమ్‌ మాత్రమే కాదు.. ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, వార్డ్‌ బాయ్స్, హాస్పిటల్‌ యాజమాన్యాలు.. ఇలా అందరికీ భాగం ఉంది.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement